కొన్ని చీకటి జ్ఞాపకాలు, నెత్తుటి మరకలు సమాజం అంత త్వరగా మర్చిపోదు. జనరేషన్స్ మారుతున్నా కొన్ని బలమైన ముద్రలు అలాగే ఉండిపోతాయి. అభినవ దుర్గ అనిపించుకున్న నాటి ప్రధాని ఇందిరాగాంధీ వేసిన అలాంటి ముద్రే ఎమర్జెన్సీ విధింపు. ఆ చీకటిరోజుల గుర్తులు ఇప్పటికీ ఢిల్లీ వీధుల్లో కళ్లకు కడుతూ నాటి తుగ్లక్ నిర్ణయాల్ని పట్టిచూపిస్తుంటాయి.

ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చే 1970ల కాలం ముందువరకూ కూడా ఢిల్లీ వీధులతో పాటు, గల్లీ వీధుల్లో కూడా చిన్నపిల్లలు బట్టల్లేకుండా కూడా ఆరుబయట ఆడుకునేవారు. కానీ, ఎమర్జెన్సీలో స్టెరిలైజేషన్ దెబ్బకు పసిపిల్లలకు కూడా ఎక్కడ వేసక్టమీ చేస్తారోనన్న భయం ఆవహించి అప్పుడే పుట్టినవారిక్కూడా బట్టలు వేసేంత ఆందోళన నెలకొంది.
50 ఏళ్ల క్రితం నాడు అత్యవరస పరిస్థితి విధించినప్పుడు స్టెరిలైజేషన్ అవసరమెంత ఉండేనోగానీ.. ఇప్పటి కాలానికి మాత్రం మళ్లీ అవసరమొస్తుందానన్న అనుమాన్నానైతే పెరుగుతున్న జనాభా చూపిస్తోంది.
- జూవ్ 25వ తేదీన నాటి ప్రధాని ఇందిర విధించిన అత్యవసర పరిస్థితికి 50 ఏళ్లు నిండుకుంటున్నా… నాటి చేదు జ్ఞాపకాలు ఇంకా చాలామందిని వెంటూడుతూనే ఉన్నాయి.
1976లోనే, భారతదేశమంతటా ఎనిమిది మిలియన్లు.. అంటే సుమారు 1 కోటి 60 లక్షల మందికి పైగా స్టెరిలైజేషన్స్ చేశారు. వాటిలో ఎక్కువ భాగం వ్యాసెక్టమీలే. అయితే అవన్నీ, స్వచ్ఛందంగా జరగకపోగా నియంతృత్వ పద్ధతిలో బలవంతంగా చేసిన ఆపరేషన్స్.
ఢిల్లీలోని ఓఖ్లా నివాసి అయిన 78 ఏళ్ల ఇష్రత్ జహాన్ ను కదిపినా… ఇప్పుడు అలీఘర్ లో నివశిస్తున్న 83 ఏళ్ల అమీనా హసన్ ను అడిగినా యుద్ధకాలపు పరిస్థితులకేమాత్రం తక్కువకాని నాటి చీకటిరోజుల గురించి అంతే బాధగా చెబుతూ వణుకుతుంటారు.
స్టెరిలైజేషన్ ప్రక్రియలో భాగంగా బావుల్లో, పొలాల్లో ఎక్కడ దాక్కున్నా నాటి సైనిక సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎలా వెంటాడేవారో వారి మాటల్లో వినబడుతుంది. వారి కళ్లల్లో కనబడుతుంది. స్టెరిలైజ్ చేయించుకుంటేనే ఉద్యోగ భరోసా అని బెదిరించే క్రమంలో దిక్కులేక, ఏంచేయాలో తోచక, కుటుంబాలను పోషించుకునేందుకు ఆలోచించే సమయం కూడా లేక ఒప్పుకున్నవారెందరో!
అలా ఇందిర విధించిన ఎమర్జెన్సీలో ఒకదిక్కు భిక్కుభిక్కుమంటూ ఏం జరుగుతుందోనన్న భయంతోపాటే.. ఇంకోవైపు, కొన్నిచోట్ల నస్బందీ కే దూత్.. ఇందిరా కీ లూట్ అంటూ స్టెరిలైజేషన్ ఏజెంట్లతో ఇందిరాగాంధీ లాటీలకు పాల్పడుతోందనే నినాదాలూ ఉపందుకున్నాయి.
1976 ఏప్రిల్ లో ఢిల్లీలోని తుర్క్ మాన్ గేట్ దగ్గర అత్యంత హింసాత్మక ఘటనలకు తెరలేచింది. ఢిల్లీ నగర సుందరీకరణ ఆందోళనకరంగా మారింది. ఇళ్ల కూల్చివేతలను నిరసిస్తూ జనం రోడ్డెక్కారు. మరోవైపు, అప్పటికే జరుగుతున్న స్టెరిలైజేషన్ కు వ్యతిరేకంగా కదం తొక్కారు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. అక్కడ తమ ఉనికిని, అస్తిత్వాన్ని కోల్పోయినవారెందరో ఇప్పటికీ నాటి ఇందిర విధించిన ఎమర్జెన్సీ కాలంలో అనుభవించిన నెత్తుటి జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే, వారంతా నిర్వాసితులయ్యారు. తమ కూడు, గూడు, నీడైన ఇళ్లన్నీ ధ్వంసమైపోయాయి. పోలీసుల కాల్పుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఢిల్లీ తుర్క్ మాన్ గేట్ బలవంతపు ఆక్రమణలకు ఓ శాశ్వత చిహ్నంలా ఎప్పటికీ గుర్తుండిపోతోంది.
పురుషులు, మహిళలన్న తేడా లేకుండా మొత్తంగా మానవ హక్కుల ఉల్లంఘనకు నాటి ఎమర్జెన్సీ ఓ మాయని మచ్చగా మారిపోయింది. పిల్లలు కనే హక్కులను కాలరాసింది. నాడు పెరుగుతున్న జనాభాను ఓ బూచిగా చూసిన కాలం నుంచి నేడు 140 కోట్లకుపైగా జనాభా విస్తరించినా కూడా మన ప్రజలే మన ఆస్తి అనుకునేంత మార్పునూ చూస్తోంది నేటి భారత్.
కానీ, అదే సమయంలో పెరుగుతున్న జనాభా కచ్చితంగా సవాళ్లను అంతకంతకూ పెంచేదే. విద్యా, వైద్యం, రేషన్, ఉపాధి, ఉద్యోగావకాశాలు, ప్రతీ జీవితానికీ కావల్సిన పెట్టుబడి గురించిన ఆలోచనలను తీవ్రంగా రేకెత్తించేదే!
ఒక విధానాన్ని అమలు చేయాలంటే.. దానికి ప్రజలందరికీ ఆమోగయోగ్యమైన ఒక మార్గాన్ని ముందుగా తయారుచేసుకోవాల్సి ఉంటుంది. సంతానోత్పత్తని ఇద్దరికే పరిమితం చేసుకునే కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ ప్రయోజనాలను పరిమితం చేసేలా కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానం వల్ల ప్రజల ఆలోచనల్లోనే మార్పు తీసుకువచ్చే అవకాశముంటుంది.
జనాభా పెరుగుదలే లక్ష్యంగా మహిళల శరీరాలను సాధనంగా మారుస్తూ అభ్యంతరకరంగా వ్యవహరించే దేశాలున్న ఈ భూమ్మీదే.. ఆ జనాభా తగ్గింపు కోసం బలవంతపు ఆపరేషన్స్ చేసే విధానమూ అభ్యంతరకరమే.
జనాభా నియంత్రణ అనేది ఒత్తిళ్లతో కాకుండా.. విశ్వాసం, గౌరవం, పునరుత్పత్తి హక్కులను రక్షించే విధానాల నుంచే పుట్టుకురావాలి. 50 ఏళ్ల కిందటి అత్యవసర పరిస్థితిని, చీకటి రోజులను దేశం ఓవైపు మరోసారి గుర్తు చేసుకుంటున్న తరుణంలోనే, ఇంకోవైపు భవిష్యత్తునెలా నిర్మించుకోవాలో కూడా ఆలోచించుకోవాల్సిన సమయమిదేనేమో!



