గాంధీని పాక్ జాతిపిత చేసిన గాయకుడు! అభిజిత్ సెటైర్స్ తో తెరపైకి మరో వివాదం!!

మహాత్మాగాంధీ పాకిస్థాన్ జాతిపిత! ఈ మాట వినగానే అవాక్కవుతున్నారా..? అందుకు కారణం వాక్ స్వాతంత్రం ఇచ్చిన స్వేచ్ఛ. కానీ, ఆ స్వేచ్ఛ శృతి మించితే వివాదానికి దారితీస్తుంది. భారత జాతిపితగా పిల్చుకునే గాంధీని.. పాకిస్థాన్ జాతిపిత అని సంబోధిస్తే.. జాతిపితను తప్పుబట్టేవారు.. గాడ్సే అంత ద్వేషించేవారూ హర్షించవచ్చేమోగానీ… ప్రేమించే మెజార్టీ జనానికి మాత్రం అది వివాదమే. అదిగో ఆ వివాదాన్నే సృష్టించాడిప్పుడు ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య.

సాధారణంగా కాంట్రవర్సీస్ మాట్లాడటంలో వెనుకాడని నైజం అభిజిత్ ది. ఆయన పాటెంత మధురమో.. కొన్నిసార్లు ఆయన మాట మాత్రం చాలా కటుకు. ఏ.ఆర్. రెహమాన్ నుంచి మొదలుకుంటే.. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వరకూ ఆయన నిర్మొహమాటంగా తనకు నచ్చనివాటిని బల్లగుద్ది చెప్పేస్తాడు. సింగర్ గా అభిజిత్ పాడిన చాలా పాటలు సూపర్ డూపర్ హిట్. కిషోర్ కుమార్ పాడిన పాటలను తిరిగి పాడినప్పుడు.. రిమ్ జిమ్ గిరె సావన్ వంటి పాటలు ఒర్జినల్ ను మించి శ్రవణంగా సాగుతాయి. కానీ, మాటలకొచ్చేసరికి మాత్రం అభిజిత్ నిర్మొహమాటం.. వివాదానికి దారి తీయకతప్పదు.

ఇప్పుడూ అదే జరిగింది. ఇటీవల శుభంకర్ మిశ్రా అనే హోస్ట్ తో ఓ పోడ్ కాస్ట్ రూపొందిస్తున్న తరుణంలో అభిజిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మహాత్మగాంధీతో పాటు… బాలీవుడ్ టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డీ బర్మన్ పైనా ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

మహాత్మాగాంధీ పాకిస్థాన్ జాతిపిత అనేశాడు అభిజిత్. ఆర్డీ బర్మన్ గాంధీ కంటే పెద్ద పితామహుడంటూ వెటకారాన్ని దట్టించాడు.

భారతదేశం ఆల్రెడీ అప్పటికే ఉంది. విభజన జరిగి భారత్ నుంచి పాక్ విడిపోయింది. అందుకు కారకుడు మహాత్మాగాంధీ. కాబట్టి మహాత్మాగాంధీ పాకిస్థాన్ జాతిపిత. ఆయన్ను అనవసరంగా భారత జాతిపిత అని పిలుస్తున్నారు. పాక్ అస్తిత్వానికి కారకుడే మన మహాత్ముడంటూ ఒకింత వెటకారాన్ని దట్టిస్తూ లాజికల్ గా ముడిపెట్టిన అభిజిత్ వాదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆర్డీ బర్మన్ ను ఎందుకన్నాడో తెలీదుగానీ… గాంధీ దేశానికి జాతిపితైతే… బాలీవుడ్ సంగీతానికి గాంధీని మించిన జాతిపితగా ఆర్డీ బర్మన్ ను వ్యంగ్యంగా దెప్పిపొడిచాడు. మరోవైపు, పంచమ్ దాపై తనకెలాంటి కోపం లేదని.. అయితే, తమ ఇద్దరి బంధాన్ని తెగ్గోసెందుకు చాలామంది ప్రయత్నించినట్టు చెప్పుకొచ్చాడు అభిజిత్. ఆ క్రమంలో ఓసారి తాను వెళ్లితే.. అప్పటికే కొంత బప్పీలహరి, లక్ష్మీకాంత్ ప్యారెలాల్ వంటివాళ్లు రంగప్రవేశం చేయడంతో… తానిప్పుడు ఖాళీగా ఉన్నానని తనతో పంచమ్ చెప్పినట్టు పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు అభిజిత్. తన సక్సెస్ కు మందు పార్టీ ఇచ్చి తనను ఆనందపర్చిందీ ఆర్డీ బర్మనేనంటాడు మళ్లీ.

ఇక షారుక్ ఖాన్ తో తన ఫైట్… మొగుడు, పెళ్లాలవంటిదంటాడు. తనతో పాటు, కుమార్ సాను, ఉదిత్ నారాయణ్ కూడా షారుక్ కు ఎన్నో పాటలు పాడారు. మరి అవి గుర్తున్నాయా అని ఎదురు ప్రశ్నిస్తాడు. ఇప్పుడు వస్తున్న షారుక్ పాటలపైనా పెదవి విరిచిన అభిజిత్.. సల్మాన్ ఖాన్ పేరు చెబితేనే అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. డేవిడ్ ధావన్ జుడ్వా సినిమా తీస్తున్నప్పుడు అందులో హీరో గోవిందా అనుకున్నానని.. కానీ, ఆ తర్వాత సల్మాన్ అని తెలిసి అవాక్కయ్యానన్నాడు. ముందు తెలిస్తే పాడే వాడినే కాదన్నాడు. ఇప్పటికీ అతనికో స్థాయి లేదు.. అసలతడి గురించి నేను మాట్లాడ్డమేంటంటూ ఓ పూచికపుల్ల మాదిరి సల్మాన్ నూ తీసిపారేశాడు.

గతంలో ఏ.ఆర్. రెహమాన్ తోనూ విభేదించినట్టు పలు యూట్యూబ్ ఛానల్స్ కు చెప్పుకొచ్చిన ఘటనలున్నాయి. ముంబైలో రికార్డ్ చేయాల్సిన పాటలను మిస్ చేసుకుని వెళ్లితే.. చెన్నైలో ఎంతోసేపు వెయిట్ చేయించి తనతో పాట పాడించాడని.. అది కూడా అదేం పాటో, ఫిమేల్ సింగరెవరో, మ్యూజికేవిధంగా ఉండబోతుందో అస్సలర్థం కాదని.. అలాంటి కంపోజిషన్ తన జీవితంలో ఎప్పుడూ చూళ్లేదంటూ అభిజిత్ మాట్లాడిన ఇంటర్వ్యూసూ ఇప్పటికీ ఉన్నాయి.

ఇవన్నీ చెప్పిన అభిజిత్.. గ్యాంగ్ స్టర్ అబూసలేం నుంచి తాను బెదిరింపులెదుర్కొన్నదీ చెప్పాడు. 60 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన అబూసలేం… లేకపోతే తనకోసం పాడాలని కోరినట్టు వెల్లడించాడు. కుమార్ సాను వంటి ఇతర గాయకుల ఫోన్ నంబర్స్ కావాలని అడిగినట్టు చెప్పుకొచ్చాడు. అప్పటికే అబూసలేం క్రైమ్ రికార్డ్స్ విన్న తనకు ఎంతో భయమేసిందని నర్మగర్భంగా చెప్పిన అభిజిత్.. ఆ సమయంలో తాను వాష్ రూంకు వెళ్లానని… తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ గురించి తెలియని తన భార్య తాను పాడే కూనీరాగాలను విని తనింకెవ్వరినైనా ప్రేమిస్తున్నానా అన్న అనుమానంలో పడిందంటూ ఒకింత ఛమత్కారాన్నీ తన ఇంటర్వ్యూలో యాడ్ చేశాడు.

తౌబా తుమ్హారే ఇషారా, తుమే జో మైనే దేఖా, హమ్ తో దివానే హుయే, జరా సా జూమ్లూమే నారే నారేనా వంటి ఎన్నో హిట్స్ ఇచ్చిన అభిజిత్ కంఠంలో కిషోర్ పాటలు ఇప్పటికీ ఎంత సుమధురమో.. కుండబద్ధలు కొట్టే ఆయన తత్వం.. వెటకారంగా ఆయన విసిరే వ్యంగ్యాస్త్రాలు మాత్రం అంతకన్నా ఘాటు! అందుకే ఇప్పుడు అభిజిత్ భట్టాచార్య తన పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూతో మరోసారి వార్తల్లో వ్యక్తయ్యాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles