ఎవరిని ఎవరు ఎలా ఎంతలా ప్రభావితం చేస్తారో ఎవ్వరూ ఏవిధంగానూ అంచనా వేయలేరు. అలా అమెరికా మాజీ అధ్యక్షుడితో అమితంగా ప్రభావితమైన వ్యక్తుల్లో… సీనియర్ దివంగత కాంగ్రెస్ నేత ఎస్.ఎం. కృష్ణ ఒకరు. 92 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన ఎస్.ఎం. కృష్ణకు.. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్. ఎఫ్. కెన్నడీకి మధ్య ఆ సంబంధమేంటో ఒకసారి చెప్పుకుందాం

సోమనహల్లి మల్లయ్య కృష్ణ అంటే తెలియనివారందరూ… ఎస్.ఎం. కృష్ణ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. 2009 నుంచి 2012 వరకూ భారతదేశ విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఎస్. ఎం. కృష్ణ 1999-2004 మధ్య కర్నాటక పదో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2004-2008 వరకూ మహారాష్ట్ర 19వ గవర్నర్ గా పనిచేశారు. 1989 నుంచి 93 వరకు కర్నాటక విధానసభకు స్పీకర్ గా వ్యవహరించారు. లోక్ సభ, రాజ్యసభలకు ఎన్నికయ్యారు. ఇంత సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న ఎస్. ఎం. కృష్ణకు అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్. ఎఫ్. కెన్నడీ అంటే అమితమైన ఇష్టం. ఒక్కమాటలో చెప్పాలంటే తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు కూడా కెన్నడీ ప్రభావం అమితంగా కృష్ణపై పనిచేసింది.
గ్రాడ్యుయేషన్ వరకూ మైసూర్, బెంగళూర్ లో చదివిన కృష్ణ… ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ లా డల్లాస్ లోని సదర్న్ మెథడిస్ట్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ లా స్కూల్ లోనూ ఆయన విద్యాభ్యాసం సాగగా… కృష్ణకు మంచి బ్రైట్ స్టూడెంట్ అనే పేరుండేది. అలా 1960 సమయంలో వచ్చిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జాన్. ఎఫ్. కెన్నడీ డెమోక్రాట్ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ఆ సమయంలో కెన్నడీ నుంచి తన తరపు ఇండియన్ అమెరికన్ సామాజికవర్గాల్లో ప్రచారం నిర్వహించాలని ఓ లేఖ అందింది. సరిగ్గా 28 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఎస్.ఎం. కృష్ణ కాదు అనకుండా.. ముందుకు దూకాడు. అదిగో అలా జాన్. ఎఫ్. కెన్నెడీకి, ఎస్.ఎం. కృష్ణకు మధ్య బంధం బలపడింది.
క్యాంపెయినింగ్ పూర్తైంది. ఎస్. ఎం. కృష్ణ అంకితభావంతో కెన్నెడీ కోరినట్టే ప్రచారం చేశాడు. ఇంకేం, కెన్నెడీ అధ్యక్షుడయ్యాడు. ఆ తర్వాత మన యువ భారత విద్యార్థైన ఎం. ఎం. కృష్ణను తల్చుుకన్నాడు. అంతేకాదు.. మన పద్మవిభూషణుడైన ఎస్. ఎం. కృష్ణకు కృతజ్ఞతా పత్రాన్ని కూడా అందించారు జాన్. ఎఫ్. కెన్నెడీ. ఈ విషయాల్ని కృష్ణ తరచూ సందర్భం వచ్చినప్పుడు తన స్నేహితులతో చెప్పుకునేవారట.
కెన్నెడీ ఎంతగా తనను అభినందించింది.. డెమోక్రాటిక్ అభ్యర్థిగా ఉన్న తన గెలుపులో ఇండియన్ అమెరికన్స్ ఓట్ షేరింగ్ తనకెంతగా ఉపయోగపడింది.. తన గెలుపుకు దోహదపడిందీ.. ఇలా అన్ని విషయాలను నాటి అమెరికా దివంగత మాజీ అధ్యక్షుడు గుర్తు చేసుకున్న సందర్భాలను ఎస్. ఎం. కృష్ణ చెబుతుండేవారట. అలా అమెరికా నుంచి తిరిగొచ్చాకే ఎస్. ఎం. కృష్ణ మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. 1962లో కర్నాటకలోని మాండ్య నియోజకవర్గం నుంచి ప్రముఖ రాజకీయవేత్త శంకర్ గౌడన్ ఓడించి ఎమ్మెల్యే అయ్యాడు.
ఎస్. ఎం. కృష్ణ సేవలకుగాను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ తో సత్కరించగా.. ఈయన ఇద్దరు బిడ్డల తండ్రైన కృష్ణ కూతురు మాళవిక భర్త.. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ ఆత్మహత్య కృంగదీసింది. సుదీర్ఘకాలంపాటు కాంగ్రెస్ తో ప్రయాణం చేసిన కృష్ణ… చివర్లో 2017 సమయలో కాంగ్రెస్ పార్టీ గందరగోళ నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆరోపణలతో ఆ పార్టీ వీడి.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2023లో పాలిటిక్స్ నుంచి పూర్తిగా పక్కకు తప్పుకున్నారు.
కృష్ణ మృతి నేపథ్యంలో బుధవారం రోజు కర్నాటక ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా అవనతం చేయాలనీ ప్రభుత్వం ఆదేశించింది. మొత్తంగా సుదీర్ఘ కాలంగా భారత రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన సోమనహల్లి మల్లయ్య కృష్ణ.. అలా జాన్. ఎఫ్. కెన్నెడీతో తన బంధాన్ని కొనసాగించిన రోజులను తరచూ తల్చుకునేవారట.



