అనన్య సామాన్యులెప్పుడూ సామాన్యమైన జీవితాన్నే ఇష్టపడుతారు. స్థితప్రజ్ఞులెప్పుడూ సింపుల్ లైఫ్ స్టైల్ నే కోరుకుంటారు. అలాంటి ఓ జీనియస్ గురించి మనమోసారి పరిచయం చేసుకోవాలి. ఆయనే రెండు పద్మ అవార్డులతో పాటు.. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలెన్నో అందుకున్న అశోక్ సేన్.
వార్డ్ మెంబర్ మొదలు.. ముఖ్యమంత్రి వరకూ… పంచాయితీ కార్యదర్శి నుంచి మొదలు ప్రధానమంత్రి వరకూ వారి స్టేచర్ ను బట్టి హంగూ, ఆర్భాటాలు, కాన్వాయిలు, ప్రోటోకాల్స్ తో విలాసవంతమైన జీవితాలను చూస్తున్న రోజులివి. ఇలాంటి కాలంలో పదికి పైగా ప్రపంచస్థాయి పురస్కారాలతో పాటు… శాస్త్ర, విజ్ఞానంలో నోబెల్ కన్నా గొప్పగా పరిగణించే ఫండమెంటల్ ఫిజిక్స్ ప్రైజ్ సాధించిన ఓ శాస్త్రవేత్త మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జీవిస్తున్నాడు.

ప్రొఫెసర్ అశోక్ సేన్ ఎవరు..?
ప్రెసిడెన్సీ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 1975లో ఐఐటీ కాన్పూర్ లో ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేశారు అశోక్ సేన్. అదే సమయంలో ఆయన సైద్ధాంతిక భౌతికశాస్త్రంలో నిష్ణాతుడిగా తయారయ్యారు.
ఆ తర్వాత అశోక్ సేన్ అమెరికా స్టోరీ బ్రూక్ యూనివర్సిటీలో పీపెచ్డీ పూర్తి చేశారు. అనంతరం 1982-85 మధ్య ఫెర్మీల్యాబ్ లోనూ, ఆ తర్వాత 1985-88 మధ్య స్టాన్ ఫర్డ్ లీనియర్ యాక్సిలరేటర్ సెంటర్ (ఎస్ఎల్ఏసీ) లోనూ పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్ గా పనిచేశారు. ఉన్నతస్థాయి భౌతికశాస్త్ర పరిశోధనల్లో అనుభవం సంపాదించారు.
శాస్త్రీయ విజ్ఞానంపై లోతైన అధ్యయనం!
1988లో సేన్ ముంబై టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సెంటర్ లో ఫ్యాకల్టీగా చేరారు. 1997లో అలహాబాద్ లోని హరీశ్ చంద్ర రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు మారి ప్రస్తుతం డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ గా కొనసాగుతున్నారు. ఎంఐటీలో మార్నింగ్ స్టార్ విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేసిన సేన్.. స్ట్రింగ్ థియరీలో చేసిన కృషి ప్రపంచ శాస్త్ర విజ్ఞాన రంగంపై అమిత ప్రభావం చూపింది. ముఖ్యంగా ఎస్ డ్యుయాలిటీ అనే సిద్ధాంతం ద్వారా వివిధ స్ట్రింగ్ థియరీలు ఒకే ప్రాథమిక సిద్ధాంతానికి చెందినవేనని శాస్త్రవేత్తలకు అర్థమయ్యేలా చేయడంలో సేన్ ది కీలకపాత్ర. అన్ స్టేబుల్ డీ- బ్రేన్స్, టాకియన్ కండెన్సేషన్ పై చేసిన పరిశోధనలు సేన్ కు విశేషమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి.
ఎంట్రోపీ ఫంక్షన్ ఫార్మలిజం ద్వారా బ్లాక్ హోల్ ఫిజిక్స్, స్ట్రింగ్ థియరీ మధ్యనున్న బంధాన్ని వివరించి బ్లాక్ హోల్ ఎంట్రోపీకి సూక్ష్మస్థాయి వివరణ కూడా ఇచ్చారు సేన్.
నోబెల్ కంటే పెద్దదా ఫండమెంటల్ ఫిజిక్స్ ప్రైజ్..?
2012లో అశోక్ సేన్ కు ఫండమెంటల్ ఫిజిక్స్ ప్రైజ్ వచ్చింది. ఆయనే తొలి శాస్త్రవేత్తగా రికార్డుకెక్కారు. రష్యన్ వ్యాపారవేత్త యూరీ మిల్నర్ స్థాపించిన అవార్డ్ అది. నోబెల్ ప్రైజ్ కంటే కూడా ఎక్కువ నగదు బహుమతి ఇచ్చే పురస్కారం. స్ట్రింగ్ థియరీ అభివృద్ధికి సేన్ చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డ్ ఆయనకు దక్కింది.
వివిధ స్ట్రింగ్ థియరీలు ఒకే ప్రాథమిక, మూల సిద్ధాంతానికి చెందినవని నిరూపించడంలో సేన్ పాత్ర కీలకం.
సేన్ సాధించిన పురస్కారాలు- గౌరవాలు
పద్మభూషణ్ 2013
పద్మశ్రీ 2001
డిరాక్ మెడల్ 2014
ఇన్ఫోసిస్ ప్రైజ్ 2009
శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్ 1994
రాయల్ సొసైటీ ఫెలోషిప్, ఇతర ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలందుకున్నారు అశోక్ సేన్.
ఎందుకింతగా ఈ అశోక్ సేన్ గురించి చెప్పుకుంటున్నాం..?
ఎందుకు అశోక్ సేన్ ప్రేరణ అంటే… ప్రపంచ ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతికశాస్త్రవేత్తగా ఎదిగిన అశోక్ సేన్ జీవన ప్రయాణం సర్వసాధారణంగా ఉండటమే కారణం. సైకిల్ పైన పనికి వెళ్తూ ఆయన గురించి తెలిసినవారిని ఆశ్చర్యపర్చేత సాదాసీదాతనమే అశోక్ సేన్ స్థితప్రజ్ఞత, సామాన్య జీవిత ప్రత్యేకత. గొప్పతనం ప్రదర్శిస్తే వచ్చేది కాదని… ఎంత ఎదిగినా ఒదిగే నిరాడంబరతలోనే కనిపిస్తుందని ది గ్రేట్ సైంటిస్ట్ అశోక్ సేన్ జీవితం చెప్పే పాఠం.



