కళ తప్ప.. కామర్స్ ఎరుగని కుంచె అది! మరి చివరకు మిగిలింది..?

పాయింట్ బ్రష్ తో నిబ్‌తో చిక్కని సన్నని గడ్డిపోచల్లాంటి రేఖలతో చెక్కుచెదరని ఎనాటమీతో అపూర్వమైన బొమ్మలతో తెలుగు వీక్లీ జర్నలిజంలో బాపు గారు వీరవిహారం చేస్తున్న కాలం. నవలా సామ్రాజ్యాన్ని కూడా పట్టించుకునే ఆర్టిస్టులు లేక ఆయనే విలీనం చేసుకొని దూసుకుపోతున్నారు. మనుషుల అనుభూతులను, సమాజాన్ని చదివి కుంచెతో ఆయన చేస్తున్న రేఖావిన్యాసంతో పోటీ పడలేక కొందరు జూనియర్‌ ఆర్టిస్టులు చేతులెత్తేశారు.


అలాంటి కాలంలో ఏలూరు నుండి బస్సులో బయలు దేరి బెజవాడ ఏలూరు రోడ్డులో దిగాడు ఒక కుర్ర ఆర్టిస్టు. పొడుగు చేతుల చొక్కాను పైకి మడిచి, నల్లని రింగుల జుట్టును వెనక్కి సర్దుకొని, చూపుడు వేలుతో మీసాలను గోక్కుంటూ ఎదురుగా ఉన్న కిళ్లీ షాపులో ఓ సిగరెట్‌ తీసుకొని వెలిగించి ఒక దమ్ము పీల్చి… ఆ షాపు ముందు వేలాడుతున్న పత్రికల కవర్‌మీద పెద్ద కనులు, సన్నని నడుముతో రంగవల్లులు అద్దుతున్న బాపు బొమ్మకు నమస్కరించాడు. అదే రోడ్‌లో ఉన్న వామపక్ష పత్రికాఫీసు వైపు బయలు దేరాడు.


కమ్యూనిస్టు కుటుంబం నుండి రావడం వల్ల ఆ పత్రికలో అతడికి ఆర్టిస్టు కొలువు దొరికింది . తెలుగు రీడర్‌కి కొత్త గీతను చూపించాలి. బాపు కంటే భిన్నంగా గీయాలి, ఆ బొమ్మలు చూసి మద్రాసు నుండి బాపు పరుగున వచ్చి తనకు కరచాలనం చేయాలి అనే లక్ష్యంతో పని మొదలు పెట్టాడు. బాపును జయించడం ఎలా? అని తపస్సు మొదలు పెట్టాడు.


మ్యాడ్‌ మ్యాగజైన్‌ నుండి జాక్‌ డెవిస్‌ ప్రత్యక్షమయ్యాడు. ‘‘ నేనేమైనా పనికొస్తానా గురూ? ’’ అని అడిగాడు. నీ చేతివేళ్లు… గుండ్రటి కళ్లల్లో ఎక్స్‌ప్రెషన్‌ బాగుందబ్బా… నీకు తలపాగా చుట్టి పంచ కడితే తెలుగోడిగా బాగుంటావ్‌ అనుకున్నాడు మన ఏలూరు ఆర్టిస్టు. ఇక వెనక్కి తిరిగి చూసుకొనే టైమ్‌ కూడా లేకుండా పనిచేస్తున్నాడు.


‘‘నీ గీతల్లో ఏదో మ్యాజిక్‌ ఉందిరా అబ్బాయి. కొత్త డైలీ మొదలెడుతున్నాం వచ్చి కార్టూనిస్టుగా చేరిపో ! ’’ అన్నాడు ప్రఖ్యాత ఎడిటర్‌ ఏబీకే. అలా హైదరాబాద్ ‘‘ఉదయం’’ లో చేరాడు మోహన్. ‘‘ఏమండోయ్‌ రీడర్‌ గారు, లేవండోయ్‌ తెల్లారింది…’’ అంటూ సైకిల్‌ మీద వచ్చి పేపర్‌ విసురుతున్న పేపర్‌ బాయ్‌ కార్టూన్‌తో తొలి ఉదయం పత్రిక వెలువడింది. పత్రికా ఓనర్‌ దాసరిని పేపర్‌ బాయ్‌గా గీయడంతో దాసరి విరగబడి నవ్వి ఆనందంతో ఏలూరు ఆర్టిస్టుని కౌగలించుకున్నాడు. అప్పుడు సీఎంగా ఉన్న ఎన్టీఆర్‌ ‘ఉదయం’లో ముద్దుగా బొద్దుగా ఉన్న తన క్యారికేచర్‌లను చూసి మురిసిపోయేవాడు. జర్నలిజంలో ఎంత సంచలనం సృష్టించిందో ఆ పత్రిక అందరికీ తెలుసు.

అలా తెలుగు కార్టూన్‌ కళారంగంలో కొత్త ఎపిసోడ్‌ మొదలైంది. కార్టూన్లు, బొమ్మలు, క్యాలెండర్‌ పెయింటింగ్స్‌, కవర్‌ పేజీలు, యానిమేషన్‌లు ఏది కావాలన్నా నిమిషాల్లో క్రియేట్‌ చేసే ఇప్పటి ఛాట్‌ జీపీటీకి తాతలా తయారయ్యాడు మన హీరో. కవులు, రచయితల నుండి కార్పొరేట్‌ కంపెనీల వరకు బొమ్మల కోసం ఆయన ఫ్లాట్‌ ముందు పడిగాపులు పడటం నేను చూశాను. యానిమేషన్‌ కోసం పెద్ద కంపెనీలు ఆయన వెంట పడటం నాకు తెలుసు.


అయితే కళా ప్రపంచాన్ని శాసిస్తూ, ఊపేస్తున్న ఈ చిత్రకారుడికి తన ఆర్ట్‌ విలువ అస్సలు తెలీదు. ఎవడు అడిగితే వాడికి గీసి ఇవ్వడానికే తాను పుట్టాను అనుకున్నాడు తప్ప తన శ్రమకు ఇంత ఇవ్వండి అని అడగడం ఏమాత్రం తెలీదు. ఎవరు ఎంత ఇస్తున్నారో అవి ఎలా ఖర్చు అవుతున్నాయో కూడా చూసుకోలేదు.
కళ తప్ప కామర్స్‌ తెలీని ఆ మహా కళాకారుడు. తన విలువైన కళను కృతజ్ణత లేని సమాజానికి ధార పోసి, పైసా మిగుల్చుకోకుండా చివరి రోజుల్లో అప్పులు చేసి బతుకుతూ ఖాళీ జేబులతో వెళ్లిపోయాడు
.

ఇపుడు చెప్పండి ఫ్రెండ్స్‌ ?

రాత్రింబవళ్లు శ్రమించి కొన్ని తరాలకు సరిపడా విలువైన ట్యూన్స్‌ సృష్టించిన ఇళయరాజా తన సంగీతానికి రాయల్టీ అడగడం తప్ఫా…?

శ్యాంమోహన్, సీనియర్ జర్నలిస్ట్.. ✍🏻


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles