Siva Racharla.. ✍🏻
కొందరికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తే.. కొందరికి గడప వరకు వొచ్చిన అవకాశాలు ఇంట్లోకి రాకుండా వెనక్కి తిరుగుతాయి. విజేతల చరిత్రను గుర్తుపెట్టుకున్నంతగా.. పరాజితులను, అవకాశాలను కోల్పోయిన వారి గురించి గుర్తుపెట్టుకోం.
ఒక నాయకుడికి పదవి దక్కటం వెనుక జరిగిన మంత్రాంగం, తంతాంగ్రం మనకు అరుదుగా తెలుస్తాయి. ఎక్కువ శాతం నాయకుల ఆత్మకథల వల్లనే మనకు ఆనాడు తెరవెనుక జరిగిన సంగతులు తెలుస్తాయి.

P.N. Haksar, బాబు గారు రాష్ట్రపతిని చేశానన్న P.C.Alexandar, I.G.Patel గురించి ఎంతమందికి తెలుసు? P.V కన్నా ముందు ప్రధాని పదవికి కాంగ్రెస్ పరిశీలించింది ఎవరి పేరును? అనేక రాజకీయ మలుపులు, కీలక సంఘటనలు, వ్యక్తుల పాత్రల గురించి చదవండి
నారాయణ్ దత్ తివారి(N.D.Tiwari) 18-Oct-2018 తన 93వ పుట్టినరోజు నాడు చనిపోయారు. తివారి అంటే ఆంధ్రా ప్రజలకు గవర్నర్ భవన్లో రాసలీలలు సాగిస్తూ TV sting operationకు దొరికి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన రాజకీయ నాయకుడు గుర్తుకు రావటం సహజం కాని ఆయనది సుదీర్ఘ మరియు ప్రాముఖ్యత ఉన్న రాజకీయ చరిత్ర.
పి.వీ.నరసింహా రావ్ ప్రధాని కావటానికి ప్రత్యక్ష కారణం తివారి. 1991 ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీని LTTE హత్య చెయ్యటం అందరికి తెలిసిందే. ఆ ఎన్నికల్లో గెలుపు కోసం రాజీవ్ తీవ్రంగా కృషి చేస్తూ దేశం మొత్తం ప్రచారం చేశారు.
1991 ఎన్నికల్లో యువకులకు అవకాశం ఇవ్వాలని తలచి కాంగ్రెస్లో సీనియర్లు అయిన తివారీ తదితరులను పోటీకి దూరంగా ఉండమని చెప్పారు. P.V రాజీవ్ తో చెప్పించుకోకుండానే ముందుగానే పోటీకి దూరంగా ఉండి మ్యానిఫెస్టో బాధ్యతలు చూసుకున్నారు.
P.V పోలింగు & రాజీవ్ మరణానికి ముందే ఢిల్లీ నుంచి హైదరాబాదుకు మకాం మార్చారు. మొదటి దశ పోలింగ్ ముగిసిన తరువాత 21-May-1991న రాజీవ్ హత్య జరిగింది. రాజీవ్ అంత్యక్రియలతో పాటు, కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎన్నికకు ప్రయత్నాలు ఢిల్లీలో మొదలయ్యాయి.
రాజీవ్ చనిపోయిన రెండవరోజే సోనియా కాంగ్రెస్ కొత్త అధ్యక్షురాలు అని పత్రికలు రాశాయి. అర్జున్ సింగ్, ఫోతేదార్ తదితరులు సోనియా గాంధీని అధ్యక్షపదవి చేపట్టమని కోరగా ఆవిడ తిరస్కరించారు.
అందరిలో సీనియర్, గాంధీా కుటుంబానికి విధేయుడు ముఖ్యంగా బలమైన ఉత్తర ప్రదేశ్ బ్రాహ్మణ వర్గానికి చెందిన తివారీ సహజంగానే అధ్యక్షుడు కావలసింది. కానీ ఆయన రాజీవ్ సూచనను కాదని ఆ ఎన్నికల్లో పోటీ చెయ్యటంతో ఆయన అవకాశాలు దెబ్బతిన్నాయి.

సోనియాకు సన్నిహితంగా ఉండే నట్వర్ సింగ్ తదితరులు ఇందిరా principle secretaryగా పనిచేసిన P.N. Haksar సలహా తీసుకోమని ఆవిడకు సలహా ఇచ్చారు. హక్సర్ అప్పటి ఉపరాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మను అధ్యక్షుడిగా ఎన్నుకోమని సలహా ఇచ్చారు. సోనియా దూతలుగా శంకర్ దయాళ్ శర్మ వద్దకు వద్దకు నట్వర్ సింగ్, అరుణ ఆసఫ్ అలీ వెళ్ళారు. అప్పటికి 77 సంవత్సరాల వయస్సు, కీళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న శంకర్ దయాళ్ అంత పెద్ద బాధ్యతను తీసుకోలేనని దేశం అంతా తిరిగి ఎన్నికల ప్రచారం చెయ్యలేనని సున్నితంగా సోనియా ఆహ్వానాన్ని తిరస్కరించారు. అదే సందర్భంలో రాష్ట్రపతి పదవి కోసం ఎదురు చూస్తున్నట్లు మనసులో మాట బయట పెట్టారు.
శంకర్ దయాళ్ శర్మ కాదనటంతో సోనియా మరోసారి హక్సర్ సలహా అడిగారు. ఈసారి ఆయన పి.వీ,నరసింహారావు పేరు సూచించారు.

కొత్త అధ్యక్ష పదవికి అనేక మంది పోటిపడ్డారు. అర్జున్ సింగ్, మాధవరావు సింధియా, శరద్ పవర్, ప్రణబ్ ముఖర్జీ తదితరులు చేసిన ప్రయత్నాలకు పార్టీలోని ఇతర వర్గాల నుంచి మద్దతు దక్కలేదు. కానీ, వీరిలో ఎవరైనా పార్టీని చీలుస్తారేమో అన్న సంశయంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక మీద చాలా జాగర్తగా వ్యవహరించారు. శరద్ పవార్, ప్రణబ్ ముఖర్జీ గతంలో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి సొంత పార్టీలు పెట్టినవారే! 29-May-1991 న పీ.వీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టారు.
రాజీవ్ హత్యతో వాయిదా పడ్డ ఎనికలు జూన్లో జరిగాయి. కాంగ్రెస్ 531 స్థానాలకు కాను 235 స్థానాలు గెలిచింది. ప్రధాని పదవికి కాంగ్రెసులో మరోసారి పోటి నెలకొన్నది. అధ్యక్షుడు పీ.వీ సహజంగా ప్రధాని కావాలి. శరద్ పవార్ కాంగ్రెస్ MPల అభిప్రాయాన్ని secret ballot ద్వారా తీసుకోవాలని పటుబట్టారు. అర్జున్ సింగ్ తనను ప్రధానిని చెయ్యాలని కోరారు. రాజీవ్ వద్దన్నా పోటిచేసిన ND.తివారి తన కంచుకోట నైనిటాల్ నుంచి 11,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దానితో ఆయన పేరు చర్చకు రాలేదు. తివారి అర్జున్ సింగ్ కు మద్దతు ఇచ్చారు. తివారి గెలిచి ఉంటే ప్రధాని పదవి పోటి పీ.వీ, తివారి మధ్యనే ఉండేది.
పీ.వీ తరపున ఇందిరా మరియు రాజీవ్ వద్ద principle secretary, తమిళనాడు గవర్నర్ గా పనిచేసిన P.C. Alexander మరియు చంద్రస్వామి కాంగ్రెసులోని వివిధ వర్గాలతో సంప్రదింపులు జరిపారు. పత్రికలు రాజీవ్ రహస్య మిత్రుడు అని పేర్కొన్న జనతా నాయకుడు సుబ్రమణ్యస్వామి కూడా పీ.వీ తరుపున రంగంలో దిగారు.
రాజీవ్ మిత్రుడు కెప్టెన్ సతీష్ శర్మ ను పీ.వీ ఆయన ఇంటికి వెళ్లి కలిసారు. పీ.వీ కి దాదాపు మార్గం సుగమం అయ్యింది .అనేక చర్చల తరువాత శరద్ పవార్ తనకు ఉప ప్రధాని పదవి ఇస్తే పీ.వీ కి మద్దతు ఇస్తానని ప్రకటించారు. పీ.వీ దానికి అంగీకరిచకుండ ముఖ్యమైన మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. ఈ ప్రతిపాదనకు శరద్ పవర్ అంగీకరిచటంతో ఆయన రక్షణ శాఖ మంత్రి అయ్యారు. మహారాష్ట్రకే చెందిన తన అనూయుడు S.B.చవాన్ ను హోంమంత్రిని చేసి పీ.వీ చాణక్యాన్ని ప్రదర్శించారు.
ఎన్నికల్లో ఓడిపోయిన తివారి తనకు మంత్రి పదవి ఇవ్వమని అడిగినా పీ.వీ అంగీకరించలేదు. అసలు తివారి ఓటమి వెనుక ఒక కథ ఉంది. 1991 ఎన్నికల్లో అయోధ్య ప్రధాన అంశంగా BJP బరిలోకి దిగింది. తివారి తన ఎన్నికల ప్రచారానికి దిలీప్ కుమార్ ను తీసుకొచ్చారు. దిలీప్ కుమార్ ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రజలు ముస్లిం అయిన నువ్వు దిలీప్ కుమార్ అని పేరు ఎందుకు మార్చుకున్నావ్ అని వాదనకు దిగారు. పోలీసులు ఆందోళనకు దిగిన ప్రజలను అదుపుచేశారు కానీ, ఓటర్లలో తివారి పట్ల వ్యతిరేకత ఏర్పడి తుదకు ఆయన ఓటమికి దారి తీసింది.

ఆ విధంగా తివారి చేజార్చుకున్న అధ్యక్ష పదవి మరియు ప్రధాని పదవి పీ.వీ కి దక్కాయి.
అయోధ్య వివాదం, ఆర్థిక విధానాలు, అవినీతి తదితర అంశాలు 1994 నాటికి పీ.వీని బాగా ఇబ్బంది పెట్టాయి. అర్జున్ సింగ్ లాంటి మంత్రులు పీ.వీ మీద నేరుగా విమర్శలు చెయ్యసాగారు.” A perception has emerged that liberalization of economic policy perhaps has become liberalization of corruption” అని బాగా విమర్శలు చేసేవారు.
చివరికి పీ.వీ అర్జున్ సింగ్ ను మంత్రి పదవికి రాజీనామా చెయ్యమని కోరారు. మంత్రి పదవి నుంచి తప్పుకున్న అర్జున్ సింగ్ తివారి, నట్వర్ సింగ్, షీలా దీక్షిత్ తదితరులతో కలిసి 1994లో కాంగ్రెస్(తివారి) పేరుతొ కొత్త పార్టీ పెట్టారు.
1996 ఎన్నికల్లో తివారి కాంగ్రెస్ (AIIC(T)) 321 స్థానాలలో పోటి చేసి 4 చోట్ల గెలిచి 310 చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అర్జున్ సింగ్, నట్వర్ సింగ్ ఇద్దరు ఓడిపోయారు. తివారి, సత్పాల్ మహారాజ్, శీష్ రాం ఓలా గెలిచారు. ఆంధ్రా నుంచి కావూరి సాంబశివరావు మాత్రమే డిపాజిట్లు దక్కించుకున్నారు. మచిలీపట్నంలో కావూరి, రెడ్డయ్య యాదవ్(మాజీ మంత్రి పార్ధసారధి తండ్రి) మధ్య కాంగ్రెస్ ఓట్లు చీలటంతో TDP తరుపున కైకాల సత్యనారాయణ గెలిచారు.

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం తరువాత తివారీ కాంగ్రెసును కాంగ్రెసులో విలీనం చేసారు. 2000లో వాజ్ పాయి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ను విడదీసి ఉత్తారాఖండ్ ను ఏర్పాటు చేసిన తరువాత “తన శవం మీదనే ఉత్తరప్రదేశ్ విడిపోతుందని” అన్న తివారి 2002లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు.
ఆ ఎన్నికల్లొ కూడా తివారి ఉత్తరాఖండ్ లో కాకుండా ఉత్తరప్రదేశ్లోనే ప్రచారం చెయ్యటం గమనార్హం. 2007 ఉత్తరాఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తరువాత తివారి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అవ్వటం, అమ్మాయిలతో ఉన్న వీడియోలు బయటపడటంతో రాజీనామా చెయ్యటం తెలిసిందే.
2017 ఉత్తరాఖండ్ ఎన్నికల ముందు కొడుకు రోహిత్ శేఖర్తో కలిసి BJPలో చేరి రెండవరోజు లేదు నేను BJPలో చేరలేదు నా కొడుకు మాత్రమే చేరాడని చెప్పారు.
1954లో పెళ్లి చేసుకున్న తివారికి పిల్లలు లేరు.1968లో కేంద్ర మంత్రి షేర్ సింఘ్ కూతురు ఉజ్వలా శర్మతో వివాహేతర సంబధం వలన రోహిత్ శేఖర్ పుట్టారు. కానీ, తివారి రోహిత్ ను తన కొడుకుగా ఒప్పుకోకపోవటంతో కోర్టుల చుట్టూ తిరిగి 2012లో DNA test ద్వారా రోహిత్ తివారీ కొడుకే అని ఉజ్వలాశర్మ నిరూపించుకున్న తరువాత 87 సంవత్సరాల వయస్సులో 2012లో తివారి ఆమెను పెళ్లి చేసుకొని రోహిత్ ను కొడుకుగా అంగీకరించారు.
తివారి చివరి రోజుల్లో రోహితే ఆయన బాధ్యతలు చూసుకున్నారు 18-Oct-2018 న తివారి చనిపోయారు. ఆరోజు ఆయన పుట్టినరోజు కూడా.
భారత దేశం మొత్తంలో స్వాతంత్రం వచ్చిన తరువాత ముఖ్యంగా 1956 రాష్ట్రాల పునఃవిభజన తరువాత 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు తివారి.
ప్రకాశం పంతులు గారు మద్రాస్ & ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ, మద్రాస్ రాష్ట్రానికి స్వాతంత్రం రాకముందు 1946 March నుంచి 1947 April మధ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1976, 84, 88 ల్లో పనిచేసారు. UPకి మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా ఒక్కసారి కూడా పూర్తి కాలం పాలించలేకపోయినా 2002 -2007 మది మాత్రం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పాలించారు.
భారత గవర్నర్ జనరల్ గా పనిచేసి, ప్రధాని పదవికి నెహ్రూతో పోటిపడిన రాజగోపాలాచారి తరువాత మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇదే కోవలొ తివారి ప్రధాని స్థాయి నేత అయ్యుండి గుప్పెడంత రాష్ట్రాని ముఖ్యమంత్రి పనిచేశారు.

ఈసందర్భంలో మన్మోహన్ సింగ్ గురించి కూడా చెప్పుకోవాలి.
పీ.వీ ప్రధాని అయిన తరువాత మొదట I.G.పటేల్ (మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్)ను ఆర్ధిక మంత్రిగా తీసుకోవాలని అనుకున్నారు. కానీ, ఆయన అగీకరించకపోవటంతో మన్మోహన్ ను ఆర్ధికమంత్రిగా తీసుకున్నారు. I.G.పటేల్ పీ.వీ ఆహ్వానాన్ని అంగీకరించి ఉంటే.. మన్మోహన్ సింగ్ రాజకీయాల్లోకి రావటం, ప్రధాని కావటం జరిగి ఉండేవా..?
అబ్దుల్ కలాం గురించి కూడా ఓ మాట!
,2002లో కాంగ్రెస్, BJP పార్టీలకు సొంతంగా రాష్ట్రపతి పదవికి తమ అభ్యర్ధులను గెలిపించుకునే బలం లేదు. ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని అనుకున్నారు.

BJP/NDA మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్న P.C.Alexandar పేరును ప్రతిపాదించింది. ఇందిరా, రాజీవ్ వద్ద పనిచేసి ఉండటం, పీ.వీ తో సన్నిహిత సంబధాలు ఉండటం తదితర కారణాలతో సోనియా P.C.Alexandar అభ్యర్ధిత్వానికి మద్దతు ఇస్తారని వాజ్ పాయ్ భావించారు. కానీ, సోనియా అంగీకరించలేదు. దీనితో అబ్దుల్ కలాం పేరు తెర మీదికి వొచ్చింది. కలాం అభ్యర్దిత్వాన్ని కమ్యూనిస్టేతర ముఖ్యపార్టీలన్నీ అంగీకరించాయి. కమ్యూనిస్టులు అజాద్ హిందు ఫౌజ్ లో పనిచేసిన కెప్టన్ లక్ష్మి సెహగల్ ను పోటీకి పెట్టారు. నామమాత్రపు పొటీలో కలాం గెలిచారు.
దేవగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో.. 1997లో కలాంకు భారతరత్న రావటంతో ఆయనకు క్రియాశీలక గుర్తింపు వొచ్చింది. అదే రాజకీయ పార్టీలు ఆయన్ను రాష్ట్రపతిగా ఎన్నుకోవటానికి తోడ్పడింది.
తెర వెనుక కీలకంగా వ్యవహరించిన Haksar, Alexandar లాంటి వారి గురించి ఎక్కువ మందికి తెలియక పోవచ్చు కానీ.. వారికి చరిత్రలో సుస్థిర స్థానం దక్కుతుంది. నేతల ఆత్మకథల్లో వారి ప్రాధాన్యత లిఖించపడుతుంది.
ఈ పొస్టులో రాసిన విషయాలు అప్పట్లో పత్రికల్లో వొచ్చినవే. కానీ main reference Half – Lion: How P.V Narasimha Rao Transformed India మరియు నట్వర్ సింఘ్ One Life is Not Enough.
Please read Natwar Singh article https://www.thehindu.com/opinion/op-ed/how-pv-became-pm/article3592050.ece



