గణేశ్ తోట… ✍️
ఈ దేశం మొత్తం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదు : మధ్యప్రదేశ్ హైకోర్ట్
“రేపు ఒక రోజున ఈ దేశం మొత్తం వక్ఫ్ ఆస్తి అని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు” మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ పై.. ఆ రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలివి. వక్ఫ్ బోర్డుకున్న అపరిమితమైన అధికారాల వల్ల వచ్చే సమస్యలేంటి..? దానికున్న విశేషాధికారాలను తొలగించడంలో అంతరార్థం ఏంటనేది.. తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టులో జరిగిన విచారణ గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది.

మధ్యప్రదేశ్ లోని చారిత్రక బుర్హాన్ పూర్ కోట మొత్తం వక్ఫ్ ఆస్తి అంటూ ఆ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసుకుంటోంది. 2013లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఈ కోట మొత్తం వక్ఫ్ ఆస్తి అని పేర్కొంటూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ను కోటను ఖాళీ చేయాలని కోరడంతో.. ఈ అంశం తెరపైకి వచ్చింది. దీనిపై ASI హైకోర్టును ఆశ్రయించింది. బుర్హాన్‌పూర్‌లోని ఎమాగిర్డ్ గ్రామంలో ఉన్న 4.448 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కోట, 1904 నాటి పురాతన స్మారక చిహ్నాల సంరక్షణ చట్టం ప్రకారం రక్షింపబడుతుందని.. ఇది దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉందని.. స్మారక చిహ్నాలు వాటి హోదాను కలిగి ఉండటంతో.. ఇది వక్ఫ్ ఆస్తిగా గుర్తించలేమని.. ASI వాదించింది. అయితే వక్ఫ్ బోర్డు ఆ ఆస్తిని న్యాయబద్ధంగా వక్ఫ్‌గా ప్రకటించిందని.. హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి బదులుగా.. వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ASI ఆశ్రయించాల్సి ఉందని వక్ఫ్ బోర్డ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ జీఎస్ ఆహ్లూవాలియా ధర్మాసనం.. 1913, 1925 నాటి పురాతన స్మారక చిహ్నాల సంరక్షణ చట్టాలతో పాటు.. 1904 నాటి పురాతన స్మారక చిహ్నాల సంరక్షణ చట్టం ప్రకారం ఈ కోటను అధికారిక నోటిఫికేషన్‌ల ద్వారా గుర్తించబడిందని తెలిపింది. దీని ప్రకారం.. వక్ఫ్ బోర్డుకు ఎలాంటి అధికారం లేదంటూ వక్ఫ్ బోర్డ్ వేసిన దావాను తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కర్ణాటక వక్ఫ్ బోర్డ్ వర్సెస్ భారత ప్రభుత్వం (2004)లో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) వైఖరిని కోర్టు సమర్థించింది. పురాతన రక్షిత స్మారక చిహ్నాల రిజిస్టర్‌లో జాబితా చేయబడిన ఆస్తులు.. భారత ప్రభుత్వ యాజమాన్యం పరిధిలోకి వస్తాయని.. అలాగే వాటి నిర్వహణ కూడా ASI కే ఉంటుందని స్పష్టం చేసింది.
“ఒక ఆస్తిని పురాతన స్మారక చిహ్నంగా మరియు రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించిన తర్వాత.. అది 1995 వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడదు” అని జస్టిస్ ఆహ్లూవాలియా తన తీర్పులో వెల్లడించారు. “1995 వక్ఫ్ చట్టం ప్రకారం.. దాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసినా.. పురాతన స్మారక చిహ్నాల సంరక్షణ చట్టం 1904 ను రద్దు చేయలేదు” అని స్పష్టం చేశారు. “వక్ఫ్ చట్టం అమల్లోకొచ్చిన నాటికి.. వక్ఫ్ ఆస్తి కాని ఆస్తికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినంత మాత్రాన.. అది వక్ఫ్ ఆస్తిగా మారదు. పురాతన కాలం నుండి దాని యజమాని అయిన కేంద్ర ప్రభుత్వాన్ని తొలగించడానికి వక్ఫ్ బోర్డుకు అధికారం లేదు” అని తెలిపారు. ఈ సందర్భంగా కోటలో ఉన్న షా షుజా సమాధి, నాదిర్ షా సమాధి, బీబీ సాహిబ్ మసీదు, బుర్హాన్‌పూర్ కోటలోని ప్యాలెస్‌ను వక్ఫ్ ఆస్తిగా ప్రకటించిన మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆదేశాలను ఈ సందర్భంగా కోర్టు రద్దు చేసింది.
ఈ సందర్భంగా జస్టిస్ ఆహ్లూవాలియా చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేశాయి. “తాజ్ మహల్‌ను వక్ఫ్ ఆస్తిగా ఎందుకు క్లెయిమ్ చేయకూడదు..? రేపు.. భారతదేశం మొత్తం వక్ఫ్ ఆస్తి అని మీరు అనవచ్చు. మీరు అలాంటి నోటిఫికేషన్‌లను జారీ చేయలేరు. మరియు అలాంటి ఆస్తులను మీదిగా క్లెయిమ్ చేయలేరు” అని తెలిపారు. చారిత్రక స్మారక చిహ్నాన్ని వక్ఫ్ ఆస్తిగా పరిగణించి.. దానిని ఖాళీ చేయాలంటూ ASI ని ఆదేశించడం ద్వారా.. మధ్యప్రదేశ్ వక్ఫ్ బోర్డు తీవ్రమైన చట్టపరమైన తప్పిదానికి పాల్పడ్డిందని జస్టిస్ ఆహ్లూవాలియా ఆగ్రహం వ్యక్తం చేశారు.



