ఓ కండక్టర్ కాస్తా రజనీ అయినట్టు.. ఆ కండక్టర్ లైబ్రేరియన్ అయ్యాడు!

బస్ కండక్టర్ గా పనిచేసిన శివాజీరావ్ గైక్వాడ్… తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గా అందరికీ సుపరిచితుడే. మరి, అదే ఓ బస్ కండక్టర్.. 20 లక్షల పుస్తకాల లైబ్రరీని ఐదు దశాబ్దాలుగా నిర్వహిస్తుంటే… చదువరుల దృష్టిలో ఆయనా ఓ సూపర్ స్టారే! కండక్టర్ కాస్తా గ్రంథాలయ ఉద్యమకారుడిగా మారి.. ఇప్పుడేకంగా భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్న ఆ అంకె గౌడ కథ కాస్త తెలుసుకుందాం రండి.

కర్నాకలోని ఓ గ్రామం హరళహల్లి. అక్కడ 75 ఏళ్లకు పైబడ్డ ఓ వ్యక్తి అందరిలానే నివశిస్తున్నాడు. అలాగే, అందరికంటే మరింత ప్రత్యేకంగా పేరు సంపాదించుకున్న సామాన్యుడు. ఆయనే అంకె గౌడ. ఇప్పుడాయన ఇల్లు 20 లక్షల పుస్తకాలతో నిండిన ఓ లైబ్రరీ. అరుదైన లిఖిత ప్రతుల నుంచి బహుభాషా నిఘంటువుల వరకూ అల్మారాలతో కనిపించే గ్రంథాలయం.

కన్నడంలో పుస్తక మానే అని పిల్చుకునే ఆ బుక్ హౌజ్ తలుపులు చదవడానికిష్టపడేవారికి ఎప్పుడైనా తెరిచే ఉంటాయి.

తాను యువకుడిగా ఉన్నప్పుడే కండక్టర్ జాబ్ సాధించిన అంకెగౌడ.. కన్నడ సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. కండక్టర్ గా ఉద్యోగం చేసే క్రమంలో సంపాదించిన ప్రతీ రూపాయిని అవసరమైతే తప్ప ఖర్చు పెట్టేవాడుకాదు. మిగతా అంతా ఆదా చేసే పొదుపరి అంకెగౌడ. తనకు ఓ ప్రొఫెసర్ తో పరిచయమేర్పడింది. ఆయన అంకెగౌడను పుస్తక ప్రపంచానికి మరింత చేరువ చేశాడు. నేర్చుకోవాలనే తపనను పెంచాడు. ఆ స్పార్క్ పుస్తకాల వైపు అంకెగౌడ మనసును లాగేసింది. పైసా పైసా కూడబెట్టిన అంకెగౌడ.. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ, ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్న వీరేశలింగం పంతులు చెప్పిన మాటల్ని నిజం చేశాడు. పొదుపు చేస్తూ వచ్చిన తన డబ్బంతా పుస్తకాలపైనే ఖర్చు పెట్టాడు.

పుస్తకమున్న చోటే తన జీవనం!

పుస్తక పఠనంపై మక్కువ ఏర్పడ్డాక అందులో టింజ్ అర్థమైన గౌడ.. చిన్న చిన్న ఆనందాలను, కొన్ని అవసరాలను కూడా వదులుకుని పొదుపు చేసిన డబ్బును పుస్తకాలపైనే వెచ్చించాడు. చివరకు ఎక్కడైతే లైబ్రరీ ఏర్పాటు చేశాడో అక్కడే తనూ జీవిస్తానంటూ.. మైసూర్ లో ఉన్న తన ఇంటినీ అమ్మేశాడు. ఇక గ్రంథాలయమే తన సరస్వమైపోయింది. తన భార్య విజయలక్ష్మి, కొడుకు సాగర్ కూడా ఇప్పుడు ఆ లైబ్రరీ నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్నారు.

పుస్తక మానే చదువరుల నిధి!

వ్యక్తిగతంగా పుస్తకాల పట్ల అంకెగౌడకు ఏర్పడిన ఇష్టం కంటే కూడా.. ఇప్పుడా నిధి తన చుట్టూతా సమాజానికి ఆయన ఇచ్చిన ఓ వరంగా మారింది. పాఠశాల విద్యార్థుల నుంచి పరిశోధనా పండితులు, రచయితలు, సుప్రీంకోర్ట్ జడ్జీల వరకూ ఎందరో ఆ లైబ్రరీలో అడుగుపెట్టినవారే. ఓ వ్యక్తి కృషి వల్ల అంతలా విస్తరించిన ఆ లైబ్రరీని చూసి ఆశ్చర్యపోయినవారే.

అక్కడి అల్మారాలు 20కి పైగా భాషల్లో మనల్ని రారమ్మని పిలుస్తూ ఆయా భాషల్లోని గ్రంథాలను కళ్లకు కడతాయి. కేవలం భారతీయ భాషలకు సంబంధించినవే కాదు.. విదేశీ భాషల్లోని కొన్ని ముఖ్యమైన గ్రంథాలూ ఇప్పుడు అంకెగౌడ నిర్వహణలోని పుస్తకమానేలో దర్శనమిస్తాయి. ప్రాచీన తత్వశాస్త్రం నుంచి మొదలు.. సైన్స్, టెక్నాలజీ, పొయెట్రీ, అరుదైన తాళపత్ర గ్రంథాల వంటివి 5 లక్షల వరకూ ఆ లైబ్రరీ సొంతం చేసుకుంది. అరుదైన విదేశీ శీర్షికలు, బహు భాషా డిక్షనరీస్, 19వ శతాబ్దపు పుస్తకాలవంటివీ వరుస క్రమంలో పలకరిస్తాయి.

ప్రారంభంలో తను సేకరించిన బుక్స్ ఎక్కడ పెట్టాలో అంకెగౌడకు తెలియకపోయేది. దాంతో సంచులు కట్టి, లేకుంటే ఏదైనా ఓ గదిలో వరుసలు పేర్చి పెట్టేవాడు. కర్నాటకకు చెందిన పారిశ్రామికవేత్త శ్రీ హరి ఖోడే లైబ్రరీ నిర్మాణం కోసం ముందుకొచ్చారు. మరికొందరు స్థానికులు, శ్రేయోభిలాషులు కూడా చేయి చేయి వేసి ఓ శాశ్వత నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడా ఆర్కైవ్ రాబోయే తరాలకు కూడా ఓ దిక్సూచిలా కనిపిస్తోంది.

ఓ అభ్యాసన కేంద్రంలా పుస్తకమానే!

పుస్తకమానేను కేవలం అల్మారాలు, పుస్తకాలతో నింపడం ధ్యేయం కాదు. ఎలాంటి అడ్డంకులు లేకుండా, లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా, స్వేచ్ఛగా ఆలోచించేవారందరికీ కావల్సినవి అన్వేషించే ఓ విజ్ఞాన భాండాగారం.

75 ఏళ్ల వయస్సులో కూడా అంకెగౌడ పుస్తకాలను శుభ్రపరుస్తూ కనిపిస్తాడు. అయితే, నేటి మారుతున్న కాలానికి తగ్గట్టుగా అక్కడున్న విజ్ఞాన సంపదను డిజిటైలజేషన్ చేస్తే బాగుండుననే అభిప్రాయం అంకెగౌడ నుంచి వినిపిస్తుంది. కానీ, అంత నిధులెక్కడివన్న ప్రశ్నా మళ్లీ ముందుకొస్తుంది.

పరధ్యానంలో వడివడిగా నడిచే ప్రపంచంలో… గౌడలాంటివాళ్లు బహు అరుదు. కర్నాటకలోని ఓ చిన్న ఊరు నుంచి తానేమీ ఆశించకుండా నల్గురికీ విజ్ఞానం పంచాలనుకున్నాడు. అందుకు, లైబ్రరీ నిర్మాణంతో ఓ వేదికను తయారుచేశాడు. అందుకే, బస్ కండక్టర్ శివాజీరావ్ గైక్వాడ్ రజనీకాంత్ గా మారి సూపర్ స్టార్ అయితే… ఈ బస్ కండక్టర్ పుస్తకానికున్న విలువను తన చుట్టూ సమాజానికి చాటిచెప్పిన సూపర్ స్టార్ అయ్యాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles