Shyam Mohan… ✍🏼
జర్నలిస్టు జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతాయి.
ఎన్నో ప్రమాదాలు చూస్తాం. ఎన్నో రాజకీయాలు చూస్తాం. ఎన్నో కన్నీళ్లు, ఎన్నో విజయాలు, ఎన్నో ఓటములు చూస్తాం.
కాలం గడిచేకొద్దీ వాటిలో చాలా జ్ఞాపకాలుగా మసకబారిపోతాయి.
కానీ కొన్ని సంఘటనలు మాత్రం మనసులో శాశ్వతంగా నిలిచిపోతాయి.
అవి వార్తలు కావు… అవి మనిషి మీద నమ్మకాన్ని పెంచిన క్షణాలు.
పాలన అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపించిన అనుభవాలు.
………………..

కొన్ని ఫోన్ కాల్స్ జీవితాంతం గుర్తుండిపోతాయి.
అవి కేవలం సమాచారం ఇవ్వవు… ఒక మనిషి జీవితాన్ని మన చేతుల్లో పెట్టేస్తాయి.
అది 2008.
ఒకరోజు ఫోన్ మోగింది.
“ ఒక సాయం కావాలి. నందిగామ నుంచి మా బంధువులు వచ్చారు. వారి నెలల పాపకు గుండె సమస్య ఉంది. ఏమైనా హెల్ప్ చేయగలమా?” అని అవతల ఒక మిత్రుడు. ఆ స్వరంలో కనిపించిన ఆందోళన ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది.
మర్నాడు 11 గంటలకు టీవీ9 కార్యాలయంలో జర్నలిస్టు మిత్రుడు చంద్రమౌళిని కలిశాను.
“మీ బ్రదర్ హార్ట్ స్పెషలిస్టు కదా… ఈ పసిబిడ్డను ఎలాగైనా కాపాడాలి ..” అన్నాను.
‘ ప్రయత్నం చేద్దాం మిత్రమా’ అని అతడు చెప్పాడు.
ఆ మాటతోనే ఒక ఆశ మొదలైంది.
12 గంటలకు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆసుపత్రికి నందిగామ నుంచి ఆ దంపతులు తమ నెలల పాపను గుండెలకు హత్తుకుని వచ్చారు.
ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ల ముందు నిలిచే ఉంటుంది.
ఆ తల్లి చేతుల్లో చిన్నారి. ఆ చిన్నారి ముఖంలో అమాయకత్వం.
తల్లిదండ్రుల కళ్లలో మాత్రం భయం.
వారిని చూస్తేనే వారి జీవితం అర్థమైపోయేది.
రెండెకరాల పొలం తప్ప మరో ఆస్తి లేదు. ఆ పొలమే వారి బతుకు. ఆ బిడ్డే వారి ప్రపంచం.ఎంతో కాలం తర్వాత పుట్టిన పాపకు గుండె జబ్బు అని తెలిసినప్పటి నుంచి ఆ తల్లి కన్నీళ్లు ఆగలేదు.
అన్ని టెస్ట్‌లు పూర్తయ్యాక వైద్యులు చెప్పిన మాట ఒక్కటే.
“ఆపరేషన్‌కు దాదాపు మూడు లక్షల రూపాయలు ఖర్చవుతుంది.”
ఆ మాట విన్న వెంటనే ఆ తల్లి తలవంచుకుని ఏడవడం మొదలుపెట్టింది.
ఆ తండ్రి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.
జేబులోంచి ఫోన్ తీసుకున్నాడు.ఎవరికో కాల్ చేశాడు.
“పొలం తాకట్టు పెట్టండి… ఎలాగైనా డబ్బు ఏర్పాటు చేయండి…”
అని చెబుతున్నాడు.
ఆ మాట విన్న క్షణం… ఆ పాప ప్రాణం కంటే ముందు వారి జీవనాధారమైన పొలం కళ్ల ముందు మెదిలింది.
ఒక పక్క బిడ్డ ప్రాణం.మరో వైపు తరతరాలుగా కుటుంబాన్ని నిలబెట్టిన పొలం.
ఏది కాపాడాలి? ఏది వదులుకోవాలి?
ఒక పేద రైతుకు ఈ ప్రశ్న రావడమే ఎంత క్రూరం!…..
ఆ బిడ్డ తండ్రిని పక్కకు తీసుకెళ్లి “ఆరోగ్యశ్రీ కార్డు ఉందా?” అని అడిగాను.
“లేదు … రేషన్ కార్డు ఉంది.”
అంతే. ఆ తెల్లకార్డు చేతిలో పట్టుకుని నేరుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లాం.
అక్కడ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ కౌంటర్‌లో వైద్యుల రిపోర్టులు సమర్పించాం. నా అక్రిడిటేషన్ కార్డు చూపించి విషయం వివరించాను. అధికారులు వెంటనే కేసును కంప్యూటర్‌లో ఫీడ్ చేశారు.
…………………………………
ఒక వారం తరువాత వారిని పరిచయం చేసిన మిత్రుడి ఆఫీసులో లక్డీకాపూల్‌లో ఆ దంపతులు మళ్లీ ఎదురుపడ్డారు.
ఈసారి కూడా వారి కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి…
కానీ అవి బాధతో ఉన్న కన్నీళ్లు కాదు.
“అన్నా … ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. ఆపరేషన్ విజయవంతమైంది. మా పాప బతికింది… మా బతుకు తెరువైన పొలం కూడా మాకు దక్కింది…” అంటూ ఇద్దరూ నా చేతులు గట్టిగా పట్టుకుని ఏడ్చేశారు.
ఆ నాలుగు మాటలు..ఇప్పటికీ నన్ను వెంటాడు తూనే ఉంటాయి.
నేను వాళ్లతో ఒక్క మాట మాత్రమే అన్నాను.
“నాకు థ్యాంక్స్ చెప్పొద్దు. ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిగారికి చెప్పండి.”
ఆ రోజు నాకు రాజకీయాలు గుర్తుకురాలేదు.
ఒక పథకం నిజంగా ప్రజల జీవితాల్లోకి వెళ్లినప్పుడు ఎలా ఉంటుందో మాత్రమే కనిపించింది.
ఆ చిన్నారి నవ్వులో నాకు ప్రభుత్వం కనిపించింది.
ఆ రైతు చేతుల్లో మిగిలిపోయిన పొలంలో నాకు సంక్షేమం కనిపించింది.
ఆ తల్లి కళ్లలో నాకు పాలన కనిపించింది.
ఇప్పటికీ ఆ చిన్నారి పేరు గుర్తులేదు.
ఆ కుటుంబం ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియదు.
బహుశా…ఆ పాప ఇప్పుడు పెద్దదై ఉంటుందేమో.
చదువుకుంటూ ఉండొచ్చు. ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు.
తనకు చిన్నప్పుడు జరిగిన ఈ కథ కూడా తెలియకపోవచ్చు.
కానీ నాకు మాత్రం తెలుసు.
ఆమె బతుకులో ఒక రోజు…ఒక ప్రభుత్వ పథకం నిలబడింది.
ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఆమె గుండె చప్పుడు ఆగకుండా చేసింది.
సంక్షేమ పథకాల గురించి చాలా చర్చలు జరుగుతాయి.
కొంతమంది వాటిని ఖర్చు అంటారు. మరికొందరు వాటిని రాజకీయాలు అంటారు.
కానీ ఒక పేద రైతు తన పొలాన్ని తాకట్టు పెట్టకుండా కాపాడుకోగలిగితే…
ఒక తల్లి తన బిడ్డను డబ్బుల్లేక కోల్పోకుండా కాపాడుకోగలిగితే…
అది ఖర్చు కాదు. అది నాగరిక సమాజం తన పౌరుడికి ఇచ్చే భరోసా.
వైఎస్ రాజశేఖరరెడ్డి గురించి ఎన్నో రాజకీయ విశ్లేషణలు ఉండొచ్చు.
ఎన్నో విమర్శలు ఉండొచ్చు.ఎన్నో ప్రశంసలు ఉండొచ్చు.
అదంతా చరిత్ర నిర్ణయిస్తుంది. కానీ నా జీవితంలో మాత్రం ఆయనను గుర్తు చేసే మొదటి జ్ఞాపకం రాజకీయ సభ కాదు.
ఒక నెలల పాప గుండె మళ్లీ కొట్టుకోవడం.
ఒక రైతు తన పొలాన్ని కోల్పోకుండా నిలబడటం.
ఒక తల్లి కళ్లలో తిరిగి వెలిగిన చిరునవ్వు.
అందుకే ఆయన జన్మదినం వచ్చినప్పుడల్లా నేను పూలతో నివాళి అర్పించను.
ఆ చిన్నారి నవ్వును గుర్తు చేసుకుంటాను.
ఎందుకంటే…
ఆ రోజు బతికింది కేవలం ఒక పసిగుండె మాత్రమే కాదు.
ఒక రైతు ఆత్మగౌరవం బతికింది. ఒక కుటుంబం భవిష్యత్తు బతికింది.
అంతకంటే ముఖ్యంగా… ఒక పేద మనిషి ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకం బతికింది.



