మనదేశంలో మొట్టమొదటి మోబైల్ కాల్ మాట్లాడుకున్నదెవరు..?

ఒక్క క్లిక్కుతో ప్రపంచంలో ఏం జరిగిందో తెలుసుకోగల్గతున్నాం… జస్ట్ చేతుల్లో ఉంటే మనమనుకున్నదేదైనా ప్రపంచం మొత్తానికి తెలుపగల్గుతున్నాం.. సరిగ్గా ఉపయోగించుకుంటే అదే ఓ బడి, ఓ గుడి, గ్రంథాలయం, సినిమా టాకీస్, మార్కెట్, వాట్ నాట్..? చివరకు ఆన్ లైన్ పెళ్లిళ్లు కూడా చేసుకునే ఓ ఎమోషనల్ డివైజ్. అదేనండీ మోబైల్ ఫోన్. పోను పోను కొత్త పుంతలు తొక్కుతూ స్మార్ట్ మోబైల్ ఫోన్ సృష్టిస్తున్న సాంకేతిక విప్లవం మానవుడు సాధించిన ప్రగతికి ప్రతీక.. అదే స్థాయిలో ప్రమాదాలనూ మన ముందుంచుతున్న పరాకాష్ఠ. అయితే, మొట్టమొదట మన భారత్ లో మోబైల్ ఫోన్ ఎవరు వినియోగించారో మీకు తెలుసా..?

అందుకు మనమోసారి కోల్ కత్తా రైటర్స్ బిల్డింగ్ నుంచి ఢిల్లీలోని సంచార్ భవన్ వరకూ వెళ్లిరావాలి.

ఢిల్లీలోని సంచార్ భవన్ నుంచి… ప్రధాని పీవీ నర్సింహారావు క్యాబినెట్ లోని టెలికాం మినిష్టర్ సుఖ్ రామ్ కు ఓ కాల్ వచ్చింది. అదే మొట్టమొదటి మోబైల్ కాల్ కనెక్టివిటీ. అటు పక్కనుంచి చేసినవారు.. నాటి బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు. అలా 1995, జూలై 31న మొదటి మోబైల్ ఫోన్ కాల్ కనెక్టివిటీ అనేది కోల్ కత్తా రైటర్స్ బిల్డింగ్ నుంచి ఢిల్లీ సంచార్ భవన్ మధ్య జరిగింది.

ఇప్పుడా ముఖ్యమంత్రి జ్యోతిబస్ లేడు… నాటి కేంద్ర మంత్రి సుఖ్ రామ్ కూడా లేరు. కానీ, వాళ్లిద్దరి మధ్య 29 ఏళ్ల క్రితం మొట్టమొదటి సంభాషణగా ప్రారంభమైన మోబైల్ కనెక్టివిటీ… ఇప్పుడు దావానంలా వ్యాపించింది. అది కొత్త పుంతలు తొక్కుతూ స్మార్ట్ ఫోన్ గా అవతరించింది. కమ్యూనికేషన్ వ్యవస్థలో కొత్త శకాన్ని ఆవిష్కరించింది. అయితే, అదే సమయంలో భారత్ లో అత్యంత తక్కువ మోబైల్ ఆసక్తిపరులు, కనెక్టివిటీ ఉన్న ప్రాంతంగా కూడా నాడు మొట్టమొదటి కాల్ చేసిన జ్యోతిబస్ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమబెంగాలే కావడం మరో విశేషం.

ఇప్పటికే భారతదేశంలో వందకోట్ల మందికి దగ్గరగా మోబైల్ వినియోగదార్లున్నట్టు తెలుస్తోంది. 2026కు వందకోట్లకు చేరుకోనున్నట్టుగా కూడా అంచనాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట ప్రతీ సెకన్ కు ఓ మోబైల్ ఫోన్ అమ్ముడవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.

భారత్ కు చెందిన బీకే మోడీ, ఆస్ట్రేలియా చెందిన టెల్స్ట్రా మధ్య జాయింట్ వెంచర్ గా మోడీ టెల్స్ట్రా నెట్ వర్క్ ఒకటి రూపొందింది. ఆ నెట్ వర్కే ఇండియాలో మొట్టమొదటి కమ్యూనికేషన్ వ్యవస్థకు బీజం వేసింది. ఆ సమయంలో మోబైల్ కాల్ ధర ఆకాశాన్నంటేది. నిమిషానికి ఏకంగా 8 రూపాయల 40 పైసల చొప్పున ఔట్ గోయింగ్ కాల్స్ చేసేవారికి మాత్రమే కాకుండా… ఇన్ కమింగ్ కాల్ అందుకున్నవారూ బేర్ చేయాల్సివచ్చేది. ఇక ట్రాఫిక్ సమయాల్లో అయితే, నిమిషానికి 16 రూపాయల 80 పైసలు ఖర్చయ్యేవి. అంతేకాదు, నాడు మోబైల్స్ ఫోన్ ఎవరు కొందరు రాజకీయ నాయకులు, వ్యాపార, సినీ ప్రముఖులకు మాత్రమే పరిమితమైన విలాస వస్తువు.

ధీరూభాయి అంబానీ రాకతో మోబైల్ ఒక విప్లవంగా మారింది. పండ్లు, కూరగాయలమ్మేవారి వద్దా మోబైల్ చూడాలనుకున్న ఆయన కలకు బీజం పడింది. ఇక 2016లో జియో రాకతో… డాటా ప్లాన్స్, రకరకాల ఆఫర్స్ తో మార్కెట్ ను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. మిగిలిన ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ వంటి నెట్ వర్క్స్ కు బలమైన పోటీదారుగా మారి.. మోబైల్ సర్వీస్ సాంకేతికతలో ఓ సంచలనం సృష్టించింది.

ఇవాళ మోబైల్ అంటే మనిషికి ఓ విడదీయరాని బంధం. మోబైల్ లోనే మనిషి స్విగ్గీ పేరిట భోజనం, టిఫిన్స్ కావల్సిన తినుబండారాలన్నీ తెప్పించుకోగల్గుతున్నాడు. బజారులో అడుగు పెట్టకుండానే.. మార్కెట్ లో షాప్స్ లో దొరికే వాటికంటే బెటర్ బట్టలను కొనుక్కోగల్గుతున్నాడు. కావల్సిన విజ్ఞానం, చూడాల్సిన పర్యాటకం, మొక్కాల్సిన దేవుళ్లు, కొనాల్సిన టిక్కెట్లు, చూడాల్సిన సినిమాలు, ఆ సినిమాలు తీసుకొచ్చే ఓటీటీలు, ప్రపంచాన్ని తెలుసుకునే వార్తలు.. ఇలా ఫలానాది ఇందులో ఇంకా తక్కువ ఉందనే అవకాశమివ్వనంతగా మోబైల్ స్మార్ట్ ఫోన్ అప్డేట్ అవుతూనే ఉంది.

ఇవాళ స్వీపర్ నుంచీ సీఈవో వరకూ కమ్యూనికేషన్ కోసం ఆధారపడే అతి పెద్ద నెట్ వర్క్ ను మోబైల్ రంగం సృష్టించింది. అందుకే, మోబైల్ రంగం భారత మార్కెట్ లో బడా వ్యాపారులకు కామధేనువులా మారింది. పెట్టిన పెట్టుబడులకు తిరిగి భారీ లాభాలు రావడంతో కొత్త కొత్త ఫీచర్స్ తో ఫోన్స్, అలాగే, సర్వీసులు ఇలా రెండూ పోటాపోటీగా ఈ కమ్యూనికేషన్ అనే సాంకేతిక రంగంలో దూసుకుపోతున్నాయి. 1999లో టెలికాం ఆపరేటర్స్ నుంచి లైసెన్స్ రుసుము వసూలు చేయడాన్ని సంస్కరణల్లో భాగంగా నాటి ప్రభుత్వం నిలిపివేయడం.. కేవలం ఆదాయపన్ను రూపేణ మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించడం కూడా మోబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ కు అనుకూలంగా మారింది. ఆ తర్వాత టెలికాం ఇండస్ట్రీలో ప్రభుత్వం కూడా ఓ వాటాదారుగా మారడం.. 2003లో ఒక యూనిఫాం లైసెన్సింగ్ విధానాన్ని తీసుకురావడం.. వివిధ టెలికాం కంపెనీల సేవలకు ప్రత్యేకమైన లైసెన్సెస్ జారీచేయడం వంటి ఎన్నో విధానాలకు తెరతీసింది కేంద్రం.

ఇప్పటికే మోబైల్ ఫోన్ మానవుడి అవయవాల్లో ఒక్కటిగా మారిపోయిన పరిస్థితి. మ్యూజిక్ ప్లేయర్స్, వివిధ ఓటీటీ యాప్స్, ట్యాక్స్ పేమంట్స్ యాప్స్, లైసెన్సుల బరువును ప్యాకెట్స్ లో మోయాల్సిన అవసరం లేని యాప్స్, మనమెక్కడుంటే అక్కడి నుంచి బిల్లులు చెల్లించే ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పేలతో మోబైల్ మానవుడు సాధించిన అతిపెద్ద సాంకేతిక విప్లవం. అయితే, అదే సమయంలో శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టుగా… వీటన్నింటినీ ఉపయోగిస్తూ మనిషి ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా హ్యాకర్స్ సైబర్ దాడులకూ గురయ్యే ప్రమాదాలతో మోబైల్ మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది.

అమెరికా వంటి చోటనైతే ఇప్పుడేకంగా కోర్టుల పని తగ్గించేలా కూడా విచారణలకు సంబంధించి టెక్స్ట్ మెస్సేజుల ద్వారానే కొన్ని పూర్తవుతున్నట్టు సమాచారం. ఇక పోలీస్, ఫైర్ సేప్టీ, నేరగాళ్ల వేట వంటివాటిల్లో మోబైల్ సిగ్నల్ వ్యవస్థను పట్టుకుని జస్ట్ గంటలు.. లేదా, రోజుల్లోనే నిందితులను పట్టుకునేంత వేగాన్ని మోబైల్ టెక్నాలజీ నిఘా వ్యవస్థలకందిస్తోంది. మొత్తంగా ఇవాళ సంచలనం సృష్టిస్తున్న ఈ మోబైల్ విప్లవానికి.. నాటి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబస్.. నాటి కేంద్ర మంత్రి సుఖ్ రామ్ నోకియా హ్యాండ్ సెట్ తో మాట్లాడుకున్న ఫోన్ కాల్ మొదటిది కావడం విశేషం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles