ఇరాన్, ఇజ్రాయెల్ శత్రుత్వం – చారిత్రక వాస్తవాలు!
1948లో ఇజ్రాయెల్ ఏర్పాటైన తర్వాత టర్కీ 1949లో, ఇరాన్ 1950లో ఆ దేశాన్ని డీ ఫ్యాక్టోగా మాత్రమే గుర్తించాయి. అయితే, పాలస్తీనా విభజన తీరుపై ఇరాన్‌కు అభ్యంతరాలు కొనసాగడంతో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు అధికారిక మైత్రి స్థాయికి మాత్రం చేరుకోలేదు. అందుకే ఇరాన్.. ఇజ్రాయెల్ తో అనధికార సహకార సంబంధాల వరకు మాత్రమే పరిమితమైంది. 1979 వరకూ కూడా వీరి మధ్య పెద్దగా శత్రుత్వమేమీ లేదు.
పైగా అరబ్ జాతీయవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తో.. ఇరాన్ రాజు జట్టు కట్టడం.. అరబ్ దేశాలను అప్పటి ఈజిప్ట్ అధ్యక్షుడు నాసర్ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి హీరోగా మారడం.. రాజరిక వ్యవస్థను నాసర్ వ్యతిరేకించడం వంటివి షా మహ్మద్ రెజా పెహ్లావీకి నచ్చకపోవడం, సోవియెట్ యూనియన్ ఆధిపత్యం ఇలా పలు కారణాలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మైత్రీ బంధానికి కారణమయ్యాయి.
ఇరాన్ పై విదేశీ శక్తుల ఆధిపత్యం ఎలా మొదలైంది..?
మొదటి ప్రపంచ యుద్దానికి మునుపే రష్యా సామ్రాజ్యం, బ్రిటన్ రెండూ ఇరాన్ పై కన్నేశాయి. తమ సామ్రాజ్య విస్తరణలో భాగంగా.. చమురు అవసరాల నేపథ్యంలో ఇరాన్ ను తమ రాజకీయ ఆటస్థలంగా మార్చుకున్నాయి. దాంతో 1914-18 నాటికే ఖజార్ రాజవంశం పూర్తిగా బలహీనపడిపోయి విదేశీ శక్తుల చేతుల్లోకి ఇరాన్ పాలనా వ్యవస్థ వెళ్లిపోయి ప్రభావితమైంది.

1917లో రష్యా విప్లవంతో ఇరాన్ నుంచి రష్యా సైడ్ అయిపోవడంతో బ్రిటన్ పట్టుబిగించింది. మరోవైపు 1921లో బలహీనుడైన అహ్మద్ షా ఖజార్ రాజుపై తిరుగుబాటు మొదలైంది. అప్పుడే రెజా షా పెహ్లావీ అలియాస్ రేజా ఖాన్ ఎంటర్ అయ్యాడు. యుద్ధనిపుణుడిగా సైనిక నాయకుడిగా ఆరంభించి మంత్రిగా, ఆ తర్వాత ప్రధాని స్థాయికి ఎదిగాడు. ఈ రెజా ఖాన్ ఎదుగుదల వెనుక బ్రిటన్ ఉందనే వాదన ఉంది. కానీ, రెజా ఖాన్ స్వతంత్ర భావాలు కల్గినవాడని, జాతీయ భావాలు కల్గినవాడని కొందరు కొట్టిపారేసేవారూ ఉన్నారు.
రెజా ఖాన్ గద్దె దిగడానికి గల కారణాలేంటి?
ఏ బ్రిటిష్ ప్రభుత్వం అండతోనైతే గద్దెనెక్కి పాలించాడో.. అదే రెజా ఖాన్ ఆ తర్వాత సోవియట్ యూనియన్, బ్రిటన్ పట్టును జీర్ణించుకోలేక జర్మన్ తో చేతులు కలిపాడు. నాజీ జర్మన్ తో సంధి.. సోవియట్ యూనియన్ కూ, బ్రిటన్ కూ కన్నుగుట్టి రెజా ఖాన్ ను గద్దె దింపేందుకు రంగం సిద్ధం చేశాయి.
మొసాద్ధేఖ్ పాలన ఎలా సాగింది..?
ఆ సమయంలోనే 22 ఏళ్లకే రెజా ఖాన్ కుమారుడైన మహమ్మద్ రెజా షా సింహాసనం దక్కించుకున్నాడు. ఆ సమయంలోనే అమెరికా కూడా ఇరాన్ లో బలపడుతూ వచ్చింది. మహమ్మద్ రెజా షాతో అమెరికాతో పాటు, ఇతర విదేశీ శక్తులు బాగుంటూనే తమ ఆధిపత్యాన్ని చలాయిస్తుండటంతో.. మళ్లీ తిరుగుబాట్లు మొదలయ్యాయి. 1951లో మళ్లీ పార్లమెంటరీ ప్రభుత్వమేర్పడ్డాక దానికి మహమ్మద్ మొసాద్ధేఖ్ కొత్త ఊపు తెచ్చాడు. ఆయన నాయకత్వంలో ఇరాన్ చమురు బావులను పూర్తిగా జాతీయం చేసి ఓ చారిత్రక నిర్ణయం తీసుకుంది. దాంతో నాడు టైం మ్యాగజీన్ మొసాద్ధేఖ్ ను ఆ ఏడాది మ్యాన్ ఆఫ్ ది ఈయర్ పేరిట కథనం ప్రచురించింది.
ఆపరేషన్ అజాక్స్ అంటే ఏంటి..?
మహమ్మద్ మొసాద్ధేఖ్ తో మొదట బాగానే ఉన్నా.. ఆ తర్వాత అమెరికాకు చెందిన సీఐఏ, బ్రిటన్ కు చెందిన మిలిటరీ ఇంటలిజెన్స్ సెక్షన్ 6 వంటి గూఢచర్య సంస్థలు మొసాద్ధేఖ్ ప్రభుత్వాన్ని ఆపరేషన్ అజాక్స్ పేరిట కూలదోయడంలో కీలకపాత్ర వహించాయి. ఆ తర్వాత మహమ్మద్ రెజా షా మరింత బలపడి మళ్లీ ప్రజాస్వామ్య పార్లమెంటరీ విధానాలకు భిన్నంగా రాజరికం పోకడలు పెరిగాయి. అదే సమయంలో 1953 నుంచి 1979 వరకు ఇరాన్ వేగవంతమైన ఆధునీకరణ, ఆర్థిక వృద్ధిని చూసింది.. ప్రాశ్చాత్య దేశాల నమూనాలా తయారవుతూ వచ్చింది. అదే సమయంలో ఇరాన్ లో రాజకీయ స్వేచ్ఛ పరిమితమైపోయి మరో తిరుగుబాటుకు కారణమైంది.
SAVAK టార్గెట్ ఏంటి..?
రాజకీయ నిర్బంధాలు పెరిగిపోయాయి. 1957లో సాజ్మాన్-ఎ ఎట్టెలాఅత్ వా అమ్నియత్-ఎ కిష్వర్ (SAVAK) పేరిట ఆర్గనైజేషన్ ఆఫ్ ఇంటలిజెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఏర్పాటైంది. అమెరికా సీఐఏ, ఇజ్రాయెల్ మొస్సాద్ వంటివి savak లో శిక్షణనందించాయి. తిరుగబాటుదారులకు ఇది రుచించలేదు. ఈ SAVAK ఏర్పాటుతో కూడా విదేశీ ప్రభావంపై అసంతృప్తి అగ్గి రాజేసింది.
SAVAK ఏర్పాటుతో షా పాలనకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ కార్యకర్తలు, కమ్యూనిస్టులు, ఇస్లామిక్ ఉద్యమాలపై నిఘా, అరెస్టులు, విచారణల పేరిట తీవ్ర వేధింపులకు కారణమైంది.
ఇరాన్ లో బాహ్యశక్తుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ వచ్చిన ఇస్లామిక్ విప్లవంతో పరిస్థితులు ఇక పూర్తిగా మారుతూ వచ్చాయి
దాంతో అది కాస్తా ఇస్లామిక్ రిపబ్లిక్ విప్లవానికి దారితీసింది.
వైట్ రెవల్యూషన్ అంటే ఏమిటి..?
ఇరాన్ లో షా పాలనలో వైట్ రెవల్యూషన్ ప్రధానమైంది. భూస్వాముల ఆధిపత్యం తగ్గించడం, రైతులకు భూపంపిణీ, మహిళా హక్కులకు రక్షణ, పారిశ్రామికీకరణ, విద్య, వైద్యం అభివృద్ధి, చమురు సంపదతో చేపట్టిన అభివృద్ధి వంటివి ఇరాన్ ను ఆధునీకీకరించినా… ఇదే వైట్ రెవల్యూషన్ స్థానికంగా అసంతృప్తిని కూడా పెంచింది. సామాజిక, మత, రాజకీయ వ్యతిరేకతను పెంచి చివరకు 1979 ఇస్లామిక్ విప్లవానికి దారితీసిన ముఖ్య కారణాల్లో వైట్ రెవల్యూషన్ కూడా ఒకటిగా మారింది.
ఇస్లామిక్ రిపబ్లిక్ విప్లవానికి బీజం!
1960లలో అయతుల్లా రుహొల్లా ఖొమేనీ.. షా పాలనా విధానాలపై విరుచుకుపడటం మొదలెట్టాడు. ఆ క్రమంలో ఖొమేనీ అరెస్టయ్యాడు. మరోవైపు షా రాజకీయ పార్టీలను అణిచివేసి పూర్తి రాజరిక పాలనవైపు నడిపించడంతో ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి.
దేశం ఆర్థిక సవాళ్లనెదుర్కొంది. మత, జాతీయ భావజాలం పెరిగింది. విదేశీ శక్తులను అడ్డుకోవాలన్న కసి కనిపించింది. అదే 1979 ఇస్లామిక్ విప్లవంగా మారింది. దేశమంతా ఏకతాటికి పైకి రావడంతో షా దేశం వదలి పారిపోయాడు. ఇరానియన్ విప్లవం విజయం సాధించింది. ఇస్లామిక్ విప్లవం కేవలం షా అనే ఒక రాజును మాత్రమే మార్చిన ఘటన కాదు.. మధ్యప్రాచ్య రాజకీయ పటాన్నే మార్చేసిన ఓ ఉద్యమం. అప్పట్నుంచి అమెరికా ఇరాన్ కు ప్రధాన ప్రత్యర్థుల్లో ఒకటిగా మారింది.
2000 సంవత్సరంలో అంతర్జాతీయ వివాదంగా మారిన అణు కార్యక్రమం!
1950లలో అమెరికా సహకారంతోనే ఇరాన్ అణు కార్యక్రమం ప్రారంభమైంది. కానీ, 2002లో నతాంజ్, అరాక్ అణు కేంద్రాల సమాచారం బయటకు పొక్కడంతో వివాదం తీవ్రరూపం దాల్చింది.
ఇరాన్ కు అమెరికాతో పాటే, ఇజ్రాయెల్ కు కూడా మరింత చెడింది. ఇరాన్ పై అంతర్జాతీయ ఆంక్షలు మొదలయ్యాయి. 2020 నాటికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యురేనియం శుద్ధి ఉద్రిక్తతలను తారాస్థాయికి చేర్చింది. ఇరాన్ చేసే అణు శుద్ధి, సామర్థ్యాల పెంపు తనకు ముప్పుగా భావించింది ఇజ్రాయెల్. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఇవాళ జరుగుతున్న యుద్ధానికెన్నో కారణాలు. భద్రత, ప్రాంతీయ ఆధిపత్యపోరు, అణునిరోధంపై కుదరని సయోధ్య, లెబనాన్, హెజ్బొల్లా, పాలస్తీనా వంటి చోట్ల జరిగే ప్రాక్సీ యుద్ధాల్లో ఇరాన్ జోక్యం.. వెరసి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ ఎడతెగని చిచ్చై ఎగిసిపడుతోంది.
ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యో… లేక, అమెరికా, ఇరాన్ మధ్యో జరుగుతున్న యుద్ధంగా మాత్రమే చూడలేం.. మధ్య ప్రాచ్య భౌగోళిక రాజకీయాలనే అత్యంత ప్రభావితం చేస్తున్న సంక్లిష్ట ఘర్షణ.



