ఒక చిన్న పట్టణంలో వరద వస్తే.. దాన్ని దారి మళ్లించడం గగన గండం. ఇక వాటి నష్టాలంటారా.. ప్రతీ ఏటా వర్షాకాలాల్లో చూసేదే. మన హైదరాబాద్ పరిస్థితైతే చెప్పనక్కర్లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. నియంత్రించలేని ట్రాఫిక్ కు తోడు.. ఇక వానలు పడితే అంతే సంగతి. వాటికి పక్కా ప్రణాళికలూ ఉండవు.. నాళాలు, చెరువులు, సరస్సులకు సంబంధించిన భూకబ్జాలూ ఆగవు.. వెరసి వరద నివారణ.. వాటర్ మేనేజ్ మెంట్ లో మనమెక్కడున్నాం..?

కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో జరిగిన తంతు.. ప్రాజెక్టుల్లో పిల్లర్స్ కుంగిపోవడం.. గేట్స్ ఎత్తే క్రమంలో బొరియలేర్పడటం వంటి వార్తలు వింటున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. ఈ క్రమంలో భౌగోళికంగానే ప్రమాదపుటంచుల్లో ఉండే నెదర్లాండ్స్ గురించి మనం ఓసారి తెలుసుకోవాలి.
నెదర్లాండ్స్ అంటే వాళ్ల డచ్ భాషలో లోతట్టు ప్రాంతమని అర్థమట. పైన ఆకాశం.. కింద నీరు.. ఎటు చూసినా నీలిదృశ్యమే. ఆమ్ స్టర్ డామ్, రోటర్ డామ్, హేగ్.. ఏ నగరానికైనా వెళ్లండి.. నగరాల మధ్య నుంచి ప్రవహించే నదులు, కాలువలే దర్శనమిస్తాయి. అందుకే ల్యాండ్ ఆఫ్ వాటర్ వేస్ అన్న పేరును సంపాదించుకుంది నెదర్లాండ్స్. శతాబ్దాల కాలంగా ఇక్కడ వరదలు జనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అదే సమయంలో మట్టితోనే పెద్ద పెద్ద కరకట్టలు కట్టి ఇక్కడి జనం తీసుకున్న జాగ్రత్తలూ అభినందనీయమైనవి.
1953 తుపానైనా, 1995లో వచ్చిన పెను తుపానైనా.. వేల సంఖ్యలో ఇక్కడి జనాల్ని పొట్టనబెట్టుకున్నాయి. కానీ, ఇక్కడి జనం ఎక్కడికో వలసల పేరిట పారిపోలేదు. రెట్టించిన ఉత్సాహంతో కొత్త కరకట్టలు కట్టారు. మడులు, మడులుగా తీరప్రాంతాల్ని పునరుద్ధరించారు. పోల్డర్స్ అని పిల్చుకునే ఈ మడులు నీటిమీద తేలియాడుతున్న ఆకుపచ్చ తివాచీల్లో కనిపిస్తుంటాయి. ఇక్కడి తడిని గాలిమరలతో ఆరబెట్టుకోవడం విశేష దృశ్యం. గాలిమరల అరేంజ్ మెంటే లేకపోతే ఈ దేశం మొత్తం ఓ బురదనేలే. పెరుగుతున్న సముద్రమట్టంతో 2050 నాటికి ఈ దేశంలో 600కు పైగా లోతట్టు ప్రాంతాలుగా తయారు కాబోతున్నాయని.. 80 కోట్ల మంది వరకూ బాధితులు కానున్నారనీ ఐక్యరాజ్యసమితి వేసిన ఓ అంచనా. అదే జరిగితే నెదర్లాండ్స్ స్వరూపమే కనిపించకుండా పోయే ప్రమాదమూ పొంచి ఉంది.

ఈ పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన ఇక్కడి ప్రభుత్వం.. మల్టీ లేయర్ విధానాల్లో ఇక్కడ వరదల నిర్వహణపై వివిధ తాగు, సాగునీటి పథకాలను డిజైన్ చేసింది. ఫలితంగా ఇప్పుడు ప్రపంచానికే నెదర్లాండ్స్ వరద నిర్వహణ సాంకేతికతలో ఓ మాడల్. సముద్రతీర ప్రాంతాన్ని సుదీర్ఘంగా కల్గి ఉన్న ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో పాటు… అమెరికా, ఆసియా, ఆఫ్రికా వంటివన్నీ ఇప్పుడు నెదర్లాండ్స్ పద్ధతులనే అవలంబిస్తున్నాయి. దుబాయ్ లో ఏర్పాటు చేసిన కృత్రిమదీవులకూ.. డచ్ సాంకేతికతే స్ఫూర్తి.
ఏదో ఒక్క కంపెనీకే అన్నీ అప్పగించే పద్ధతులిక్కడ కనిపించవు. అనుకోని ఉత్పాతం జరిగితే దానికి ఆ కంపెనీని బాధ్యులను చేసే పరిణామాలూ ఇక్కడ కనిపించవు. అంతా ముందు జాగ్రత్త, అప్రమత్తంగా జరుగుతుంది ఇక్కడి సాగునీటి విధానంలో డిజైనింగ్స్ కు సంబంధించిన వ్యవహారం. రెండు వేలకు పైగా కంపెనీలు ఇక్కడ సాగునీటి రంగంలో వివిధ రకాల ప్రాజెక్టుల నిర్వహణకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటే.. వీటిల్లో లక్షకు పైగా ఉద్యోగులున్నారంటేనే.. నెదర్లాండ్స్ లో తాగు, సాగునీటి ప్రాజెక్టులు, వరద, విపత్తుల నిర్వహణకు ఎంత జాగ్రత్త పడుతారో అర్థం చేసుకోవచ్చు. సముద్రపు నీటిని భూభాగంలోకి రాకుండా జాగ్రత్త పడటంతో పాటు.. నదుల కింది డెల్టాలోని బురదనేలల్ని వినియోగంలోకి తెచ్చుకోవడమూ ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది.
1995 వరదలు.. నెదర్లాండ్స్ కు పెద్ద దెబ్బ. ఇదే వీరిలో కొత్త ఆలోచనలకు బీజం వేసింది. డెల్టా ప్లాన్ పేరుతో నీటి నిర్వహణ కోసం ఓ నివేదికను తయారు చేసుకుని ముందడుగేసింది ఇక్కడి ప్రభుత్వం. గత అనుభవాలు.. ఒకవేళ భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలన్నింటినీ పక్కా లెక్కలతో వేసుకుని పకడ్బందీ ప్రణాళికలతో ఇక్కడి వాటర్ మేనేజ్ మెంట్ జరుగుతుండటం.. సాంకేతికతలో మేమింత గొప్ప అని చెప్పుకునే దేశాలనే అబ్బురపరుస్తోంది. ఎందుకంటే 190 ఏళ్ల ఓ సుదీర్ఘ ప్రణాళిక అంటే.. సుమారు రెండు శతాబ్దాల డెల్టా ప్లాన్ ను రూపొందించింది ఈ దేశం. నదులు సముద్రంలో కలిసే చోట్లలో బాగా దృష్టి పెట్టి తీరప్రాంతాన్ని కుదించేలా ఆనకట్టలు, గోడలను నిర్మించడం ఇక్కడి విశేషం. అంతేకాదు నదుల పూడకతీత, లోతు కోసం వీరి వద్దనున్న టెక్నాలజీ కూడా ప్రత్యేకత సంతరించుకుంది. అందుకే ఆధునిక ప్రపంచపు ఏడు అద్భుతాల్లో ఒకటిగా ఇక్కడి నీటి నిర్వహణ సాంకేతికతను.. అమెరికన్ సివిల్ ఇంజనీర్స్ సొసైటి కొనియాడింది.
ఒక నదికి వచ్చే వరద ఉధృతితో ఒత్తిడి పడకుండా.. మరోవైపు ఆ నీరంతా సముద్రమయం కాకుండా వినియోగించుకునే విధంగా.. వివిధ మార్గాల్లో వరద కాలువలు, వాటిని అనుసంధానిస్తూ కృత్రిమ సరస్సుల ఏర్పాటు చేశారిక్కడ. ఈ కాలువలు కూడా వీలైనంత లోతుగా.. నగరాల్లోని భూమి కోతకు గురి కాకుండా.. మరోవైపు ఒత్తిడిని తగ్గించే పంప్ హౌసెస్ నిర్మాణాలు చేపట్టారు. కాలువల పక్కన వనసంపద ఓ చూడముచ్చటలా కనిపిస్తుంది. అంతేకాదు, రూమ్ ఫర్ రివర్ ప్రాజెక్ట్ పేరుతో నదులనానుకుని ఉన్న ఇళ్లల్లోని జనాన్ని ఖాళీ చేయించి.. వారికి మరోచోట పునారావసం కల్పించారు. కాలువలు తవ్వగా వెళ్లిన మట్టిని పెద్దపెద్ద కుప్పలుగా.. కొండల మాదిరి పేర్చి.. వరదలు వచ్చినా తట్టుకునేలా ఎత్తైన ప్రాంతాల్లో నిర్వాసితులకు ఇళ్లు కట్టించారు. ఇలాంటి ఎన్నో ప్రణాళికల రచనతో.. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఇప్పుడు ప్రపంచంలోనే రెండోస్థానంలో నిల్చింది ఈ చిన్న నెదర్లాండ్స్ అనే కంట్రీ. వరదలు, నీటి నిర్వహణకు కేవలం రిజర్వాయర్ల నిర్మాణం మాత్రమే మార్గమన్నట్టుగా వ్యవహరించే దేశాలకు.. నెదర్లాండ్స్ సాగునీటి విధానాల, పథకాల రూపకల్పన ఓ రోల్ మాడల్. చైనా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలతో పాటు.. మనదేశంలోని కేరళలోనూ ఇప్పుడు నెదర్లాండ్స్ నమూనా పథకాల కోసం కసరత్తు జరుగుతోంది.
స్యాండ్ మెటార్ ప్రయోగమూ ఓ వినూత్న ఆలోచనే!
సుమారు పన్నెండు, పదముడేళ్ల క్రితమే స్యాండ్ మోటార్ అనే మరో క్రియేటివ్ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసింది నెదర్లాండ్స్ గవర్నమెంట్. తీరప్రాంతాలకు దరిలో ఉన్న నగరాలు, పట్టణాలను కాపాడుకునేందుకు టన్నుల కొద్దీ ఇసుకను తీసుకొచ్చి సముద్రంలో పోసి.. ఓ కృత్రిమ ద్వీపకల్పాన్నే సృష్టించారు వారు. సముద్రగాలులకు ఇసుకంతా విస్తరించి.. తీరప్రాంతం పరిమాణం పెరుగుతుంది. తద్వారా నగరాలు, పట్టణాలు, ఇతర ప్రాంతాలకు ముంపు హాని తగ్గుతుంది. శాండ్ మోటార్ ప్రయోగంతో.. తీరప్రాంతం విస్తరించి హాని తగ్గడంతో పాటు.. ఆ ప్రాంతం బీచులకు అనుకూలంగా.. చిన్న చిన్న సరస్సులతో.. వివిధ రకాల పక్షులు, జంతువులు, చెట్లతో బయోడైవర్సిటీకి కేరాఫ్ గా కూడా మారడం ఇక్కడి సక్సెస్ స్టోరీలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో విశేషం.
తీరప్రాంతం కోతతో నేల దొరకడమే కష్టంగా మారుతున్న పరిస్థితుల్లో.. ఆ ప్రభావానికనుగుణంగా వీరి జీవన విధానాల్నీ మార్చుకున్నారు. వెనిస్ నగరం తరహాలోనే పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం పడకుండానే.. నీటిలో తేలియాడే ఇళ్లను నిర్మించుకున్నారు. విద్యుత్ఛక్తి కోసం సోలార్ ప్యానెల్స్, హీట్ పంప్స్, వాటర్ రీసైక్లింగ్ సిస్టమ్స్ ఇక్కడి నీటిపై ఇళ్లల్లో సౌకర్యాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి. అంతేకాదు, పట్టణాలు, పల్లెల్లోనూ నిర్మించిన ఇళ్లు వరదలు బాగా వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా.. వరదననుసరించి పైకి లేచే విధమైన టెక్నాలజీ ఇక్కడి నదులపై తేలియాడే ఇళ్ల సొంతం. ఐదు నదుల మధ్య ఉన్న డాడ్రెక్ట్ నగరాన్ని వాటర్ సిటీ అని, ఐలాండ్ సిటీ అని కూడా పిలుస్తుంటారు.

వాటర్ స్క్వేర్స్ ప్రత్యేకతేంటంటే..?
మన నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో ఎక్కడైనా వరదలు వస్తే ఊళ్లోని డ్రైనేజీలే దిక్కు. కానీ, నెదర్లాండ్స్ లో వాన నీటికోసం ప్రత్యేక కాలువలను తవ్వించారు. పైగా నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని కూడళ్లను లోతుగా తవ్వి.. పైన కూడలి.. లోపలికి యాంపీ థియేటర్స్ మాదిరిగా మెట్లు కట్టి పిల్లలు ఆ కూడళ్ల కింద ఆడుకునే విధంగా ఏర్పాట్లుంటాయి. వర్షాకాలంలో ఆ కూడళ్లల్లో కింద ఏర్పాటు చేసిన లోయలాంటి ప్రాంతంలోకి నీళ్లు వెళ్లి కొలనుల్లా మారతాయి. సహజ సిద్ధంగానే నీళ్లు ఇంకిపోయే విధంగా, అలాగే నీరు ఎక్కువ ఉన్న చోట్ల నుంచి పైపుల ద్వారా పట్టణాల శివార్లలోని సరస్సులు, చెరువులకు మళ్లించే విధమైన పైప్ లైన్స్ ఏర్పాట్లుంటాయి.
నీటితో పోరాటం చేయాల్సిన నెదర్లాండ్స్ వంటి చోట్ల సహజీవనం చేస్తుంటే… నీటిని ఎలా ఒడిసిపట్టుకోవాలో తెలియని రీతిలో ఇంకా నెదర్లాండ్స్ వంటివాటిని చూస్తూ పోరాటాలు చేస్తోంది మిగతా ప్రపంచం. అంతెందుకు… ఆసియాలోనే అతిపెద్దదిగా చెప్పబడ్డ మన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇవాళ బొరియలేర్పడితే… బుంగలు పడితే… ఏంచేయాలో తెలియని పరిస్థితుల్లో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అసలు ఒక బ్యారేజీని 16 టీఎంసీలకు డిజైనా చేయొచ్చా అనేదీ ఇప్పటికీ చర్చ జరగుతూనే ఉంది. ఈ క్రమంలో.. వాటర్ మేనేజ్ మెంట్ పాఠాలకు కేరాఫ్ అడ్రస్ గా అమ్ స్టర్ డామ్ నిలవడమంటే.. నీటి నిర్వహణలో ఆ దేశం మిగతా ప్రపంచం ముందు గర్వంగా తలెత్తుకుని కాలరెగురేయడమే మరి!



