అడ్మిషన్ కోసం 24 ఏళ్ల నిరీక్షణ! వ్యవస్థల్లో లోపాలను కళ్లకుగట్టే ఓ బెంగాలీ బాబు కథ!!

ఎలాగైనా లా చదవాలన్న ఆకాంక్ష గుజరాత్ లోని ఆ బెంగాలీ బాబుది. అందుకోసం 24 ఏళ్ల నిరీక్షణ తప్పనిసరైంది. ఎందుకలా…?

గుజరాత్ కు చెందిన 66 ఏళ్ల శశికుమార్ మొహతా స్టాక్ మార్కెట్ నిపుణుడు. అయినప్పటికీ లీగల్ ఇష్యూస్ విషయంలో ఇంకా తెలుసుకోవాలనే కుతూహలంతో న్యాయశాస్త్రం అభ్యసించాలనుకున్నాడు. అందుకోసం గుజరాత్ లోని దౌలత్ భాయ్ త్రివేది లా కళాశాలను సంప్రదించాడు. కానీ, శశికుమార్ మొహతాకు ఎల్ఎల్బీలో సీటు ఇవ్వడానికి ఆ కళాశాల నిరాకరించింది.

గుజరాత్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ డీటీ లా కళాశాలలో నిబంధనల ప్రకారం కనీసం 15 ఏళ్లు.. అంతకుముందు స్కూల్, కళాశాల చదువులు కల్గి ఉంటేనే.. ఎల్ఎల్బీలో సీటు లభిస్తుంది. 12 ఏళ్లపాటు స్కూల్, ఇంటర్ విద్యతో పాటు.. మూడేళ్ల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోవాలి. అప్పుడుగానీ గుజరాత్ యూనివర్సిటీ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు పూర్తవుతుంది. కానీ, మొహతాకు అంతకుముందు 14 ఏళ్ల అకాడమిక్ విద్య మాత్రమే ఉంది. దాంతో కళాశాల యాజమాన్యం శశికుమార్ మొహతాకు సీటు ఇవ్వడానికి నిరాకరించింది.

గుజరాత్ లో స్థిరపడ్డ శశికుమార్ మొహతా కోల్ కత్తావాసి. కోల్ కత్తాలో 11 ఏళ్ల పాఠశాల విద్యను పూర్తి చేసి.. ఆ తర్వాత బీకామ్ డిగ్రీ చేశాడు. అప్పటికి అదే పశ్చిమబెంగాల్ లో ప్రామాణిక విద్యాభ్యాస తీరు. కానీ, 1979లో గుజరాత్ కు వలస వచ్చిన మొహతాకు.. ఆ ప్రామాణికత కాస్తా తన చదువులకు ప్రశ్నార్థకంగా మారింది. అదే దౌలత్ భాయ్ త్రివేది లా కళాశాలలో మొహతాకు సీటు దక్కకుండా చేసింది.

1970ల్లో పశ్చిమబెంగాల్ లో 11 ఏళ్ల స్కూల్ విద్య, 3 ఏళ్ల కళాశాల విద్య అనే అభ్యసన విధానముండగా.. గుజరాత్ లో 11+4 విధానంలో ఈ విద్య సాగేది. ఆ తర్వాత అది కాస్తా 12+3గా విద్యా విధానానికి మారింది.

అంతకుముందు 1987-88లో నవ్ గుజరాత్ కళాశాలలో కూడా ఓసారి తాను ప్రయత్నం చేయగా.. ఇవే పరిస్థితులు మొహతాకు ఆటంకంగా మారాయి.

దీంతో శశికుమార్ మొహతా సరిగ్గా 24 ఏళ్ల క్రితం.. 2000 సంవత్సరంలో అహ్మదాబాద్ సివిల్ కోర్ట్ మెట్లెక్కాడు. తన అర్హత పూర్తిగా చెల్లుబాటైనా… ఎల్ఎల్బీ చదవడానికి కావల్సిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నా దౌలత్ భాయ్ త్రివేది లా కళాశాల యాజమాన్యం తనకు అడ్మిషన్ నిరాకరించడంపై తన వాదనను వినిపించాడు. మొహతా వాదనతో కోర్ట్ అంగీకరించింది. చివరకు 24 ఏళ్ల తర్వాత కోర్టు మొహతాకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

అదే సమయంలో కోర్టు తన తీర్పులో 12+3 పేరిట నిబంధనలు పెట్టి కచ్చితంగా 15 ఏళ్ల అకాడమిక్ చదువులుండాలనే నిబంధనపైనా అక్షింతలు వేసింది. అర్హత కల్గి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల పేరిట స్టీరియోటైప్ పద్ధతులు మానేయాలని.. ఒకరి ఆకాంక్షను, చదువుకోవాలనే ఆసక్తిని అడ్డుకోవడం సరికాదంటూ చివాట్లు పెట్టింది. కేవలం నిబంధనల పేరిట సాంకేతిక కారణాలు చూపిస్తూ అడ్మిషన్స్ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది.

ఇప్పుడు మొహతా వచ్చే అకాడమిక్ ఈయర్ నుంచి తనకిష్టమైన లా కళాశాలలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించవచ్చు. అయితే, మొహతా సర్టిఫికెట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో, లేదో కావాలంటే వెరిఫై చేయొచ్చు… వాటిల్లో ఏమన్నా ఇబ్బందులుంటే తిరస్కరించవచ్చు.. కానీ, 15 ఏళ్ల అకాడమిక్ విద్య పేరి అడ్మిషన్ నిరాకరించడం కుదరదని కోర్టు తేల్చిచెప్పేయడంతో.. 24 ఏళ్ల తర్వాత శశికుమార్ మొహతాకు న్యాయం లభించింది.

కోర్టులో మొహతా సాధించిన ఈ విజయం విద్యకు వయస్సు, కాలంతో పనిలేదనే విషయాన్ని నిరూపించింది. అదే సమయంలో, మన స్టీరియోటైప్ విద్యావిధానానికి ఓ చెంపపెట్టులా తీర్పునిచ్చింది అహ్మదాబాద్ సివిల్ కోర్ట్. మరోవైపు, కళాశాలలో జరిగిన అన్యాయానికి కోర్ట్ మెట్లెక్కితే… సత్వర న్యాయం కరువై… ఇలా జీవితకాలం పోయాక తీర్పులు రావడం మన న్యాయవ్యవస్థలో నెలకొన్న మరో విషాదం. మొత్తంగా ఇన్ని వ్యవస్థల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపే ఓ కేస్ స్టడీగా మారింది.. శశికుమర్ మొహతా 24 ఏళ్ల న్యాయపోరాటం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles