Bridge to Terabithia
…………………………………………………………………………………………………
వివేక్ లంకమల… ✍🏻
వాస్తవం ఎంత నేలకు దించినా
మనిషికి కొన్ని భ్రమలు/ఊహలు అవసరం.
ఆశల తాలూకు భ్రమ
ఆశయాల తాలూకు భ్రమ
డబ్బు, రిలేషన్‌షిప్, పవర్, ఇలా ఏదైనా అవ్వొచ్చు.

Jesse ఒక ఆర్టిస్ట్. ఎప్పుడూ ఊహా ప్రపంచపు బొమ్మలు గీస్తుంటాడు. స్కూల్‌లో పిల్లలు గేలి చేస్తుంటారు. బస్‌లో ఏడిపిస్తుంటారు. ఇంటికొస్తే తండ్రినుంచి ప్రేమకంటే తిట్లే ఎక్కువ వస్తుంటాయి.
Leslie కి ప్రేమ రాహిత్యం ఏం లేదు కానీ అందరితో వెంటనే కలవలేదు. సీనియర్స్ గేలి చేస్తుంటారు. బయటినుంచి చూస్తే ఇవేవీ పెద్ద సమస్యలు అనిపించవు కానీ వాళ్లదైన చిన్న ప్రపంచంలో అవే పెద్ద సమస్యలు.
ఇద్దరికీ పరుగు ఇష్టం. ఒకరోజు పరిగెడుతూ ఇంటిపక్కన అడవిలోకి వెళ్తారు. ఒక వాగు అడ్డమొస్తుంది. దాన్ని దాటగానే Terabithia అనే ఒక ఊహా ప్రపంచం వీళ్లను ఆహ్వానిస్తుంది. కాదు, వీళ్లే సృష్టించుకుంటారు. ఈ రాజ్యానికి Jesse కింగ్.
బయట ప్రపంచంలో వాళ్లను తరిమిన భయాలు, అపోహలన్నీ ఇక్కడే ప్రతీకలుగా తరుముతుంటాయి. వాటితో భయపడుతూ, పరిగెడుతూ, పోరాడుతూ ఉంటారు.
ఒకరోజు Jesse వాళ్ల మ్యూజిక్ టీచర్ Jesse ని మ్యూజియంకు తీసుకెళ్తుంది. అక్కడి డ్రాయింగ్స్ అబ్బురపరుస్తాయి. తిరిగొచ్చేసరికి Leslie ఉండదు. Terabithia చూడటానికి వెళ్లి వాగు దాటుతుండగా అందులో పడి చనిపోతుంది. నా వల్లే చనిపోయింది అనే దిగులుగా ఉంటాడు Jesse. ఆ బాధనుంచి బయటపడటానికి మళ్లీ Terabithia కే వెళ్తాడు.
****
నర మానవుడి అలికిడి ఉండని అడవిలో కొద్దిసేపు ఏకాంతంగా ఉండి నిన్ను నువ్వు గమనించావా?
గాలి కూడా ఏవో కబుర్లు చెబుతున్నట్టుగా ఉంటుంది.
గలగలపారే వాగు సవ్వడి విన్నావా?
ఏదైనా ఒక కొండ శిఖరం ఎక్కి, అక్కన్నుంచి పాద ప్రాంతాన్ని గమనించావా?
ఎవరి Terabithia ప్రపంచాలు వాళ్లవి. వాళ్లే అక్కడ కింగ్.
మ్యాజిక్ రియలిజం కాన్సెప్ట్‌కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. Katherine Paterson 1977 లో రాసిన నవలని 2007లో అదే పేరుతో సినిమాగా తీశారు. సినిమా 90 నిమిషాలే కానీ అది తట్టిలేపే ఊహా ప్రపంచం విశాలమైనది.



