ఒకే ఒక ఇల్లు… ఏకంగా ఒక ఎక్స్ ప్రెస్ హైవేనే ఆపేసింది. అదేదో అల్లాటప్పా హైవే కాదు.. దేశ రాజధాని ఢిల్లీతో ముడిపడ్డ హైవే.
ఢిల్లీ- డెహ్రడూన్ మధ్య నిర్మిస్తున్న ఎక్స్ ప్రెస్ హైవే దాదాపు పూర్తి కావచ్చింది. కానీ, ఆ ప్రధాన రహదారిని మధ్యలో ఓ ఇల్లు అడ్డుకుంది. ఆ కేసు ఇంకా కోర్టు విచారణలోనే నానుతోంది.
ఢిల్లీ – డెహ్రాడూన్ మధ్య ఇంతకాలం 6 గంటల సమయం పట్టేది.. ఈ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణంతో కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకునే వెసులుబాటు కల్గుతుంది. రెండువైపులా పూర్తి కావచ్చిన హైవే మార్గం ఒక్కచోట మాత్రం ఓ పిటిషనర్ కోర్టుకెక్కడంతో ఆగిపోయింది.

ఘజియాబాద్ లోని మండోలా గ్రామం వద్ద హైవేకు బ్రేక్ పడింది. వీర్ సేన్ సరోహా అనే వ్యక్తికి సంబంధించిన కుటుంబం ఇక్కడ న్యూమాడల్ లో ఓ రెండతస్తుల బిల్డింగ్ కట్టుకుంది. చూడ్డానికి రాయల్ గా కనిపించే ఈ ఇంట్లో 1990ల నుంచే ఆ కుటుంబీకులుంటున్నారు. 1600 చదరపు మీటర్ల ప్లాట్ లో ఈ ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఉత్తరప్రదేశ్ హౌజింగ్ బోర్డ్ మండోలా హౌజింగ్ స్కీమ్ కోసం భూసేకరణలో భాగంగా వీర్ సేన్ సరోహా భూమిని స్వాధీనం చేసుకోవాలనుకుంది. దాంతో వీర్ సేన్ అప్పుడే అలహాబాద్ కోర్ట్ మెట్లెక్కాడు. అలా 1998 నుంచీ ఈ భూవివాదం కోర్టులో నానుతూనే ఉంది.
మండోలా హౌజింగ్ ప్రాజెక్ట్ ఎప్పుడూ అక్కడ నెలకొన్న ప్రజల నిరసనలు, విధానపరమైన జాప్యం కారణంగా ముందుకు వెళ్లిన దాఖలాల్లేవు. హౌజింగ్ బోర్డ్ గృహనిర్మాణ స్కీమ్ అటకెక్కాక.. అంతకుముందు సేకరించిన భూములను ఇక ఢిల్లీ – డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ హైవేకు కేటాయించారు. కానీ, ఇక్కడా ఈ ఎక్స్ ప్రెస్ హైవేకు వీర్ సేన్ ఇల్లే ఆటంకంగా మారింది.
ఈ ఎక్స్ ప్రెస్ హైవేను రెండు భాగాలు నిర్మిస్తున్నారు. అక్షరధామ్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని వరకు 14.7 కిలోమీటర్లు… అలాగే, లోని నుంచి ఖేక్రా వరకు మరో 16 కిలోమీటర్లు నిర్మాణంలో భాగంగా ఈ ఆటంకం ఎదురైంది. మండోలా హౌజింగ్ బోర్డ్ భూసేకరణను వ్యతిరేకిస్తూ అలహాబాద్ కోర్టుకెక్కిన వీర్ సేన్ కేసు.. ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరింది. దీంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈ హైవే నిర్మాణం పెద్ద తలబొప్పి కట్టిస్తోంది.
వీర్ సేన్ కుటుంబ సభ్యులు ఈ హైవే కారణంగా తమ ఇల్లు పోవడానికి వీల్లేదంటూ సుప్రీను ఆశ్రయించడంతో.. ఈ హైవే నిర్మాణంపై తర్జనభర్జన పడుతున్నారు అధికారులు. వీర్ సేన్ మనవడైన లక్ష్యవీర్ తమ భూమిని నేషనల్ హైవేస్ కు బదిలీ చేయడం చట్టవిరుద్ధమంటూ సుప్రీంను ఆశ్రయించడంతో ఈ వివాదం ఒడవని ముచ్చటలా మారిపోయింది. ప్రస్తుతం హైకోర్ట్ లక్నో బెంచుకు ఈ కేసును బదిలీ చేయగా.. తదుపరి విచారణ ఈనెల ఏప్రిల్ 16వ తేదీన జరుగనుంది. అయితే, ఎక్స్ ప్రెస్ హైవే కారిడార్ కు ఒకే ఒక్క ఇల్లు వల్ల అంతరాయం కల్గడం సమంజసం కాదని.. సత్వరమే పరిష్కారం చూపాలని కూడా కోర్ట్ ఆదేశించడంతో… నెక్స్ట్ జరుగబోయే విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.



