మారణహోమమే అంతిమ విజయమనుకునేవారికి.. కనువిప్పు కల్గించే కథ ఇది!

Vamsy Krishna…  ✍🏻

మొన్నీమధ్య నేనొక కన్నడ కథ కి ఆంగ్ల అనువాదం చదివాను.నంజనగూడు తిరుమలాంబ 1914 లో రాసిన కథ అది. అంతా కలిపి నాలుగు పేజీలు కూడా ఉండదు. కానీ అది నామీద చూపిన ప్రభావం మాత్రం చాలా పెద్దది.

పశ్చిమ కనుమల పాదాల దగ్గర విస్తరించిన అటవీ ప్రాంతాలలో వున్న హలక్కి గిరిజన తెగల గురించిన కథ అది. ఇది 2025 అంటే నూటపదకొండు సంవత్సరాల క్రితం రాసిన కధ. ఇప్పుడంటే కర్ణాటక ప్రభుత్వం వాళ్ళను అదర్ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ లుగా గుర్తించింది కానీ అప్పటికి వాళ్ళు ప్రమాదకరమైన అడవి మనుషులు మాత్రమే.

ఈ కథ ప్రారంభం కావడమే Long long ago, there was a group of people who were not aware that they were human. They cooed and twittered to one another like birds,and wondered about eating whatever they could find. They were meat-eaters,cannibals అని మొదలు అవుతుంది.

వాళ్లకు మనుషులకు జంతువులకు తేడా తెలియదు. కడుపు నింపుకోవడం ఒక్కటే తెలుసు. బాధ, దుఃఖం,ప్రేమ లాంటి మానవ సహజ భావోద్వేగాలు ఏవీ వాళ్లకు తెలియదు. గుంపులు గుంపులు గా అడవుల చివరి అంచువరకూ వాళ్ళు ఆహార అన్వేషణ లో వెళతారు కానీ ఎక్కడా స్థిరంగా వుండరు. ఒకపూట,లేదా ఒక రాత్రి. అంతే ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ మకాం మార్చేస్తూవుంటారు.

వాళ్ళ లో ఒక గుంపు నాయకుడు పేరు సుబ్బా. ఆ గుంపులోని వాళ్ళందరూ సుబ్బా మాట తప్పనిసరిగా వింటారు. ఒకేసారి ఆహారాన్వేషణ లో ఆ గుంపు అడవి చివరకు వస్తుంది. గుంపులోని నలుగురు నాలుగు వైపులా ఆహారం కోసం వేటకి హాలక్, హాలక్ అంటూ బయలుదేరుతారు. అందులో ఒకడు అలా నడుచుకుంటూ ఒక చిన్న గ్రామం దగ్గరకు వస్తాడు. నిజానికి అది గ్రామం కూడా కాదు. నాలుగయిదు గుడిసెల సమూహం.

ఈ హాలక్ కొంచెం దూరం లో ఉండి చూస్తుంటే ఒక చిన్న గుడిసెలో ఒక స్త్రీ తన చిన్న పాపను దగ్గరకు తీసుకుని పాలు ఇస్తూ కనిపిస్తుంది. పాప పాలు తాగి నిద్రపోయాక గుడ్డ ఉయ్యాల లో పాపను పడుకోబెట్టి లోపలకు వెళుతుంది. ఇదంతా దూరం నుండి చూస్తున్న హాలక్ ఆ స్త్రీ లోపలకు వెళ్ళగానే పరుగున వచ్చి గుడ్డ ఉయ్యాలలో పడుకున్న పాపను ఎత్తుకుని వెళ్ళిపోతాడు.

పాపను తీసుకుని అతడు వెళ్లేసరికి అందరూ అతడికోసం ఎదురు చూస్తూ వుంటారు.ఆహరం కోసం వెళ్లిన మిగతావాళ్ళు అందరూ వట్టి చేతులతో తిరిగి వస్తారు. ఇక ఆ పూటకి పస్తు పడుకోవడమే అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు ఈ హాలక్ పాపను తీసుకుని వెళ్తాడు. పాపను చూసి అందరూ కేరింతలు కొడతారు. ఎప్పుడో కానీ దొరకని మానవ మాసం. వాళ్లకు ఆ పూట పండుగ లాగా ఉంటుంది.

ఆచారం ప్రకారం దొరికిన ఆహారాన్ని నాయకుడు సుబ్బా కొంచెం తిని అనుజ్ఞ ఇచ్చాకే మిగతావాళ్ళు వాటాలు వేసుకుని తినాలి. అందుకని హాలక్ పాపను సుబ్బా చేతుల్లో పెడతాడు. లేలేత పాప. కళ్ళుమూసుకుని చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతుల చప్పుడు ఏవో వింటూ ఉంటుంది. సుబ్బా చేతుల్లో పెట్టి అతడు పాప వేలు విరుస్తాడా? చేతిని లాగేస్తాడా అని వాళ్ళందరూ ఎదురు చూస్తూ వుంటారు.

సుబ్బా చేతుల్లో పెట్టగానే పాప కి మెలకువ వస్తుంది. కళ్ళు తెరుస్తుంది. తెరుచుకున్న పాప కళ్ళు విశాలంగా నీలి ముత్యాలు లాగా మెరుస్తూ కనిపిస్తాయి. సుబ్బా తనకు తెలియకుండానే ఆ అందమైన పాప మొహం వైపు ఆశర్యం తో కళ్ళు విప్పార్చుకుని చూస్తాడు. పాప భయం తో గట్టిగా ఏడవడానికి బదులు బూ ,బూ అంటూ చిన్న చిన్న శబ్దాలు చేస్తుంది. ఎవరైనా తనను చూసి గగ్గోలు పెట్టడం మాత్రమే తెలిసిన సుబ్బా కి ఒక చిన్న పాప భయపడకుండా బూ , బ్రూ అనటం చాలా వింతగానూ, హాయిగానూ అనిపిస్తుంది.

తనకే తెలియని ఒక వింత ఆకర్షణకు లోనైనా సుబ్బా “ఏమిటిది? ఇలా అవుతున్నది ఏమిటి?” అని లోలోపల గొణుక్కుంటాడు. పాప సుబ్బా వంక చూస్తూ మళ్ళీ నవ్వుతుంది. కాకపోతే ఈ సారి కాస్త పెద్దగా. అంతకు ముందెప్పుడూ అనుభవం లోకి రాని చిన్న నొప్పి ఏదో సుబ్బా కి లోలోపల కలుగుతుంది. సాటి మనిషి పట్ల కలగవలసిన ప్రేమ ఏదో మొదటి సారి అనుభవం లోకి వచ్చినట్టు ఉంటుంది. తన చేతుల్లో ఉన్న ఆ పాప వైపు అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. ప్రశాంతంగా, శుభ్రంగా ఉండి, మెరుస్తున్న ఆ కళ్ళ నుండి, లేత మొగ్గ లాగా వున్న చిన్ని ముక్కు నుండి, నవ్వుతున్న పెదవుల నుండి చూపు తిప్పుకోవాలి అనిపించదు. తానేం చేయాలో మరచిపోయిన సుబ్బా ఆ పాప చిన్న ముక్కు మీద, బుగ్గల మీద, పెదవుల మీద మెల్లగా తన బండ వేళ్ళతో మెల్లగా స్పర్శిస్తాడు. ఆ స్పర్శలో సుబ్బా తనను తాను సర్వం కోల్పోతాడు. ఒక తియ్యటి అనుభూతి అతడి వెన్నులోకి పాకుతుంది.

“నాకేమవుతున్నది?” అనుకుంటూనే పాపను రెండు చేతులతో పైకెత్తి పట్టుకుంటాడు. అతడలా పట్టుకోగానే మిగతా వాళ్ళు అందరూ సుబ్బా పాప మెడ విరిచేస్తాడు, వెంటనే తమకు ఇచ్చేస్తాడు అని ఉద్వేగం తో గట్టిగా అరుస్తారు. ” ఈ పాప తన చిన్న నవ్వుద్వారా నా లోలోపలకి ఏవేవో మార్మికమైన సందేశాలు పంపిస్తున్నది. ఈ పాప నవ్వు నా లోపల ఏదో వినూత్నమైన తియ్యటి నొప్పికి దారులు వస్తున్నది. ఈ పాప వేళ్ళు ఎలా విరువగలను? ఈ పాప ముక్కును ఎలా చిదిమి వేయగలను? ఈ పాపను ఎలా తినగలను? ఈ పాపను తింటే నేను నా జాతి సర్వ నాశనం అయి పోతుంది?” ఇలా ఏవేవో భావనలు సుబ్బాని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.

“It is sharing so many mysteries through its laughter. Abbabbh. I can not. I will be ruined if I eat it ” అలా అనుకుని పాపను తీసుకుని వచ్చిన హాలక్ ని పిలుస్తాడు.

“ఈ పాపాను ఎక్కడనుండి తీసుకుని వచ్చావు?’ అని అడుగుతాడు

“అదుగో ఆ దూరం గా కనిపిస్తున్న గుడిసెల నుండి!”

“పాపా ఒక్కతే ఉన్నదా?”

“లేదు. తల్లి పాలిచ్చి పాపను అప్పుడే ఉయ్యాలలో పడుకోబెట్టింది. నేను వెంటనే తీసుకుని వచ్చాను”

సుబ్బా గుండె పట్టుకుని ఏడవడం మొదలు పెట్టాడు. ఈ పాప కనపడక ఆ తల్లి ఎంత ఏడుస్తున్నదో కదా. ఇప్పుడు నేను ఏడుస్తున్నట్టుగానే అని ఏడుస్తూనే “ఈ పాపను ఎక్కడ నుండి తీసుకుని వచ్చావో అక్కడకు వెళ్లి భద్రంగా మళ్ళీ ఉయ్యాల లో పెట్టేసి రా!” అని ఆజ్ఞాపిస్తాడు. తన చేతుల్లో ఉండి చేయెత్తి తన చెంపలను తరుముతున్న పాపను భద్రంగా హాలక్ కి అందిస్తూ “వెళ్ళు … అమ్మ దగ్గరకు వెళ్ళు” అంటాడు సుబ్బా ! హాలక్ మరు మాట్లాడకుండా పాపను తీసుకుని వెళతాడు

ఆ తరువాత జరిగింది అంతా చెప్పను కానీ ఆ హాలక్ తెగ నరమాంసం తినడం మానేశారు.

ఇదంతా ఇప్పుడు ఎందుకు రాశానో నాకు తెలియదు. కానీ నాకు ఇప్పుడు నెత న్యాహు కంటే సుబ్బా గొప్ప మనిషిగా కనిపిస్తున్నాడు. సుబ్బా పుతిన్ కంటే గొప్ప నాయకుడు గా కనిపిస్తున్నాడు. ఈ కథను ఎవరైనా వాళ్ళిద్దరికీ వినిపిస్తే బావుండు

(ఈ కథ చదవాలి అనుకుంటే A Teashop in Kamalapura and other classic kannada stories చదవండి )

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles