ఐదుగురు ముఖ్యమంత్రులతో సినిమాలు నిర్మించిన చరిత్ర.. ఆ సంస్థ ప్రత్యేకత!

AVM మూడక్షరాలు మాత్రమే కాదు… ఐదు దశాబ్దాల చరిత్ర!

సినిమా గురించి కాస్తో కూస్తో తెలిసున్నవారందరూ తప్పకుండా విని ఉండే పేరు AVM. అటు తమిళనాట.. ఇటు తెలుగు, మరోవైపు కన్నడ, ఇంకోవైపు హిందీ.. ఇలా పలు భాషల్లో సినిమాలను డబ్ చేయడంతో పాటు.. బ్లాక్ అండ్ వైట్ నుంచి నేటి బ్లాక్ బస్టర్ల వరకూ ఎన్నో సినిమాలను నిర్మించిన ఘన చరిత్ర AVM సంస్థది. అందుకే ఓసారి ఏవీఎం.. దాని వెనుకనున్న ఏ. వి. మేయప్పన్.. నిన్నటివరకూ తండ్రి తనపై పెట్టిన బాధ్యతలను చూసిన శరవణన్ గురించి కాస్త తెలుసుకుందాం

మద్రాస్ లోని వడపళని రోడ్డులో వెళ్లుతుంటే… సినిమా ప్రియులను ఇట్టే ఆకట్టుకునే స్టూడియో AVM. సరిగ్గా 5 దశాబ్దాల కాలంగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో తనదైన ప్రత్యేక పాత్ర పోషించింది AVM. బతుకు కోసం తన పుట్టినిల్లైన కరైకూడి నుంచి మద్రాస్ వచ్చిన మేయప్పన్.. సరస్వతీ గ్రామఫోన్ రికార్డ్స్ స్టోర్స్ పెట్టాడు. ఆ తర్వాత మైథాలజికల్ డ్రామాలు ప్రదర్శించాడు. ఆ డ్రామా అనుభవాల్ని థియేటరికల్ గా మార్చి.. సినిమా రంగానికి విస్తరించిన మేయిప్పన్ కృషే ఏవీఎం సంస్థ. సినిమాలను నిర్మిస్తూనే.. దర్శకత్వమూ వహించిన మేయప్పన్ సక్సెస్ కు చిరునామా AVM సంస్థ.

ఐదుగురు ముఖ్యమంత్రులతో సినిమాలు తీసిన చరిత్ర AVM సంస్థది. 1945 నవంబర్ 14న ఏవీఎంను నెలకొల్పిన మేయప్పన్.. దక్షిణ సినిమా చరిత్రలో ఓ పయనీర్ గా నిల్చాడు. ఆ తర్వాత ఆయన కొడుకు శరవణన్ సారథ్యంలో ఇంతకాలం AVM సంస్థ.. సినిమాలను నిర్మించింది. అన్నాదురై, ఎంజీఆర్, కరుణానిధి, ఎన్టీఆర్, జయలలిత వంటి మాజీ ముఖ్యమంత్రులంతా AVM సంస్థతో పనిచేసినవారే. హరిశ్చంద్ర అనే తమిళ సినిమాను కన్నడంలోకి మొట్టమొదట డబ్ చేసి… దేశంలో డబ్బింగ్ సినిమాలకు శ్రీకారం చుట్టిందీ AVM సంస్థనే. కేవలం సినిమా నిర్మాణంలోనే పయనీర్ గా నిలవడం కాదు… మేయప్పన్ వ్యక్తిత్వమే ఆయన్ను ఇవాళ్టికీ సినీఇండస్ట్రీ ఉన్నంతకాలం తల్చుకునేలా చేసింది. సినిమా కోసం పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం సైకిళ్లు పంచడం, వారుండేందుకు ఉచితంగా ఇంటి సౌకర్యం కల్పించడంతో పాటు… సినీ కార్మికుల పిల్లల చదువులకు స్కూల్స్, వైద్యానికి ఆసుపత్రులు వంటివెన్నో ఏర్పాటు చేసి.. తనవంతు సాయాన్నందించిన వితరణశీలి మేయప్పన్. అదే బాటలో కుమారుడు శరవణన్ కూడా పయనించి తండ్రి పేరు ప్రతిష్ఠలను నిలబెట్టాడు.

నాటి అన్నాదురై కాలం నుంచి నేటి కమలహాసన్ వరకూ ఎందరికో మార్గదర్శి మేయప్పన్. సంసారం ఒక చదరంగం చూసినా… పున్నమినాగు పోస్టర్ కంటపడ్డా… పూజ సినిమాలోని పాటల కోసం అర్రులు చాచినా… 1958లో వచ్చిన భూకైలాస్ నుంచి 1967లో వచ్చిన భక్త ప్రహ్లాద వరకూ సినిమాకు ముందు థియేటర్ లో ఆ AVM ఎంబ్లమ్ చూస్తేనే ఓ అనుభూతి. అందుకే AVM అంటే కేవలం మూడక్షరాలుగా మాత్రమే కాకుండా… ఐదు దశాబ్దాల కృషిగా ఇవాళ మనం చెప్పుకుంటున్నాం

మేయిప్పన్ తర్వాత తండ్రి తనపై పెట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన శరవణన్ కూడా మృతి చెందడం ఇప్పుడు ఏవీఎంకే కాదు.. సినిమా ఇండస్ట్రీకే ఓ తీరని లోటు.

85 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన శరవణన్ కూడా రజనీ, కమల్ వంటి నేటి సూపర్ స్టార్స్ ఎందరికో మార్గదర్శి. తండ్రి తర్వాత 1970లో శరవణన్ ఏవీఎం బాధ్యతలను స్వీకరించారు. ఆయన కుమారుడు ఎం.ఎస్. గుహన్ కూడా నిర్మాతే. శరవణన్ రజనీతో నిర్మించిన 9 చిత్రాలు వరుస హిట్స్. మధ్యలో ఏవీఎం సినిమాలు ఫ్లాఫ్స్ అయ్యాయి. అయితే, సినిమాలు నిర్మించకున్నా పర్లేదుగానీ.. స్టూడియోను మాత్రం కాపాడాలన్న తండ్రి మాటకు కట్టుబడి మధ్యలో కొంతకాలం చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు శరవణన్. ఇప్పుడు ఏవీఎంలో ఓ అంతస్తు మొత్తం పాత సినిమాల్లో ఉపయోగించిన వస్తువులతో ఒక వింటేజ్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. శరవణన్ సోదరులైన కుమరన్, బాలసుబ్రహ్మణ్యన్ కూడా సినీ నిర్మాతలే. అన్నతో కలిసి వారు సినిమాలు నిర్మించారు. తమిళనాడు సర్కార్ నుంచి కలైలామణి, పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి శిఖరం వంటి సత్కారాలనందుకున్నారు శరవణన్. తండ్రి తన భుజాలపై పెట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి వెళ్లిపోయిన శరవణన్ లేని లోటు ఏవీఎంకే కాదు.. యావత్ సినీ ఇండస్ట్రీకి, ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమకు ఓ పెద్ద లోటు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe

Latest Articles