మానవుడు మహనీయుడని నిరూపించారు.. ఆర్టెమిస్ వీరులు!

ఆకుల అమరయ్య… ✍️

ఆర్టెమిస్-2 వీరులు తిరిగొచ్చారు!
ఇక మనం చందమామను తాకిరావొచ్చు!
మానవుడా, నీకు వందనం. మానవుడే మహనీయుడని నిరూపించావు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశావు.


ఎక్కడ చంద్రుడు, ఎక్కడ మనం..?


3 లక్షల 80 వేల కిలో మీటర్ల దూరంలోని చందమామను తాకొచ్చావు. 9 రోజుల 13 గంటల 15 సెకన్ల తర్వాత భూమికి క్షేమంగా తిరిగివచ్చావు. మొత్తం మీద అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించావు.


భూమి మీద మరో అద్భుతం జరిగింది. జాబిల్లి గుట్టు తేల్చేందుకు వెళ్లిన నలుగురు సాహస వీరులు తమ లక్ష్యాన్ని ముగించుకుని కొద్ది సేపటి కిందట విజయవంతంగా భూమికి తిరిగొచ్చారు. భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5.38 గంటలు- ఆ నలుగురు శాన్ డియాగో వద్ద పసిఫిక్ మహాసముద్రంలో దిగారు సుమారు ఐదు దశాబ్దాల తర్వాత చంద్రుడి చెంతకు వెళ్లి వచ్చిన మానవ సహిత నౌకగా ఆర్టెమిస్-2 రికార్డు సృష్టించింది. ఏప్రిల్ 1 న వీరు ఆర్టిమిస్ 2 ఉపగ్రహంలో ఫ్లోరిడాలోని నాసా సెంటర్ నుంచి చంద్రగ్రహ యాత్ర చేపట్టారు.


ఆ ఉపగ్రహంలో రీడ్ వైజ్‌మాన్, విక్టర్ గ్లోవర్ (Victor Glover), (చంద్రుడి వైపు వెళ్లిన తొలి నల్లజాతీయుడు), క్రిస్టినా కోచ్(చంద్రుడి మిషన్‌కు ఎంపికైన తొలి మహిళ), జెరెమీ హాన్సన్ (కెనడియన్) ప్రయాణించారు.


9 రోజుల ఉత్కంఠ.. అద్భుత విజయం!


చందమామను చుట్టి రావడానికి వెళ్లిన ఈ నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలో మొత్తం 9 రోజుల 13 గంటల 15 సెకన్ల పాటు గడిపారు. నాసా వెల్లడించిన ఈ లెక్కలు చూస్తుంటే, ప్రతి సెకను ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. పసిఫిక్ మహాసముద్రంలో ఓరియన్ వ్యోమనౌక సురక్షితంగా ల్యాండ్ కావడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది.

నిప్పులు చిమ్ముతూ.. సముద్రాన్ని తాకుతూ..
తిరుగు ప్రయాణంలో భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పుడు ఓరియన్ నౌక అసలైన అగ్నిపరీక్షను ఎదుర్కొంది. వేల డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకుంటూ, గంటకు వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చి పారాచూట్ల సాయంతో సముద్రపు అలలపై వాలింది.

చంద్రుడిపై అడుగు వేసేందుకు సిద్ధం!


ఈ మిషన్ కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, భవిష్యత్తులో మనం చంద్రుడిపై ఇళ్లు కట్టుకోవడానికి, అక్కడి నుంచి అంగారక గ్రహానికి పయనం కావడానికి పడిన బలమైన పునాది.


ఈ మిషన్‌ ముఖ్య విశేషాలు..


ల్యాండింగ్: ఓరియన్ వ్యోమనౌక సముద్రంలో దిగిన తర్వాత, వ్యోమగాములను ఒక్కొక్కరిగా బయటకు తీసి, హెలికాప్టర్ ద్వారా యూఎస్ నేవీ నౌకకు తరలించేందుకు నాసా ఏర్పాట్లు చేసింది.
ప్రమాదకరమైన రీ-ఎంట్రీ: భూ వాతావరణంలోకి ప్రవేశించడం అనేది ఎప్పుడూ ప్రమాదకరమే. ముఖ్యంగా ఆర్టెమిస్ II విషయంలో ఇది మరింత క్లిష్టంగా మారింది. ఎందుకంటే, విపరీతమైన వేడి నుండి వ్యోమగాములను రక్షించే హీట్ షీల్డ్ రూపకల్పనలో కొన్ని లోపాలు ఉన్నట్లు ముందే గుర్తించారు.


కొత్త వ్యూహం: ఈ ముప్పును తగ్గించడానికి, నాసా వ్యోమనౌక ప్రయాణ మార్గంలో మార్పులు చేసింది. ఓరియన్ క్యాప్సూల్ తక్కువ సమయంలో ఎక్కువ వేడికి గురికాకుండా ఉండటం కోసం, దానిని మరింత వేగంగా, నిటారుగా ఉన్న కోణంలో భూమి వైపు పంపారు.

చారిత్రక ఘనతలు… 10 రోజుల పాటు సాగిన ఈ మిషన్ ద్వారా వ్యోమగాములు అనేక రికార్డులను సృష్టించారు:


50 ఏళ్ల తర్వాత: గత 50 ఏళ్లలో చంద్రుడి వైపు ప్రయాణించిన తొలి మానవులుగా వీరు నిలిచారు.


దూర ప్రయాణం: భూమి నుండి అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించిన మానవులుగా వీరు కొత్త రికార్డు నెలకొల్పారు.


తొలి ప్రయోగాలు: నాసా యొక్క భారీ స్పేస్ లాంచ్ సిస్టమ్ (SLS) రాకెట్ ద్వారా ప్రయోగించబడిన మరియు ఓరియన్ వ్యోమనౌకలో ప్రయాణించిన మొదటి బృందం కూడా వీరే.


తదుపరి లక్ష్యం: ఆర్టెమిస్-2 ఇచ్చిన విజయంతో, త్వరలోనే ఆర్టెమిస్-3 ద్వారా మనుషులు నేరుగా చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టనున్నారు.


టెక్నాలజీ సత్తా: లోతైన అంతరిక్షంలో మనిషి మనుగడ సాధ్యమేనని ఈ యాత్ర మరోసారి నిరూపించింది. నాడు అపోలో మిషన్లు సృష్టించిన సంచలనాన్ని మళ్లీ కళ్లముందు ఉంచుతూ, ఆర్టెమిస్ వీరులు సాధించిన ఈ విజయం అంతరిక్ష రంగంలో ఒక నవశకానికి నాంది పలికింది. ఇక చంద్ర గ్రహాన్ని తాకడం మనకు అసాధ్యమేమీ కాదని ఈ వీరులు నిరూపించారు!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles