ఆపరేషన్ పోలోకు ముందే నిజాంకు ఓ కాళరాత్రి! సోషలిస్టులు సాయుధులైన పోరాటమది!!

సందర్భం!

రిషీ, జర్నలిస్ట్.. ✍🏼

అసలారోజేం జరిగింది?

1948 సెప్టెంబర్ 17 విమోచనమా, విద్రోహమా, విలీనమా ఇన్ని చర్చలోవైపు జరుగుతుంటే.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవం పేరిట మరో చర్చకు తెరలేపింది. నిజాం నిరంకుశ పాలనలో ఉన్నదని ఆరోపణలెదుర్కొన్న హైదరాబాద్ సంస్థానం.. ఆపరేషన్ పోలోతో భారతదేశంలో విలీనమవ్వడం ఓ చారిత్రక ఘట్టం. అయితే, ఆపరేషన్ పోలో కంటే ముందే.. నిజాం నవాబును ఆందోళనకు గురిచేసిన మరో ఆపరేషన్ పుస్తకాలకెక్కని మరో చరిత్ర! రికార్డులకెక్కని సాహసోపేతమైన ఆ ఆపరేషన్ డార్క్ నైట్ కథేంటో ఓసారి తెలుసుకుందాం. అందుకు మనమోసారి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం.

తెలంగాణా.. రకరకాల పోరాటాల ఉద్యమగడ్డ. తెలంగాణా సాయుధ పోరాటం, రైతాంగ పోరాటం, భూపోరాటం, మావోయిస్టుల పోరాటం, ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు చేసిన పోరాటం.. ఇలా చరిత్ర పుస్తకాలను తన పోరాటాల అస్తిత్వంతో పేజీలు నింపేసిన సుదీర్ఘ కథలిక్కడ కనిపిస్తాయి.

అలాంటి ఘట్టాల్లో రజాకార్లపై సాగిన తెలంగాణా సాయుధ పోరాటం… ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ పోలో గురించి కచ్చితంగా చెప్పుకోవాల్సిందే! నిజాం నుంచి వేరుపడి స్వేచ్ఛావాయువులు పీల్చుకుని భారత్ లో కలిసిన నాటి హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన కథ యాదితో.. ప్రతీ యేటా సెప్టెంబర్ 17ను వివిధ పార్టీలు, వివిధ వర్గాలు నాటి 1948 ఘటనను వివిధల రకాలుగా స్మరించుకుంటున్నాయి.

అయితే, చాలా ప్రాంతాల్లోలాగే.. తెలంగాణాలోనూ కమ్యూనిస్టులది ప్రత్యేక పాత్ర. కానీ, ఆ ఒక్క తాలూకాలో మాత్రం కమ్యూనిస్టులు అడుగు కూడా పెట్టలేకపోయారు. అయితే, అందుకు తమ ఉద్యమాల్ని శాంతియుతంగా నడపాలని గాంధేయ మార్గాన్ననుసరించిన రామ్ మనోహర్ లోహియా అడుగుజాడల్లోని.. సోషలిస్టులే ప్రధాన కారణం. అంతేకాదు, కమ్యూనిస్టులను మించిన కొత్త చరిత్రకు నాడు శ్రీకారం చుట్టి.. ఆ ప్రాంతంలో సోషలిస్టులు తమ ఉనికిని బలంగా చాటుకున్నారు.

ఇంతకీ ఏం చరిత్ర అది… ఎప్పుడు జరిగింది..?

కీచురాళ్ల సవ్వడి… కుక్కల అరుపులు… విరబోసుకున్న అమ్మాయి నల్లటి కురుల్లాంటి దట్టమైన చీకటి.. అందుకు సింబాలిక్ గా కనిపించే మర్రిచెట్ల ఊడలు.. దానికింద ఓ పోలీస్ స్టేషన్. వెరసి.. 1948 ఆగస్ట్ 27న అర్ధరాత్రి 2 గంటల సమయమది.. నాడు సైదాపూర్ మండలంలో రావికల్ గా పిలువబడి.. నేడు రాయికల్ గా స్థిరపడ్డ ఊళ్లోపోలీస్ స్టేషన్ పై ఓ గ్రెనేడ్ వచ్చి పడింది. అయితే, అదృష్టవశాత్తూ అది పేలలేదు. జస్ట్ ఆ పొగతో అక్కడున్న పోలీసులు, రజాకార్లు పరారయ్యారు. అందులో ఉన్న తుపాకులు, మందుగుండు సామాగ్రంతా తమ చేతుల్లోకి తీసుకుని ఊరంతా కలియదిరుగుతూ, గ్రామాన్నంతటిని చైతన్యపరుస్తూ ఓ బృందం బయల్దేరింది. అదే సోషలిస్ట్ బృందం. అప్పటివరకూ రామ్ మనోహర్ లోహియా ఆచరించిన అహింసా సిద్ధాంతాన్నే నమ్ముకున్న సమూహం. కానీ, నిజాం పాలకుల అరాచకాలపై దండోరా ప్రకటించాలని నిర్ణయించుకున్న ఆ సోషలిస్టులు… తమ ప్రాంతంలో కమ్యూనిస్టులు కూడా అడుగు పెట్టేందుకు జంకే స్థాయిలో నాటి పోరాటానికి మరపురాని ఓ శాశ్వతత్వాన్ని కల్పించారు.

నర్సింగరావు నేతృత్వంలో జరిగిన ఆ దాడిలో 15 మంది అగ్ర నాయకులు పాల్గొన్నారని… తనతో పాటు పడాల చంద్రయ్య అనే మరో కీలకపాత్రధారి కూడా నాటి ఘట్టంలో ఉన్నారని.. ప్రస్తుతం భీమదేవరపల్లిలో ఉంటున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్వాతంత్ర సమరయోధుల సంఘం అధ్యక్షుడు 93 ఏళ్ల బొజ్జాపురి వెంకటయ్య చెప్పిన మాట.

1947వ సంవత్సరంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ పేరుతో అప్పటి సభ్యత్వం కేవలం 25 పైసలు మాత్రమే. సేవాదళ్ యూనిఫామ్స్ తో 12 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మహాసభలైన నల్లబెల్లి, పల్లగుట్ట, జడ్చర్లలో పాల్గొన్నారు. అనాటి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. నాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రామానందతీర్థ.. సత్యాగ్రహ దీక్షకు ఆదేశించారు. ఆ దీక్ష నిర్విరామంగా కొనసాగేందుకు బుర్రకథలు, బహిరంగసభలతో అవగాహన కల్పిస్తూ ఒక లైవ్లీ మూమెంట్ కు శ్రీకారం చుట్టారు. ప్రతీరోజూ ఒక్కో గ్రామంలో ఈ దీక్షలో భాగంగా అవగాహనా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని చైతన్యపర్చే క్రమంలో.. బొజ్జాపురి వెంకటయ్యతో పాటు.. ఆర్. దామోదర్, గుడికందుల వడ్ల వీరయ్య, చిదురాల వీరయ్యను అరెస్ట్ చేశారు.

అయితే, ఆపరేషన్ డార్క్ నైట్ గా మనం చెప్పుకుంటున్న రావికల్ పోలీస్ స్టేషన్ ఘటనకు బలమైన కారణాలే ఉన్నాయి. అహింసా మార్గాన పయనించే సోషలిస్టులు.. సాయుధులయ్యేందుకు అలాంటి ఘటనలే బలంగా పురిగొల్పాయి.

అది 1948 జూలై 27న మల్లారం అనే గ్రామంలో జాతీయజెండా ఎగురేసేందుకు 50 మంది కార్యకర్తలు బయల్దేరారు. సరిగ్గా అప్పుడే ఎంటరయ్యాడు మల్లారం ముస్లీం మక్తేదార్ గులాం దస్తగీర్. పది మంది యువకులైన రజాకార్లను వెంటపెట్టుకొచ్చి… జెండా ఎగురేయొద్దని హుకుం జారీ చేశాడు. కానీ, సోషలిస్టులు బెదరలేదు సరికదా.. ఎత్తిన జెండా దింపేదే లేదన్నట్టుగా తిరుగుబాటు చేశారు. దాంతో రెచ్చిపోయిన గులాం దస్తగీర్ తన తుపాకీతో కాల్పులు జరపగా.. గుజ్జ వీరయ్య అనే ఉద్యమకారుడు అసువులు బాసాడు. దస్తగీర్ పరారయ్యాడు. అక్కడితో ఆగకుండా నాటి నిజాం పాలనలోని పోలీస్ బలగాలు వచ్చి తెల్లవారి మరికొందరు సోషలిస్ట్ నాయకులను అరెస్ట్ చేశారు. ఆ ఘటన మరింత అగ్గి రాజేసింది. అదే సమయంలో హుజూరాబాద్ తహశీల్ కార్యాలయంపై కూడా జెండా ఎగురేసేందుకు పెద్దఎత్తున ప్రజలు ఏకం కాగా.. అప్పుడూ పోలీస్ కాల్పులు జరిపారు. దాంతో తిరుగబడిన ప్రజలు ఒడిశెలు, రాళ్లతో ఎదురుదాడికి దిగడంతో కాల్పులు జరిపిన సీఐ అక్కడికక్కడే మృతి చెందాడు. అది నిజాం నవాబును మరింత రగిలించింది. రజాకార్లు, నాటి పోలీసులు కలిసి గ్రామాలపై చేసిన దాడులు, దౌర్జన్యాలు, ఆడవారిపై మానభంగాలకు పాల్పడటం వల్ల… సత్యాగ్రహ దీక్షను కూడా విరమించుకున్నారు సోషలిస్టులు.

అయితే, స్టేట్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాడు కేవీ నర్సింగరావు నేతృత్వంలో మహారాష్ట్రలోని బార్డర్ లో చాందా క్యాంప్ ఏర్పాటు చేయగా…. అక్కడకు చేరుకున్న రావికల్ ప్రాంతపు సోషలిస్టులు ఆ మిల్ట్రీ క్యాంపులో ఆయుధ శిక్షణ పొందారు. గెరిల్లా తరహా పోరాటాల్లో శిక్షణనంతరం తిరిగి వచ్చిన సోషలిస్టులు.. ఇక నిజాం పోలీసుల భరతం పట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో బొజ్జాపురి వెంకటయ్య కొత్తగూడెం సింగరేణి ప్రాంతానికి వెళ్లి.. కనపర్తిలోని బంధువైన కొమురమ్మతో రహస్యంగా గ్రెనేడ్ తెప్పించుకుని.. అంతే రహస్యంగా జమ్మికుంటకు రైల్లో తిరిగివచ్చాడు.

1948 ఆగస్ట్ లో ఓవైపు సోషలిస్టుల ఉద్యమం తీవ్రమవుతోంది.. మరోవైపు అరెస్టుల పర్వం కొనసాగుతోంది.. హుజూరాబాద్, రావికల్, జమ్మికుంట వంటి ప్రాంతాలన్నీ కల్లోలంగా మారాయి. ములకనూర్ రిజర్వ్ పోలీసులు అమాయకులైన ఏడుగురు పశుల కాపర్లను లైన్ గా నిలబెట్టి కాల్చిచంపారు.

ఇక ఆ ఆకృత్యాలను భరించలేని స్థితిలో అప్పటివరకూ అహింసా పరమో ధర్మ: అనుకున్న సోషలిస్టులు సాయుధులయ్యారు. అలా 200 మందిని పోగు చేశారు. రజాకార్ల రాక్షసత్వానికి… నాటి నిజాం పాలకులు పంపిన పోలీసుల నిరంకుశత్వానికీ వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. 50 మంది కలిసి ఒక్కో వరుసగా, సమూహంగా ఏర్పడి… మొత్తం 2 వందల మంది ఒక పథకం ప్రకారం రాయికల్ పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు.

1947, ఆగస్ట్ 15నే భారతదేశానికి బ్రిటీష్ కంబంధహస్తాల నుంచి స్వాతంత్ర్యం లభించినా.. ఇంకా తన హైదరాబాద్ సంస్థానం మాత్రం తమ వద్దే ఉందన్న ఒకింత గర్వంతో నాడు నిజాం 1948, సెప్టెంబర్ 17ను ఊహించి ఉండకపోవచ్చు. అయితే, అదే సమయంలో అంతకంటే ముందే తనలో కల్లోల పరిస్థితులకు కారణమవుతుందని.. 1948, ఆగస్ట్ 27 అనే రోజే తనకు నిద్రలేని రాత్రులను మిగిల్చే ఓ కాళరాత్రి అవుతుందనీ నాటి నిజాం నవాబ్ అంతకంటే కూడా ఊహించి ఉండరు. కానీ, ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరు చెప్పగలరు.. అదే డెస్టినీ అంటే!

రాయికల్ పోలీస్ స్టేషన్ పై దాడితో నిజాం ఉలిక్కిపడ్డాడు. వేల సైన్యంతో అక్కడి సోషలిస్టులపై దాడికి ఉసిగొల్పాడు. రజాకార్లు, పోలీసులు రాయికల్ తో పాటు.. నాడు సోషలిస్ట్ ఉద్యమంలో పాల్పంచుకున్నవారిపై విచక్షణారహితంగా దాడులు చేసి ప్రజల్ని చిత్రహింసలు పెట్టారు. కానీ, నాటి కమ్యూనిస్టుల చరిత్ర వలే.. ఈ సోషలిస్ట్ ఆపరేషన్ డార్క్ నైట్ అనే రాయికల్ ఠాణాపై జరిగిన దాడి రికార్డులకెక్కలేదు.

నాడు నిజాం నవాబులో వణుకు పుట్టించిన నాటి ఆపరేషన్ డార్క్ నైట్ లో పాల్గొన్న ప్రముఖుల్లో దుగ్గిరాల వెంకటరావు, పడాల చంద్రయ్య, బొజ్జాపురి వెంకటయ్య ,సంజీవరెడ్డి, పెంటకుర్తి మోహన్ రెడ్డి.. జమ్మికుంట ప్రాంతంలోని కనపర్తి గ్రామానికి చెందిన బంగారి కనకయ్య, బంగారి వెంకటస్వామితో పాటు.. మహాకళ రాజపాపిరెడ్డి, వెంకట నర్సయ్య, రాంరెడ్డి, వెంకటపాపయ్య లాంటి అనేక మంది పాల్గొన్నారు.

రాయికల్ పోలీస్ స్టేషన్ కథేంటి..?

నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. అప్పుడు 7 తాలూకాలతో విస్తరించి ఉండేది. అందులో హుజురాబాద్ తాలూకా ఒకటి. అయితే, సైదాపుర్ మండలం రాయికల్ పోలీస్ స్టేషన్ మాత్రమే నాటి ఉమ్మడి జిల్లాకు ఏకైక పోలీస్ స్టేషన్ అప్పట్లో.

నిజాం హయాంలో 1931లోనే ప్రస్తుత సైదాపూర్ మండలంలోని రాయికల్ లో పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు.చేశారు. హుజురాబాద్ తాలూకా దక్షిణ ప్రాంతంలో సోషలిస్టుల నాయకత్వంలో నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు ఏకమవుతున్నారన్న కారణంతోనే ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. రాయికల్ గ్రామాన్ని అనువైన ప్రాంతంగా గుర్తించి.. ఇక్కడ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. నిజాం హయాం నుండే తాలుకాగా ఉన్న హుజురాబాద్ తాలూకా పరిధి.. ఒకవైపు వెల్ది, వేగురుపల్లి.. మరోవైపు కట్కూరు, కన్నారం గ్రామాల సరిహద్దులుగా విస్తరించి ఉండేది.

ఆ రోజుల్లో ఎస్ఐని అమీన్ సాబ్ అని.. హెడ్ కానిస్టేబుల్ ను జమేదార్ సాబ్ అని.. కానిస్టేబుల్ ను జవాన్ అని పిలిచేవారు. 1902 ప్రాంతంలోనే కానిస్టేబుల్ కు నెలకు ఆరు రూపాయల వేతనం ఉండేది. బయటకు వెళ్తే రోజుకు రెండు అణాలు (12 పైసలు) రవాణా భత్యంగా ఇచ్ఛేవారు.
ఇలా నిజాం రాజుల పాలన హయాంలో ఏర్పడిన రాయికల్ పోలీస్ స్టేషన్ ను ఒక అమీన్ సాబ్, ఒక జమేదార్ సాబ్, నలుగురు జవాన్లను నియమించి ఏర్పాటు చేశారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఈ పోలీస్ స్టేషన్ భవనంలో అమీన్ సాబ్ గదితో పాటు… అప్పట్లో మెహర్రీగా పిల్చే రైటర్ గది, ఆయుధాల భద్రతకు ఒక గది, రెండు లాకప్ గదులు, ఒక హాల్ ను ఏర్పాటు చేశారు. అప్పట్లో ముల్కనూరులోగానీ, భీమదేవరపల్లిలోగానీ పోలీస్ స్టేషన్ లేదు. రాయికల్ పోలీస్ స్టేషన్ నుంచే.. హుజురాబాద్ తాలూకా ప్రాంతాన్ని పర్యవేక్షించేవారు.

అహింసా మార్గాన్ని వీడి సాయుధ పోరాటానికి దిగిన సోషలిస్టుల కథ ఇది!

1931 లో స్వాతంత్రం కోసం తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా బద్దం ఎల్లారెడ్డి, అనభేరి ప్రభాకర్ వంటి కమ్యూనిస్టులతో పాటు.. స్వామి రామానంద తీర్థ, సోషలిస్ట్ ఉద్యమ నాయకుడైన డాక్టర్ రాం మనోహర్ లోహియా వంటివారెందరో పనిచేశారు.

కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేస్తే.. సోషలిస్టులు అహింసా మార్గాన్నెంచుకున్నారు. అయితే, అందుకు భిన్నమైన పరిస్థితి హుజూరాబాద్ సోషలిస్ట్ నాయకుల్లో కనిపించింది. అంతేకాదు.. నాటి ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా అమితంగా ప్రభావితం చేస్తూ కనిపించిన కమ్యూనిస్టులు.. హుజూరాబాద్ లో మాత్రం కాలు పెట్టలేకపోయారు. ఎందుకంటే ఆ ప్రాంతమంతా సోషలిస్టుల చేతుల్లో బలంగా ఉండేది. అలా నాటి ఉమ్మడి కరీంనగర్ లోని 6 తాలూకాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్నా.. హుజురాబాద్ లో మాత్రం సోషలిస్టులదే ఆధిపత్యం.

అహింసా సిద్ధాంతంతో పోరాడే సోషలిస్టులు కూడా హింసాత్మక తిరుగుబాటుకు పూనుకున్న ఏకైక ఘటన.. రాయికల్ పోలీస్ స్టేషన్ పై దాడి. నాటి పాలకుల చీకటి ఆకృత్యాలు, దౌర్జన్యాలు తట్టుకోలేకే.. సోషలిస్టులు తమ పోరాట పంథాను మార్చి ఆయుధాలు పట్టేలా చేసింది.

కొసమెరుపేంటంటే.. ఈ అంశాల్ని దివంగత ప్రధాని పీవీసాబ్ తన గొల్లరామవ్వ కథలు అనే పుస్తకంలోనూ పేర్కొన్నారు.

ఇదిగో ఆ ఘటనే.. ఆపరేషన్ పోలో కంటే ముందే నిజాం వెన్నులో వణుకు పుట్టించి.. ప్రజా తిరుగుబాటు సత్తా ఏంటో గిరిగీసి చెప్పిన వెలుగు చూడని ఈ చీకటి కథ!

ఇలా రికార్డులకెక్కక.. కనుమరుగైన చరిత్రలు వెలుగులోకొస్తున్నప్పుడు.. “నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పు… మీ లిఖిత చరిత్రలో ఎవరి గురించి రాశారు…? మీ గురించే కదా…?? అందుకే ఎక్కడా నా ప్రస్తావన లేదు!” అంటూ నాడే సామాజిక వివక్షపై మహాప్రస్థానంలో శ్రీశ్రీ చెప్పిన మాటలోసారి గుర్తుకొస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles