నేపాల్ లో రాజకీయ దిగజారుడుతనాన్ని కళ్లకు కట్టే.. హిశీలా ఆత్మకథ!

రమాసుందరి… ✍🏼

నేపాల్ మాజీ ప్రధానుల్లో ఒకరైన బాబురామ్ భట్టారాయ్ ఇంటిని కూడా తగలబెట్టారు జెన్ జడ్ ఆందోళనకారులు. అక్కడి పరిస్థితుల గురించి అప్పుడే ఏమీ చెప్పలేం కానీ, 2021లో నేను చదివిన అతని భార్య హిశీలా యామీ ఆత్మకథ ‘Hisila -from revolutionary to first lady’ అనే పుస్తకం గురించి అప్పుడు నేను రాసిన పరిచయం మళ్లీ పోస్టు చేస్తున్నాను. అక్కడేదో విప్లవం పరిఢవిల్లుతుందని భ్రమలు పడుతున్న వాళ్లు ఇది చదవాలి.

హిశీలా యామి ఆత్మకథ -రాజకీయ, నైతిక దిగజారుతనానికి టెక్స్ట్ బుక్ ఉదాహరణ.

ఒకానొక కాలంలో, ఒకానొక రాజకీయాలలో ప్రముఖంగా కనిపించిన వారి ఆత్మకథలను ఇష్టపడటానికి కారణం వాళ్ల సొంత జీవితాల గురించి తెలుసుకోవటానికి కాదు. ఆనాటి కాలమాన పరిస్థితులు, ఆ ప్రాంతపు భౌగోళిక రాజకీయార్థిక పరిస్థితులను గురించి తెలుసుకోవటం కోసం. అలా మొదలుపెట్టిన పుస్తకమే ఒకప్పటి నేపాల్ మావోయిష్టు నాయకురాలు హిశీలా యామి ఆత్మకథ ‘Hisila -from revolutionary to first lady’. పార్వతి అనే పేరుతో హిశీల యామి నేపాల్ పీపుల్స్ వార్ లో పని చేసిందనీ, అజ్ఞాతవాసం గడిపిందని ఆమె గురించి చాలా గొప్పగా విన్నాం.

ఈ పుస్తకం నేపాల్ ఇప్పటి పరిస్థితులను అర్థం చేసుకోవటానికి సహకరించింది కానీ, చాలా నిరాశను కలిగించింది. పుస్తకం బాగా రాయలేదనీ కాదు. ఆమె రాసిన దాన్లో నిజాయితీ లేదనీ కాదు. వ్యక్తుల గురించి అంచనాలు తారుమారు అయినపుడు కలిగిన నిరాశ అది. అసలు విప్లవకారిణి లేక విప్లవకారుడు అంటే అర్థం ఏమిటీ, ఆ మాట అనిపించుకోవటానికి అర్హత ఎవరికి ఉంటుంది లాంటి తాత్విక ప్రశ్నలు కూడా వచ్చాయి. చాలా సాదాసీదాగా, ఎలాంటి ప్రచారాలకు ఇష్టపడకుండా నమ్మిన రాజకీయాల కోసం చివరికంటా నిలబడి, ప్రజలలో పని చేసిన విప్లవ పార్టీల మహిళలను చూశాం కాబట్టే ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయేమో.

ఈ పుస్తకం ఒక శతాబ్దపు నేపాల్ రాజకీయ చిత్రపటాన్ని అర్థం చేయించిన మాట వాస్తవం. వివిధ దశల్లో నేపాల్ సమాజం గురి అయిన వత్తిళ్లు, ప్రకంపనలు మనకు ఈ పుస్తకం ద్వారా అర్థం అవుతాయి. రాజరికపు కోరల్లో (అదీ హిందూ రాజరికపు) ఇరుక్కొని ఆ ప్రజ విలవిలలాడిన విధానం అర్థం అవుతుంది. పరిపాలకుల పచ్చి స్వార్ధపూరిత రాజకీయ పాలసీలు, వాటికి వ్యతిరేకంగా కొనసాగిన ఉద్యమాల వివరాలు తెలుస్తాయి.

హిశీలా యామి నేపాల్ లో నేవార్ తెగకు చెందిన మహిళ. ఈ నేవార్ ప్రజలు ఖాట్మండు లోయలో, దాని చుట్టుపక్కలా ఎక్కువగా నివశిస్తుంటారు. హిశిలా తండ్రి నేపాల్ రాచరికానికి వ్యతిరేకంగా పోరాడి అజ్ఞాతవాసం, జైలు జీవితం గడిపారు. అలాంటి రాజకీయ కుటుంబం నుండి వచ్చిన హిశీల చదువంతా ఇండియాలో నడిచింది. ఆమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో చదివేటపుడు అరుంధతీ రాయ్ ఆమె క్లాస్ మేట్. చాలామంది మహిళల మొదటి రాజకీయ కార్యాచరణ జెండర్ కాన్షియస్ నుండి ప్రారంభం అయినట్లే, హిశీల కూడా అలాగే సెన్సిటైజ్ అయ్యి తన రాజకీయ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఆల్ ఇండియా నేపాల్ స్టూడెంట్స్ యూనియన్ లో పని చేసారు. భారతదేశంలో పనులు చేసుకొంటున్న నేపాలీల దైన్యం, ఇండియాలో వ్యభిచారం చేయాల్సి వచ్చిన నేపాలీ మహిళల పేదరికం ఆమెను కలిచివేశాయి.

ఆ క్రమంలో ఆమెకు బాబురాయ్ భట్టారాయ్ తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి, ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు. నేపాలీ బ్రాహ్మిన్ కుటుంబంనుండి వచ్చిన భట్టారాయ్ నేపాల్ కమ్యూనిష్టు పార్టీలో సభ్యుడయ్యాడు. ఆయనతో పాటే హిశీలా. ఉన్నత చదువులు చదివిన ఇద్దరూ పార్టీ శ్రేణుల్లో త్వరగా పైకి ఎదిగారు. అదే సమయంలో ఇంకో స్థానిక నాయకుడు ప్రచండ కూడా నేపాల్ వామపక్ష రాజకీయాల్లో, సామాన్య ప్రజల్లో ముద్ర వేయగలిగేటట్లుగా ఎదిగాడు. తొలుత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (CPN -మశాల్) పార్టీలో వీరందరూ కలిసి పనిచేశారు. ఆ పార్టీ దేశంలోని రాజరికాన్నీ, భారతదేశ విస్తరణవాదాన్నీ రెండిటినీ సమాన శత్రువుగా చూస్తుందనీ; నిజానికి రాజరికాన్ని తక్షణ శత్రువుగా చూడాలనీ బాబురాయ్ భట్టారాయ్ అభిప్రాయం. పార్టీ అంతర్గత చర్చలకు తావు ఇవ్వని ‘స్టాలినిస్టు’ పోకడలు పోతుందని ఆరోపణలతో కొత్త పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిటీ సెంటర్) ను ఏర్పాటు చేశారు. ప్రచండ దానికి జనరల్ సెక్రెటరీ అయ్యాడు.

ఇక తరువాత జరిగిన చరిత్ర హిశీలా వైపు నుండి చదువుతుంటే, కమ్యూనిష్టు పార్టీలు ఇంత ప్రాధమికంగా ఉంటాయా అని అనిపించింది. మిగతా రాజకీయాలను పక్కన పెడితే (అవి అర్థం అయితే ఇంకా చీదర కలుగుతుంది) హిశిలా పని చేసిన విధానం ఎన్జీవో పని విధానం లాగా నాకు అనిపిస్తే అది నా తప్పు కాదు. ఆమె పీపుల్ వార్ (మిలటరీ) లో పని చేసింది. ప్రజా ఉద్యమాల్లో పాలు పంచుకొన్నది. అయితే నమ్మిన రాజకీయాలు ఆ దంపతులను ఎటు వైపు తీసుకొని వెళ్లాయో చదువుతుంటే విచారంగా అనిపించింది. Dogmatic (ఛాందసవాదం) అని ఆమె పుస్తకంలో పదే పదే రాసిన కిరణ్ వర్గం మీద కూసింత ఆశలు కలిగాయి. కానీ ఆ వర్గం కూడా ఇప్పుడు బలంగా లేదని తెలిస్తోంది.

ప్రచండ వర్గం, బాబురావ్ బట్టారాయ్ వర్గం రెండూ అనేక కుప్పిగంతులు వేశాయి. ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకొన్నాయి. చివరకు సాయుధ పోరాటాన్ని తుంగలో తొక్కి, నేపాల్ అధ్యక్ష పదవి పొందటానికి ఉవ్విళ్లూరాయి. ఒకప్పుడు చిన్నపిల్లలు, స్త్రీలు కూడా పని చేసి అనేక త్యాగాలు చేసిన పీపీల్స్ వార్ ను రద్దు చేసి నేపాల్ సైన్యంలో కలిపేసి, ఈ దంపతులు అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ ను సందర్శించిన ఫోటోలు ప్రదర్శించుకొనేంత దిగజారారు. ఆయుధాలనూ, వాళ్ల వ్యూహ స్థావరాలను కూడా తాము భాగస్వామ్యం వహిస్తున్న ప్రభుత్వానికి తెలియచేసారు. ఇంకా నేపాల్ లో విప్లవోద్యమం జరిగే అవకాశాలను దిగజార్చారు.

ఈ మొత్తం విషయాన్ని ఆత్మకథా రచయిత్రి తనకు తెలియకుండా మనకు అర్థం చేయించింది. ఆమెకు ఈ విషయంలో ఎక్కడా పశ్చాత్తాపం కలిగినట్లు అనిపించలేదు. విప్లవాన్ని నిర్వహించటానికి ఒక్కొకరికి ఒక్కో మార్గం, వ్యూహం ఉండవచ్చు. దాన్ని ఏట్లో కలపటానికి కూడా అలాగే చాలా పథకాలు ఉంటాయి. ఒక్కోసారి మావోను అడ్డం పెట్టుకోవచ్చు, ఒక్కోసారి స్టాలిన్ ని తిట్టవచ్చు.

ఆమె తమ పుస్తకంలో కొన్ని నైతిక విలువలు కూడా పాటించలేదు. పోలిట్ బ్యూరోలోని ఇద్దరు స్త్రీ పురుషులకు వివాహేతర సంబంధం ఉండేదని పేర్లతో సహా రాసేసారు. వివాహేతర సంబంధాల పట్ల తన విశాల దృక్పథాన్ని ప్రదర్శించుకోవటానికి ఈ పని చేసినట్లు ఉంది. ఇంకా తమకు అప్పుడు ఆర్థిక, ఆయుధాల సహాయం చేసిన వాళ్ల పేర్లను కూడా చక్కగా రాసేసారు. వాళ్లు ఇప్పుడు జీవించే ఉన్నారు. చాలామంది రాజ్యం నిఘానేత్రంలో ఉన్నవారు.

జాతులు, కులాల విషయంలో కూడా హిశీలా ఆలోచనలు శాస్త్రీయంగా లేవు. తను పుట్టిన నేవార్ జాతిని చాలా పొగుడుకొన్నారు. అందులో కులం, అస్పృశ్యత ఉన్నాయని తనే ఒక చోట రాసారు. అవి రెండు ఉన్న జాతిని గొప్ప జాతి అని, దాన్ని ఉద్దరించటానికి పని చేయాలని చెప్తున్నట్లా?

కమ్యూనిష్టు పార్టీ, అదీ సాయుధ పోరాటం పెద్ద ఎత్తున చేసిన విప్లవ పార్టీ ఎలా దిగజారుతుందో తెలుసుకోవటానికి ఈ పుస్తకం చదవచ్చు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles