అక్టోబర్ 2 అంటే సాధారణంగా చాలామందికి స్ఫురణకొచ్చే పేరు జాతిపిత గాంధేగానీ.. నిరాడంబరతకు నిలువుటద్దం శాస్త్రి ఎలాగూ కాదు! జీవితంపై ఒక స్పష్టమైన అవగాహనతో మెదిలిన ఓ సాదాసీదా ప్రధాని.. దేశానికి జై జవాన్ జై కిసాన్ నినాదాన్నందించిన దార్శనికుడి పుట్టినరోజు కూడా అక్టోబర్ రెండే అయినా.. గాంధీ పుట్టిన్నాడే యాదృఛికంగా శాస్త్రీ జన్మించడమో ఏమో.. గట్టిగా గుర్తు చేసుకునేవారు తక్కువే! అందుకని ఆయన కన్నుమూసిన రోజు జనవరి 11న ఆయన వర్ధంతి రోజైనా ఓసారి తల్చుకుందాం. నీతి, నిజాయితీకి నిలువెత్తు దర్పంలా కనిపించే ఆ అద్దంలో నేటి సమాజాన్ని ఓసారి చూసుకున్నప్పుడు ఎంత వికృతంగా కనిపిస్తుందో కూడా చెప్పుకుందాం.

సాయుధ తిరుగుబాటు, మతపరమైన అసమ్మతి, ఆకలికేకలు, ఆహారధాన్యాల కొరత, ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారతదేశ రెండో ప్రధానిగా ఆశాకిరణమైనవాడు లాల్ బహుదూర్ శాస్త్రి. కుల, మతాలకతీతంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పేందుకు… జైజవాన్-జైకిసాన్ వంటి నినాదంతో యావత్ దేశం స్ఫూర్తి రగిలించిన దార్శనికుడు. ఒక ప్రధాని హోదాలో ఉన్నప్పటికీ.. తానూ ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన ప్రస్థానాన్ని మరువకుండా నిరంతరం ప్రజాశ్రేయస్సుకై యోచించినవాడు. 1965 ఇండో-పాక్ వార్ సమయంలో శాస్త్రి దేశం కోసం చేసిన కృషితో పాటు… పాల పరిశ్రమను అభివృద్ధిపర్చడంపై ఆయన చూపిన చొరవ అభినందనల వర్షాన్ని కురిపించింది.
శాస్త్రి స్వాతంత్ర్య పోరాట సమయంలో పలుమార్లు జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆయన జైల్లో ఉన్న ఒకానొక సమయంలో ఆయన కుమార్తె తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో.. ఓసారి జైలు నుంచి 15 రోజులపాటు పెరోల్ పై బయటకొచ్చారు శాస్త్రి. కానీ విధి వక్రించి కూతురు పెరోల్ పూర్తికాక ముందే చనిపోయింది. దాంతో శాస్త్రి తన పెరోల్ గడువు పూర్తికాకముందే మళ్లీ జైలు బాట పట్టారట. ఎందుకిలా అని జైలు అధికారులడిగితే… నా కుమార్తెను చూసుకోవడానికి… వీలైతే ఆమెను ఆరోగ్యంగా తయారు చేసుకోవడానికి నాకు పెరోల్ ఇచ్చారు. కానీ ఇప్పుడామే లేకుండా పోయింది. ఇంకా నాకు ఈ పెరోల్ ఎందుకు..? జైలుకు తిరిగిరావడం నా కర్తవ్యమని చెప్పేశారట శాస్త్రి. ఈ విషయాన్ని రాజకీయ విశ్లేషకులైన డాక్టర్ సందీప్ శాస్త్రి… లాల్ బహదూర్ శాస్త్రి, పాలిటిక్స్ అండ్ బియాండ్ అనే పుస్తకంలో రాసుకొచ్చారు. అంతేకాదు తమకు వచ్చే యాభై రూపాయల పెన్షన్ లో లాలా లజపతిరాయ్ పేదల కోసం నడిపించే సంస్థకు.. పది రూపాయలను విరాళంగా అందించిన సహృదయశీలి ఎల్బీ శాస్త్రి.
తన చిన్ననాట పాఠశాలకు నది దాటి వెళ్లాల్సి ఉన్నప్పుడు కూడా పడవలో ప్రయాణించడానికి డబ్బు ఖర్చు చేయకుండా ఈదుకుంటూ వెళ్లి డబ్బునాదా చేసి.. దాని విలువను చిన్ననాటే గుర్తించిన పొదుపరి శాస్త్రి. ప్రధాని హోదాలో ఒక కారైనా లేకపోతే ఎలా అన్న చర్చ ఇంట్లో పెరిగి పెద్దదైనప్పుడు 12 వేల రూపాయల ఫియట్ కారు కొనడానికి.. కేవలం శాస్త్రి వద్ద ఏడువేలే ఉంటే మరో 5 వేలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రుణంగా తీసుకోవాల్సి వచ్చింది. ఆ లోన్ తీర్చేకంటే ముందే తాష్కెంట్ లో ఆయన మృతి… ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆ రుణాన్ని రద్దు చేస్తామన్నా వినకుండా ఆయన భార్య తనకొచ్చే పెన్షన్ డబ్బు నుంచి ఆ రుణాన్నితీర్చేయడం.. ఆయన సారథ్యంలోని సంస్కార కుటుంబ వ్యవస్థను కళ్లకు కట్టేది.
మొట్టమొదటి ఖాతాదారులుగా డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్, లాలా బహదూర్ శాస్త్రి వంటివారు నాడు ఆదర్శప్రాయంగా ఉంటే… అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి నీరవ్ మోడీ వంటివారు రుణాలు తీసుకుని కోట్లు కొల్లగొట్టి… వారి లక్ష్యసాధనైన విదేశాలకు చేరుకుని.. జలసాలు చేస్తున్నారు. కన్నతల్లి వంటి దేశాన్ని నిండా ముంచి… రాజ్యానికీ, చట్టానికీ దొరక్కుండా.. తనదికాని చోట వెళ్లి ఆ డబ్బుతో విలాసాలు పోతున్నారు. ఒక విజయ్ మాల్యా, ఓ నీరవ్ మోడీ, ఓ మెహుల్ చోక్సీ, ఓ వజ్రాల వ్యాపారి జతిన్ మెహతా, ఓ లలిత్ మోడీ… ఇలా జాబితా తీస్తే సుమారు 29 మంది విదేశాల్లో ఇక్కడి బ్యాంకులకు రుణాలెగ్గొట్టి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నవారున్నారు. బహిరంగసభల్లో పెద్దపెద్ద నీతులు వల్లించే ప్రస్తుత ప్రభుత్వాధినేతలు వారినేమీ చేయలేరు… కాదు కాదు చేయరు. ఎందుకు చర్యలు తీసుకోలేరనీ ఎవరూ అడగొద్దు. అలాంటివారిని వెనక్కి తీసుకురాలేకపోవడం చేతగానితనమా అనే ప్రశ్నలుండొద్దు. అంతా జగన్నాటకం చూస్తున్న రోజుల్లో.. అదిగో ఇలాంటి వాళ్లతో పోల్చుకున్నప్పుడు.. శాస్త్రి వంటివాళ్లు ఇప్పుడున్నారా అనిపిస్తుంది. అసలు పోలికే లేనివాళ్లతో శాస్త్రిలాంటివాళ్లను పోల్చడమూ ఓ పాపమే!
1965 -1966 మధ్యకాలంలో తీవ్ర ఆహారకొరతతో దుర్భిక్ష పరిస్థితులేర్పడినప్పుడు… ప్రతీ ఇంటి పెరట్లో గోధుమలు, లేదా వరిని పండించాలని పిలుపునిచ్చి శ్వేతవిప్లవాన్ని రగిలించిన నాయకుడు. ఢిల్లీ జనపథ్ లోని తన ఇంట్లో ధాన్యాన్ని ఆయనే స్వయంగా పండించి… ఆచరణలో పెట్టేవాడే నాయకుడని నిరూపించినవాడు. భారత్ అప్పటికే గోధుమలను ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న కాలంలో… భారత్ లో ధాన్యం కొరత ఏర్పడి వినిపిస్తున్న ఆకలి కేకలను నివారించాలంటే… వారానికి ఓ పూట ఇంటిల్లిపాది భోజనం మానేసే ఉపవాస ఉద్యమాన్ని తన ఇంటి నుంచే ప్రారంభించినవాడు. ఏకంగా ఆల్ ఇండియా రేడియోనే ఉద్యమానికి పిలుపునిచ్చేలా చేసిన ఆదర్శప్రాయుడు లాల్ బహదూర్ శాస్త్రి.
ఇలా శాస్త్రికి సంబంధించిన ఎన్నో కథలు నేటి తరానికి ఇంకా తెలియాల్సి ఉంది. అంతకుమించి అక్టోబర్ 2 అంటే మహాత్ముణ్ని మాత్రమే మహాత్ముడిగా గుర్తించి, తల్చుుకునే దేశంలో… కనీసం వర్ధంతి రోజైనా ఆయన స్మరించుకునేందుకే ఈ అక్షరనివాళి!



