ఐ లవ్ మద్రాస్ అంటున్న ఓ ఏస్ సినిమాటోగ్రాఫర్!

మద్రాస్ నన్ను పరీక్షించింది.. నన్ను పెంచింది.. తీర్చిదిద్దిందంటున్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవివర్మన్.

ఇళ్ల నుంచి పారిపోయి నగరంలో జీవితాన్ని వెతుక్కుంటూ వచ్చేవారెందరికో మద్రాస్ ఓ తల్లిలాంటిదంటున్నారు ఈ ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రవివర్మన్. ఎలాంటి కలలు, ఆశల్లేకుండానే మద్రాస్ వచ్చాను. భోజనానికింత డబ్బు దొరికితే చాలు.. బతకడానికి ఏదైనా ఉద్యోగం లభిస్తే చాలనుకున్నాను. అలాంటి సమయంలో మద్రాస్ నాకు అన్నం పెట్టింది. నేను ఎన్నో బాధలు పడ్డా.. నాకు వరాలిస్తూ వచ్చింది. ఇలా చెబుతూ వచ్చారు ఈయన ఓ ఇంటర్వ్యూలో.

తల్లిదండ్రులను కోల్పోయి.. 14 ఏళ్లకే మద్రాస్ బాట పట్టి.. ఓ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీలో ఆఫీస్ బాయ్ గా ప్రారంభమై.. రవి. కే. చంద్రన్ అనే మరో ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ వద్ద శిష్యుడిగా జాయిన్ అయ్యి.. ఈరోజు మణిరత్నం, శంకర్, గౌతమ్ వాసుదేవన్ వంటి ప్రముఖ దర్శకులకు ఇష్టమైన సినిమాటోగ్రాఫర్ గా ఎదిగాడు రవివర్మన్.

మణిరత్నం నిర్మించిన పొన్నియన్ సెల్వన్ సినిమాటోగ్రాఫర్ గా.. మణి సినిమాలకు పీసీ శ్రీరామ్, సంతోష్ శివన్, రాజీవ్ మీనన్ వంటివారి తర్వాత సినిమాటోగ్రఫీ జోడీగా కుదిరిన వ్యక్తి రవివర్మన్ తన జ్ఞాపకాలను ఓసారి ఇలా పంచుకున్నాడు.

మద్రాస్ ఎందరికో ఆశ్రయమిచ్చే ఓ ఇల్లులాంటింది. ఎంతమందికైనా వసతి కల్పించగలదు. కష్టపడి పనిచేసి నైపుణ్యాలు మెరుగుపర్చుుకుంటే.. ఉద్ధరించేందుకు మద్రాస్ ఎప్పుడూ రెడీనే. కష్టపడి పనిచేసినంత మాత్రాన విజయం లభించదు.. హార్డ్ వర్క్ కు తోడు స్మార్ట్ వర్క్ ఎంత చేస్తే అంత వృద్ధిలోకి రావడం గ్యారంటీ అంటారు రవివర్మన్.

సిల్వర్ స్పూన్ తో పుట్టినవాణ్నే అయినా.. నేను యుక్తవయస్సులోనే మద్రాస్ వచ్చాను. నిత్యం తదుపరి భోజనం కోసం ఎదురుచూస్తూ గడిపాను. కానీ, ఎలాగైనా ఇక్కడ స్థిరపడాలనుకున్నాను. తమిళ సినిమాల్లో మద్రాస్ వెళ్లడమంటే ఏదో సాధించినట్టు. సినీ పరిశ్రమలోకి వచ్చేవారు కూడా అలాంటి కలలతోనే వచ్చినవారై ఉంటారు. అది మీకూ తెలిసిందే.

తంజావూర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం మాది. కానీ, నాకు సినిమాల పిచ్చి మాత్రం ఉండేది. వారానికి మా ఊర్లో రెండు సినిమాలు గ్యారంటీగా చూసేవాణ్ని. ఎంజీఆర్, శివాజీ గణేషన్ సినిమాలంటే తెగ పిచ్చి. ఆ తర్వాత కమల్, రజనీ సినిమాలు చూస్తూ పెరిగాను.

మద్రాస్ వెళ్లినప్పుడు నేనెవరో ఎవ్వరికీ తెలియదు. నేనో అనామకుణ్ని. దీనికి నేనే కాదు నాలాగా ఎవరు వచ్చినా వారెవ్వరూ మినహాయింపూ కాదు. అదే మన బలం కావాలి. ఆ స్వేచ్ఛే మనను నడిపిస్తుంది. ఏ పనైనా చేసేలా మనల్ని మలుస్తుంది. ఎవరైనా తెలిసినవారున్నారంటే ఫలానా పని చేయాలంటే నామోషీగా ఫీలవుతుంటాం. కానీ, నగరంలో ఎవరికెవరు ఈ లోకంలో అన్నట్టుగానే అన్నీ కనిపిస్తుంటాయి. కాబట్టే అదే నా ఎస్సెట్ గా చేసుకున్నాను. పడిపోవడం, లేవడం ఇలా మొత్తంగా జీవించడం నేర్చుకున్నాను. చిన్న చిన్న పనులు చేసి బతికాను. అవన్నీ నాకు లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. నన్ను మరింత బలంగా మార్చాయి.

వాస్తవానికి నా గ్రామంలో నా జీవితం చాలా హాయిగా సాగిపోతోంది. చిన్న చిన్న కలలతో ఆనందంగా గడిపేవాణ్ని. అంతా తెలిసినవాళ్లతో రోజులు అలా తెలియకుండానే గడిచిపోయేవి. కానీ, మద్రాస్ అందుకు పూర్తి కాంట్రాస్ట్. వివిధ భాషల వారు, భిన్నభావాలు కలవారు, కొత్త మనుషులు, అంతా అపరిచితులు.. అలా అలల్లా ఒకరినొకరు తెలుసుకోకుండానే తీరం దాటే మనుషులతో అంతా అయోమయం జగన్నాథమన్నట్టుగా ఉండేది. సరైన బట్టల్లేక, చెమటలతో, క్యాన్వాస్ పై వేసిన పెయింటింగ్ పై పడ్డ దుమ్ములా కనిపించేవాణ్ని. చాలాసార్లు ఆకలితో నాపైన నేనే కోపంగానూ ప్రవర్తిస్తూ నన్ను నేనే ప్రశ్నించుకునేవాణ్ని. అలా అశాంతితో రగిలిపోయేవాణ్ని.

చీకటిని శపించడం కంటే కొవ్వొత్తిని వెలిగించడం మంచిదనేది నా మోటో. అలా సినిమా ఇండస్ట్రీలో చిన్న బాయ్ గా ప్రారంభమైన నా జీవితం.. ఇవాళ ఏఎస్సీ, ఆస్కార్ కమిటీవంటివి గుర్తించిన సినిమాటోగ్రాఫర్ గా ఎదగడానికి మద్రాస్ నగరమే నాలాంటి ఎలాంటి మార్గదర్శి లేని పల్లెటూరి బాలుడికి పునర్జన్మనిచ్చింది. మొత్తంగా నన్ను పెంచింది. తీర్చిదిద్దింది. నేను కలలుగన్న స్థితేం కాదు. ఏదో అలా సహజంగానే ఇలా పేరు పొందిన సినిమాటోగ్రాఫర్ గా రాణించాను. నన్నింతవాణ్ని చేసిన మద్రాస్ కు ధన్యవాదాలంటాడు రవి వర్మన్.

మద్రాస్ అంటే ఎందుకిష్టమంటే.. మా ఊళ్లో ఒకటో, రెండో గుళ్లు మాత్రమే ఉండేవి. కానీ, మద్రాస్ లో అడుగడుగునా గుడి ఉంది. నేను తరచుగా దేవాలయాలను సందర్శిస్తుంటాను. నేనేదో దేవుడి దర్శనం కోసమో.. మతపరమైన నియమ, నిష్ఠలతో పోయేవాణ్ననుకునేరు..? నేను వెళ్లేది ప్రసాదాల కోసం. నేను పెరుగుతున్న రోజుల్లో ఉచిత ఆహారం తినని ఒక్క ఆలయం కూడా లేదంటే మీరు నమ్మరేమో! నాలాంటి నిరాశ్రయులకు ఈ ఆలయాలే నిద్రించడానికీ ఆశ్రయాలయ్యాయి. ప్రతీ వీధిలో మంచి నీటి సంపులుండేవి. అప్పుడు ఆ సంపుల్లో నీళ్లు పట్టుకుని తాగిన నేనే.. ఈరోజు వాటర్ కొని తాగుతుండటం కూడా అప్పడప్పుడూ నన్ను ఆశ్చర్యపరుస్తుంది. మెరీనా బీచ్ నాకిష్టమైన స్పాట్. అక్కడే గంటల తరబడి ఎడతెగని అలలను చూస్తూ నా జీవితం గడిచిపోయింది. చాలా రాత్రులు ఆ ఇసుక తిన్నెలపైనే నిద్రించాను. సముద్రం నన్ను ఆకర్షించింది. అలా మొత్తంగా మద్రాస్ నన్ను మార్చేసింది.. ఏస్ సినిమాటోగ్రాఫర్ గా మల్చిందంటున్నాడు రవివర్మన్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles