నాజీలనే ఎదిరించిన గూఢచారి నూర్: అందుకే, ఫ్రాన్స్ పోస్టల్ స్టాంప్ పై ఆమెకు స్థానం!

చరిత్రలో చాలామందికి పేజీలున్నాయి. జస్ట్ తెలుసుకోవాలంతే. అలా తెలుసుకోదగ్గ మరో పేరు నూర్ ఇనాయత్ ఖాన్. నాజీల దురాక్రమణలో ఫ్రాన్స్ లో రేడియో ఆపరేటర్ గా పనిచేసిన ఇనాయత్ ఖాన్ ఇప్పుడు ఫ్రాన్స్ పోస్టల్ స్టాంపులపైకెక్కింది. అంతటి సత్కారమందుకున్న ఆమె ఆసక్తికర కథేంటి..?

నూర్ ఇనాయత్ ఖాన్ ఓ సూఫీ సంగీతకారుడి కుమార్తె. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలతో విభేదించింది, ప్రతిఘటించింది. అలా వీరనారిగా గుర్తింపు పొందిన ఇనాయత్ ఖాన్ ధైర్యాన్ని గుర్తించిన ఫ్రాన్స్ ప్రభుత్వం ఇప్పుడు అక్కడి పోస్టల్ స్టాంప్ పై ఆమె స్మారక చిహ్నాన్ని ముద్రించింది.

పారిస్ లో పీస్ ఫుల్ గా ఉండే ఓ అపార్ట్ మెంట్ లో ఆమె వేళ్లు వైర్ లెస్ సెట్స్ పై కీస్ సవరిస్తుండేవి. ఆ వైర్ లెస్ మోగినప్పుడల్లా క్లాక్ క్లాక్ అనే శబ్దం.. ఆమె గుండె దడతో పెనవేసుకుని వినిపించేది. వైర్ లెస్ లో ఆమె అందుకునే ప్రతీ సంకేతం ఆమె లైఫ్ లైన్ కు సంబందించిందే. అలా గూఢచారిగా పనిచేసిన ఇనాయత్ ఖాన్ స్టోరీ.. ఒక నవలను తలపిస్తుంది. కానీ, అదంతా వాస్తవంలో ఆమె చూపిన ధైర్యం, రెండో ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా ఆమె చేసిన త్యాగం. అందుకే, దశాబ్దాలు గడిచినా ఫ్రాన్స్ ఆమె స్మృత్యార్థం పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది.

ఫ్రెంచ్ పోస్టల్ సర్వీస్ లా పోస్టే.. జర్మన్ నాజీలకు వ్యతిరేకంగా పోరాడిన త్యాగధనులను తల్చుకుంటూ కొన్ని స్టాంప్సును విడుదల చేసింది. అందులో ఆ గౌరవాన్నందుకున్న ఏకైక భారతీయ మహిళగా నూర్ ఇనాయత్ ఖాన్ ఒకరు.

కళాకారుల కుటుంబంలో జననం – కానీ, అనూహ్యంగా మారిన విధి!

1914లో భారతీయ సూఫీ సంగీతజ్ఞుడు ఇనాయత్ ఖాన్, అమెరికన్ తల్లి అమీనా బేగంకు జన్మించింది. ఇనాయత్ ఖాన్. మైసూర్ పాలకుడైన 18వ శతాబ్దపు టిప్పు సుల్తాన్ వంశస్థుడు.నూర్ జీవితమంతా లండన్, ప్యారిస్ లోనే పెరిగింది. కవిత్వం, సంగీతం, సూఫీ తత్వంతో నిండిన చిన్ననాటి జీవితానికి ఏమాత్రం సంబంధం లేని పూర్తి భిన్నమైన జీవితాన్ని రెండో ప్రపంచ యుద్ధకాలంలో అనుభవించాల్సి వచ్చింది నూర్.

నాజీలు ఫ్రాన్స్ ను ఆక్రమించినప్పుడు నూర్ తన కుటుంబంతో సహా బ్రిటన్ కు తరలివెళ్లింది. అక్కడ ఉమెన్స్ యాక్సిలరీ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగంలో చేరింది. అదే ఆమెను ఆ తర్వాత గూఢచారిగా మార్చింది. 1943, ఫిబ్రవరి 8న ఆమెకు అప్పటికీ యుద్ధానుభవాలు లేనప్పటికీ బ్రిటన్ స్పై విభాగం ఆమెను స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (SOE)గా నియమించింది.

ఆక్రమిత ప్యారిస్ లో గూఢచారిగా పాత్ర పోషించడమే ఆమె విధి. ఎప్పటికప్పుడు రహస్య సమాచారాలను ఛేదించి స్పెషల్ ఆపరేషన్స్ బృందానికి.. రేడియో ఆపరేటర్ గా సమాచారాన్నందించడం నూర్ ఇనాయత్ ఖాన్ పని. అలా 1943లో బ్రిటన్ నుంచి నాజీల ఆక్రమిత భూభాగానికి వెళ్లిన తొలి సాహన మహిళా రేడియో ఆపరేటర్ గా నూర్ పేరు నిల్చిపోయింది. ఆమెపై పెట్టిన బరువైన బాధ్యతను అంతే సమర్థవంతంగా చేసి.. హైరార్కీ మెప్పు పొందింది.

మరణానికీ వెరవని ధైర్యం నూర్!

కొన్ని వారాలపాటు శత్రువుల రహస్యాలను ఛేదించి తన టీంకు సమాచారం అందించిన నూర్.. ఎట్టకేలకు నాజీల చేతికి చిక్కింది. నాజీలు ఆమెపై విశ్వాసఘాతకురాలిగా ముద్ర వేశారు. అయితే, ఎంత విచారించినా, ఎన్ని చిత్రహింసలు పెట్టినా, ఎన్ని బెదిరింపులెదురైనా అన్నింటినీ భరించిందేగానీ.. నూర్ ఇనాయత్ ఖాన్ ఏ ఒక్క సమాచారమూ నాడు వెల్లడించలేదు. చివరకు ఆమెను దాచౌ కాన్సంట్రేషన్ క్యాంపుకు తరలించారు. 1944, సెప్టెంబర్ 13వ తేదీన నూర్ తన 30 ఏళ్ల వయస్సులో మరణశిక్షకు గురైంది.

చనిపోయే ముందు ఆమె చివరి మాటనడిగితే… నీడ్ లిబర్టీ అంటూ ఆమె అరిచిన అరుపులు కూడా నాజీలతో ప్రతిఘటించాయి.

మరణానంతరం ఓ జ్ఞాపకంగా తల్చుకున్న బ్రిటన్!

నూర్ ఇనాయత్ ఖాన్ మరణానంతరం ఆమెకు బ్రిటన్ అత్యున్నత గౌరవమైన జార్జ్ క్రాస్, ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారమైన క్రోయ్స్ డె గేర్, ఫ్రెంచ్ రెసిస్టెన్స్ మెడల్ వంటివెన్నో దక్కాయి.

2014లోనే బ్రిటన్ ఆమె స్మారక స్టాంపును విడుదల చేసింది. అయితే, 2025లో ఫ్రాన్స్ ఆమెను వరల్డ్ వార్ 2లో పాల్గొన్న యూనిఫామ్ లోని ఫోటోతో కొత్త స్టాంపును ఆవిష్కరించింది.

ఎందుకు ఇప్పటికీ నూర్ కు ఆ గుర్తింపు..?

నూర్ ఇనాయత్ ఖాన్ కథ కేవలం గూఢచర్యానికో, యుద్ధ వీరత్వానికో సంబంధించింది మాత్రమే కాదు. స్వేచ్ఛ కోసం ఆమె చేసిన పోరాటంగా చూడాల్సింది. ఆమె కాదనుకుంటే వెనక్కి వెళ్లే అవకాశమూ ఉన్నప్పటికీ ఆమె చేసిన సాహసం, ధైర్యంతో వేసిన అడుగులు, స్వేచ్ఛ కోసం చేసిన త్యాగంతో పాటు… 1940ల కాలంలోనే ఓ భారతీయ మూలాలున్న యువతి సామాజిక అంచనాల్ని బ్రేక్ చేసి పోరాటానికి పరుగుపెట్టిన తెగువ.. ఇవన్నీ నూర్ ను ప్రత్యేకంగా నిలబెట్టేవి.

2025లో ఫ్రాన్స్ విడుదల చేసిన నూర్ స్టాంప్ కేవలం ఓ గూఢచారిని సత్కరించడం మాత్రమే కాదు.. ఓ మహిళా ధైర్యానికి ప్రతీక.

పిల్లల కథలు రాయడం, వీణ వాయించడం, కైండ్ హార్టెడ్ గా ఉండటం వంటివెన్నో నూర్ ప్రత్యేకతలుగా ఉండేవట. అలాంటి సున్నితత్వంలో పెరిగిన ఓ యువతి.. ఆ తర్వాత హిట్లర్ వంటి నాజీలనే ఎదుర్కొనే యుద్ధంలో గూఢచారిగా పనిచేయడమంటే అస్సలేమాత్రం ఊహించలేని భిన్నమైన జీవితకథ నూర్ ఇనాయత్ ఖాన్ ది. అందుకే, ఓ చిన్న పోస్టల్ స్టాంప్ రూపంలోనైనా.. ఇప్పుడామె ప్రపంచం దృష్టినాకర్షించి మళ్లీ చర్చనీయాంశమైంది. భయంకర యుద్ధకాలపు సైనికురాలిగానే కాదు.. నైతిక ధైర్యానికి కేరాఫ్ గా ఆమెకంటూ ఓ అధ్యాయన్నే సృష్టించుకుంది నూర్ ఇనాయత్ ఖాన్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles