ఏ అంశంపైనైనా ప్రేమలో పడ్డారో.. అది ఏ పనైనా చేయిస్తుంది. యూఎస్ లో మంచి జీతాన్ని వదులుకుని చెట్టూ, పుట్టా, గుట్టా అంటూ వన్యప్రాణుల ఫోటోల కోసం ఇండియాకు తిరిగివచ్చిన ఫోటోగ్రాఫర్ సుయాష్ కేసరీది అదే తరహా! 19 ఏళ్లకే తానంతగా ఇష్టపడి ప్యాషన్ పెంచుకున్న ఫోటోగ్రఫీలో నేచర్స్ బెస్ట్ ఫోటోగ్రఫీ ఆసియా అవార్డునందుకుని.. దాన్నేకంగా వాషింగ్టన్ DCలోని స్మిత్సోనియన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలోనూ ప్రదర్శించే స్థాయికెదిగిన ఆ ఛాయాచిత్రకారుడి కథకు ఓ ఆడ పులిపిల్ల స్ఫూర్తంటే మీరు నమ్మగలరా…? జూలై 29, ఈరోజు ఇంటర్నేషనల్ టైగర్స్ డే సందర్భంగా ఈ కథ చెప్పుకుందాం.

మధ్యప్రదేశ్‌కు చెందిన సుయాష్ కేసరికి ప్రకృతన్నా, వన్యప్రాణులన్నా ఎనలేని ప్రేమ. బాంధవ్‌ఘర్ నేషనల్ రిజర్వ్ పార్క్ లో సోలో పేరుతో ఉన్న ఓ ఆడ పులి అసహజ మరణం సుయాష్ ను కలిచివేసింది. అప్పటికే ఓ టీవీ ఛానెల్ లో ప్రెజెంటర్ గా, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్న సుయాష్.. ఆ ఆడపులి మరణంతో కొంతకాలం తన వృత్తికి కూడా విరామమిచ్చాడు. ఎందుకంటే ఆ పులితో సుయాష్ కు ఏర్పడిన అనుబంధమే అందుకు ప్రధాన కారణం. బాంధవ్‌గఢ్‌లో ఆ పులి పిల్ల జన్మించిన్నాట్నుంచీ.. పెరిగి పెద్దదై మిగిలిన పులులతో ఫైటింగ్ చేసే వరకూ వివిధ రకాల సోలో టైగ్రెస్ ఫోటోలను తన కెమెరాలో బంధించిన అనుభవంతో పాటు.. ఆ క్రమంలో ఏర్పడిన అనుబంధమే.. సుయాష్ ను దిగ్భ్రాంతికి గురిచేసింది.
” సోలో నీది నా జీవితంలో చాలా కీలకపాత్ర. నేను నీతో ఎన్ని లెక్కలేని గంటలు గడిపానో నాకే గుర్తులేదు. ముందు నిన్ను నా కెమెరాలో బంధించడానికి నీ గురించి తెలుసుకునే యత్నం చేశా. ఆ తర్వాత నీ నుంచే నేను చాలా నేర్చుకున్నా. ప్రేమ, ఆప్యాయత, కుటుంబం, ధైర్యం వంటి ఎన్నో లక్షణాలను నేను నీ నుంచి తెలుసుకున్నా” అంటూ తన సోషల్ మీడియా టైమ్ లైన్స్ పై కూడా పోస్టింగ్స్ చేశాడు ఆమధ్య సుయాష్.
ఎందుకు సోలో అంటే సుయాష్ కు ప్రత్యేక ప్రేమ అంటే..? తన 25 ఏళ్ల ఫోటోగ్రఫీ జీవితంలో సోలోదే ఎంతో కీలకపాత్ర. ” సఫారీ విత్ సుయాష్ ” పేరుతో సుయాష్ రూపొందించిన ఐదుభాగాల సీరిస్ లో సోలోనే లీడ్ రోల్. ఆ సీరీస్ తన సోషల్ మీడియా సైట్స్ ద్వారా వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) దృష్టిలో పడింది. ఆ తర్వాత ఆ సీరీస్ కొనసాగింపుకు WWF యే ఫండ్స్ కేటాయించగా.. వన్యప్రాణి పరిరక్షణ ఎంత అవసరమో జనం కళ్లు తెరిపించేలా ఆ సీరీస్ తన థర్డ్ ఐతో రూపొందించాడు సుయాష్. అదే సుయాష్ కు తర్వాతి రోజుల్లో యానిమల్ ప్లానెట్ ఛానెల్ లో అతి పిన్నవయస్సులో ప్రెజెంటర్ అవకాశాన్ని కూడా తెచ్చిపెట్టింది. అంతేకాదు మొదట చెప్పుకున్నట్టుగా 19 ఏళ్ల వయస్సులో ఆ ఆడపులి పిల్లను తీసిన ఫోటోలకే సుయాష్ కు నేచర్స్ బెస్ట్ ఫోటోగ్రఫీ ఆసియా అవార్డును తెచ్చిపెట్టింది. ఆ ఫోటోనే ఫోటోగ్రాఫర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే వాషింగ్టన్ DCలోని స్మిత్సోనియన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ఒక సంవత్సరం పాటు ప్రదర్శించబడింది.
“వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై తనలో అవగాహన పెంచింది జూ అంటాడు సుయాష్”
చాలా మంది పిల్లలు టామ్ & జెర్రీ వంటి కార్టూన్‌లను చూడటానికి, నేటి పిల్లలైతే మోబైల్ గేమ్స్ ఆడటానికో ఇష్టపడతారు. కానీ సుయాష్ మాత్రం తన బాల్యమంతా డిస్కవరీ, యానిమల్ ప్లానెట్ వంటి ఛానెల్స్ లో జంతువులు, పర్యావరణ వ్యవస్థ వంటివాటినే చూసుకుంటూ పెరిగాడు. దాంతోపాటే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో నివసించిన సమయాల్లో ఎక్కువగా జాతీయ పార్కులు, జంతు ప్రదర్శనశాలలను సందర్శించడంతో సుయాష్ కు జంతువుల పట్ల వల్లమాలిన ప్రేమ ఏర్పడింది. కోల్ కత్తాలోనూ తన తల్లితండ్రులతో వేసవి సెలవుల్లో గడిపేందుకు వెళ్లినప్పుడు కూడా.. అలీపూర్ లోని జూపార్కుకు తరచూ వెళ్తుండేవాడు. అలా జూలలో పులులను బోనుల్లో చూసి చప్పట్లు కొట్టే సందర్భంలో అవి తిరిగి చూస్తున్నప్పుడు.. సుయాష్ తాత వాటి సహజ నివాసాలు అడవులని చెప్పిన మాటలు సుయాష్ ఆరేడేళ్ల వయస్సులోనే ఆయన మనస్సులో నాటుకున్నాయి. పంజరాలు జైళ్లవంటివన్న ఆలోచనతో ఆయనలో వన్యప్రాణుల పట్ల దృక్పథం మారిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత సుయాష్ తన తండ్రి కెమెరానుపయోగించి జంతువుల చిత్రాలను క్లిక్ చేయడం ప్రారంభించాడు. బేర్ గ్రిల్స్, నిగెల్ మార్వెన్, క్రిస్ ప్యాక్‌హామ్ వంటి ఫోటో ప్రెజెంటర్స్ ను ఫాలో అవుతూ మెల్లిమెల్లిగా ప్రేరణ పొందేవాడు. భారత్ అడవుల్లోని వన్యప్రాణులను విదేశీ ఫోటోగ్రాఫర్స్ వచ్చి అందంగా బంధించి ప్రపంచానికి చూపెడుతున్నప్పుడు.. మనం భారతీయులం మాత్రం ఆ పని ఎందుకు చేయకూడదన్న కసి సుయాష్ లో మరింత పెరిగింది.
” ఆదిలో అంత ప్రోత్సాహమూ దక్కకపోగా నిరాశే ఎదురైంది. “
17 సంవత్సరాల వయస్సులో సుయాష్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ వృత్తినెంచుకుని.. అడవుల్లో అన్వేషణకు బయల్దేరాడు. కానీ వన్యప్రాణి సంరక్షకులు, అటవీశాఖ అధికారులు, ఇతర అధికారుల నుంచి కెరీర్ మొదట్లో ఏమాత్రం ప్రోత్సాహం లభించకపోగా… ఈ ఫీల్డ్ శుద్ధ దండగనీ ముఖం మీదే చెప్పేశారు. ఎలాంటి డబ్బులాశించకుండా, మీరిచ్చే సర్టిఫికెట్స్ వంటివి కూడా అవసరం లేకుండా మీరెది చెబితే అది చేస్తూ.. ఇంటర్న్ షిప్ చేస్తానని చెప్పినా అధికారులు ససేమిరా అనడంతో.. సుయాష్ రూట్ మారింది. అలా తన అభిరుచిని విడిచిపెట్టి.. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మాస్టర్స్‌ని అభ్యసించడానికి US బాట పట్టాడు సుయాష్. తను ఒక మంచి స్థిరమైన ఉద్యోగంలో సెటిలై.. కాస్తోకూస్తో సంపాదించుకున్న తర్వాత తాననుకున్న ఫీల్డ్ లో మళ్లీ ప్రయత్నం మొదలెట్టాలన్న ఆశను మాత్రం సుయాష్ వదులుకోలేదు.
“అసలు సుయాష్ ఎలా వెలుగులోకొచ్చాడు…?”
చాలామందిలాగే.. సుయాష్ కూడా సోషల్ మీడియా స్యావీ. తన విద్యాభ్యాస కాలం నుంచే తను క్లిక్ చేసిన ఫోటోలను శీర్షికలతో సహా పోస్ట్స్ పెడుతూ మన్ననలందుకునేవాడు సుయాష్. యువత చిన్నగా, ఫన్నీగా ఉండే క్యాప్షన్ తో కూడినవాటిని ఎక్కువ ఇష్టపడటాన్ని గమనించిన సుయాష్.. తన ఫోటోలకూ అలాంటి శీర్షికలే పెట్టడం వల్లే నెటిజనం స్పందననందుకున్నట్టు చెబుతాడు. అలా తన క్లిక్కులకు లైకులు, కామెంట్స్, షేర్స్ రూపంలో వస్తున్న స్పందనలతో.. మెల్లిగా సఫారీ విత్ సుయాష్ సీరీస్ తయారు చేయాలనే కోరికకు అంకురార్పణ జరిగింది.
మధ్యప్రదేశ్ స్థానికుడైన సుయాష్ కు చిన్ననాటి నుంచే పరిచయమున్నను బాంధవ్‌గర్ నేషనల్ రిజర్వ్ పార్కునే తన సీరిస్ నిర్మాణం కోసం కేంద్రంగా ఎంచుకున్నాడు. కొందరు స్పాన్సర్స్, రచయితలతో కలిసి అక్టోబర్ 2018లో సిరీస్‌ని చిత్రీకరించాడు. ఏదో కనిపించిన జంతువునల్లా ఫోటోలు కొట్టుకుంటూ వెళ్లడం కాకుండా.. ఓ క్రమపద్ధతిలో అద్భుతమైన స్టోరీ నేరేషన్ తో ఉండేలా అటవీశాఖ నిపుణులు, కొందరు కథా రచయితల సహకారాన్నీ తీసుకున్నాడు. అంతేకాదు ఆ క్రమంలో పలు పుస్తకాలు చదవటం, యూట్యూబ్ వైల్డ్ లైఫ్ ఛానల్స్ ను వాచ్ చేయడం వంటివి చేస్తూ.. మొత్తంగా ఓ అద్భుతమైన వైల్డ్ లైఫ్ దృశ్యకావ్యాన్ని సీరిస్ రూపంలో తీసుకొచ్చాడు సుయాష్.
” WWF ను ఆకట్టుకోవడంతో మారిన దశ “
సుయాష్ సోషల్ మీడియా కంటెంట్‌ని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ (WWF) చూసింది. తను తన పోస్టులను ట్యాగ్ చేస్తుండటం వల్ల వారి దృష్టిలో పడటంతో పాటు.. వారికి సుయాష్ ఫోటోగ్రాఫ్స్ లో సుమారు 200 ఫోటోలు బాగా నచ్చాయి. దాంతో వారు రంగంలోకి దిగి సుయాష్ ను సంప్రదించారు. వారికి సుయాష్ సీరీస్ కాన్సెప్ట్ నచ్చడంతో.. స్పాన్సర్ షిప్ అందించడానికీ ముందుకొచ్చారు. అయితే సుయాష్ ధారావాహికంలో తానెంతగానో ఆరాధించిన సోలో అనే ఆడపులి కథనే ప్రధాన ఘట్టమైంది. వేట.. మానవులకు, జంతులకు మధ్య నెలకొన్న సంఘర్షణ.. అటవీ నిర్మూలన.. ప్రభుత్వ నష్టపరిహారం వంటి అనేక రకాల అంశాలను స్పృశించేలా సఫారీ విత్ సుయాష్ సీరిస్ క్లిక్కైంది. అలా సీరీస్ లో ఐదు భాగాలను తీసుకురాగా.. దక్షిణాఫ్రికాలో సింహాలు, ఖడ్గమృగాలు, ఇతర అటవీ జంతువుల ఆధారంగా.. రెండో సిరీస్‌ను రూపొందించారు.
సుయాష్ ఫోటోగ్రఫీపై ఏర్పర్చుకున్న అభిరుచితో ఇప్పటికే 23 దేశాలకు పైగా తిరిగాడు. కేవలం వంద నుంచి 200 మీటర్ల దూరం నుంచి వన్యప్రాణులను కెమెరాలో బంధించగల్గే నేర్పరితనం ఇప్పుడు సుయాష్ సొంతం. తన వాహనాన్ని ఎప్పుడు కూడా వాటి పొలిమేరల్లోకి తీసుకెళ్లకుండా వాటిని గౌరవిస్తూ జాగ్రత్తపడటంతో పాటు.. అవి దగ్గర్లోకొచ్చేవరకూ కూడా క్లిక్కుల కోసం నిరీక్షిస్తానంటాడు సుయాష్. అంతేకాదు తనకు అడవుల్లో సహకరించేవారందరికీ ఏదో ఓ రకమైన సాయమందిస్తుంటాడు. అటవీశాఖ అధికారులకు బూట్లివ్వడం, అటవీప్రాంతంలోని గిరిజనుల కోసం సోలార్ ల్యాంప్స్ ను అందించడం, అక్కడి పిల్లల విద్యకు తగిన ప్రోత్సాహన్నిందించడం వంటివెన్నో చేస్తూనే.. తనకిష్టమైన వృత్తిలో రాణిస్తున్నాడు సుయాష్. 2018లో.. 18 అడవి ఏనుగులు ఛత్తీస్‌గఢ్ నుంచి బాంధవ్‌గఢ్‌కు సురక్షితమైన నివాసం కోసం వలస వచ్చినప్పుడు.. అవి రైతుల పంటలను నాశనం చేశాయి. గ్రామస్థులు వాటిని భయపెట్టడానికి పటాకులు ఉపయోగించగా అవి ఎదురుతిరగడం తీవ్ర ఆందోళన రేపింది. ఆ సమయంలో సుయాష్, అతని బృందం జోక్యం చేసుకుని పొలాలను రక్షించడానికి.. కాక్టస్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు బాంధవ్ గఢ్ రిజర్వ్ ఫారెస్ట్ లో దాదాపు 50 ఏనుగులున్నాయి.
వన్యప్రాణి ప్రేమికుల కోసమే.. త్వరలోనే తన సొంత OTT ప్లాట్‌ఫారమ్‌ను కూడా ప్రారంభించాలని ఆశిస్తున్నాడు సుయాష్. ఇదీ ఓ యంగ్ ఫోటోగ్రాఫర్ కి తాను ప్రేమించిన వృత్తిపై తీరని దాహపు కథ! తనను క్లిక్కుమనిపించిన ఛాయాచిత్రకారుణి జీవితచిత్రాన్నే మార్చేసి, కంట తడిపెట్టించి వెళ్లిపోయిన ఓ పులికథ!!




Nice article
tq mitrama