నరేష్కుమార్ సూఫీ…✍️
“నీకు ముప్పై అయిదువేల డాలర్లు మిగిలే ఉపాయం చెప్తాను, దానికి బదులుగా నా మిత్రులకి నువ్వు బీరు తాగిస్తే చాలు” చావుకి రెండంగుళాల దూరంలో ఉండి అతనా డీల్ మాట్లాడుతున్నప్పుడు నాకర్థమైంది. అతను మిత్రులు అంటున్నది మమ్మల్నే, తన తోటి ఖైదీలనే.
ఏళ్లకు ఏళ్ళుగా క్షణికావేశంలో చేసిన తప్పులకు ఆ షషాంక్ జైల్లో మగ్గిపోతున్న మమ్మల్ని ఒక ఉదయకాలం పాటు సంతోషపెట్టడానికే అతనా పని చేయటానికి ఒప్పుకున్నాడు. అతను కేవలం జైలు అధికారులని మంచి చేసుకోవటానికి మాత్రమే ఆ పని చేయలేదు. మేమంతా కొద్దిసేపు మా బాధలని మర్చిపోవటానికి అతనా పని చేయటానికి ఒప్పుకున్నాడు… మేము బీర్లు తాగుతుంటే అతను మాత్రం తాగకుండా మమ్మల్నే చూస్తూ నవ్వుకుంటూ కూచున్నాడు.

మరోసారి… మమ్మల్నందరినీ సంతోష పెట్టటానికి. జైలు సూపరెంటెండెంట్ ని గదిలోనే ఉండగా బయటినుంచి తాళం పెట్టి. ఓ ఒపెరా సాంగ్ ప్లే చేశాడు. ఆ కొద్ది క్షణాల పాటు మొత్తం జైలంతా సంతోషంతో, ఉద్వేగపు కన్నీళ్ళతోనూ నిండి పోయింది. దాని ఫలితంగా అతను వారం రోజుల పాటు చీకటి కొట్టంలో బంధించబడ్డాడు, దెబ్బలు తిన్నాడు…. ఆ పని కూడా అతను కేవలం మా సంతోషం కోసం మాత్రమే చేశాడు.
ఆ తర్వాత కొన్నాళ్ళకి… అతను తను ఈ జైల్ నుంచి తప్పించుకుంటానని, ఫసిఫిక్ తీరానికి వెళ్తానని చెప్పాడు. నిజంగా అతని మీద జాలి కలిగింది. ఎందుకంటే, ఇక్కడ నుంచి తప్పించుకోవటం అసాధ్యం… అదే చెప్పబోతుంటే.. “నేను వెళ్ళిన తర్వాత నువ్వూ నాదగ్గరికి వచ్చేయ్ అంటూ”.. ఒక ప్రాంతానికి వెళితే అక్కడ నాకోసం ఒక వస్తువును దాచి ఉంచుతానని చెప్పాడు. నాకు ఆశ్చర్యమే కాదు, అతనికి పిచ్చి పట్టిందా? అని కూడా అనిపించింది..
కానీ… కానీ…
అతను నిజంగా ఈ జైలునుంచి తప్పించుకున్నాడు, దానికోసం ఇరవయ్యేళ్ళు కష్టపడి సొరంగం తవ్వాడు, అతను చెప్పినట్టే నాకూ పెరోల్ దొరికింది. అతను చెప్పిన చోటికి ఆ ఊరిచివర ఉన్న పెద్ద వృక్షం దగ్గరికి వెళ్ళాను. అతను నాకోసం దాచిన బహుమతిని తీసుకున్నాను. చివరికి అతను చెప్పినట్టే…. ఫసిఫిక్ తీరంలో మనసుకునచ్చినట్టుగా బతికే అతన్ని కలుసుకున్నాను.
అతను మాకు బీర్లు ఇప్పించటం, మా కోసం ఒపెరా ప్లే చేయటం, తను తప్పించుకుంటానని చెప్పటం, నన్ను కూడా తీసుకువెళతానని చెప్పటం… ఇవన్నీ అతను ఊరికే చేయలేదు. మాలో ఆశని నింపటానికి చేశాడు, ఆశతో మరికొన్నాళ్ళు బతికేలా చేశాడు. బతుకులో ఇక ఏమీ మిగలలేదన్న నిరాశని పారదోలి జీవితం మీద ప్రేమ పెరగటానికి చేశాడు.
నా పేరు రెడ్…
అతను యాండీ… షషాంక్ జైలులో నా తోటి ఖైదీ. కాదు..కాదు… నా మిత్రుడు, యాండీ నా స్నేహితుడు.
(ఎప్పుడైనా విపరీతమైన నిరాశ ఆవరించినప్పుడు the shawshank redemption అనే ఈ సినిమాని చూస్తాను, మళ్ళీ మళ్ళీ చూస్తాను. జీవితమ్మీద ఇంకాస్త హోప్, ప్రేమా పెంచుకోవటానికి ఈ సినిమాని చూస్తాను. ఇప్పుడూ అందుకే చూశాను.
అన్నట్టూ…! మీ జీవితంలోనూ ఓ యాండీ ఉండే ఉంటాడు కదా. అతనికోసారి కాలో, మెసేజో చెయ్యండి. ఎందుకంటే యాండీ అవసరం రెడ్ కి ఉన్నట్టే ఒక్కోసారి రెడ్ అవసరం యాండీకి కూడా ఉండొచ్చు కదా!!



