ప్రపంచమంతా గుర్తించినా సరే… మన పాలకులు, ప్రభుత్వాలు గుర్తించడమే కష్టం. అలాంటి అనుభవమే మురళీకాంత్ పేట్కర్ ది. తాజాగా ఆయనకు భారత ప్రభుత్వం జీవన సాఫల్య గుర్తింపుగా అర్జున అవార్డ్ ను ప్రకటించడంతో ఇప్పుడు మురళీకాంత్ పేట్కర్ అనే పారా స్విమ్మర్ కథ తెరపైకొచ్చింది.
మురళీకాంత్ రాజారామ్ పేట్కర్ పారా ఒలింపిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణం సాధించిన స్విమ్మర్. తను జర్మనీ హెడెల్ బర్గ్ లో 52 ఏళ్ల క్రితం ఆ ఘనత సాధిస్తే… 52 ఏళ్ల తర్వాత ఇంతమంది పాలకులు, ఇన్ని ప్రభుత్వాలు మారినతర్వాతగానీ పేట్కర్ కు అర్జున అవార్డ్ దక్కలేదు.

ఇండియన్ ఆర్మీకి చెందిన కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ విభాగంలో క్రాఫ్ట్స్ మ్యాన్ గా పనిచేసే మురళీకాంత్ ఓ దివ్యాంగుడు. కానీ, స్విమ్మింగ్ లో మంచి నైపుణ్యమున్న పేట్కర్.. 1972 లో పారా ఒలింపిక్స్ కు సెలక్టై.. అక్కడ ఏకంగా వ్యక్తిగత స్వర్ణపతకం సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.
1965లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో శ్రీనగర్ సైనిక శిబిరంపై దాడిలో పేట్కర్ తీవ్రంగా గాయపడ్డాడు. తొమ్మిది బుల్లెట్ల వర్షంతో అసలు బతుకడేమోననుకున్న వ్యక్తి.. ఓ జీవశ్చవంలా ఇక కదలలేని స్థితిలో గాయపడ్డాడు. అయితేనేం, ఆర్మీలో పనిచేసిన ఉక్కు సంకల్పంతో.. దివ్యాంగుడిగా మారాక కూడా క్రీడలపై తనకున్న మక్కువను మాత్రం వదులుకోలేదు. ఆ సాధనతో ఏకంగా పారా ఒలింపిక్స్ లో స్వర్ణపతకాన్ని సాధించడమే కాకుండా మూడుసార్లు వరల్డ్ రికార్డ్ సాధించిన ఘనత కూడా పేట్కర్ ది. ఆయన గొప్పదనాన్ని ప్రపంచం గుర్తించిందేగానీ.. అర శతాబ్దం నుంచి ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోకపోవడం విచారకరం.
ఇప్పుడు 80 ఏళ్ల ముదిమి వయస్సులో 2025 జనవరి 17వ తేదీన రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇప్పటికైనా తనను గుర్తించి పాలకులిచ్చిన అవార్డును స్వీకరించబోతుండటం ఈ దేశంలో పుట్టినందుకు ఆయన చేసుకున్న అదృష్టం.

2018లో పేట్కర్ కు పద్మశ్రీ!
అసలు పారా ఒలింపిక్స్ ను పెద్దగా పట్టించుకుంటేనా… గుర్తింపు దక్కేది అన్నట్టుగా ఉన్న రోజులవి. క్రీడాకారులకు కావల్సిన సౌకర్యాలుగానీ, మద్దతుగానీ ఏదీ పెద్దగా ప్రభుత్వాల నుంచి లభించేదేకాదు. అన్ని అడ్డంకులున్నప్పటికీ పేట్కర్ లాంటివాళ్లు నాటి రోజుల్లో భారత్ నుంచి వ్యక్తిగత స్వర్ణపతకం సాధించడమంటే మాటల్లో చెప్పినంత మామూలు విషయమేం కాదు.
మురళీకాంత్ కు బాక్సింగ్ లో పట్టు సాధించాలని, ఛాంపియన్ కావాలనే కల ఉండేది. జపాన్ లో జరిగిన బాక్సింగ్ పోటీల్లో పాల్గొని ఓసారి బంగారు పతకాన్ని కూడా సాధించాడు. కానీ, పారా స్విమ్మింగ్ లో తాననుకున్న కలను నెరవేర్చుకున్నాడు. 1968-72 మధ్య భారతదేశం నుంచి పారా స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనేవాడు. ఆటల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి. 1968లో మెక్సికోలో జరిగిన పారా ఒలంపిక్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ లోనూ రెండో రౌండుకు చేరుకున్నాడు.
జర్మనీలో స్వర్ణం సాధించిన 1972లో స్విమ్మింగ్ తో పాటు.. జావెలిన్ త్రో, టేబుల్ టెన్నిస్, షాట్ పుట్, స్లాలోమ్ వంటి క్రీడల్లోనూ రాణించాడు. పదవీ విరమణ తర్వాత తనలాగే ఆర్మీ ఉద్యోగైన కొడుకు అర్జున్ పేట్కర్ వద్ద పూణేలో ఉంటున్నాడు మురళీకాంత్ పేట్కర్. రీసెంట్ గా కబీర్ ఖాన్ డైరెక్షన్ లో కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్ లో నటించిన చందూ ఛాంపియన్ సినిమా బయోగ్రఫీ కూడా ఈ మురళీకాంత్ పేట్కర్ దే కాగా… 2018లో భారత ప్రభుత్వం మురళీకాంత్ పేట్కర్ ను పద్మశ్రీతో సత్కరించింది.



