మద్రాసులో వావిళ్ళ ప్రెస్ సంగతులు!

తోట భావనారాయణ.. ✍🏻
99599 40194

1994 మే నెల. అంటే, మద్రాసు ఆంధ్రప్రభకి వచ్చి అప్పటికి దాదాపు రెండున్నరేళ్ళు. ఠంచనుగా జీతభత్యాలతోబాటు బోనస్, ఫెస్టివల్ అడ్వాన్స్, ఎడ్యుకేషన్ అడ్వాన్స్, కళ్ళజోడు అలవెన్స్.. ఇలా రకరకాల పేర్లతో డబ్బులిచ్చే ఎక్స్ ప్రెస్ గ్రూప్ ఆంధ్రప్రభ ఉద్యోగం ఏ విధంగానూ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి తీసిపోదు. అందుకేనేమో అక్కడ వృత్తిలో ఉన్నామా, ఉద్యోగంలో ఉన్నామా అనే అనుమానం ఎప్పుడూ వెంటాడేది. చాలా తక్కువ పని. రెండు మూడు రోజులనాటి వార్తలు పోస్టులో వస్తే వాటిని దిద్దుకోవటం, కొత్తగా తిరగరాయాల్సిన అవసరం లేకుండా అనంతపురం నుంచి యాధాటి కాశీపతి గారు (లెఫ్ట్ మేధావి, శ్రీశ్రీతో కలిసి జైలుకెళ్ళినవాడు), తిరుపతి నుంచి కంచర్ల పూర్ణచంద్రరావు గారు (జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు), కడపనుంచి శ్రీనాథ్ రెడ్డి గారు (వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్), నెల్లూరు నుంచి కేబీ రామ్మోహన్ రావు గారూ పంపే నాలుగైదు టెలిప్రింటర్ వార్తల లిపి మార్చటం తప్ప చేసేదేమీ లేని మఫిసిల్ డెస్క్. ఉద్ధండులందరూ జనరల్ డెస్క్ లో ఉంటారు.

అలా మద్రాసు ఆంధ్రప్రభలో అత్యంత నిస్సారంగా గడిపిన రోజుల్లో నాకు కేటాయించిన మంగళవారం వీక్లీ ఆఫ్ ఏదో రకంగా పనికొచ్చేట్టు వాడుకోవటం మాత్రమే కాస్త తృప్తి. అలాంటి ఒకానొక మంగళవారం పాతచాకలిపేట అని తెలుగువారు పిలుచుకునే ఓల్డ్ వాషర్మెన్ పేట వెళ్లాలని నిర్ణయించుకున్నా. తెలుగు వాఙ్మయాన్ని పరిపుష్టం చేసిన ప్రచురణ కర్తలుగా పేరుమోసిన వావిళ్ళ వారి ప్రెస్ చూడటం ఆ రోజు ఎజెండా. సినీనటి జయసుధ గారి తాతగారు, ఉద్ధండుడైన తెలుగు పండితుడు, ప్రెసిడెన్సీ కాలేజ్ అధ్యాపకుడు నిడదవోలు వెంకటరావు గారు రాసిన ఈ పద్యం అప్పటికే చదివి ఉండటం నా ఉత్సాహాన్ని పెంచింది.

బాలశిక్ష మొదలు భారతంబు వరకు
గ్రంథమేదియైన కావలసిన
వ్రాయుడింకనేల వావిళ్ళకనియెడు
పలుకు తెలుగునాట నిలిచె నేడు

వావిళ్ళ ప్రెస్ నిర్వాహకుల నాలుగోతరం వారసుడు అల్లాడి స్వామినాథం గారిని కలుసుకున్నా. 1854 నుంచి వాళ్ళు ఈ ప్రెస్ నడుపుతూనే ఉన్నారు. మధ్యలో రెండు సార్లు కొంత విరామం వచ్చినా స్వామినాథం గారిది నాలుగో తరం. మడి కట్టుకొని మరీ అక్షరాలు కంపోజ్ చేయటం గురించి వింటే ముద్రణ అనేది ఒక వ్రతంలా, చేశారని అర్థమైంది. ప్రూఫులకోసం వేసిన ఫామ్ లు బైట అరుగుల దగ్గర వేలాడదీసి దారిన పోయేవాళ్ళెవారైనా తప్పులు ఎంచితే తప్పుకొక అణా చొప్పున ఇస్తామనటం ఒక సాహసం, ఒక సవాలు, ఒక సరికొత్త ప్రయోగం.

ప్రచురించిన పుస్తకాలలో సగం కూడా కాపీలు అందుబాటులో లేవు. ఉన్నవైనా మళ్ళీ వేద్దామంటే తప్పుల్లేకుండా టైప్ చేయించటం, ప్రూఫులు దిద్దించటం సమస్యగా మారిందని చెప్పారు. అలా ప్రెస్ మొత్తం తిప్పి చూపించి అరుదైన పాతపుస్తకాల దగ్గరకు తీసుకెళ్లారు. తాళపత్ర గ్రంధాలను పరిష్కరించి ప్రచురించటం దాకా సుప్రసిద్ధ పండితుల సేవలు వాడుకున్న తీరు వివరించారు. ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం కోసం ఒక వ్యాసం రాయడానికి సరిపడేంత సమాచారం ఉంది. నేను మాట్లాడుతున్నంత సేపూ అక్కడే ఉన్న స్వామినాధం గారబ్బాయి రామ్ కుమార్ వింటూ ఉన్నారే తప్ప నోరు విప్పలేదు. కొత్త తరానికి ఆసక్తి ఉండే అవకాశం లేనే లేదని నాకనిపించింది. కానీ స్వామినాధం గారమ్మాయి మద్రాస్ యూనివర్సిటీ తెలుగు శాఖలో ఎమ్మే చేశాక తన ఎంఫిల్ కు ‘వావిళ్లవారి సాహిత్య సేవ’ ను ఎంచుకొని సమగ్రంగా సిద్ధాంత వ్యాసం వెలువరించారని ఆ తరువాత తెలిసింది.

వావిళ్ళ ప్రెస్ నుంచి బయల్దేరే ముందు స్వామినాథం గారు నాకొక అమూల్యమైన కానుక ఇచ్చారు. అది ‘త్రిలింఙ్గ రజతోత్సవ సంపుటము’.1916 లో మాస పత్రికగా మొదలై వారపత్రికగా మారిన వావిళ్ల వారి సాహిత్య పత్రిక పాతికేళ్ళ ప్రత్యేక సంచిక అది. పుస్తకాల ప్రచురణతోబాటే లబ్ధప్రతిష్ఠులైన వారి వ్యాసాలతో ఆ పత్రిక తీసుకువచ్చారు. అంతగా ప్రాచుర్యం పొందబట్టే 1941 లో రజతోత్సవ సంచిక తీసుకువచ్చారు. అంటే, 1994లో నాకు ఇచ్చేనాటికి దాని వయసు 53 ఏళ్ళు. స్వామినాథం గారు సంతకం చేసి ఇచ్చిన ఆ విలువైన 842 పేజీల పుస్తకం ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. దాని వయసు 84 ఏళ్ళు. (మనుషులకైతే సహస్ర చంద్ర దర్శనం అయినట్టు). ఆ సంపుటం ధర అప్పట్లోనే 60 రూపాయలు. (కవర్ పేజ్, లోపలి కవర్ పేజ్ ఫోటోలు ఈ వ్యాసానికి జతచేశా)

ఇందులో విద్వాన్ శ్రీ దీపాల పిచ్చయ్యశాస్త్రి, శతావధాని శ్రీ గాడేపల్లి వీరరాఘవశాస్త్రి , శ్రీమతి కవితిలక, కవితా విశారద కాంచనపల్లి కనకాంబ సహా 40 మందికి పైగా పంపిన పద్యరూప ఆశీస్సులున్నాయి, శ్రీ భోగరాజు పట్టాభిసీతారామయ్య. సర్ వేపా రామేశం, డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి, వి.టి. కృష్ణమాచారి, పిఠాపురం యువరాజు, కపిలేశ్వరపురం జమీందారు. మామిడిపూడి వెంకట రంగయ్య, తలావజ్ఝల శివశంకరశాస్తి, గూడవల్లి రామబ్రహ్మం, వేటూరి ప్రభాకరశాస్త్రి, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, విద్యాసుందరి, గానకళా విశారద బెంగళూరు నాగరత్నము, పిఠాపురం మహారాజు, సర్ సివై చింతామణి, ఖాసా సుబ్బారావు, దేశభక్త కొండా వెంకటప్పయ్య లాంటి 200 మందికి పైగా ప్రముఖులు పంపిన సందేశాలున్నాయి.

ఆశీస్సులు పంపినవారు వావిళ్ల ప్రెస్ గొప్పదనాన్ని పద్యరూపంలో చెప్పారు. తండ్రి వావిళ్ల రామశాస్త్రులు మొదలుపెట్టిన యజ్ఞాన్ని కొనసాగించిన వేంకటేశ్వరశాస్త్రిని పొగుడుతూ

జనకునినాడు తెల్గులిపి సాగెను ముద్రణశాలయందు; నే
ర్పున నిపుడాంగ్లమున్ దమిళమున్ మరి కన్నడమున్ మరాటి పెం
పు నెనయ హింది సంస్కృతంబు మున్నగు నక్షర ముద్రణంబు లె
ల్లను విలసిల్ల జేసితి బళా! చతురుండవు వేంకటేశ్వరా!

అంటూ తండ్రిని మించిన తనయుడిగా ఎదిగిన వేంకటేశ్వరశాస్త్రిని అభినందించారు. అదే సమయంలో తమిళులను ఆరవ వాళ్ళు అనటాన్ని గుర్తుచేస్తూ, ‘అరవం’ అనేవాళ్ళు కూడా ఏమని అరుస్తారో చమత్కారంగా చెప్పిన పద్యమిది.

అరవమనువారు గూడ మీయాంధ్ర కావ్య
రాజముల జూచి సత్సభారంగములను
బరగ మీకీర్తి వేనోళ్ళ నరచి రరవ
వారటన్న దదితరులెట్లూరుకుంద్రు!

అని చెప్పటం ద్వారా ఇతర భాషల్లోనూ ప్రచురణలందించటాన్ని గుర్తుచేశారు.

ఈ ప్రత్యేక సంచిక కోసం 75 మంది ఉద్ధండులైన కవి పండితులు వ్యాసాలు రాశారు. అలంకార శాస్త్రోత్పత్తి గురించి మేడేపల్లి వేంకట రమణాచార్యులు రాస్తే, రసానుభూతి మీద జమ్మలమడక మాధవరామశర్మ గారు రాశారు. మిల్టన్-వాల్మీకిని పోల్చిన వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి, ఆంధ్రవాఙ్మయంలో శతకాల గురించి అయ్యల సోమయాజుల కృష్ణమూర్తి, ముత్యాలసరాలమీద వేముల సత్యనారాయణ చౌదరి విమర్శ, మనుచరిత్రలో పెద్దనగారి పెద్దతనం గురించి చిలుకూరి నారాయణరావు, యతి నియతి గురించి దీపాల పిచ్చయ్య శాస్త్రి, కవుల ప్రయోగాలమీద ‘అభ్యనుజ్ఞ’ పేరుతో చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి వ్యాసాలు రాశారు. భమిడిపాటి కామేశ్వరరావు గారి రేడియో కబుర్లు, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ‘టాకీలూ-నాటకాలూ’, పీవీ రాజమన్నారు రాసిన ‘ఏకాంకా నాటిక’ లాంటి వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి.

తెలుగు సాహిత్యంలోని అనేక వివాదాల మీద చర్చలు, విశ్లేషణలు కూడా ఇందులో కనబడతాయి.

స్తుతమతియైనయాంధ్రకవి ధూర్జటి పల్కుల కేలగల్గెనో
యతులిత మాధురీమహిమ .. హా తెలిసెన్! భువనైక మోహనో
ద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి సం
తత మధురాధరోదిత సుధారస ధారలు గ్రోలుటం జుమీ

అనే పద్యం ఆధారంగా ధూర్జటి కవి వేశ్యాప్రియుడని కందుకూరి వీరేశలింగం పంతులు అభిప్రాయపడటాన్ని ఖండిస్తూ అఖండ శివ పూజాదురంధరుడైన భక్తాగ్రేసునికి అంటిన మరకను తొలగించటానికి అనేక ఆధారాలు చూపటం ఈ సంపుటంలో చూడవచ్చు.

వాత్స్యాయనుడి కామసూత్రాలు మొదలు ఆంధ్ర తమిళ ఛందస్సాదృశ్యాల దాకా, నూతన విద్యావిధానం నుంచి సాంఖ్య దర్శన సారం దాకా, పూర్ణ చతురంగ క్రీడా విమర్శనం మొదలు ముద్రణా కళదాకా వైవిధ్యభరితమైన వ్యాసాల సంకలనంగా తీర్చిదిద్దటం ఈ రజతోత్సవ సంపుటం ప్రత్యేకతగా అర్థమవుతోంది.
*

2012 డిసెంబర్ లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పుస్తకప్రదర్శనలో వావిళ్లవారి స్టాల్ పెట్టారు. 18 ఏళ్ల తరువాత మళ్ళీ స్వామినాథం గారిని కలుసుకున్నా. హైదరాబాద్ కు మకాం మార్చినట్టు, కొన్ని పుస్తకాలు పునర్ముద్రిస్తున్నట్టు చెప్పారు. పోయిన వారం పుస్తకాలు సర్దుతూ ఉంటే ‘త్రిలింఙ్గ రజతోత్సవ సంపుటము’ కనిపించింది. వెంటనే స్వామినాధం గారితో మాట్లాడాలని అనుకున్నా. కష్టపడి నెంబర్ సంపాదించి ఫోన్ చేస్తే వాళ్ళబ్బాయి మాట్లాడారు. పేరు చెప్పగానే గుర్తు పట్టారు. ఆశ్చర్యమనిపించింది. మద్రాసులో వాళ్ళ ప్రెస్సుకు వెళ్ళినప్పుడు, తిరుపతిలో వాళ్ళ స్టాల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళనాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు దగ్గరే ఉన్నానని గుర్తుచేయటం నన్ను మరీ ఆశ్చర్యపరచింది. స్వామినాధం గారు వయోభారంతో ఉండటంతో రామ్ కుమార్ స్వయంగా ప్రచురణ పనులు చూస్తున్నారు..

మాటల్లో త్రిలింఙ్గ ప్రస్తావన తెస్తే, “మీ దగ్గర ఒక కాపీ, మా దగ్గర ఒక కాపీ మాత్రమే ఉన్నాయి. రీప్రింట్ చేయిస్తున్నాం” అన్నారు. అక్షర దోషాలు లేకుండా టైప్ చేయటం, ప్రూఫ్ దిద్దటం ఈరోజుల్లో ఏమంత సులభం కాదని తెలుసు గనుకే ఈ పని తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వారికి అప్పగించామన్నారు. త్వరలో మళ్ళీ మనం ‘త్రిలింఙ్గ రజతోత్సవ సంపుటము’ చూస్తాం. ఈ పుస్తకం గురించి చెప్పగానే దాని ప్రాధాన్యాన్ని నాకంటే ఎక్కువగా గుర్తించిన సీనియర్ జర్నలిస్ట్, రచయిత తాడి ప్రకాశ్ గారు దాన్ని స్కాన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. కొత్త పుస్తకం వస్తుంది కాబట్టి స్కాన్ చేయించాల్సిన అవసరం ఉండకపోవచ్చు.
*
ఏమైనా, నిడదవోలు వెంకటరావు గారే చెప్పినట్టు ఆంధ్ర వాఙ్మయ చరిత్రలో వావిళ్లవారి స్థానం సుస్థిరం.

ఆంధ్ర వాఙ్మయ చరితంబునందు తెలుగు
ముద్రణ చరిత్రమును చెప్ప మొట్టమొదట
వెలయు మూడక్షరముల “వావిళ్ళ” పేరు
వాఙ్మయ ముఖాన నోం కృతి వరలునట్లు

ఇప్పుడు ఈ సంగతి గుర్తుకు రావటానికి కారణముంది. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెబుతూ భాషాభిమానులు, సాహితీవేత్తల వ్యాసాలతో ‘విశిష్ట తెలుగు దిగ్దర్శనం’ అనే గ్రంథం వెలువడింది. చెన్నపురి తెలుగు అకాడెమీ మేనేజింగ్ ట్రస్టీ గా ఉన్న డాక్టర్ తూమాటి సంజీవరావు గారి సంపాదకత్వంలో వచ్చింది ఈ పుస్తకం. తెలుగు భాష ప్రయాణం, విశిష్ట భాషగా తెలుగు చరిత్ర, తెలుగు భాష ప్రాచీనత – ప్రత్యేకత, ఆంధ్రసాహిత్య ప్రశస్తి లాంటి ప్రామాణిక, పరిశోధనాత్మక వ్యాసాలు ఈ గ్రంథాన్ని పరిపుష్టం చేశాయి. 30 మంది సాహితీ దిగ్దంతుల చేత వ్యాసాలు రాయించటమనే మహా యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. ఈ రోజుల్లో అలా రాయించటం చాలా కష్టం. ఎన్నో సార్లు గుర్తు చేసి వెంటబడితే తప్ప కుదిరే పని కాదు. అలా సాధ్యం కావటానికి ఈ రచయితల క్రమశిక్షణ కూడా కారణం కావచ్చు. ఏమైతేనేం.. ఆచార్య తూమాటి దొణప్పకు శతజయంతి స్మృత్యంకితంగా వెలువరించిన ఈ బృహత్ గ్రంథం తెలుగు భాషకు నీరాజనం, తెలుగు కీర్తికి జయ కేతనం.

Related Articles

1 COMMENT

  1. అక్షరాల… టైమ్‌ ట్రావెల్‌!.”https://www.sakshi.com/telugu-news/guest-columns/vaaavailala-sahitya-vikasam-book-release-1789495

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles