Shankar. G.. ✍🏼
వెళ్లిపోయి…. ఇల్లు విడిచి….
సినీరాజై పైకి తేలెను!
1930 సంవత్సరంలోమనప్రాంతం నుంచి బయలుదేరి నేను తిన్నగా బొంబాయి వెళ్ళాను. అది చాలా ఆర్థిక సంక్షోభం చూసిన సంవత్సరం. ధాన్యం ధరలు బాగా తగ్గాయి. మా నాన్నగారు చాలా గౌరవంగా బ్రతికినాయన.
బస్తా ధాన్యం రెండు రెండున్నర రూపాయలు కావటంతో, నాన్నగారు దివాళా ప్రకటించదలచినట్లుగా నాకు తెలియ పరిచారు. అది చాలా నామోషీ అని గౌరవంగా ఇన్నాళ్ళు బ్రతికామని, నేనెట్లాగైనా సరే అక్కడి నుంచి వెళ్ళిపోదామని ఉద్దేశం కలిగింది. ఏమైనా చేద్దాం బయటకు వెళ్ళి అంటే ఎకడమిక్ గా బియే డిగ్రీలు గిగ్రీలు లేవు నాకు. కొద్దిగా గ్రామాల్లో డ్రామాల్లోనటించడం అలవాటు, సినిమాలు చూడటం,అప్పుడప్పుడు హీరోల్లాగా ఇంటికి వచ్చి గంతులేయడం చేసేవాణ్ణి, ఎప్పుడైనా హీరోగా ఏక్టు చేద్దామని ఏదో మూలనున్న అభిప్రాయం అప్పుడు బయటకు లాగి సరే ఏమయితే అయింది అని ఇంట్లోనుంచి వంద రూపాయలు తీసుకొని నా పేర ఖర్చు రాసి రాత్రికి రాత్రి బయలుదేరి తిన్నగా బొంబాయి వెళ్ళాను. ఇంటి దగ్గిర ఎవరికీ తెలియదు నేను ఎక్కడికెళ్ళానో.సరే. అక్కడ ఏదో నానా అవస్థలు పడి, కొంత కాలం తిరగ్గా తిరగ్గా చిన్న చిన్న ఉద్యోగాలు దొరికాయి పోయాయి. చాలా అవస్థలు పడ్డాను. భాష సరిగా తెలియదు. హిందీ తెలియదు, ఇంగ్లీషు ఏదో బ్రోకెను ఇంగ్లీషు. అట్లా ఎట్లా అయితేనేం 1931 ప్రాంతాలలో, అంటే అప్పుడు సైలెంటు యుగం నడుస్తున్నది, టాకీ కొత్తగా వచ్చిందన్నమాట, ఇంపీరియల్ కంపెనీలో చేరాను. అక్కడ అలవాటు ఏమిటి? ఒక ఏక్టర్ల గ్రూపును జూనియర్ ఆర్టిస్టులుగా ఎప్పుడు ఏవి కావలసి ఉన్నా వేయడానికి ఉంచుకునేవారు. అందులో నన్ను కూడా చేర్చుకున్నారు. అక్కడ పృథ్వీరాజుగారు వీరూ, వారూ అంతా ఉండేవారు.పెద్ద, చిన్నా తేడా లేకుండాఅంతా కలిసి మెలిసి ఉండేవారు. ప్రతి రోజూ సాయంత్రం కవాతు చేయడం. అలా హేపీగానే కాలం గడిచేది.అక్కడుండగానే హెచ్.ఎమ్. రెడ్డిగారు నాకు * పరిచయమయ్యారు. అయనేదో అక్కడ పృథ్వీరాజ్ కపూర్ హీరోగా ఒక సైలెంట్ పిక్చర్ డైరెక్టు చేస్తున్నారు. అప్పుడే టాకీ ప్రారంభమయింది. ‘ఆలంఆరా’ వచ్చింది – అర్దేషీర్ గారికి తమిళ్ ఏమైనా పిక్చర్ తీద్దామని ఉద్దేశం కల్గి ‘సావిత్రి’ తీద్దామనుకున్నారు. అప్పుడు టి.పి. రాజ్యలక్ష్మిని, వారినీ పిలిపించారు. నేను కూడా ఉన్నాను కనుక అందులో నేను కూడా ఒక వేషం వేశాను. ఆ విధంగా హెచ్.ఎమ్. రెడ్డిగారితో పరిచయమయింది.

ఆయన దక్షిణ. భారతీయుడైనా అక్కడ మంచి కమాండ్ చేసేవాడు. ఆయనంటే అందరికీ హడలు. ఆయన అస్ట్రాలజీ, పామిస్ట్రీ చెబుతూ ఉండేవాడు. అందువలన అందరికీ గౌరవం. ఆ పిక్చర్ అవగానే, కృష్ణ ఫిలిం కంపెనీవారికి ‘భక్తప్రహ్లాద’ తీయాలని ఉద్దేశం కల్గింది. రెడ్డిగారే డైరెక్టు చేయడం కనుక ఆయనే నన్ను పిలిచారు. సావిత్రి పిక్చరులో కమలాబాయి ఉండేది. సుబ్బారావు అని ఒకాయన ఉండేవారు. చిత్రపు నరసింహారావుగారు రెడ్డిగారికి అసిస్టెంటుగా పని చేస్తూ ఉండేవారు. ఆయన నాకు పరిచయం. ఆయనా, నేను మాస్టర్ల వేషం ఏదో ప్రహ్లాదలో అనుకుంటాను వేసాం.
దాని తర్వాత కొద్ది కాలానికి రెడ్డిగారు సీతా స్వయంవరం అని ఒక హిందీ పిక్చర్ డైరెక్టు చేయబోతుంటే అక్కడకునన్ను పిలిచారు. అక్కడేదో చిన్న వేషం వేసాను. ఆయనతోబాటు కొంతకాలం ఉన్నాను. అయితే ఆయనకీ, ప్రొడ్యూసర్స్ అభిప్రాయభేదాలు కలిగి ఆయన వెళ్ళిపోయారు. కాని నేను ఆ ప్రొడ్యూసర్ దగ్గిరే కొనసాగి కొంతకాలం పని చేసాను. అక్కడి నుంచి అల్లాగే బొంబాయిలో కొంతకాలం పని చేస్తూ చేస్తూ, ఇంపీరియల్లో ఉండగా, అక్కడి సిబ్బందిని తగ్గించటంతో నన్ను తీసివేస్తే అక్కడా ఇక్కడా పని చేసాను. కొంతకాలానికి సొంతంగా ఏదైనా ఫిలిం తీయాలని ఉద్దేశం కలిగి అక్కడ నౌకరీలేక అవస్థలు పడ్తూ చివరకు మన ప్రాంతం వచ్చి, మళ్ళీ ఏదైనా చేదామా అంటే ఏదీ కుదరలేదు. రెడ్డిగారు అప్పుడు మద్రాసులో గృహలక్ష్మి అనే పిక్చర్ తీసారు. వాహినీ పిక్చర్ బ్రాండ్లో. అయనెట్లా తెలుసుకున్నాడో నా ఎడ్రసు తెలుసుకొని నువ్వు రావలసింది. నీకు ఏదైనా పని చూపిస్తాను అంటే మద్రాసు వచ్చాను. అప్పుడు ఆయన నన్ను ఆయనకి అసిస్టెంటుగా పెట్టుకున్నారు. ఆయన తీసే పిక్చర్ ‘సత్యమేజయం’లో హీరోగా వేషం ఇచ్చారు. దాని తర్వాత తెనాలి రామకృష్ణ తర్వాత లైనులో పడ్డాం. కాని ఈలోగా జపాను బాంబింగు ఏదో జరిగింది. మళ్ళీ అంతా విడిపోయారు. రెడ్డిగారు పూనా లేదా మరెక్కడికో వెళ్ళిపోయారు. నేను మళ్ళా మన ప్రాంతం వచ్చాను.
తాండ్ర సుబ్రహ్మణ్యంగారని ఒకాయన ఉండేవారు. ఆయనేదో నాటకాలు రాసినట్లున్నారు. ఏదో పిక్చరుకు కూడా రాసినట్లున్నారు. ‘కష్టజీవి’ అనే పిక్చరు తీయాలి. బొంబాయిలో తీయాలి. మీరు బొంబాయిలో ఉన్నారు కనుక మీరు తప్పకుండా రావాలని కోరారు. అలా మళ్ళీ బొంబాయి వెళ్ళాను. అది 1943 సంవత్సరం అనుకుంటాను. అప్పటికే క్విట్ ఇండియా హడావుడి అదీ వచ్చింది. సరే అక్కడ తర్వాత ఆయన రెండు రీళ్ళు పిక్చర్ తీసిన కొనసాగలేదు. ఆయన తిరిగి వచ్చేసారు. జంపన కూడా ఉన్నాడనుకుంటాను అప్పుడు. అక్కడే నాకు పాత స్నేహితులు మళ్ళీ కనబడితే వాళ్ళతో జాయినయి అసిస్టెంటు డైరెక్టర్ దావల్లీ సాయి, ముంతాజుశాంత వాళ్ళు తీసే పిక్చర్లలో ‘సవాల్’, లేడీ డాక్టర్ అనే రెండు మూడు పిక్చర్లో పని చేసాను. పనులులేక వున్నాను. పృథ్వీ థియేటర్స్ అని అప్పుడే మొదలు పెట్టారు. వాళ్ళు శకుంతల నాటకం, దీవార్ నాటకం వేస్తూ ఉండేవారు. నాకు పరిచయం ఉంది కనుక వెళ్ళి అడిగితే దానిదేముందిరా అన్నారు. సరే రోజూ అక్కడ నైట్ డ్యూటీ ఎక్కువగా ఉండేది. పగలు అక్కడా ఇక్కడా పని చేస్తూ ఉండేవారు. తర్వాత కొన్ని హిందీ పిక్చర్సులో అసిస్టెంటు డైరెక్టర్ పని చేస్తూ ఉండగా 1945లో అనుకుంటాను అక్కడే సారథీ ఫిలిమ్స్ తరపున మన కోవెలమూడి ప్రకాశరావుగారు ఇంకా కొందరు బొంబాయి వచ్చారు. నేను వారిని కలుసుకున్నాను. వారు అప్పుడు ఏదో పిక్చరు ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ గారు రైటరు. మీరు రండి గోపీచంద్ గార్కి అసిస్టు చేద్దురుగాని, ఆయన డైరెక్టర్గా కొత్త అని చెప్పారు. తప్పకుండా వస్తానని చెప్పాను. 45లో అనుకుంటాను మద్రాసు వచ్చాను. గోపీచంద్ గారు, నేను స్టోరీ విషయంలో, హీరో విషయంలో ఎవరా అనుకున్నాం. వాళ్ళు నా పాత పిక్చర్ సత్యమేజయం కూడా చూసి ఎందుకండీ మీరే వేయండి ఫర్వాలేదు బాగానే ఉంటుంది అన్నారు. సరేలే అన్నాను. మాట సందర్భంలో గోపీచంద్ గారు ఏమనుకున్నారో ఏమో, వద్దు ప్రసాదూ! నువ్వే డైరెక్ట్ చేయి నాయనా, నేను రైటర్గా ఉంటాను ఈ పిక్చరుకి అని అన్నారు. అలా గృహప్రవేశానికి నేను హీరోని, డైరెక్టరుని అయ్యాను. ఆ పిక్చరు ప్రజలకి ఏదో తమాషాగా కొత్త టెక్నిక్గాను, బొంబాయి టైపులో ఉందనుకొని బాగానే లైకు చేసారు. అలా ఫస్టు డైరెక్టరుగా కెరీర్ మొదలయింది.
అప్పుడే గూడవల్లి రామబ్రహ్మంగారు గృహప్రవేశం రషెస్ చూసారు. ఆయన పల్నాటి యుద్ధం ఎర్లీ పోర్షన్ తీసారు. ఆయనకి వంట్లో అంత బాగుండటంలేదు. ఆయన ఏమనుకున్నారో ఏమో “నాయనా! పల్నాటి యుద్ధం నువ్వే డైరెక్టు చేయి. నాకు ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు అన్నారు ఒక రోజున, సరే అలా ఈ గృహప్రవేశం తీస్తూ ఉండగానే పల్నాటియుద్ధం ప్రారంభించారు. పల్నాటి యుద్ధం అవుతుండగానే కోవెలమూడి ప్రకాశరావుగారు ద్రోహి ఫిలిం ప్లాను చేసి అందులో కూడా నన్ను వేషం వేయమన్నారు. డైరెక్టు చేయమన్నారు. అందులో ప్రకాశరావుగారు హీరో, లక్ష్మీ రాజ్యం వరలక్ష్మి నటించారు. ఆయన కూడా ప్రేమగా ఆప్యాయతగా చూసారు. కలిసిమెలిసి చేసాం. ద్రోహి పిక్చర్ చాలా బాగా వచ్చింది. అందర్నీ ఆకర్షించింది. అలా అక్కడ్నించీ ప్రారంభమయింది మద్రాసులో.. సరే తర్వాత తర్వాత షావుకారు.. సంసారంతో పాటుగా, తమిళ పిక్చర్స్ కూడా చేశాను, ఇట్లే 1954లోనో ఎప్పుడో స్వంతంగా ఫిలిం తీయాలని ఉద్దేశం కల్గింది.వాహినీలో చేరటం,లక్ష్మి ప్రొడక్షన్స్ అని సంస్థ పేరు పెట్టి ‘ఇలవేల్పు’ అని తీసాను. నాకు వంట్లో బాగుండక ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళి ఉపవాసాలు ఉండి చాలా నీరసంగా ఉండేవాణ్ణి. నా దగ్గిర అసిస్టెంటుగా పని చేస్తూ ఉండేవాడు యోగానంద్. అతన్ని పిలిచి నాయనా! నువ్వే డైరెక్టు చేయి, నేనుచూస్తూ ఉంటాను. అని ఇలవేల్పు పిక్చర్ తీసాం. ప్రజలు బాగానే ఆదరించారు. దాని తర్వాత ఉద్దేశం కల్గింది. ఈ పిక్చరునే హిందీలో ఎందుకు తీయకూడదు.అని. డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రోత్సహించారు. వెనుక వుండే పాత పరిచయంవలన పృథ్వీరాజ్ గార్ని. రాజ్కప్పూర్ని కలుసుకోవటం జరిగింది. వాళ్ళు చాలా సంతోషించారు. చాలా కాలం తర్వాత మళ్ళీ వచ్చానని. రాజ్ కపూర్ ని రిక్వెస్టు చేసి ఆయనను నాగేశ్వరరావు వేసిన వేషం వేయమని మీనాకుమారిని, అంజలీదేవి వేషం వేయమని ‘శారద’ అని ఫస్టు పిక్చర్ హిందీలో తీసాం. దానికి కూడా మంచి పేరు వచ్చింది. దాని తర్వాత వరుసగా ఛోటీ బెహన్ ససురాల్. చాలా పిక్చర్లు.. పదహారు పిక్చర్ల వరకు తీసాం. అన్నీ బాగానే
పోయాయి.
(1982లో పన్నాల సుబ్రహ్మణ్యభట్టుకి ఎల్.వి. ప్రసాద్ గారు మద్రాసులో ఇచ్చిన ఇంటర్వ్యూ) నేడు ఎల్ వి ప్రసాద్ జయంతి)
(క్లాసిక్స్ గా పేరుపడ్డ షావుకారు, పెళ్ళిచేసిచూడు ,మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు లాంటి విజయావారి చిత్రాలను తనే డైరెక్ట్ చేశాడు. యన్టీ రామారావును మన దేశం ద్వారా సిని రంగానికి పరిచయం చేశాడు. ప్రసాద్ కలర్ ల్యాబ్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, ప్రసాద్ ఐమ్యాక్స్ దియేటర్లు ఈయన పేరు మీదుగా నెలకొల్పబడ్డాయి.)



