మాట
………………………………………………………………………………………………………..
డా. పుల్లూరి సంపత్ రావు… ✍🏻
“నేను మతభోధకుడిని అయి ఉండకపోతే ఉపాధ్యాయుణ్ని కావాలని కోరుకుంటాను. ఎందుకంటే మతభోధకుడుగా నేను నడుములు వంగిపోయి, చేతులు కాయలు కాసి, జీవితంలో వికలురూ, కళంకితులూ అయిన వాళ్లని ఉద్దేశించి మాట్లాడుతాను. ఉపాధ్యాయులైన మీరు పరిశుద్ధాత్మలను ఉద్ధేశించి మాట్లాడుతారు. నేను భోధించే సత్యం వికలమైన మనసులో పడి అక్కడ తనే వికలమైపోతుంది, లేదా అక్కడే ఉండిపోయి పెరగక గిడసబారిపోతుంది. కాగా మీరు భోధించే సత్యం బాలబాలికల గ్రహణశక్తి కలిగిన పరిశుద్ధమైన మనసుల్లో ఉజ్వల కాంతితో ప్రకాశిస్తుంది.”
—మార్టిన్ లూథర్ (1483-1546)—క్రైస్తవ మత భోధకుడు, జర్మనీ.
అధ్యాపకునికి ఆయుధమైనా, ఆభరణమైనా మాటే! సినిమా కవి ‘మాటే మంత్రమూ ‘ అని వేరే సందర్భంలో అన్నాడుగానీ, తరగతి గదిలో అది నిజంగా మంత్రమే. మనం యథాలాపంగా ఉచ్చరించిన పదాలు సైతం పిల్లలపై చూపవలిసిన ప్రభావాన్ని చూపుతాయి.

అందుకని ప్రతి పదాన్ని, వాక్యాన్ని ఆచి తూచి ఎంపికచేసి మాట్లాడటం నేర్చుకోవాలి. విడిచిపెట్టిన బాణం విడిచిపెట్టిన మాట వెనక్కి రావు. మన నుండి వెలువడిన మాటలు కొందరికి జీవితాంతం ప్రేరణగా పనిచేయవచ్చు. దారి తప్పిన మాటలు వారిని కుచించుకుపోయేలా చేయవచ్చు. మన నుండి ప్రేరణ పొందిన వారు మన మాటలను మనకు గుర్తు చేయవచ్చు. కానీ మన మాటల వలన బాధ పడినవారు.. ఆ మాటలను ఇతరులకు చెప్తారు. అందుకే కత్తి గాయం మానుతుంది గాని.. మాట గాయం మానదు అంటారు.
అందరికీ అర్థమయ్యే భాషను పద సంపదను తరగతి గదిలో అభివృద్ది చేయాలి. కుల, మతాలు, స్త్రీ-పురుష, ధనిక,పేద మొదలగు విషయాల ప్రసక్తి వచ్చినపుడు ఎంతో సమతుల్యాన్ని పాటించాలి. వినటం అనేది చాలా బలహీనమైన ప్రక్రియ. మాటకు సత్తువ లేకుంటే ఎవరూ వినరు. గదిలోని 40 మంది వినలేకపోవడానికీ.. బహిరంగ సభలో లక్షలాది మందిని వినేలాగా చేసేది.. మాటలోని సత్తువే! బాగా మాట్లాడేవారి మౌనాన్ని కూడా శ్రోతలు సరిగానే అర్థం చేసుకుంటారు. ఉపాధ్యాయ/ఉపన్యాస రంగంలోని వారిని.. వారి మాటలకు ఉన్న విలువతోనే అంచనా వేస్తారు.
మాటకు తోడు కంఠస్వరం, ఉచ్ఛారణ, హావభావాలు, వేషధారణ, నడవడి పిల్లలను ఎంతో ప్రభావితం చేస్తాయి.



