యూఎస్ తన పెద్దన్నతనాన్ని నిలబెట్టుకునేందుకు.. ప్రపంచ దేశాల్ని శాసించేందుకు… తన పట్టు కోల్పోకుండా ఉండేందుకు.. తన స్థాయికెదిగేవారిని ఎక్కడికి పరిమితం చేయాలో అక్కడికే పరిమితం చేసేందుకు.. బలహీనుల్ని బలవంతులనుకున్నవారిపైన ఎగదోసేందుకు.. ఆ క్రమంలో వారికి మద్దతిచ్చేందుకు అస్సలు వెనుకాడదు. ఇది చరిత్ర చెబుతున్న నిజం.
అదే క్రమంలో భారత్ తో యుద్ధంలో గతంలో పాకిస్థాన్ కు సాయం చేయమని ఇరాన్ ను కోరిన ఆ చరిత్ర గురించి ఓసారి చెప్పుకుందాం. అదే సమయంలో అదే పాకిస్థాన్ ఇప్పుడు ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులను ఎలా ఖండించిందో కూడా చూస్తున్నాం. దీంతో అంతర్జాతీయంగా ఎప్పుడెవరికి ఎవరు ఎలాంటి మద్దతునందిస్తారో… అవసరమైతే ఎలా మారిపోతారో ఈ కథనంలో తెలుసుకోవచ్చు.

పెహల్గాం విషాదం తర్వాత భారత్ – పాక్ మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభనలో నిర్ణయాత్మక దౌత్య పాత్ర తనదేనంటూ తనకు తానే చాటుకుని పలు చర్చలకు, అంతర్గతంగా భారత్ లో పలు అనుమానాలకూ తెరతీశాడు యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్. అలాంటి ట్రంపును పాకిస్థాన్ నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేయడం ఈ మధ్యకాలంలో పాన్ వరల్డ్ జోక్. అయితే, అంతలోనే పాకిస్థాన్ యూ టర్న్ తీసుకుంది. ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులను అదే పాక్ తీవ్రంగా ఖండించడంతో మళ్లీ అమెరికా పట్ల మారిన పాక్ వైఖరి స్పష్టమైంది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఓపెద్ద చర్చగా మారింది.
ఇది కాస్సేపలా ఉంచితే అమెరికా ఆది నుంచీ వాటం కొద్దీ ఏలా వ్యవహరిస్తుందో చెప్పే ఓ హిస్టారికల్ స్టోరీ ఇది.
1971లో భారత్ – పాక్ మధ్య దౌత్యసంబంధాలు బెడిసికొట్టి తీవ్ర యుద్ధానికి తెరలేచిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పాక్ ను భారత్ చిత్తు చేసింది. ఒక దశలో పాక్ పని మొత్తం అయిపోతుందేమోనన్న ఒకింత ఆందోళనకు కూడా తెరలేచింది. అదిగో అప్పుడే పాకిస్థాన్ కు మద్దతిమ్మని నాడు అమెరికా ఇరాన్ ను కోరింది.
అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కు అప్పటి జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న హెన్రీ కిస్సింజర్ 1971, డిసెంబర్ 9వ తేదీన ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించాడు. భారత దళాలు కరాచీ ఓడరేవుపై దాడి చేసిననంతరం పాకిస్థాన్ ఇంధన నిల్వలు ప్రమాదకరస్థాయిలో తగ్గిపోతుండటం పాక్ తో పాటు, అప్పటి అమెరికాను కూడా ఆందోళనకు గురిచేసింది. పాక్ ఇంధన నిల్వల్లో ఎక్కువ భాగం కరాచీ ఓడరేవులోనే నిల్వ ఉన్నాయి. ఆ సమయంలో ఆ కరాచీ ఓడరేవును ఇంధనాన్ని వెంటనే సరఫరా చేయకపోతే పశ్చిమ పాకిస్థాన్ ప్రాంతంలోని పాకిస్థాన్ సైనిక కార్యకలాపాలన్నీ పూర్తిగా నిల్చిపోయి భారత్ పైచేయి సాధిస్తుందనే భయం అమెరికాను వెంటాడింది.
దాన్ని నివారించడానికి ఇరాన్ ను టెహ్రాన్ నుంచి పాకిస్థాన్ కు త్వరగా ఇంధనాన్ని సరఫరా చేయగలరా అని కిస్సింజర్ అడిగాడు. అలాగే, భారత దళాలకు వ్యతిరేకంగా పాక్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి తమ ఫైటర్ జెట్లను కూడా సరఫరా చేయాలనే ఆలోచనను కూడా అమెరికా ఇరాన్ ముందుంచింది. అంతేకాదు, అమెరికా కుట్రలు ఎలా పన్నేదో చెప్పడానికి నాటి ఈ చారిత్రక విషయాలు నిలువెత్తు తార్కాణాలుగా కనిపిస్తాయి. ఒకవైపు పాకిస్థాన్ తో యుద్ధం జరుగుతున్న సమయంలో భారత్ ఫోకస్ ను డైవర్ట్ చేసే కుట్రలో భాగంగా నాడు చైనా దళాలను భారత సరిహద్దుల్లో మోహరించే ప్రతిపాదనను కూడా చైనా ముందుంచింది అమెరికా.
భారత్ – పాక్ యుద్ధం తీవ్రతరమైన ఆ సమయంలో సైనిక పరిస్థితిపై కిస్సింజర్.. అదే అమెరికాకు చెందిన అప్పటి జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్ఠాఫ్ చైర్మన్ అడ్మిరల్ ధామస్. హెచ్. మూరర్ ను కూడా ఆరా తీశాడు.
అప్పటి తూర్పు పాకిస్థాన్ లో కాల్పుల విరమణకు అవకాశమే లేకుండా.. పాక్ సైన్యం కుప్పుకూలిపోబోతోందని మూరర్ కిస్సింజర్ కు చెప్పాడు. అప్పటికే వారికి ఇంధన సరఫరా మార్గాలు పూర్తిగా తెగిపోయాయని.. వైమానికంగా ఎలాంటి మద్దతు కూడా ఇచ్చే పరిస్థితి లేదనీ.. సరిగ్గా పది నుంచి పద్నాలుగు రోజుల్లో అక్కడ యుద్ధం ముగిసే అవకాశం ఉందనే సమాచారమందించాడు. అయితే, చివరివరకూ పాక్ దళాలు పోరాటం చేస్తాయా, లేక మధ్యలోనే లొంగిపోతాయా అనేది మాత్రమే చూడాల్సి ఉందన్న మూరర్.. అదే సమయంలో, లొంగిపోయే అవకాశాలూ తక్కువేననీ కిస్సింజర్ కు వెల్లడించాడు.
పశ్చిమ పాకిస్థాన్ వైపు జరుగుతున్న యుద్ధం గురించి కూడా స్పష్టమైన వివరాలనందించాడు మూరర్. కశ్మీర్ లో వీలైనంత ఎక్కువ భూభాగం పాక్ స్వాధీనం చేసుకోవడానికి యత్నిస్తున్నట్టు.. అలాగే, భవిష్యత్తులో భారత్ కు ఉండే ప్రధాన కమ్యూనికేషన్ మార్గాలకు అడ్డుకట్ట వేసేవిధంగా పాక్ యోచిస్తోందన్నారు. అదే సమయంలో, కాశ్మీర్ కు దక్షిణ భూభాగంలో భారత దళాలు పాకిస్తాన్ కు మించి రెట్టింపు దళాలను మోహరించాయినట్టు వెల్లడించిన మూరర్.. లాహోర్ వైపు భారత చూపు అప్పటికింకా స్పష్టంగా లేకపోయినా భవిష్యత్తు అవకాశాలనూ కొట్టిపారేయలేం అన్నాడు. అయితే, పాకిస్థాన్ మాత్రం కాల్పుల విరమణ జరిగేకంటే ముందే వీలైనంత కశ్మీర్ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు కిస్సింజర్ కు వెల్లడించాడు మూరర్.
కాల్పుల విరమణ గనుక జరగకపోతే పశ్చిమ పాకిస్థాన్ వైపు పాక్ దళాలు కేవలం ఇంకో మూడువారాలు మాత్రమే తమ సైనిక కార్యకలాపాలను కొనసాగించగలవని.. ఆ తర్వాత భారత్ దే పైచేయి కాబోతోందని.. అప్పటికే భారత ప్రధాని ఇందిర పాక్ సైనిక బలాన్ని తుత్తునియలు చేయాలనే సంకల్పంతో ఉన్నట్టుగా కూడా ఆయన తన నివేదికనిచ్చాడు.
కశ్మీర్ లో వీలైనంత భూభాగాన్ని పాక్ స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న తరుణంలో… ఒకవేళ అదే జరిగితే ఆ భూభాగాల్ని పాక్ తనవైపు నిలుపుకోగదా.. లేక, సైన్యమే తుడిచిపెట్టుకుపోతుందానని కూడా కిస్సింజర్ మూరర్ తో ఆరా తీశాడు.
తూర్పు పాకిస్థాన్ లో పాక్ సైనికులు చేతులెత్తేశాక.. భారత్ తన బలగాల్లోని ఆరు డివిజన్లలోని నాల్గింటిని తూర్పు నుంచి పశ్చిమం వైపు పంపించే అవకాశముందని మూరర్ అంచనా వేశాడు. అప్పటి పరిస్థితులు, పాక్ వైమానిక దళాల కదలికల్లో మందగింపువంటివి చూస్తే మూడువారాల్లో యుద్ధం ముగుస్తుంది.. పాక్ ను భారత్ కొట్టేస్తుందని.. పాక్ కు ఓటమి తప్పదని.. మూరర్ కచ్చితమైన అంచనా వేయగల్గాడు.
ఎప్పటి కెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి యన్యుల మనముల్ నొప్పించక తా నొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ అంటాడు బద్దెన. ఈ బద్దెన పద్యం అమెరికాకు వర్తిస్తుంది. బలవంతుల పక్కన నిలబడమే కాదు… కొన్ని సందర్భాల్లో బలహీనమైనవారి పక్కనా నిలబడి వ్యూహాత్మక భాగస్వాములను రక్షించుకోవడానికి అమెరికా వేసే ఎత్తుగడలను ఎప్పుడైనా ఓ కాపు కాసిపెట్టుకోవాల్సిన విషయాన్ని నాటి 1971 యుద్ధకథ చెబుతుంది.
అదే సమయంలో నాడు పాకిస్థాన్ కు మద్దతు కోసం అమెరికా ఇరాన్ ను సంప్రదిస్తే… అదే అమెరికా ఇరాన్ అణుకేంద్రాలపై దాడి చేస్తే… అదే పాకిస్థాన్ నేడు తీవ్రంగా ఖండించడం కూడా ఎప్పుడు ఎవరి ప్రాధాన్యతలెలా మారిపోతాయో కూడా చూపించే ఉదంతమిది.



