హాస్యచిత్రాల పర్యాయపదమై! అమరజీవై!
హరీ.. నీకు కావల్సిన యువతి.. నువ్వు ప్రేమించిన పడతి.. నిన్ను ఆస్తిపరుణ్ని చేయగల కూజంతి.. నిన్ను కోటీశ్వరుణ్ని చేయగల ఇంతి.. నీకు సహధర్మచారిణిగా మెలగవలసిన సుధతి.. నిన్నో మాట అందని.. చిరాకు పడిందని నువ్వు ఆవేశపడి, హైరానాపడి, కోప్పడి వచ్చేస్తావా లోకజ్ఞానరహిత… అది ప్రణయ కలహంరా పిచ్చినాన్న అంటాడు రావుగోపాలరావు. తండ్రి విసిరిన ఆ డైలాగ్ కొడుకు సత్యనారాయణకర్థం కాక.. ప్రాసకెందుకింత కష్టపడుతావో ఆ దేవుడికే తెలియాలంటే.. కౌంటర్ గా నేను సనాసాల చక్రవర్తిని.. భాషా వక్రవర్తినంటాడు రావుగోపాల్ రావు. ప్రాసల్లో రావుగోపాలరావు విలనిజాన్నీ వేటగాడు సినిమాలో చమక్కులుగా మార్చాడు జంధ్యాల.

అసలాడదంటే ఆడించేదనర్థమంటాడు. స్త్రీ క్షణంలో ఏడుస్తుంది.. ఇంకో క్షణంలోనే నవ్వుతుంది… తాను ఏడ్చి మగాణ్ని ఏడిపిస్తుంది… నవ్వీ మగాణ్ని ఏడ్పిస్తుంది… మొత్తంగా స్త్రీ ముల్లైతే.. మగాడు అరటాకు.. కాబట్టి ముల్లు వెళ్లి అరిటాకు మీద పడ్డా… అరిటాకు వచ్చి ముల్లు మీద పడ్డా అరిటాకుకే నష్టమంటూ సంప్రదాయ నానుడిని మగాళ్ల తరపున సానుభూతిగా మల్చాడు. తన కామెడీ కలంతో వివాహభోజనంబేర్పాటు చేశాడు దర్శకుడు జంధ్యాల.
ఇవాళ ఏ సభలోనైనా వేదికనెక్కి ఎవరైనా ముందుగా చెప్పేది సభకు నమస్కారం అని. శంకరాభరణంతో ఈ మాటను జనానికి మరింత చేరువ చేసి… ఇవాళ ప్రతీ వక్తాఆ నమస్కారంతోనే తమ ప్రసంగాలను మొదలుపెట్టేందుకూ కారకుడు జంధ్యాల. ప్రాశ్చాత్య సంగీత పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక్క కాపు కాయడానికి తన చేతులడ్డు పెట్టిన ఆ మహానుభావులెవరో.. వారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానంటూ సినిమా ఆఖరున శంకరశాస్త్రి చెప్పే ఆ శంకరాభరణంలోని విధేయత కల్గిన మాటలపాళీ జంధ్యాలదే. అద్దెబాకీ మాఫీ చేస్తానని శంకుస్థాపన తరహాలో బ్రహ్మానందాన్ని పాతిపెట్టి… విష్ణుమూర్తిలాగా తానిసుకలో పడుకుని.. తానాలోచించిన కథలో ఓ చిన్న లైనినిపిస్తానంటూ సుత్తి వీరభద్రరావు చెప్పే మంగళగిరి తిరునాళ్లలో తప్పిపోయిన గుంటడి స్టోరీ… ఊర్ల పేర్లన్నీ వరుసబెట్టి చదువుతూ ఆతర్వాత మొదలెట్టే హైదరాబాదు, ఆదిలాబాదు, సికిందరాబాద్, అహ్మదాబాదు వంటి సోది పురాణపు సీన్స్ పండించడం కేవలం జంధ్యాలకు మాత్రమే సాధ్యపడిన ప్రత్యేకత. తన కామెడీ సినిమాల్లో నటీనటులందరినీ వాడుకున్న తీరు.. అందులోనూ సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందాలకిచ్చిన ప్రాధాన్యత వారినెప్పటికీ తెలుగు సినీ అభిమానులు గుర్తుంచుకునేలా చేసింది.
అమ్మాయిలు నృత్యానికి అనర్హులని తన శిష్యరికంలో అమ్మాయిని చేరదీసినందుకు వెలివేయబడే ఓ గురువు కథను తీసుకున్నాడు. తన కలం నుంచి అలవోకగా జాలువారిన మాటలతో పాటే… దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి వంటి వారి పాటలతో… రమేష్ నాయుడి మైమరిపించే సంగీతాన… ఆనందభైరవి వంటి ఓ సీరియస్ సామాజిక ఇతివృత్తాన్నీ అద్భుతంగా తెరకెక్కించిన దర్శకరత్నం జంధ్యాల. 1976లో దేవుడి చేసిన బొమ్మలు సినిమాతో మాటల రచయితగా ప్రస్థానాన్ని ప్రారంభించి… ఎన్నో బొమ్మలను వెలికి తీసి… ఇవాళ తెలుగు తెరపై అలరిస్తున్న ఎందరో ప్రతిభావంతమైన నటులకు ఓ రూపమిచ్చిన కామెడీ ప్రతిసృష్ఠి జంధ్యాల.
రెండురెళ్లను ఆరు చేసినా… అక్కినేనంతటివాడిని అమరజీవిగా చూపించినా… చంటబ్బాయితో చిరంజీవిని డిటెక్టివ్ గా మార్చినా… ఓ భారతీయ వనిత, విదేశీయుడి ప్రణయగాధను బాలు స్వరరచనలో పడమటి సంధ్యారాగంలా వినిపించినా… బాబాయ్ హోటల్ కు బ్రహ్మానందాన్ని ఓనర్ ని చేసినా.. ఆహా నా పెళ్లంట అని రాజేంద్రప్రసాద్ కు ఈనాటికీ తను గర్వపడే సినిమానందించినా… నరేష్, ప్రదీప్, పూర్ణిమ, తులసితో నాల్గుస్తంభాలాటాడించినా… వీరవేంకట దుర్గా శివ సుబ్రహ్మణ్యశాస్త్రిగా ఎవరూ అంతగా గుర్తుపట్టని ప్రత్యేకమైన శైలి జంధ్యాలది. ఇంటిపేరునే తన సినీప్రస్థానంగా మార్చుకున్నారు జంధ్యాల. రామానాయుడు సినిమాతో మొదలైన జంధ్యాల పూర్తి పేరేంటని ఎవరైనా అడిగితే… రామానాయుడు సినిమా వరకు జంధ్యాల అని… విశ్వనాథ్ తో, జంధ్యాల విశ్వనాథ్ అని సినిమా బయటా అదే చతుర్లతో తెలుగు సినీరంగాన జంధ్యాల ఓ మరపురాని మనిషి. తన హస్యరస చిత్రాలతో.. తాను తెలుగు తెర నుంచీ… ఏకంగా ఆయనభిమానులందరి నుంచీ విడిచివెళ్లిపోయినా… నాడు నేడు ఏనాడూ జంధ్యాల చిరంజీవే. నవ్వడమొక భోగమని… నవ్వించడం ఒక యోగమని… నవ్వలేకపోవడం ఒక రోగమని నవ్వు నిర్వచనాన్నంతా మూడు ముక్కల్లో చెప్పి, చూపించి వెళ్లిపోయారు జంధ్యాల. ఆయన్నోసారి స్మరించుకుంటూ.. ఈ అక్షర నివాళి!



