తన దేశానికి తానే మొదటి ఒలింపిక్ గోల్డ్ మెడల్ అయిన చిరుత.. ఆల్ఫ్రెడ్!

తన దేశ జనాభా 1 లక్షా 80 వేల మందిలో ఎవ్వరూ కలగనని.. ఇప్పటివరకూ ఎవ్వరూ సాధించలేని… తానొక్కతే సాధించి తన దేశానికి విజయపతాకైంది ఆ యువతి.

అమావాస్య వంటి చీకట్లను పారద్రోలి కొత్త వెన్నెల వెలుగులు సాధించిన ఆ నల్లజాతి బంగారం కథ పట్టుదలకు నిర్వచనం.

పేరు.. జూలియన్ ఆల్ఫ్రెడ్. జస్ట్ 12 ఏళ్లకు తండ్రి జూలియన్ హామిల్టన్ ని కోల్పోయింది. 14 ఏళ్లకు తన బాగోగులు చూస్తున్న అత్త కరెన్ ఆల్ఫ్రెడ్ మరణించింది. చిన్నప్పుడు ప్రాక్టీస్ కి కూడా బూట్లు లేని స్థితి నుంచి.. ఇవాళ సెయింట్ లూసియా అనే కరేబియన్ దీవుల్లో ఎక్కడో మారుమూల సముద్రంలో విసిరేసిన ద్వీపం నుంచి.. అమెరికా, జమైకా దేశాల ఆధిపత్యానికే సవాలై నిల్చింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ను ముద్దాడింది 23 ఏళ్ల నల్లజాతి చిరుత ఆల్ఫ్రెడ్.

ఒలింపిక్స్ లో వందమీటర్ల పరుగు పందెంలో జగజ్జేతగా నిల్చి.. తాను ఏకలవ్య శిష్యురాలిలా ఆరాధించిన పరుగుల బాణం ఉసేన్ బోల్ట్ కు గురుదక్షిణనిచ్చింది. విజయానికి రంగు, రుచి, వాసన సంపాదించాలంటే… కులం, మతం, జాతి ఇవ్వేవీ అడ్డంకులు కావని… కేవలం పట్టుదల, సాధన, అంకుఠిత దీక్ష, సంకల్పబలం, ఏకాగ్రత, శ్రద్ధ, ఓర్పు ఇవే అర్హతలని చాటి చెప్పింది.

ఆగస్ట్ 4వ తేదీ, శనివారం 100 మీటర్ల పరుగు పందెంలో విజేతగా నిల్చిన ఉద్విగ్న క్షణం… ఆల్ఫ్రెడ్ జీవితంలో ఓ మరపురాని మధుర జ్ఞాపకమైతే… సెయింట్ లూసియా దేశానికే మొట్టమొదటి ఒలింపిక్ గోల్డ్ మెడల్ ను అందించి ఓ చరిత్రను సృష్టించిన సమయమది.

అసలు జూలియన్ ఆల్ఫ్రెడ్ నేపథ్యమేంటి..?

ఓ అథ్లెట్ అంటే అంతర్జాతీయ సమాజంలో కాస్తో, కూస్తో పరియచముండాలి. కానీ, ఒక్కసారిగా ఎగిసిపడిన కెరటంలా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది ఆల్ఫ్రెడ్.

అయితే, 2018 నుంచి 2023 వరకూ కూడా ఆమె యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ తరపున ప్రాతినిథ్యం వహిస్తూ పార్టిసిపేట్ చేస్తోంది. 2021 నుంచి ఆమె అథ్లెట్ గా రాణించడం మొదలైంది. 2021-22, 2022-23 ఈ రెండు సీజన్లలోనూ కళాశాల అథ్లెట్ గా ఆమె కెరీర్ కు కీలకంగా మారింది. నేషనల్ కాలేజ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో వంద మీటర్ల పరుగులోనూ.. అలాగే, 4×100 మీటర్ల పరుగులోనూ విజేతగా నిల్చింది. ఆ తర్వాత అదే ఎన్సీఏఏ ఇండోర్ గేమ్స్ లో భాగంగా నిర్వహించిన 60 మీటర్లు, 200 మీటర్ల పరుగుపందెంలోనూ పైచేయి సాధించి ఛాంపియన్ గా నిల్చింది.

ఆమె కాలేజ్ చదువులు పూర్తయ్యాక జెకస్ఫెర్వార్ లో జరిగిన ఇస్త్వాన్ గ్యులై మెమోరియల్ వంద మీటర్ల పోటీలో రిచర్డ్ సన్ ను ఓడించడంతో ఆమె అథ్లెట్ గా ఎదగడానికి అవకాశాలు ఇంకా మెరుగయ్యాయి. ఆ తర్వాత 2023లో బుడాపెస్ట్ లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ లో కూడా వందమీటర్ల పరుగు పందెంలో ఫైనల్స్ వరకూ వెళ్లగల్గింది. అప్పుడు రిచర్డ్ సన్ కంటే 0.28 సెకన్ల వెనుకంజలో ఐదో స్థానానికి పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన 200 మీటర్ల పోటీలో జమైకాకు చెందిన షెరికా జాక్సన్, అమెరికన్సైన గాబ్రియెల్ థామస్, రిచర్డ్సన్ తర్వాత నాల్గో స్థానాన్ని దక్కించుకుంది.

2024 ఒలింపిక్స్ కలల్ని నిజం చేసుకునేందుకు దోహదపడ్డ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్ షిప్!

2024 మార్చిలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె 60 మీటర్ల పరుగు పందెంలో గెల్చి తన దేశం సెయింట్ లూసియాకు మొట్టమొదటి పతకాన్నందించింది.

ఆల్ఫ్రెడ్ ను కలిచివేసిన అత్త మరణం!

తనను పెంచి.. ప్రోత్సహించిన అత్త మరణంతో ఆల్ఫ్రెడ్ కృంగిపోయింది. రెండేళ్ల పాటు అథ్లెటిక్స్ కు కాస్తా దూరం జరిగింది. మళ్లీ ఏదో చేయాలన్న కసితో తన ఆరాధ్య దైవమైన ఉసేన్ బోల్డ్ నివాస నగరమైన జమైకాకు తన నివాసాన్ని మార్చాలనుకుంది. అందుకు తన తల్లి కూడా నో చెప్పలేదు. ఆ తర్వాత మళ్లీ తనకు టెక్సాన్ యూనివర్సిటీలో కోచ్ గా ఉన్న ఎడ్రిక్ ఫ్లోరియలే గురువుగా దొరకడంతో ఆల్ఫ్రెడ్ పరుగు పందానికి మరింత వన్నె చేకూరింది. తన మెంటార్ లో ఆమె గురువునే కాదు, ఓ తండ్రిని, కోచును అందరినీ చూసుకున్నానంటూ ఒలింపిక్ డాట్ కామ్ పోర్టల్ తో చెప్పుకొచ్చింది.

ఫలితంపై దృష్టి కన్నా.. పట్టుదలే ఆల్ఫ్రెడ్ ను అందలమెక్కించింది!

అలా ఆగస్ట్ 4న 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో 10.72 సెకన్ల కాలంలో 100 మీటర్ల పరుగు పందెంలో అమెరికన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ అయిన క్యారీ రిచర్డ్సన్ ను తోసిరాజని.. నంబర్ వన్ గా నిల్చి గోల్డ్ మెడల్ ను ముద్దాడింది. తన దేశం సెయింట్ లూసియాకు గర్వకారణంగా నిల్వడమే కాదు… ఇప్పుడు ప్రపంచమంతా కొనియాడే ఓ సక్సెస్ స్టోరీ అయింది జూలియన్ ఆల్ఫ్రెడ్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles