నాల్గు దశాబ్దాలుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుణ్ని.. ఓ నలుపు తెలుపు ఫోటో పట్టించింది!
1987 కేసు ఇది. తన బావను హత్య చేసి 39 ఏళ్లుగా పరారీలో ఉన్న మోహనన్ పిళ్లై.. అసలు గుర్తింపునే దాచి బతుకుతున్నాడు. క్రైమ్ సినిమాలకు పెట్టింది పేరైన కేరళకు చెందిన మోహనన్ పిళ్లై… నాల్గు దశాబ్దాలకు పూయప్పల్లి పోలీసులకు ఇంతకాలానికి చిక్కాడు.
విచారణ కాలం మొత్తం పోలీసులను తాను మోహనన్ పిళ్లై కాదని నమ్మించాడు. కొట్టాయం జిల్లా కల్లారకు చెందిన కేశవన్ కుమారుడు రాజన్ పేరిట చలామణి అయ్యాడు. అతడి వాదన నిజమో కాదో తెలుసుకునేందుకు కేరళ పోలీసులు కళ్లు తెరిచారు. చివరకు కల్లారా పోలీసుల సాయంతో.. పూయప్పల్లి పోలీసులు విచారణ చేపట్టారు. అతడి కుటుంబ సభ్యులు, తాతలు, బంధువులు తదితర విషయాలన్నీ క్రాస్ చెక్ చేశారు.

కొత్తగా బాధ్యతలు చేపట్టిన కొట్టాయం రూరల్ జిల్లా పోలీస్ అధికారి పెండింగ్ కేసులన్నీ తిరిగి తోడేసరికి మళ్లీ మోహనన్ పిళ్లై కేసు తెరపైకొచ్చింది. ఆయన చొరవ తోనే ఇంతకాలం పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న నిందితుడు పట్టుబడ్డాడు. కొట్టాయం మెడికల్ కళాశాల ఆసుపత్రిలో అతడు చేరినట్టు పోలీసులకు సమాచారమందింది. అయితే, ఆసుపత్రిలో ఉన్న వ్యక్తే గత 39 ఏళ్లుగా దొరక్కుండా తిరుగుతున్న నిందితుడా, కాదా అన్న విషయం మరో అనుమానం. మొదట్లో నిర్ధారించుకోలేకపోయారు. సస్పెక్టెడ్ గానే పోలీసులు రంగంలోకి దిగారు.
అదే సమయంలో మరో రహస్య సమాచారం కూడా పోలీసులకు అందింది. కల్లారాలో ఉండే ఓ వ్యక్తి రోజూ ఇంటికి మద్యం తాగి వచ్చి గొడవలు పెట్టుకుంటాడని.. తనకు క్రైమ్స్ కొత్తేం కాదని చెబుతుంటాడన్న విషయాలు పోలీసుల చెవిలో పడ్డాయి. దాంతో పోలీసులు హాస్పిటల్ లోనూ.. ఇంటివద్దా అతడిపై కొంతకాలం నిఘా పెట్టారు. అతడి కదలికలు, నేపథ్యాన్ని నిశితంగా పరిశీలించారు.
ఓరోజు అతణ్ని పట్టుకున్నారు. కానీ, అతడే మోహనన్ పిళ్లై అని మాత్రం నిర్ధారించలేకపోయారు. ఎందుకంటే 39 ఏళ్లల్లో అతడి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చివరకు గంటల తరబడి పోలీస్ మార్క్ విచారణతో.. నిందితుడు హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు.
కల్లారాలోని తన ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. అతడు అంతకుముందున్న నివాసమున్న చోట వెలియంలో మాత్రం పోలీసుల సోదాల్లో ఏమీ లభించలేదు. కల్లారా చిరునామాతోనే ఆధార్ కార్డ్ సహా, ఇతర పత్రాలూ లభించాయి. కానీ, ఇంట్లో దొరికిన 1998 నాటి మసకబారిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో మాత్రమే ఇంతకాలం రాజన్ గా బురిడీ కొట్టిస్తూ తిరుగుతున్న మోహనన్ పిళ్లై అని తేలింది. ఆ ఫోటోనే అతడి అసలైన గుర్తింపును నిర్ధారించింది. అదే పోలీసులకు ప్రాసిక్యూషన్ లో అత్యంత కీలక ఆధారంగా మారింది.
నాల్గు దశాబ్దాల పరారీ!
కొల్లం జిల్లాలోని వెలియంలో తన ఇంట్లో ఉన్న 35 ఏళ్ల చంద్రశేఖరన్ పిళ్లైని అత్యంత దారుణంగా నరికి చంపాడు మోహనన్ పిళ్లై. 1987, జనవరి 11వ తేదీన ఆ మర్డర్ జరిగింది.
సాయంత్రం ఆరింటి సమయంలో ఇంట్లో గొడవ సృష్టించిన చంద్రశేఖరన్ పిళ్లైపై అతడి 25 ఏళ్ల బామ్మర్దైన మోహనన్ పిళ్లై పెద్ద కత్తితో దాడికి తెగబడి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. దాదాపు 39 ఏళ్లపాటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు 64 ఏళ్ల వయస్సులో పట్టుబడ్డాడు.
హత్య తర్వాత మోహనన్ పిళ్లై తమిళనాడుకు పారిపోయాడు. వేలంకన్నెలో కొంతకాలం నివాసమున్నాడు. అక్కడే కొట్టాయం జిల్లా కల్లారకు చెందిన కొందరితో స్నేహం కుదిరింది. ఆ తర్వాత కల్లారకు వెళ్లి తోటల్లో కూలీ పని చేస్తూ రాజన్ అనే మారుపేరుతో కొత్త జీవితాన్ని ఆరంభించాడు. స్థానిక మహిళను వివాహం చేసుకుని అక్కడే సెటిలయ్యాడు. ప్రస్తుతం మోహనన్ పిళ్లై దంపతులకు 37, 35 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలు కూడా ఉన్నారు.



