నిర్దయ భారతంలో మరో నిర్భయ ఘటన!

ఓ వైద్యురాలిపై హత్యాచారం జరిగితే వైద్యులు మాత్రమే పోరాటం చేయాలా…? సమాజంలో ఇంకెవ్వరికి ఆ బాధ్యత లేదా?

ఇండియా డార్క్ చాప్టర్ పై.. ఇప్పుడు అమెరికా టైం స్క్వేర్ ప్లాజా సాక్షిగా జరుగుతున్న న్యాయపోరాటంలో మద్దతిస్తున్న జనం నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇది.

కలకత్తాలో జరిగింది… ముమ్మాటికీ, అనాగరిక సమాజంలో శాంతి కపోతంపై రక్తపు మరకలా మిగిలిపోయిన ఓ వికృత దుశ్చర్య!

నరహంతకుల పాశవిక క్రీడకు బలైన ఆ యువతి మౌనరోదన దేశవ్యాప్తంగా ఇంకా మార్మోగుతూనే ఉంది. డేగల చేతిలో ఛిద్రమైన ఆ తెల్ల పావురం ఆత్మ న్యాయం కోసం ఇంకా మన మధ్యనే తిరుగుతోంది.

లేడీ డాక్టర్ పై హత్యాచార ఘటనలో స్పందన.. మన దేశానికో, ఇంకే పరిధికో పరిమితమైంది ఎంతమాత్రం కాదు. మానవీయ విలువల కోసం ఆరాటపడే ఎల్లలు దాటిన యావత్ సమాజానిది.

గొంతులోని Hyoid ఎముక విరిగిపోయింది.. పెల్విస్ కూడా పగిలిపోయింది.. మర్మస్థానం కాదది నీ జన్మస్థానమంటూ వేటూరి వంటివారు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టిన దుశ్శాసన పర్వంలో తీవ్ర రక్తస్రావమైంది.. శరీరంపై విచ్చల విడిగా గాట్లు పడ్డాయి.. కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి.. తలలో రక్తస్రావం… శరీరంలో 150 గ్రాముల వీర్యం… ఇవన్నీ నిర్దయ భారతంలో మరో నిర్భయ ఘటనను తలపించే ఆకృత్యపు క్రీడా ఆనవాళ్లు!

అసలేం జరిగింది.. ?

రాధా గోబిందా కర్ వైద్య కళాశాల.. 1886లో నెలకొల్పిన కలకత్తాలోని ఈ మెడికల్ కళాశాలకు ఇప్పటివరకూ ఆసియాలోనే మొట్టమొదటి ప్రైవేట్ కళాశాలగా ఓ గుర్తింపు. కానీ, ఇప్పుడు ఆ గుర్తింపును చెరిపేంత ఘోర ఘటనతో ఇప్పుడీ కళాశాల మరోసారి పతాకశీర్షికలకెక్కింది. నిర్భయ వైద్య విద్యార్థిని.. కలకత్తా లోని R.G.KAR మెడికల్ కాలేజీలో పల్మనోలజీ విభాగంలో జూనియర్ డాక్టర్. రోజు మాదిరిగానే అర్థరాత్రి వరకు పనిచేసిన ఆమె.. తన స్నేహితురాళ్ళతో కలిసి కాలేజీలోని సెమినార్ హాల్ లో భోజనం చేసింది. ఆ తర్వాత కాసేపు అందులోనే ఒంటరిగా సేదతీరింది. సరిగ్గా మెడికల్ రికార్డ్ పరంగా ఉదయం 4 గంటల ప్రాంతంలో అగంతకుడు లోపలికి వచ్చినట్లు తెలుస్తుంది. తెల్లవారే సరికి విగత జీవిగా లేడీ డాక్టర్ శవమై మిగిలింది. ఉదయం 7 గంటల 30 నిమిషాలకు జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సైకో ప్రవర్తన వల్ల సదరు వైద్యవిద్యార్థినీ, జూనియర్ డాక్టరే ఆత్మహత్య చేసుకున్నట్టుగా మొదట కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. పైగా, తల్లిదండ్రులకు కనీసం ఆమె శవాన్ని కూడా చూసే అవకాశం ఇవ్వలేదు. ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో జీవచ్ఛవంగా పడి ఉన్న కూతురిని చూసిన తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. శరీరమంతా గాయాలు, రెండు కళ్ళు, నోటి భాగాలనుంచి తీవ్ర రక్తస్రావం… ఇవన్నీ చూసి వారి రోదన ఆర్తనాదమై R.G. KAR కాలేజీలో ప్రతిధ్వనించింది. సంచలనం రేపిన ఈ ఘటనలో ఆసియాలో మొట్టమొదటి ప్రైవేట్ మెడికల్ కళాశాలగా ఎస్టాబ్లిషైన చోట భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కళాశాల పరువు కోసం.. విషయాన్ని పక్కదారి పట్టించడం కోసం జరగాల్సినవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు దేశాన్నే పట్టికుదిపేసిన ఈ ఘటనపై యావత్ భారతంతో పాటు.. విదేశాల్లోనూ గళాలు గర్జిస్తున్నాయి.

దర్యాప్తు తీరుపై అనుమానాలు!

4 రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనపై పశ్చిమ బెంగాల్ లోని దీదీ ప్రభుత్వం నుంచీ పెద్దగా స్పందన లేకుండా పోయింది. పోలీసులు సంజయ్ రాయ్ అనే ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి హడావిడి చేశారు తప్ప.. వాస్తవాలేంటో ఇప్పటికీ వెల్లడి కాలేదు. అయితే R.G.KAR కాలేజి వైద్య విద్యార్థుల స్పందనతో.. పోరాటానికి తెరలేచింది. సోషల్ మీడియా వేదికగా ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారం సృష్టిస్తోంది. #JUSTICEFORNIRBHAYA2 హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు దేశవ్యాప్త విప్లవాన్ని సృష్టిస్తోంది. ప్రాంతాలకతీతంగా వైద్యులు, వైద్యరంగాల వారంతా కదులుతున్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వైద్యసంఘాలు, విద్యార్థినీ, విద్యార్థులు, ప్రజా సంఘాలు నిరసనలకు దిగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా న్యాయం కోసమంటూ నిత్యం క్యాండిల్ లైట్ ప్రదర్శనలు న్యాయ పోరాటాన్ని కళ్లకు కడుతున్నాయి.

దర్యాప్తు వేగవంతం చేయక తప్పని పరిస్థితుల్లో పోలీసులపై ఒత్తిడి పెరిగింది. ముందు ఆత్మహత్యగా కొట్టిపారేసి చేతులు దులుపుకునేందుకు యత్నించిన నిర్భయ కేసులో ఎంత దారుణం జరిగిందో పోస్ట్ మార్టం రిపోర్ట్ వెల్లడించింది. బాధితురాలిని చిత్రహింస చేసి, అత్యాచారం చేశారనే విషయాలతో పాటు.. ఆమెపై జరిగిన దాడిలో వెన్ను పూస నుండి కాలర్ బోన్ వరకు విరిగిపోయాయని, 150 గ్రాముల స్పెర్మ్ శరీరంలో ఉందన్న కొత్త విషయాలు రిపోర్ట్ లో వెల్లడయ్యాయి. రిపోర్ట్ విషయాలు వింటేనే.. మానవమాత్రులకు ఒళ్ళు జలదరించే పరిస్థితి ఉంటే.. ఆ యువతి ఎంత వేదననుభవించి ఉంటుందో ఈ సమాజం ఒక్కసారి ఆలోచించాల్సి ఉంది.

హైకోర్టుకు చేరిన కేసు!

తలా పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పద మృతిగా రిజిస్టరైన కేసులో.. ఎలాంటి పురోగతి లేదని బెంగాల్ అడ్వకేట్ కౌస్తవ్ బాగ్చీ కలకత్తా హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కలకత్తా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి TS శివజ్ఞానం బృందం.. కేసులో పురోగతి లేదని నిర్ణయించింది. క్రూర ఉన్మాద ఘటనగా పేర్కొంటూ.. కేసును ఏకంగా సీబీఐకి బదిలీ చేసింది. విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీచేసింది.

ఐరన్ లేడీ గా పేరుగాంచిన దీదీ సామ్రాజ్యంలో జరిగిన ఈ చీకటి అధ్యాయం.. ఆమె పాలనలో ఓ మాయని మచ్చ! రక్తసిక్తమైన శాంతి కపోతం తిరిగిరాదుగానీ.. ఈ హత్యచార బలికాండకు కారకులైన ఉన్మాదుల కఠిన శిక్ష తీర్పునైనా వింటేనైనా.. కనీసం ఆ పావురం ఆత్మ శాంతిస్తుంది.

నిష్పాక్షిక దర్యాప్తు జరిగి.. పారదర్శక నివేదికను సీబీఐ కోర్టుకు అందిస్తుందనే ఆశిస్తూ వేచి చూద్దాం!

JusticeForNirbhaya2

రిషీ, జర్నలిస్ట్✍️

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles