సంక్షేమ పథకాలెందుకో తేల్చి చెప్పే స్పందన: పదినెలల పాపను రాజ్యమే దత్తత తీసుకున్న కథ ఇది!

అధికారంలోకి రావాలి. ఎన్నికల్లో గెల్చి గద్దెనెక్కాలి. అందుకు అడ్డగోలు హామీలివ్వాలి. ఆతర్వాత గద్దెనెక్కాక వాటిని నెరవేర్చలేక ఆపసోపాలు పడాలి. గద్దె దిగినవాళ్లు, ఇతర ప్రతిపక్షాల ఆరోపణలెదుర్కొంటూ.. వారు అధికారంలో ఉన్నప్పుడు గతంలో చేసిన తప్పులను ఎత్తిచూపుతూ అధికారంలో ఉన్నవాళ్లు కాలం గడపాలి. జనానికి పాలకులపై వ్యతిరేకత పెరగాలి. తిరిగి ఆరోపణలు గుప్పించినవారు మళ్లీ గద్దెనెక్కాలి. గద్దెపైనున్నవారు కిందకు దిగి అదే ఆరోపణలు గత ప్రతిపక్షంలో గుప్పించి వారి తర్వాత అధికారపక్షమైనవారిపై గుప్పిస్తూ ఉండాలి. అయితే వారు.. లేకుంటే వీరు అన్నట్టుగా తయారైన ఓట్ల పందేరంలో సంక్షేమ పథకాలపై దేశవ్యాప్త చర్చ జరగాల్సిన సమయమిది. ఎందుకంటే, ధనిక రాష్ట్రాలు కూడా అప్పులడుక్కుంటూ చిప్ప పట్టుకుంటున్న తరుణంలో ఈ చర్చ అవసరం. అయితే, ఎవరికి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి మరి అంటే.. ఇదిగో ఈ కథ వింటే ఇలాంటివాళ్లకు కదా అవి దక్కాల్సింది అనిపిస్తుంది.

క్లౌడ్ బరస్ట్ తో ఆకాశమే ఉరిమి భూమ్మీద పడిందా అన్నట్టుగా కురిసిన వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైంది. ఆ వానలు, అక్కడ వచ్చిన వరదలు సృష్టించిన బీభత్సంతో ఓ పది నెలల చిన్నారి తల్లిదండ్రుల్ని పోగొట్టుకుంది. అదిగో అక్కడ రాజ్యం సరిగ్గా స్పందించింది. ఆ పాపను రాష్ట్ర బిడ్డగా ప్రకటించింది.

మండి జిల్లాలో జూన్ 30 రాత్రి కురిసిన భారీ వాన అక్కడ ఒక ఉపద్రవాన్నే సృష్టించింది. చాచ్యోట్ రెవెన్యూ గ్రామమైన తల్వారాలో నీతిక అనే పది నెలల చిన్నారి అనాథగా మారింది. 31 ఏళ్ల తండ్రి రమేష్, 24 ఏళ్ల తల్లి రాధాదేవి ఇద్దరూ చనిపోయారు. 59 ఏళ్ల అమ్మమ్మ రాధాదేవి కూడా కనిపించకుండా పోయింది. ఇంట్లోకి వచ్చే నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు రమేష్ బయటకు వెళ్లాడు. అతడికి సాయం చేసేందుకు భార్య, తల్లి కూడా వెంట వెళ్లారు. అక్కడ వచ్చిన వరదల్లో వారు ముగ్గురూ గల్లంతయ్యారు. ఇంట్లో పది నెలల పసిపాప నీతిక ఏడ్పును విన్న పొరుగువారు ఆమెను కాపాడారు.

ఈ విషయం నీతిక బంధువులను, చుట్టుపక్కల కాలనీవాళ్లనే కాదు.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్నే కదిలించింది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఆదేశాల మేరకు ఆ అమ్మాయిని రాష్ట్ర బిడ్డగా అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

ఇంతకీ రాష్ట్ర బిడ్డగా ప్రకటిస్తే ఏం జరుగుతుంది..?

సుఖ్ ఆశ్రయ్ యోజన్ పథకం కింద నీతికాకు ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా 4 వేల రూపాయల పింఛన్ రూపంలో సాయమందుతుంది. అందుకోసం జూలై, ఆగస్ట్ నెలలకు సంబంధించి ఆమెకు మంజూరైన 8 వేల రూపాయలను ఆమె పేరిట రెండు ఖాతాలను తెరిచి ప్రభుత్వం అందులో జమ చేసింది. ఒక ఖాతా హిమాచల్ కో ఆపరేటివ్ బ్యాంకులో తెరవగా.. మరొకటి పంజాబ్ నేషనల్ బ్యాంకులో తెర్చింది. నీతికకు 27 ఏళ్ల వయస్సు వచ్చేవరకూ కూడా ఈ సాయం కొనసాగుతుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

తల్లిదండ్రుల అంత్యక్రియలనంతరం నీతికాను ఆమె అత్తైన కిర్నాదేవి పెంచాలని బంధువుల సూచన మేరకు ఒక నిర్ణయం జరిగిపోయింది. ఆమెకు ఇప్పటికే ఓ కుమారుడున్నాడు. తను తల్వారా నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న షికౌరి గ్రామంలో నివశిస్తున్నాడు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. నీతికకు సాయమందించేందుకు పలువురు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే మనం చెప్పుకున్నట్టు ఆమె పేరు మీద రెండు ఖాతాలు తెరిచారు. 18 ఏళ్లు వచ్చి ఆమె ఎదిగేవరకూ అవి పొదుపు ఖాతాలుగానే ఉంటాయి. వాటిని ఆమె తను పెరిగి పెద్దయ్యాక 18 ఏళ్ల అనంతరం వాడుకోవచ్చు. ఇంతేకాదు, నీతికకు స్థానికి సైనిక్ స్కూల్ లో కూడా ప్రభుత్వం అడ్మిషన్ ఇవ్వాలని ఇప్పటికే ఆదేశించింది.

సుఖ్ ఆశ్రయ్ యోజన కింద నీతిక వంటి పిల్లలపై అక్కడి రాష్ట్ర సర్కార్ కరుణను ప్రదర్శిస్తూ సంరక్షణ కల్పిస్తోంది. తల్లి, తండ్రి లేని బాధను తీర్చలేకపోవచ్చుగానీ.. అలాంటి పరిస్థితుల్లో అనాథలైన పిల్లల భవితకు ఒక భరోసా కల్పించే స్కీమ్ ను సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఇందిరాగాంధీ సుఖ్ శిక్షా యోజన కింద విద్య ద్వారా నీతిక వంటి పిల్లల భవిష్యత్ సురక్షితంగా ఉండాలనే ఒక దీర్ఘకాలిక ఆలోచనతో కూడిన స్కీమ్ కు రూపకల్పన అది.

ఇలాగే కర్సోగ్ లోని సనార్లి గ్రామపంచాయితీకి చెందిన రెండు కుటుంబాల్లోని ఐదుగురు పిల్లలకు కూడా ఈ స్కీమ్ లో చేర్చి.. అవసరంలో ఉన్నవారికి సంక్షేమ పథకాలందాలనే ఒక స్ఫూర్తిని కనబర్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. భుట్టి గ్రామానికి చెందిన లలిత్ కుమార్ మరణిస్తే తండ్రి లేని పిల్లల విద్య కొరకై ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున ప్రతీనెలా అందుకుంటున్నారు. అదే పంచాయితీ పరిధిలోని సుర్ము గ్రామానికి చెందిన జీత్ రామ్ కూడా ఇదే విపత్తులో ప్రాణాలు కోల్పోయాడు. అతడి ఇద్దరి కుమారులకు కూడా ఈ పథకంలో చేర్చారు. ఇప్పటికే స్కీమ్ కింద గుర్తించిన నీడీ పిల్లలందరికీ జూలై, ఆగస్ట్ నెలలకు సంబంధించిన డబ్బులను వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ ఐదుగురికీ కూడా వాళ్లకు 18 ఏళ్లు వచ్చేవరకూ కూడా ప్రతీ నెలా వెయ్యి రూపాయల చొప్పున వారి బ్యాంక్ అకౌంట్స్ లో డబ్బులు జమైతాయి. భర్తలను కోల్పోయి పిల్లలతో రోడ్డుమీద పడ్డ భార్యలకు ఈ సౌకర్యం కల్పించారు. పిల్లలతో కలిపి వారికి ఉమ్మడి బ్యాంక్ ఖాతాలను తెరిచారు.

అలాగే, ఇలా ఇబ్బందుల్లో ఉండి ఎవ్వరి ఆదరణా లేక అవసరంలో ఉన్నవారిని గుర్తించి వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, అమలు చేస్తున్న హిమాచల్ ప్రదేశ్ సంక్షేమ పథకం ఇప్పుడు అభినందనలందుకుంటోంది. అధికారంలోకొచ్చేందుకు దేశవ్యాప్తంగా అడ్డగోలు స్కీములతో ఊదరగొట్టి.. గద్దెనెక్కాక వాటిని సమర్థవంతంగా అమలు చేయలేక.. అమలు చేస్తే అప్పులు చేయాల్సిన పరిస్థితులను కొని తెచ్చుకునే స్వయంకృతాపరాధ నేతలున్న కాలంలో.. హిమాచల్ ప్రదేశ్ ఒక దిక్సూచి. ఎవరికైతే అవసరంలో భరోసా అవసరమో అలాంటివారికే స్కీమ్స్ అమలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్త కొత్త చర్చకు తెరలేపేది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles