నేనే దేవుణ్ని అనుకున్నోళ్లను.. నేలకేసి కొట్టారు!

వాపును చూసి బలుపనుకుంటే పొరబడ్డట్టే: అది పీకే అయినా, ఉమాభారతైనా గుణపాఠం తప్పదు!

భ్రమల చుట్టూ పరిభ్రమిస్తే ఏం జరుతుంది..? కలల్లో అందంగా కనిపించినవి.. కల చెదిరాక నిజాలు కావని తేలిపోతాయి. ఆ తర్వాత బాధ పడాల్సి వస్తుంది. అంతకుముందు అంతా తామే అన్నట్టుగా వ్యవహరించినవారిని లోకం టార్గెట్ చేస్తుంది. అలాంటి కథలు రాజకీయాల్లో బోలెడన్ని. తాజాగా బీహార్ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ గురించీ అలాంటి చర్చే జరుగుతోంది. ఒక్క పీకేనేనా… ? ఉమాభారతి నుంచి అమరీందర్ సింగ్ వరకూ నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో!

అంతా నేనే అనేది ఓ సిండ్రోమ్!

నాల్గు చప్పట్లు పడ్డంత మాత్రాన… కొన్ని వ్యూహాలు పారినంత మాత్రాన… అవే శాశ్వతమనే భ్రమలో ఉండిపోయే కొందరు తమకు తామే దైవాంశ సంభూతులుగా ఫీలవుతారు. జరగరాని పరిణామాలు జరిగినప్పుడు వారు ముప్పేట ఎలా దాడినెదుర్కొంటారో, ఒక్కసారిగా వారి ఇమేజ్ ఎలా పడిపోతుందో చాలా కథలు చెబుతాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు కాస్తా ప్రధాన్యత పెరిగేసరికి.. అంతా తామేననుకుంటే.. తాము లేకుంటే పార్టీనే లేదన్నట్టుగా వ్యవహరిస్తే ఏం జరుగుతుందో కొన్ని కథలను మనమిప్పుడు గుర్తు చేసుకుందాం.

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి అందుకో కేస్ స్టడీ!

2003, నవంబర్ లో ఉమాభారతి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. అయోధ్య రామ జన్మభూమి వివాదం నలుగుతున్న రోజులవి… ఆ సమయంలో రామనామాన్ని హనుమంతుడిలా తలపించి ఉమాభారతి హిందుత్వ ప్రతీకగా ఎదిగింది. బీజేపీ కూడా ఆమెను అలాగే చూసింది. భారత్ కీ భేటీ కైసీ హో… ఉమాభారతి జైసీ హో అంటూ ఆమెను ఆకాశానికెత్తింది.

అప్పటికే ఆమెలో తెలియని కొత్త అవతారం ఆవహించింది. తనకు తాను దైవాంశ సంభూతురాలిగా భావించింది. సరిగ్గా అలాంటి సమయంలోనే, 1994 హుబ్లీ కేసు వివాదంపై సుప్రీం కేసు మళ్లీ తెరపైకి రావడంతో.. బీజేపీ నాయకత్వం ఉమాభారతితో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించింది. అందుకు అప్పటికే, బీజేపీలో ఉమాభారతిపై పడనివాళ్లంతా కత్తులు, కటార్లు నూరుతున్నారు. దాంతో ఇంటర్నల్ పాలిటిక్స్, ముఖ్యమంత్రి పదవికి రాజీనామాతో.. ఉమాభారతి ఏకంగా బీజేపీకి కూడా రాజీనామా చేసి బయటకొచ్చేసింది. ఏకంగా భారతీ జనశక్తి పార్టీని ఆరంభించింది. ఆ సమయంలో తన ఛరిష్మా వల్లే బీజేపీకి మధ్యప్రదేశ్ లో ఆ హవా అని భావించిన ఉమాభారతి.. ఆ పార్టీని వీడి కొత్త పార్టీతో ఇక తానే మళ్లీ ఆల్టర్నేట్ అని భావించింది. కానీ, అదో రాజకీయ ప్రతిఘటన చర్యగానే మిగిలిపోయిందే తప్ప… ప్రత్యామ్నాయం కాలేకపోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ 201 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 5 చోట్లే గెల్చింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో పార్టీ బలపడింది. దాంతో తనవన్నీ భ్రమలేనని అప్పుడుగానీ తెలుసుకుని.. తిరిగి 2011లో తన పూర్వపు పార్టీలోకే మళ్లీ ఉమాభారతి తిరిగివచ్చి చేరింది. అంటే వ్యక్తి కన్నా వ్యవస్థ ఎంత మిన్నో చెప్పే ఘటన ఇది.

పునరావృతమైన ఘటనలు!

జేడీయూ అగ్ర నాయకుడైన శరద్ యాదవ్ 2017, ఆగస్ట్ లో నితీష్ కు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురేశాడు. నిజమైన జేడీయూ క్యాడర్ అంతా తనతోనే ప్రయాణిస్తుందని నమ్మాడు. కానీ, 2018 నాటికి శరద్ యాదవ్ వర్గం నిర్వీర్యమైపోయింది. కానీ, జేడీయూ మాత్రం మరింత బలబడింది. ఇక్కడా వ్యక్తి కన్నా పార్టీనే శక్తివంతమైందనేది నిరూపితమైంది.

2021, సెప్టెంబర్ లో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశాడు. తన సొంత పార్టీని ప్రకటించాడు. రాష్ట్రమంతా తన చుట్టే తిరుగుతుందని విశ్వసించాడు. 2022, ఫిబ్రవరిలో వచ్చిన ఎన్నికలు అమరీందర్ భ్రమలను పటాపంచలు చేశాయి. ఎన్నికల చిత్రపటంలో తన పార్టీ కనుమరుగైపోయింది.

ఇక చత్తీస్ గడ్ మాజీ సీఎం అజిత్ జోగి రాజకీయ ప్రయాణం కూడా ఇలాంటిదే. కాంగ్రెస్ పార్టీ అజిత్ జోగిని పక్కనబెట్టాక.. 2016లో జోగి జనతా కాంగ్రెస్ చత్తీస్ గడ్ పార్టీని ఏర్పాటు చేశాడు. 2018 ఎన్నికల్లో అజిత్ జోగి పార్టీకి 7 శాతంతో పదిలక్షలకు పైగా ఓట్లు వచ్చాయేగానీ.. అజిత్ జోగి గెల్చింది మాత్రం కేవలం 5 స్థానాలు మాత్రమే. కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించుకుంది. కాంగ్రెస్ పై తిరుగుబావుటా ఎగురేసిన జోగి పార్టీ మాత్రం పెద్ద శక్తిగా ఎదగలేకపోయింది.

వాజ్ పేయ్ సర్కార్ లో కేంద్రమంత్రిగా కీలక పాత్ర పోషించిన యశ్వంత్ సిన్హా బీజేపీ నుంచి బయటకు వచ్చి తానూ వేరే మార్గం చూసుకుని భంగపడ్డాడు. ఆయన అవలంబించాలనుకున్న అంతర్గత తిరుగుబాటు ఏదీ అంత విజయం సాధించలేదు.

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ రాజకీయ ప్రయాణం కూడా భ్రమల చుట్టే పరిభ్రమించింది. భ్రమలకు, వాస్తవాలకు తేడా ఏంటో కళ్లకు కట్టింది. 2006లో బీజేపీని వీడి ఝార్ఖండ్ వికాస్ మోర్చా పేరుతో కొత్త పార్టీ స్థాపించాడు. తన వ్యక్తిగత శక్తి.. భారతీయ జనతాపార్టీ శక్తి కంటే గొప్పదని తనను తాను ఎక్కువ ఊహించుకున్నాడు. కానీ, బీజేపీని నిలవరించలేకపోయాడు. ఆయన రాజకీయ ప్రభావమే తగ్గుతూ వచ్చింది. దాంతో తిరిగి 2020లో ఆయన మళ్లీ బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నాడు. పార్టీ పైచేయి సాధించింది.. మరాండీకి వాపుకు, బలుపుకూ తేడా తెలిసొచ్చింది.

బీహార్ కు చెందిన ఉపేంద్ర కుశ్వాహాదీ ఇలాంటి విఫలమైన ప్రయాణమే. జేడీయూ నుంచి పలుమార్లు బయటకొచ్చాడు. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీని ఏర్పాటు చేశాడు. మళ్లీ ఆర్జేడీలో చేరాడు. జేడీయూను విభేదించి తిరుగుబావుటా ఎగురేసిన ప్రతీసారీ తను విఫలమయ్యాడు. ఉపేంద్ర వ్యవహారం కూడా వ్యవస్థ వల్లే వ్యక్తి శక్తిమంతుడనే వాస్తవాన్ని చెప్పింది.

బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు సక్సెస్.. కానీ, విస్తరణలో అట్టర్ ఫ్లాప్!

2000 సంవత్సరం వరకూ కూడా టీడీపీతో ప్రయాణం చేసి.. 2001 నుంచి ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని భుజానికెత్తుకుని ఎన్ని ఆటుపోట్లెదురైనా తెలంగాణా సాధించిన వ్యక్తిగా, తెలంగాణా రాష్ట్ర సమితి అనే పార్టీని బలమైన ప్రాంతీయ పార్టీగా మార్చిన నేతగా కేసీఆర్ ఓ సక్సెస్ ఫుల్ లీడర్. ఆ తర్వాత రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలోనూ ఆయనకెదురే లేదు. కానీ, ఎప్పుడైతే తన శక్తి కంటే ఎక్కువ ఊహించుకోవడం మొదలెట్టాడో.. ఎప్పుడైతే టీఆర్ఎస్ ను కాస్తా, బీఆర్ఎస్ గా మార్చేశాడో.. ఇక అప్పట్నుంచీ ఆ పార్టీ పతనం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణ మొదటికే మోసం తెచ్చింది. దాంతో స్థానికంగా సరిగ్గా దృష్టి పెట్టలేక.. జాతీయస్థాయిలో అనుకున్న గుర్తింపు పొందలేక.. ఉట్టికెగురలేనమ్మ ఆకాశానికెగిరందంటూ విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇక దేశ పాలనా రాజధానైన ఢిల్లీ వంటి చోట 2013లో జయకేతనం ఎగురేసి సంచలనం సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీ. రెండోసారీ అధికారంలోకొచ్చి ఢిల్లీ ప్రజల విశ్వాసాన్ని పొందగల్గింది. కానీ, తెలంగాణాలో బీఆర్ఎస్ తరహాలోనే.. మూడోసారి అధికారానికి దూరమైంది. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆలోచన తరహాలోనే దేశవ్యాప్త విస్తరణలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ వారణాసిలో మోడీకి పోటీగా నిల్చుని ఘోర పరాజయాన్ని చవిచూశాడు. దేశవ్యాప్తంగా కూడా ఆప్ గెల్చుకుంది కేవలం 4 స్థానాలు మాత్రమే. అవి కూడా పంజాబ్ రాష్ట్రం నుంచి మాత్రమే. ఢిల్లీ, పంజాబ్ వెలుపల పార్టీ ఆనవాళ్లే కనిపించలేదు. తమ పరిమితెంతో తెలుసుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ కూడా పప్పులో కాలేశాడు.

బీహార్ లో పీకే నుంచి మధ్యప్రదేశ్ లో ఉమాభారతి వరకూ.. తాజా రాజకీయాల్లో కేజ్రీవాల్, కేసీఆర్ వరకూ వీరందరి రాజకీయ ప్రయాణాలు సిమిలర్ గా కనిపిస్తుంటాయి.

వీళ్లందరికీ మినహాయింపు శరద్ పవార్ రాజకీయ ప్రయాణం!

1999లో శరద్ పవార్ కాంగ్రెస్ తో విభేదించి బయటకొచ్చాడు. పీ.ఏ. సంగ్మా, తారిఖ్ అన్వర్ తో కలిసి ఎన్సీపీని ఏర్పాటు చేశాడు. అది కాంగ్రెస్ పార్టీపై మరో అహంకారపూరిత తిరుగుబాటులాగానే అంతా చర్చించుకున్నారు. కానీ, పవార్ మాత్రం అంతా అనుకున్నదానికి భిన్నంగా పవర్ సెంటర్ గా మారి ఇండియన్ మాడ్రన్ పాలిటిక్స్ కు ఒక కొత్త రూపునిచ్చాడు.

ఎన్సీపీని కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా నిర్మించాలనుకోలేదు. మహారాష్ట్ర కేంద్రంగా ఎదిగి రాజకీయాలను శాసించాలనుకున్నాడు. పార్టీ పెట్టిన నాల్గు నెలల్లోనే జరిగిన ఎన్నికల్లో ఏకంగా 58 సీట్లు గెల్చుకుని కింగ్ మేకర్ గా మారాడు పవార్. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. తమను విడిచి వెళ్లిపోయిన పవార్ అవసరం తప్పనిసరి అనేలా చేశాడు. బీజేపీ-శివసేన కూటమి కూడా ఆ కింగ్ మేకర్ వ్యూహాల నుంచి బయటపడలేకపోయింది. పవార్ ఏనాడూ తాను కాంగ్రెస్ కంటే శక్తిమంతుణ్ననుకోలేదు. కానీ, తనకున్న ఎకో సిస్టమ్, తను ప్రోత్సహించిన సహకార సంఘాల పునరుద్ధరణ, కుల బంధాలు, రాష్ట్రంలో ఏర్పర్చుకున్న వ్యక్తిగత బంధాలు, సంస్థాగత నిర్మాణశైలి వంటివెన్నో పవార్ ను అంతకంటే పెద్దవాడిగా నిలబెట్టాయి.

ఇదే కోవలో ఒక మమతా బెనర్జీని, వైఎస్ జగన్మోహన్ రెడ్డీని చెప్పుకోవాల్సి ఉంటుంది. పార్టీని విడిచిపెట్టి పోయే క్రమంలో ఎకో సిస్టమ్ ను పూర్తిగా పునర్నిర్మాణం చేసుకుని ముందడుగు వేసిన నేతలు వీరు. వ్యవస్థ కంటే పెద్ద అనుకోలేదు. కానీ, ఇప్పుడు వారే వ్యవస్థలుగా మారారు.

మరి ప్రశాంత్ కిషోర్ గురించి ఏం చెప్పుకోవాలి..?

భారత రాజకీయాల్లో ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన అనుభవం ప్రశాంత్ కిషోర్ ది. ముఖ్యమంత్రులు.. ఏకంగా ప్రధానమంత్రిని కూడా తయారు చేయగల్గినప్పుడు.. తానే ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదని పీకే యోచించాడు. 2022లో జన్ సురాజ్ పార్టీని ఆరంభించి.. 2023లో బీహార్ లో పాదయాత్రతో తన ప్రత్యక రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కానీ, చాలా స్థానాల్లో నోటా కంటే కూడా తక్కువ ఓట్లతో డిపాజిట్లు గల్లంతై.. ఓటు శాతం కూడా తక్కువగానే నమోదైంది. పీకేకు మిగిలింది పరాజయం మాత్రమే కాదు.. నిర్మాణాత్మకంగానే తనను నిరాకరించిన విషయం తాజా బీహార్ ఎన్నికల్లో తేటతెల్లమైంది. భావోద్వేగ బంధం లేకుండా వ్యూహాలు ఎప్పుడూ పనిచేయవని పీకే రాజకీయ అడుగులు నిరూపించాయి.

ఈ కథలన్నీ చెప్పే ఒకే ఒక్క గుణపాఠమేంటంటే… కొంత క్రేజ్ వచ్చినంత మాత్రాన అంతా తామేనని భావిస్తే.. దైవాంశ సంభూతులుగా చలామణి అవుతామంటే ఎక్కడైతే అమితైన ఆదరణ దక్కిందనుకున్నారో, అదిగో అక్కడే కుప్పకూలిపోయే ప్రమాదముంటుంది. పార్టీలను విభేదించడం, వీడటం, కొత్త పార్టీలను ఏర్పాటు చేసి నూతన రాజకీయాలకు తెరతీయడం తప్పేమీ కాదు.. కానీ, అందుకు కావల్సిన వ్యవస్థను ముందస్తుగానే బలంగా బిల్డప్ చేసుకోవాల్సిన అవసరమూ ఈ నాయకుల కథలన్నీ మనకు చెబుతాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles