అప్పుడే పదేళ్లయిపోయిందా? మనలను ఆ మంద్ర మధుర మాండొలిన్ సామ్రాట్టు వదలి! ఆ విధిదెంత నిర్దయ? నిజానికి శ్రీనివాస్ సంగీతానికి మరణం లేదు.అతనెప్పుడూ సంగీతప్రియుల మనసులలో చిరంజీవే!! ఆ నాదమూర్తికి నీరాజనం! 🙏🏻
నేను గతంలో వ్రాసుకున్న నాలుగు మాటలు..
…………………………………………………………………………………………….
మోదుమూడి సుధాకర్.. ✍🏼 సంగీత విద్వాంసులు
‘ఇంట గెలిచి రచ్చ గెలవమని’ సామెత..అయితే అది, తెలుగునాట పుట్టిన,మా శాస్త్రీయ సంగీత కళాకారుల విషయంలో తారుమారు అయిన సందర్భాలే ఎక్కువ.ఇక్కడ పుట్టిన ప్రతిభావంతులు అనేకమంది ఇక్కడ ఆదరణ కరవై,తమిళనాడు వలస వెళ్ళి, పేరు తెచ్చుకున్న తరువాత, మనవాళ్లు వారిని పిలిచి,గౌరవించడం చూస్తూ ఉంటాం.
అందుకు ఒక ఉదాహరణ వివరిస్తాను..

అది పాలకొల్లు పట్టణం… వీధిలో దేదీప్యమానమైన దీపకాంతులతో ఒక పెళ్లిబృందం ఊరేగింపుగా వస్తోంది. పట్టుచీరెలు, వంటినిండా నగలతో ఆడవారు, సూటూబూటూ ధరించి మగవారూ నడుస్తుండగా,పూలరథంలా అలంకరించబడిన విదేశీకారు వెనకగా వారిని అనుసరిస్తోంది. అందులో నూతన వధూవరులున్నారు. వీటన్నిటికన్నా ముందు సాగుతున్న ఒక టాపులేని మినీవ్యాను జనాన్ని విశేషంగా ఆకర్షిస్తోంది. శ్రవణానందంగా సినీగీతాలను అలవోకగా ఎలక్ట్రిక్ మేండలిన్ వాద్యంపై పలికిస్తున్న ఒక ఎనిమిదేళ్ల పిల్లాడిని వింతగా చూస్తున్నారు జనం. వ్యానులో నిలబడి, మెడలో తగిలించుకున్న మేండొలిన్ పై ఆ పిల్లవాడి చేతివేళ్లు వేగంగా కదులుతూ, అందరికీ తెలిసిన హుషారైన కొత్త సినిమా పాటల్ని యధాతథంగా వినిపిస్తున్నాయి.
ఆ పిల్లవాడు, భవిషత్తులో సంగీత ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాడని అక్కడ ఎవరికీ తెలియదు. అతను మదరాసు వెళ్లి ఉండకపోతే, నేర్చుకొన్న కొద్ది సంగీతం మరచిపోయి, ఇప్పటికీ అలాగే పెళ్లి ఊరేగింపుల్లో సినిమా పాటలకే పరిమితమయేవాడేమో!
ఆ పిల్లవాడెవరో మీరు ఈ పాటికి ఊహించే ఉంటారు. ‘పద్మశ్రీ’ (ఉప్పలపు) మాండొలిన్ శ్రీనివాస్. అతని తండ్రి సత్యనారాయణ గారు, గురువు సుబ్బరాజు గారు చిరంజీవి శ్రీనివాస్ లోని ప్రతిభను చూసి, అతనిని గొప్ప సంగీత విద్వాంసుణ్ణి చేయాలనే పట్టుదలతో.. మదరాసు తీసుకువెళ్ళారు. ఆర్థికంగా చాలా సామాన్యులు కావటంచేత, అక్కడ వారెన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. శ్రీనివాస్ తనకు లభించిన ప్రతి కచేరీనీ ఒక సువర్ణావకాశంగా మలచుకొని, పెద్ద విద్వాంసులనాశ్రయించి, విద్యను పెంచుకున్నాడు. ఏకసంథాగ్రాహి కావటంచేత, అనితరసాధ్యమైన విద్వత్తు అతనిని వరించింది. అనతి కాలంలోనే శ్రీనివాస్ పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది.
……………………………………………………………………………………………………….
అది 1983 వ సంవత్సరం. పాలకొల్లు పట్టణంలోని ఒక సంగీత సభవారు, జగద్విఖ్యాతిగాంచిన తమ ఊరి ఆణిముత్యం శ్రీనివాస్ ను ‘మేండొలిన్ సామ్రాట్’ బిరుదుతో సత్కరించ దలిచి, మదరాసు వెళ్లి, శ్రీనివాస్ ను కలిశారు. 14 ఏళ్లకే, రోజూ కచేరీలతో ఖాళీ లేకుండా ఉన్నాడు చిరంజీవి శ్రీనివాస్. ఎలాగో ఫిబ్రవరి 6వ తేదీని ఖరారు చేసుకున్నారు.
ఆరోజు రానేవచ్చింది. జనంతో హాలు కిటకిటలాడింది పాలకొల్లులో. ఆ సభవారు రాష్ట్రస్థాయిలో ఏటా నిర్వహించే పోటీల్లో ప్రథమ బహుమతి అందుకొన్న నేను, ఆనాటి కార్యక్రమానికి ప్రత్యక్ష సాక్షిని.
ముందు,శ్రీనివాస్ కచేరీ ప్రారంభం అయింది. విలంబగతిలో కాంభోజి అటతాళ వర్ణం ప్రారంభించి, అనుభవజ్ఞులైన సహకారవాద్య విద్వాంసుల అనుసరణతో, గమక ప్రధానంగా పూర్వ, ఉత్తరాంగాలను, రెండు కాలాల్లోనూ హృద్యంగా పలికించాడు. శ్రోతలనుండి పెద్ద స్పందన రాలేదు. మరొక అంశం తరువాత, ప్రధాన రాగాలాపన ప్రారంభించాడు శ్రీనివాస్. సభలో రణగొణధ్వనులు ప్రారంభమయ్యాయి. వేదికపై కళాకారులు తమ ప్రదర్శనపై ఏకాగ్రత కోల్పోతున్నారు.
ఇంతలో సభానిర్వాహకుడు వేదికనెక్కి, శ్రీనివాస్ చెవిలో ‘జనమంతా రాగం తానం పల్లవి అడుగుతున్నారు. అది వాయించమని’ చెప్పాడు. మదరాసు నుండి వచ్చిన శ్రీనివాస్ ముఖం ఒక్క క్షణం ఆనందంతో వెలిగి, వెంటనే ‘తను ఉన్నది తెలుగు నేలమీద’ అని గుర్తు రాగానే వాడిపోయింది. ఈ శ్రోతలకు, సభవారికి కావలసింది నిజం రాగం తానం పల్లవి కాదని, ‘శంకరాభరణం’ సినిమాలోని ‘రాగం తానం పల్లవి’ అనేది అర్థమయింది. సినిమా పాటలు వాయించడం మానేశానని చెప్పినా, శ్రీనివాస్ ను అతి చిన్నతనం నుండీ ఎరిగిన సభానిర్వాహకుడు చనువుతో బెదిరించాడు ఆ పాట వాయించమని.
ఇక చేసేదిలేక, అయిష్టంగానే తలవంచుకొని, మొక్కుబడిగా ఆ పాట వాయించాడు చిరంజీవి శ్రీనివాస్. జనం నిశ్శబ్దంగా, శ్రద్ధగా విని, మారుమ్రోగే హర్షధ్వానాలిచ్చారు. మరిన్ని సినిమా పాటలు జనం అడిగే లోపే, మంగళంతో కచేరీ ముగించాడు చిరంజీవి శ్రీనివాస్.
ఆ సన్నివేశం చూసిన నాకనిపించింది..’అందుకనేనేమో! ఆనాటి నారాయణ తీర్థులవారి నుండి ఈనాటి మేండొలిన్ శ్రీనివాస్ వరకూ అందరూ తెలుగుదేశం వదలి, దక్షిణాది బాటపట్టినది’… అని.



