కటిక పేదలైనా, అనాథలైనా, ఎలాంటి గుర్తింపుకు నోచుకోని వారైనా… ఎవ్వరైనా చివరి వీడ్కోలు లేకుండా పోకూడదు.. ఇదీ శివపుత్రుడిగా అవతరించిన ఓ చాచా తీర్మానం.
అయితే, ఈ తీర్మానం వెనుక ఆ తండ్రి గుండెలు పగిలే విషాదముంది. ఆ విషాద కథ అయోధ్యలోని ఓ రహదారిపై మొదలైంది.
అప్పట్లో ఫైజాబాద్ గా పిల్చే నేటి అయోధ్యలో సైకిల్ మెకానిక్ గా పనిచేస్తుంటాడు మహమ్మద్ షరీఫ్. 1992లో తన పెద్ద కుమారుడు రయీస్ ఖాన్ ను రోడ్డు ప్రమాదంలో కోల్పోయాడు. కొడుకు జాడకై వెతికితే చివరకు రోడ్డు ప్రమాదంలో రయీస్ చనిపోయాడని తేలింది. ఆనవాళ్ల కోసం చూస్తే అప్పటికే అడవి జంతువులు రయిస్ మృతదేహాన్నే లేకుండా చేశాయి. చాచా షరీఫ్ కు దొరికింది కేవలం కొడుకు ధరించిన షర్ట్… ఏ టైలర్ దగ్గరైతే ఆ అంగీ కుట్టించాడో ఆ టేలర్ నోట్ మాత్రమే. అవే, తన కొడుకు ఇక లేడని నిర్ధారించుకునేందుకు ఆనవాళ్లయ్యాయి. అదిగో అప్పుడే… “చివరి వీడ్కోలు లేకుండా ఎవ్వరూ పోకూడదు” అని మనసులో తనకు తానే ప్రతిజ్ఞ చేశాడు. అదే చాచాలో సంకల్పంగా మారింది.

జీవిత ధ్యేయంగా మారిన ప్రతిజ్ఞ!
తన ప్రతిజ్ఞ మనసులో అనుకోవడం వరకే పరిమితం చేయలేదు. రోజూవారీ పనిగా మార్చాడు. పోలీస్ స్టేషన్స్, ఆసుపత్రులు, మార్చురీలు తిరిగి ఎవ్వరూ తీసుకెళ్లని గుర్తు తెలియని, జాడ గుర్తు పట్టని మృతదేహాలను సేకరించేవాడు. నిబంధనల ప్రకారం మార్చురీల్లో ఉంచిన మృతదేహాల కోసం 72 గంటల వరకూ రాకపోతే వాటిని ఖననమో, దహనమో చేసేయొచ్చు. అదిగో అలాంటి మృతదేహాలన్నింటికీ… చాచా మహమ్మద్ షరీఫ్ శివపుత్రుడయ్యాడు.
సైకిల్ మెకానిక్ శ్మశాన వైరాగ్యం వెనుక కొడుకు మరణం!
మహమ్మద్ షరీష్ ఫైజాబాద్ లో సైకిల్ పంక్చర్లు వేసుకుని జీవించేవాడు. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించేవాడు. కానీ, పెద్ద కొడుకు మరణం ఆయన్ను కదిలించింది. కనీసం మృతదేహం ఆనవాళ్లు కూడా లభించకపోవడం విషాదాన్ని రెట్టింపు చేసింది. అదే ఆయన్ను కొత్త దిశలో నడిపించింది. ఎంతటి కటిక పేదలైనా సరే వారు తుది వీడ్కోలు లేకుండా మాత్రం ఈ భూమ్మీద నుంచి వెళ్లిపోకూడదనే బలమైన సంకల్పం ఆ శ్మశాన వైరాగ్యంలోంచి అవతరించింది. అదే చాచా కొత్త దిశ ప్రయాణానికి బీజం వేసింది.
కానీ, మృతదేహాలను తరలించాలన్నా డబ్బులు కావల్సిందే. ఏదైనా వాహనముండాల్సిందే. అవేమీ పట్టించుకోలేదు చాచా. తన దగ్గరున్న సైకిల్ నే వాహనం చేసుకున్నాడు. ఆ సైకిల్ నే వెనుక మృతదేహం పెట్టే ఓ రిక్షా తరహాలో మార్చేశాడు. డబ్బు లేకపోతే చుట్టుపక్కల వితరణశీలుల సాయం తీసుకున్నాడు. ఆ సైకిల్ నే గుర్తు తెలియని మృతదేహాల ఆఖరి మజిలీకి వాహనంగా మల్చాడు. శవాల ఖననానికీ, దహనానికీ కలిసివచ్చే స్థానికుల సాయం తీసుకున్నాడు.

నాకు మనిషి మాత్రమే కనిపిస్తాడు… మతం కనిపించదంటాడు చాచా మహమ్మద్ షరీఫ్.
దేశమే గర్వించే కాటికాపరి మహమ్మద్ చాచా!
విశ్వామిత్రుడి పరీక్షలో భార్యతో పాటు, సర్వం కోల్పోయి కాటికాపరిగా మారిన సత్యహరిశ్చంద్రుడి కథకు ఏమాత్రం తక్కువ కాని విషాదగాధ చాచా షరీఫ్ ది. చివరకు తన కొడుకు దహన సంస్కారాలకు.. తన భార్య నుంచే డబ్బులడిగి.. లేవంటే, మంగళసూత్రమైనా ఇవ్వాలని పట్టుబట్టి.. చివరకు, తాను దహనానికి డబ్బులడుగుతోంది తన కొడుకు మృతదేహానికేనని తెలుసుకుంటాడు హరిశ్చంద్రుడు. అలా చాచా మహమ్మద్ షరీఫ్ కూడా తన కొడుకు శవం ఆనవాళ్లు కనిపించకుండా పోయాక.. ప్రతీ గుర్తు తెలియని మృతదేహాన్నీ తన బిడ్డగానో, కుటుంబీకుడిగానో భావించి ఆఖరి మజిలీని ఘనంగా నిర్వహించాడు.
తన కుమారుడి మృతదేహం ఎవరూ స్వీకరించకపోవడంతో.. చలించిన ఈ అయోధ్య వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత యావత్ దేశాన్నే గర్వపడేలా చేసింది. ఇప్పటివరకు 26 వేల మందికి పైగా దహన సంస్కారాలు నిర్వహించి.. ఆఖరి మజిలీకి గౌరవం కల్పించిన గౌరవనీయుడు ఈ చాచా.
తానేం ప్రభుత్వాధికారి కాదు.. బాగా ధనవంతుడూ కాదు.. జస్ట్, సాధారణ సైకిల్ మెకానిక్. ఓవైపు సైకిల్ పంక్చర్లు వేసుకుంటూ.. ఖాళీ సమయంలో అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు చేయడమే చాచా నిత్య కర్తవ్యం.
అందుకు షరీఫ్ చాచా కుటుంబాన్నీ అభినందించాల్సిందే. మృతదేహాలతో వచ్చే రక్తం, బాధ, మానసిక ఒత్తిడి, దుర్గంధం ఇవన్నీ తట్టుకుని చాచాకు అండగా నిల్చి అంతిమ సంస్కారాల్లో తోడుగా నిలుస్తోంది చాచా కుటుంబం.
తన కుటుంబం అనుభవించిన బాధ ఇంకెవ్వరికీ రావొద్దన్నదే చాచా షరీఫ్ లక్ష్యం.
మతమేదైనా కావచ్చు.. మానవత్వమే అసలైన మతం అంటాడు చాచా. అందుకే ఏ మతం వారో తెలిస్తే వారి మతాచారాలు, సంప్రదాయాల ప్రకారమే అంతిమ సంస్కారాలు చేస్తాడు.
ముస్లిమైతే సమాధి, హిందువైతే దహన సంస్కారాలు, ఇతర మతాలవారైతే వారి సంప్రదాయాల ప్రకారం చివరి మజిలీని గౌరవంగా ముగిస్తాడు.
మతభేదాలను దాటి మానవత్వాన్ని నిలబెట్టిన మనిషి షరీష్ చాచా.
పద్మశ్రీకే గౌరవం!
2020లో భారత ప్రభుత్వం మహమ్మద్ షరీఫ్ చాచాను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇది చాచాకు లభించిన గౌరవం అనేకంటే కూడా.. పద్మశ్రీకి పురస్కారానికి లభించిన గొప్ప అవకాశమంటేనే బాగుంటుందేమో!
మూడు దశాబ్దాల పాటు అనాథ మృతులకు చివరి సంస్కారాలు చేసిన ఒక సాధారణ మెకానిక్ కు దేశం ఇచ్చిన గౌరవం పద్మశ్రీ.!
షరీఫ్ చాచా ఇచ్చిన సందేశమేంటి..?
మహమ్మద్ షరీఫ్ కథ హృదయాన్ని కదిలించేది. పెద్ద ప్రసంగాలు లేవు, సంస్థలు, బడా నేతల అండదండలూ లేవు, ప్లాన్ చేసిన ఆర్గనైజ్డ్ హీరోయిజమూ లేదు.. ఓ సాధారణ సైకిల్ మెకానిక్ తీసుకున్న ఒక బలమైన సంకల్పం మాత్రమే కనిపిస్తుంది. ఎవ్వరూ చివరి మజిలీలోనైనా నా అన్నవారు లేరన్నట్టుగా, అనాథలుగా వెళ్లిపోకూడదనే సందేశం కనిపిస్తుంది. మానవ జీవితంలో చివరి ఘట్టం కూడా డబ్బు, కుటుంబం, స్థాయి, హోదాల మీద ఆధారపడకూడదనే విషయాన్ని మన నోటీసులోకి తెస్తుంది. సాటి మనిషి పట్ల సమాజం స్పందించాల్సిన తీరును ఈ సభ్య సమాజానికి గుర్తు చేస్తుంది.
అందుకే, ఇప్పుడు అయోధ్య అంటే రాముడే కాదు… ఈ మహమ్మద్ షరీఫ్ కూడా గుర్తుంచుకోవాల్సిన దేవుడే!



