పాతికేళ్లకే పద్మశ్రీ వరించిన ప్రజ్ఞాపాటవం.. పర్వీన్!

నా సంగీతానుభవాలు…

.…………………………………………………..

– మోదుమూడి సుధాకర్…✍️

తన గానంతో శిలలను ద్రవింపచేసిన సుమధుర గాయని శ్రీమతి పర్వీన్ సుల్తానా! ఆమెను,పాతికేళ్లకే ‘పద్మశ్రీ’ వరించిందంటే, ఆమె ప్రజ్ఞాపాటవాలు ఏపాటివో ఊహించవచ్చు.

నా చిన్నతనంలో,మాఇంట్లో రేడియో ఉదయం ‘వందే మాతరం’ తో ప్రారంభిస్తే, రాత్రి ‘జనగణమన’ వరకూ నిర్విరామంగా మోగుతూనే ఉండేది.ముఖ్యంగా రాత్రిపూట ప్రసారమయ్యే సంగీత సభలు తప్పనిసరిగా వినిపించేవారు మానాన్నగారు.మంద్ర గంభీరమైన ఆ రేడియో స్పీకర్లో ప్రత్యేకించి, హిందుస్థానీ సంగీతం.. నా పసిప్రాణాన్ని ఎటో తీసుకుపోయేది..

నాకు తొమ్మిదేళ్ల వయసులో.. ఒకరోజు సంగీత సమ్మేళన ప్రసారాలలో భాగంగా రేడియోలో ఒక అద్భుత గానం విన్నాను.కోయిల కంఠంలా శ్రుతిశుద్ధమైన ఆ గాయని గాత్రం, అతి విలంబ గతిలో,మంద్ర స్థాయిలో ఆరంభమై,క్రమేపీ స్థాయి పెంచుకుంటూ..తార,అతి తార స్థాయిలను అలవోకగా దాటి,సంచరించింది.

అప్పటికి నాకు ఆరాగమేదో తెలియకపోయినా, ఆ రాగరసంలో ఓలలాడాను.చివరిలో ఆమె పాడిన వేగం వింటే..అది ఒక గాత్రమా?లేక యంత్రమా? అనిపించింది.ఇంటిల్లిపాదీ రేడియో చుట్టూ బందీలమై, చెవులప్పగించి,విన్నాము.ఏదో అనిర్వచనీయానందానుభూతి అది!!

ఒక అద్భుత భజన్ తో కచేరీ ముగిసింది.చివరకు గాయని పేరు ప్రకటించగా విన్నాము.’పర్వీన్ సుల్తానా’ అని! ఆరోజు మాయింట్లో మా మేనత్తగారు ఉన్నారు.ఆ పాటవిని,ఆవిడ విస్తుపోతూ మానాన్నతో,”ఒరే!సోముడూ!(మానాన్న అసలు పేరు సోమశేఖరరావు) ఏమి పాడిందిరా!సాయిబుల ఇంట్లో పుట్టినా..అంత సంగీతం ఎలా అబ్బిందో!” అన్నారు అమాయకంగా!

అసలు మా మేనత్తగారికి పాపం తెలియని విషయం ఏమిటంటే…’హిందుస్థానీ సంగీతం సాయిబుల సొత్తు కూడా’ అని.మనదేశంలోని ఎన్నో ముస్లిం కుటుంబాలలో సంగీతకళ వంశానుగతం!

పర్వీన్ తండ్రి ఆప్ఘనిస్తాన్ కు చెందిన ఇక్రాముల్ మాజిద్,తల్లి ఇరాన్ కు చెందిన మరూఫాబేగం.ఆ దంపతులకు అస్సాం లో పుట్టిన పర్వీన్, తల్లి ఒడిలో తీసిన కూనిరాగమే, ఆమె సంగీత శిక్షణకు తొలిమెట్టు అయింది.

1975 ప్రాంతంలో బెజవాడలో సద్గురు సంగీతసభ వారు హనుమంతరాయ గ్రంథాలయం హాలులో శ్రీమతి పర్వీన్ సుల్తానా గాత్ర కచేరీ ఏర్పాటుచేశారు.అప్పటికి ఆమె పేరు విశ్వవ్యాప్తమైంది.ఆమె మధుర గానం వినాలని, శ్రోతలు నిర్ణీత సమయానికన్నా గంట ముందే హాలులో నిండిపోయి కూర్చున్నారు.అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా ఒక అందమైన స్త్రీ హాలులోకి ప్రవేశించింది.’ఎవరో ఈ సౌందర్య రాశి! బహుశః కచేరీ వినడానికి వచ్చిన సినీనటి కాబోలు..’ అని శ్రోతలు అనుకుంటుండగా ఆ స్త్రీ సరాసరి వేదికనెక్కి,సభకి నమస్కారంచేసి, తంబురా తీసుకొని, కూర్చుంది.

అప్పటికి శ్రోతలు గ్రహించారు..ఆమే పర్వీన్ సుల్తానా అని! అద్భుతంగా పాడే పర్వీన్ అంత అందగత్తె అని ఎవరూ ఊహించలేదు.ఆరోజు ఆమె పాడిన రాగేశ్వరి రాగం,నన్నెంతగా ప్రభావితం చేసిందంటే..ఒకనాటికి ఆరాగంలో ఒక్క పాట వ్రాసుకొని,పాడుకుంటే గానీ నా మనసు తృప్తి పడలేదు.

రూపాయి బిళ్లంత ఎర్రని బొట్టుతో,సిసలైన హిందూ సాంప్రదాయంలో,పట్టుచీరె కట్టిన ఆమె,ఆరోజు శ్రోతల కోరికపై వినిపించిన హిందుస్థానీ భైరవి భజన్ ‘భవాని..శివాని..దయాని’.. వింటుంటే..హిమశైలరాజ తనయ,శ్రోతలకు దర్శనమిచ్చినట్లనిపించింది.

ఆరోజు మరొక ఆసక్తికర సంఘటన జరిగింది.ఎంతో రసవత్తరంగా సాగుతున్న ఆ కచేరీ మధ్యలో, ఒక ప్రఖ్యాత కవి విచ్చేశారు.సభానిర్వాహకులు, ఆయనను ముందువరుసలోకి ఆహ్వానించి, పెద్ద శబ్దంచేస్తూ..కుర్చీలు జరిపి, కుర్చున్నవారిని లేపి,ఆయనకు ఆసనాన్ని ఏర్పాటుచేశారు.కూర్చున్న ఆ పెద్దమనిషి,ముందువరుసలోని వారిని, బిగ్గరగా పలుకరించసాగారు.

వేదికపై కళాకారులకు రసభంగమైంది…

అయినా,అదేమీపట్టించుకోకుండా, ప్రక్కవారిని కుశలప్రశ్నలు వేస్తున్న కవిగారికి,ఎందుకో అనుమానంవచ్చి, వేదిక వంక చూశారు.కచేరీ నిలిచిపోయింది.నిశబ్దం ఆవరించింది.వెంటనే,’కొనసాగించమని’ సంజ్ఞ చేశారాయన. అయితే,పర్వీన్ సుల్తానా, ‘మీ మాటలు కానీయండి..అవి పూర్తిఅయినాక నేను పాడతాను..’ అన్నారు నిష్టూరంగా.తన తప్పు తెలుసుకొని,సిగ్గుతో అవాక్కయ్యారు కవిగారు.కొంతసేపటికి,కచేరీని తిరిగి ప్రారంభించారు పర్వీన్ సుల్తానా..

ఇటువంటి సంఘటనలు నేను ఎందుకు వ్రాస్తున్నానంటే, ఎంతో ఏకాగ్రతతో సంగీతంలో లీనమై, వేదికపై కళాకారులు చేసే ప్రదర్శనకు మన సభలలో అడుగడుగునా ఎదురయ్యే అంతరాయాలు ఎన్నో! ముందువరుసలో కూర్చొని,మాట్లాడేవారికి..గట్టిగా శబ్దంచేస్తూ తప్పు తాళంవేసేవారికి..శ్రోతలకు,వేదికకూ మధ్యలో అటూఇటూ మాటిమాటికీ నడిచేవారికి..సెల్ ఫోనులు మోగుతున్నా పట్టించుకోనివారికి..బిగ్గరగా ఫోన్లు మాట్లాడేవారికి..పాట విని,ఏ స్పందనా లేక,నిరుత్సాహంగా కూర్చునేవారికి….

‘దయచేసి మీ ధోరణి మార్చుకోండి…లేదా కచేరీలకు రాకండి…అదే సంగీత కళాకారులకు మీరు చేసే మేలు’…అని చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది నాకు..

కచేరీ దిగ్విజయవంతమైంది…

ఆనాడు మూడు గంటల కచేరీలో,అంతసేపూ ఒడిలోని తంబురాను తానే వేసుకొంటూ పాడి,అలసిపోయిన ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి, ‘తాను ఆమె భర్త,గురువుననే’ స్పృహ లేక..ఒక సేవకుడిలా ఆమె బుజాలను నొక్కి,సేదదీర్చిన ఆమె భర్త దిల్షాద్ ఖాన్ గారిని చూస్తే,నాకు ఎంతో ముచ్చటవేసింది…వారిరువురూ ‘నిజంగా ఆదర్శ దంపతులు’ అనిపించింది….

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles