మన జీవితాలతో ముడిపడి… జీవజాలాన్నేకాకుండా, ప్రకృతిని కూడా కబళిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టేందుకు ఓవైపు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు, నదులు, సముద్రాలు, అడవులు, పట్టణాలు, పల్లెలన్న తేడా లేకుండా ప్లాస్టిక్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ విషయంలో ఎందరో పర్యావరణ ప్రేమికుల్లాగే… నేవీలో పనిచేసిన ఓ మాజీ కెప్టెన్ ను కదిలించింది ప్లాస్టిక్ సృష్టిస్తున్న పర్యావరణ కాలుష్యం. స్వతహాగా ఇంజనీర్ కూడా అయిన ఆ మాజీ కెప్టెన్ ఓ వినూత్నమైన ఆవిష్కరణతో ఇప్పుడేకంగా లక్ష టన్నుల చెత్తను సముద్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేయగల్గాడు. నదుల్లోని చెత్తను ఎంతో సులభంగా తక్కువ ఖర్చుతో తొలగిస్తున్నాడు.
అందుకు మనం మాజీ మర్చంట్ నేవీ అధికారైన శేఖర్ కథలోకి వెళ్లాలి.

శేఖర్ ఆవిష్కరణతో ఇంధన అవసరం లేకుండా సహజంగా ఉండే ప్రవాహ సాయంతో ఇప్పుడు నదులు, సముద్రాలను ప్లాస్టిక్ భూతం నుంచి తరిమికొట్టే అడుగులు బలంగా పడుతున్నాయి.
నేవీ అధికారిగా శేఖర్ ది 26 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. తాను సముద్రయానం చేస్తున్నప్పుడు కనిపించే చెత్తా, కాలుష్యం.. మరీ ముఖ్యంగా రోజురోజుకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్ ఆయనకు ఏదో ఒకటి చేయాలనే సంకల్పానికి దారితీశాయి. భారతదేశంలోని నదులు, సముద్రాల్లోని పరిస్థితిని ప్రత్యక్షంగా చూడటంతో ఆ ఇంపాక్ట్ శేఖర్ ను కదిలించింది.
తనకు కెప్టెన్ గా ఉన్న అనుభవం, ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో నదుల్లో, సముద్రాల్లో డయాగ్నల్ గా ఒక సిస్టమ్ ను ఏర్పాటు చేశాడు. ఈ సిస్టమ్ ప్రవాహానికి ఒక అడ్డుకట్ట మాదిరిగా కనిపిస్తుందే తప్ప… ప్రవాహాన్ని అడ్డుకోదు. ఎవైతే కొమ్మలు, ప్లాస్టిక్ వస్తువులు, ఇతర చెత్తాచెదారం ఏవున్నా ఆ బ్యారియర్ వద్ద చిక్కుకుపోవడంతో పాటు… వాటిని వాటన్నింటిని ఒడ్డువైపుకు మళ్లించే ఒక ఆటోమేటిక్ ఇంజనీరింగ్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది. దాంతో చెత్తాచెదారమంతా ఒడ్డువైపుకొస్తూ… నీరు మాత్రం తన సహజ ప్రవాహంతో వెళ్లిపోతూ ఉంటుంది. అలా ఒకవైపుకు చేరిన ఆ చెత్తాచెదారాన్నీ, ప్లాస్టిక్ భూతాన్ని తీసేసి మళ్లీ రీసైక్లింగ్ పర్పస్ లోనో, లేక డంప్ యార్డులకో తరలిస్తుంటారు.
విదేశాల్లో చేస్తున్న ఆవిష్కరణలకంటే కూడా శేఖర్ క్రియేట్ చేసిన ఈ బ్యారియర్ 30 రెట్లు ఖర్చు తక్కువతో, ఎలాంటి ఇంధన అవసరం లేకుండా ఇప్పుడు ఆకట్టుకుంటోంది.
ముఖ్యంగా నదులన్నీ ప్రవహించి కలిసేవి సముద్రాల్లోనే కాబట్టి.. ప్లాస్టిక్ గానీ, ఇతర వ్యర్థాలుగానీ… ఆ నదుల నుంచే ఎక్కువగా సముద్రంలోకి వస్తున్నాయనే విషయాన్ని గుర్తించిన కెప్టెన్ శేఖర్.. నదుల్లో ఈ డయాగ్నల్ బ్యారియర్ సిస్టమ్ ను ఏర్పాటు చేశాడు.
చెన్నై అడ్యార్, కూమ్ నదుల్లో ఇప్పటికే ఈ సిస్టమ్ ను ఉపయోగించి 20 వేల టన్నులకు పైగా వ్యర్థాలను ఇటీవలే తొలగించారు. శేఖర్ చూపిన ఈ పరిష్కారం ఇప్పుడు మున్సిపల్ కార్పోరేషన్లలు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు.. రక్షణదళం దృష్టిని కూడా ఆకర్షిస్తోంది.
భారతదేశంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాలో ఈ ప్లాస్టిక్ భూతం బెంబెలెత్తిస్తోంది. ఈ క్రమంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ గోవాలో భాగంగా… గోవాలోని అరేబియా సముద్రంలోకి వచ్చే అన్నీ నదీ ప్రాంతాలను గుర్తించి శేఖర్ డిజైన్ చేసిన బ్యారియర్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడేకంగా నదుల నుంచి సముద్రంలోకి వచ్చే చెత్తాచెదారాన్ని అడ్డుకునేందుకు తన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఔరా అనిపించిన ఈ కెప్టెన్.. ఇప్పుడేకంగా సముద్రంలో పేరుకుపోతున్న చెత్తను కూడా నేరుగా ఏరిపారేసేందుకు కొత్త ఆవిష్కరణలపై పనిచేస్తున్నాడు.
మేక్ ఇన్ ఇండియా అని మన ప్రభుత్వాలు చెబుతున్న మాటలకు… ఎలాంటి విదేశీ సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేకుండా.. పూర్తిగా స్వదేశీ పద్ధతిలో చౌకగా కెప్టెన్ శేఖర్ వంటివారు చేస్తున్న ఆవిష్కరణలు.. పర్యావరణ పరిరక్షణ దిశగా వారు చూపిస్తున్న చొరవ కచ్చితంగా అభినందించాల్ని విషయం.



