నేటి రోజుల్లో మైథలాజికల్, హిస్టారికల్, జానపదం.. ఏదైనా వీఎఫ్ఎక్స్ వాడకపోతే ఏ దర్శకుడికీ కిక్కు రాదు. కథ, కథనాలు, భావోద్వేగాల కన్నా కూడా వీఎఫ్ఎక్స్ పాత్రపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. అలాంటి విజువల్ ఎఫెక్ట్స్ ఘనాపాఠీ గురించే మనం చెప్పుకోబోతున్నాం. ఎందుకంటే, గ్యారేజీలో ఓ చిన్న కంప్యూటర్ తో ఆరంభించిన అతడు.. ఇవాళ 8 ఆస్కార్స్ వరకూ చేసిన జర్నీ చాలా ఆసక్తికరమైంది. ఇప్పుడెందుకంటే నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం వెనుక వీఎఫ్ఎక్స్ నిపుణుడు కూడా అతడే.
జస్ట్ 21 ఏళ్లకు ముంబై బాట పట్టాడు నమిత్ మల్హోత్రా. తమకున్న ఒకే ఒక్క ఆస్తి అయిన ఇంటిని తాకట్టు పెట్టి.. తన తండ్రి గ్యారేజీలోనే చిన్న ఎడిటింగ్ వ్యాపారాన్ని ఆరంభించాడు. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత ఎనిమిది అకాడమీ అవార్డులు సాధించిన ఆయన సంస్థ.. లండన్ కు చెందిన ప్రముఖ విజువల్ ఎఫెక్ట్ స్టూడియోతో విలీనమై.. ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామాయణం రెండు భాగాలకు ఐమ్యాక్స్ చిత్రీకరణలో స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం పని చేస్తోంది.

ఒకే ఒక్క కంప్యూటర్ తో ఆరంభమైన జర్నీ!
1995లో ముంబైలోని ఓ యువకుడు చాలామందికి అర్థంకాని సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. ఎందరు వద్దన్నా వినకుండా ఉన్న ఒక్క ఇంటిని తాకట్టు పెట్టి… తండ్రి గ్యారేజీలోనే ఒకే ఒక్క కంప్యూటర్ తో ఎడిటింగ్ స్టూడియోను ప్రారంభించాడు. అప్పుడు భారతీయ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిని చేరుకుంటాయనే ఆలోచన కూడా ఎవ్వరిలోనూ కనిపించలేదు. కానీ, అదే నమిత్ మల్హోత్రా కల అయింది. ఎన్ని అవాంతరాలెదురైనా వెనకడుగు వేయకుండా ముందడుగుతో ఆ కలను సాకారం చేశాడు మల్హోత్రా.
చిన్న గ్యారేజీలో ఆరంభమైన ప్రయాణం నుంచి… డ్యూన్, ఇంటర్ స్టెల్లార్, బ్లేడ్ రన్నర్ 2049 వంటి ప్రపంచ ప్రఖ్యాత చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించేవరకూ సాగింది. మొత్తం ఎనిమది ఆస్కార్ అవార్డును గెల్చుకునే స్థాయికి ఎదిగింది.
సినీ కుటుంబం నుంచే వచ్చినా.. నడిచిన మార్గం మాత్రం వేరు!
నమిత్ మల్హోత్రా సినీ కుటుంబంలోనే జన్మించాడు. ఆయన తాత 1953లో.. తొలినాళ్లలో ఓ సినిమాకు సినిమాటోగ్రాఫర్. నమిత్ తండ్రి నరేష్ మల్హోత్రా 1988లో విడుదలైన అమితాబ్ క్లాసిక్ షహెన్షాతో పాటు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు.
చిన్నప్పట్నుంచే సినిమా కథలు వింటూ సెట్టింగ్స్, చిత్రీకరణ మధ్య పెరిగిన నమిత్ కూడా ఆరంభంలో కథలు చెప్పాలనే అనుకునేవాడు. అయితే తన కుటుంబ సభ్యుల్లా కెమెరాపై ఫోకస్ చేయకుండా.. కంప్యూటర్ ను తన సాధనంగా ఎంచుకున్నాడు. కంప్యూటర్ గ్రాఫిక్స్ కోర్స్ పూర్తి చేసి.. తనకు బోధించిన ముగ్గురు ఉపాధ్యాయులనే తన జతగా చేసుకుని ఓ కంప్యూటర్ తో ఎడిటింగ్ స్టూడియోకు శ్రీకారం చుట్టాడు.
ఆరంభంలో ఆయన్నెవ్వరూ నమ్మలేదు. ఆయన ఆలోచనలకు పెద్దగా ప్రాధాన్యతా దక్కేది కాదు. తన సిబ్బందిలో కూడా పరిశ్రమ అనుభవమున్నవారు తక్కువే. అంతా టీ కొట్టు, పాన్ దుకాణాలు నడుపుకునే వారి పిల్లలను చేరదీసి శిక్షణనిచ్చాడు. ఎలాంటి అవకాశాలూ దక్కవనుకునేవారిని చేరదీసి, వారిని ప్రతిభావంతులను చేసి, ఘన విజయాన్ని సాధించాడు.
ప్రైమ్ ఫోకస్ ఆవిర్భావం!
ఆరంభంలో నమిత్ సంస్థ టెలివిజన్ ప్రకటనలు, మ్యూజిక్ వీడియోల ఎడిటింగ్ పైనే ఫోకస్ చేసేది. 1997లో తన తండ్రి నిర్వహించే పరికరాలు అద్దెకిచ్చే వ్యాపారంతో తన స్టూడియోను కూడా విలీనం చేసి దానికి ప్రైమ్ ఫోకస్ అని పేరు పెట్టాడు.
ముఖ్యంగా రంగులను దర్శకుడు కోరుకున్నట్టుగా.. పగటిని రాత్రిలా, రాత్రిని పగటిలా మార్చేందుకు.. థియేటర్లలో కూడా డిజిటల్ మోడ్ లో సినిమా విడుదల చేసేందుకు ఉపయోగపడే డిజిటల్ ఇంటర్మీడియట్ టెక్నాలజీతో పాటే.. కంప్యూటర్ ద్వారా కెమెరా కదలికలను నిర్దేశించే మోషన్ కంట్రోల్ సాంకేతికతనూ ప్రవేశపెట్టడంలో ప్రైమ్ ఫోకస్ దీ భారతదేశంలో కీలకపాత్ర.
నమిత్ మల్హోత్రా మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రైమ్ ఫోకస్… 2006లో స్టాక్ మార్కెట్ లోనూ లిస్టింగ్ అయింది. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. లండన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, వాంకూవర్ నగరాల్లో తన కార్యకలాపాలను ఆరంభించింది. హాలీవుడ్ చిత్రాలకూ విజువల్ ఎఫెక్ట్స్, త్రీడీ కన్వర్షన్ సేవలందించింది.
2009లో జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ కు కూడా ప్రైమ్ ఫోకస్ విజువల్ ఎఫెక్ట్స్ లో భాగస్వామ్యమైంది. ఆ విజయంతో మరిన్ని హాలీవుడ్ ప్రాజెక్టులను దక్కించుకుంది. అదే సమయంలో తన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రపంచస్థాయి చిత్రాలకు పనిచేసే భారతీయ వీఎఫ్ఎక్స్ నిపుణుల సైన్యాన్నీ తయారుచేశారు నమిత్.
ఆస్కార్ పరంపర!
2014లో ప్రైమ్ ఫోకస్ వరల్డ్ ఇన్ సెప్షన్ చిత్రానికి ఆస్కార్ గెల్చుకున్న లండన్ కు చెందిన డబుల్ నెగటివ్ స్టూడియోతో విలీనమైంది. ఆ విలీనంతో ఏర్పడ్డ సంస్థే డీ నెగ్ (DNEG).
ఈ సంస్థకు నమిత్ మల్హోత్రా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది.
ఇంటర్ స్టెల్లార్, ఎక్స్ మషీనా, బ్లేడ్ రన్నర్ 2049, ఫస్ట్ మాన్, టెనెట్, డ్యూన్, డ్యూన్ పార్ట్ 2, వంటి చిత్రాలెన్నింటికో అందించిన విజువల్ ఎఫెక్ట్స్ కు వరుసగా ఆస్కార్ల పంట పండింది. అలా 2025 అకాడమీ అవార్డ్స్ నాటికి డీనెగ్ మొత్తం ఎనిమది ఆస్కార్లను కైవసం చేసుకుంది. ఈ విజయాలతో ప్రపంచంలోనే అత్యంత భారీస్థాయి డిజిటల్ ప్రపంచాలను సృష్టించగల కొద్దిపాటి వీఎఫ్ఎక్స్ స్టూడియోల్లో ఒకటిగా నిల్చింది.
ప్రస్తుతం ఈ సంస్థలో నాల్గు ఖండాల్లో వేలాదిమంది కళాకారులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. వీరిలో గణనీయంగా భారతీయులే ఎక్కువ. ఒకప్పుడు లాస్ ఏంజిల్స్ కో.. లేక, లండన్ కో మాత్రమే పరిమితమని భావించిన అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ పనిని.. ఇప్పుడు భారతీయులే ప్రపంచానికి అందించే స్థాయికి చేర్చడంలో నమిత్ పాత్రా కీలకం.
నమిత్ మల్హోత్రా విజయం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామంటే కేవలం అవార్డుల వల్ల మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలోకి ప్రవేశించే కొత్త మార్గాన్ని అన్వేషించి.. ప్రపంచ సినిమా పోకడలను ఆకళింపు చేసుకుని కొత్త మార్గంలో పయనించడమే ఆయన్ను మిగిలిన ఎందరో సాంకేతిక నిపుణులతో ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇదేదో కాలిఫోర్నియాలోని ఫిల్మ్ స్కూల్ నుంచో.. ఏ న్యూయార్క్ స్టూడియోల్లోనుంచో పుట్టుకురాలేదు. ముంబైలో ఓ చిన్న గ్యారేజీ నుంచి ఆరంభమైన ఓ సక్సెస్ ఫుల్ జర్నీ. అంతేకాదు పరిశ్రమ పెద్దగా గుర్తించని ప్రతిభను వెలికితీసి ప్రపంచస్థాయికి చేర్చిన ఘనతా నమిత్ మల్హోత్రా సాధించాడు.
ఇప్పుడు రామాయణమే ప్రైమ్ ఫోకస్!
ఏళ్లుగా తన మూలాలను ప్రతిబింబించేలా ఒక భారతీయ కథను ప్రపంచస్థాయిలో తెరకెక్కించాలన్న కోరిక మాత్రం నమిత్ లో ఉండేదట. ఆ కల ఇప్పుడు నితీష్ తివారీ రామాయణంతో తీరబోతోంది. ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు చూస్తున్న ముఖ్యమైన సంస్థల్లో డీనెగ్ కూడా ఒకటి. ప్రైమ్ ఫోకస్ సంస్థ పేరిట ఈ సినిమా నిర్మాణంలోనూ ఓ నిర్మాగా నమిత్ భాగస్వామి అయ్యారు. గతంలో హరికేన్ హెయిస్ట్, బ్రహ్మాస్త్ర పార్ట్ వన్, హారిజోన్ లైన్ వంటి మరికొన్ని సినిమాలు నిర్మించిన అనుభవమూ నమిత్ ది.
నమిత్ కు ఇదేం కొత్త అధ్యాయం కాదు. గ్యారేజీలో మొదలైన తంతుకు కొనసాగింపు మాత్రమే. సరైన అవకాశాలు, సాంకేతికత, నమ్మకం కుదిరితే భారతీయ ప్రతిభ ప్రపంచాన్నే ఆశ్చర్యపర్చగలదని నమ్మిన వ్యక్తి నమిత్.
ఇంటిని తాకట్టు పెట్టి.. ఓ గ్యారేజీలో స్టూడియో పెట్టి.. పైసాకు కూడా కొరగానివారని జనం నవ్విన యువతతో ప్రయాణం మొదలుపెట్టి… పాండోరా, అరాకిస్, అంతరిక్షం వంటి అద్భుతమైన డిజిటల్ ప్రపంచాలను సృష్టించిన అదే విజువల్ భాష.. ఇప్పుడిక భారతీయ ఇతిహాసమైన రామాయణంతో ప్రపంచ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



