ఒకే ఒక్కడు.. ఎడారిని ఉద్యానవనం చేశాడు!

ప్రభుత్వాలు, వ్యవస్థలు, స్థానిక పాలకులు, అధికారులు ఎవ్వరూ చేయలేని కొన్ని పెద్ద పెద్ద పనులను సామాన్యులు చేస్తారు. ఉన్న ఊరిని కబళిస్తూ మింగేస్తున్న ఇసుక ఎడారిని నిలువరించి… తన గ్రామాన్ని నందనవనంలా మార్చేశాడు. రాజస్థాన్ లో అనన్య సామాన్యుడైన ఓ రైతు సాధించిన నిశ్శబ్ద విప్లవమిది.

రాజస్థాన్ ఎడారిలో ఇసుక కూడా మేట మేస్తూ ముందుకొస్తుంటుంది. అలాంటి క్రమంలో నెమ్మదిగా ఓ ప్రవాహంలా ముందుకు కదులుతూ తమ గ్రామాన్ని మింగేస్తున్న ఇసుకను అడ్డుకునేందుకు చెట్లు నాటడం ఆరంభించాడు ఏకల్ఖోరి గ్రామ రైతు రణరాం బిష్ణోయ్. చివరకు ఆ రైతు ప్రయత్నం ఫలించింది. అప్పటివరకూ ఎగబాకినట్టుగా గ్రామాన్నే కబళించేస్తూ భీతి కల్పించిన ఇసుక ఎడారి ప్రాంతమంతా.. ఆ రైతు కృషితో ఓ ఉద్యావనంగా మారింది.

పదెకరాల్లో విస్తు గొలిపేలా చెట్ల పెంపకం!

జ్యోథ్ పూర్ సమీపంలోని ఏకల్ఖోరీ గ్రామానికి వెళ్తే ఇప్పుడు పదెకరాల్లో 27 వేల చెట్లు కనిపిస్తాయి. పోనీ, ఇసుక ఎడారిలో ట్యాంకర్స్ ఏమైనా ఉన్నాయా అంటే అదీ లేదు. బిందెలు, కుండల్లో నీళ్లను తీసుకెళ్తూ చెట్లను నాటి వాటిని పెంచాడు ఈ రణరాం బిష్ణోయ్.

బంజరుభూమి నుంచి బంగారు పంటలకు కేరాఫ్ గా మార్చాడు!

ఏకల్ఖోరి గ్రామమంతా బిష్ణోయ్ కమ్యూనిటీ తెగవారే ఎక్కువ ఉండే ఊరు. వీరు సహజంగానే ప్రకృతి ప్రేమికులు. పర్యావరణ రక్షకులు. అక్కడ ప్రజలకు ఆ నేలతో ఉన్న బంధం తల్లీబిడ్డల్లాంటింది. వారసత్వంగా ఏర్పడిన ఆ అవినాభావ బంధంతో తమ గ్రామాన్ని వీడలేక, పంట పొలాల్ని ఇసుక ఎడారి నేలల నుంచి కాపాడుకోలేక, పాలకులకు చెప్పినా లాభం లేక జనం ఇక అది అయ్యే పని కాదని తీర్మానించుకున్నారు. కానీ, రణరాం బిష్ణోయ్ మాత్రం ఒక్కడై కదిలాడు. ముందుకొస్తున్న ఎడారిని చెట్లు నాటి ఆపాడు. బంజరు భూమిని బంగారు పంటలకు నెలవుగా మార్చాడు.

ఓ రైతు, ఓ బావి, ఓ మట్టి కుండ!

ఇవే రైతు రణరాం ఎడారిని ఉద్యానవనంగా మార్చడానికి వాడిన ఉపకరణాలు. భారీ యంత్రాల్లేవు, ఆధునిక నీటిపారుదల వ్యవస్థ లేదు, కనీస ప్రభుత్వ సాయమేం లేదు. సమీపంలో ఉన్న బావి నుంచి మట్టికుండలో నీటిని తోడుకుంటూ భుజంపై పెట్టుకుని మోసుకుంటూ ఇసుక దిబ్బల దగ్గరకు నడిచి వెళ్లి ఒక్కో మొక్కకు నీరు పోస్తూ కన్న పిల్లల్ని పెంచినట్టు పెంచాడు. దాదాపు రోజూ 3 కిలోమీటర్లు నడిచి చెట్ల దగ్గరకు ప్రతీ రెండు రోజులకొకసారి నీళ్లు పట్టేవాడు. కొన్నిసార్లు ఎడారి ఒంటెలను ఆసరా చేసుకుని వాటిపై పెద్ద మట్టి కుండలు పెట్టి తీసుకెళ్లేవాడట రణరాం. ఇదేదో ఒక్కరోజులోనూ.. ఏడాదిలోనో సాధించిన విజయం కాదు.. ఏళ్ల తరబడి కష్టపడి శారీరక శ్రమతో ఎడారినే ఓడించిన అపర భగీరథ ప్రయత్నం.

తమ గ్రామాన్ని కాపాడుకునేందుకు రణరాం ఎలాంటి చెట్లు నాటాడు..?

అందగా కనిపించడానికి చెట్లు నాటలేదు. తమ ఊరు జీవనకాలం పెరిగేందుకు.. అక్కడి పంటల లైఫ్ టైమ్ పెంచేందుకు రణరాం ఆలోచించాడు. అందుకే స్థానిక జాతులైన చెట్లనే ఎంచుకున్నాడు తప్ప అలంకారంగా ఉండే మొక్కలను నాటలేదు. నీమ, రోహిడా, కంకేరీ, ఖేజ్రీ, అంజూరం, బూబుల్, బోగన్ విల్లియా వంటి ఎన్నో చెట్లు రణరాం నాటిన వాటిల్లో ఎడారిలో ఉండే కఠిన పరిస్థితులను తట్టుకునేవి.

వాతావరణానికి సరిపడే చెట్ల నాటకంతో పాటు.. చిన్న చిన్న మొక్కలను పశువులు, అడవి జంతువులు తినకుండా ఉండేందుకు ముళ్ల కంచెలతో రక్షణ వలయాలు ఏర్పాటు చేశాడు. చిన్న చిన్న జాగ్రత్తలు, మరింత చిన్న చిన్న ప్రయత్నాలతోనే ఓ పెద్ద విజయాన్ని… ఎవరూ ఊహించని ఒక నిశ్శబ్ద విప్లవాన్ని సాధించి రణరాం ఇప్పుడు రాజస్థాన్ లో ప్రత్యేక ఆకర్షణంగా నిల్చాడు.

బిష్ణోయ్ సమాజం పాత్రా కీలకం!

ఇక్కడి కథలో హీరో రణరాం బిష్ణోయే అయినా… బిష్ణోయ్ సమాజం పాత్రా చాలా కీలకం. రాజస్థాన్ లో ప్రకృతి పరిరక్షణకు బిష్ణోయ్ సమాజం చాలా ప్రాధాన్యతనిస్తుంది. ఆ సంప్రదాయానికి కొనసాగింపే ఇక్కడి సమాజమంతా రణరాంతో చేతులు కలపడానికి కారణమైంది. 1730వ సంవత్సరంలో ఈ సమాజం చెట్లను కాపాడేందుకు పెద్ద త్యాగాలే చేసి.. భారతదేశంలో పర్యావరణ ఉద్యమాలకు ప్రేరణగా నిల్చింది.

అందుకే రణరాంతో పాటు.. ఇక్కడివారికి ప్రకృతి ఓ సహజ వనరు మాత్రమే కాదు. ప్రకృతినీ కుటుంబ సభ్యుల్లా చూసే ఒక గొప్ప సంప్రదాయం, బాధ్యతా ఈ సమాజంలో కనిపించే విశేషమైన లక్షణం.

రణరాం ఇచ్చిన సందేశమేంటి..?

ఇదేదో వీరుడు, శూరుడు అనిపించుకునేందుకు చేసిందేం కాదు. ఉన్న ఊరిని, కన్నతల్లిలాంటి భూమిని కాపాడుకోవడం ఓ బాధ్యతగా, అలవాటుగా మారినప్పుడు కనిపించే మార్పు. ఎడారి పచ్చని ఉద్యానవనంలా మారడానికి పెద్ద ప్రసంగాల్లేవు… పెద్ద పెద్ద నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారుల హడావిడి లేదు.. జస్ట్, రణరాం అనే రైతు ప్రతీ రోజూ క్రమం తప్పకుండా ఓపికతో మొక్కలకు నీరు పోసిన శారీరక శ్రమ మాత్రమే ఏకల్ఖోరీ గ్రామాన్ని ఎడారి నుంచి నందనవనం చేసింది.

రణరాం కథ ఓ గొప్ప పాఠం!

పర్యావరణ పరిరక్షణ అనేది పెద్ద పెద్ద ప్రభుత్వ ప్రణాళికలుంటేనే సాధ్యమనే స్టీరియోటైపిక్ ఆలోచనలకు స్వస్తి పలకాలని చెప్పే పాఠం. కొన్నిసార్లు కొందరు సామాన్యుల చేతుల్లోనే పెద్ద పెద్ద ప్రణాళికలకు బీజం పడి అవి సాకారమవుతాయని చెప్పే లెస్సన్. ఒక మట్టి కుండతో ఇసుక దిబ్బలను అడ్డుకోవచ్చని… ఎడారిలో కూడా జీవాన్ని పుట్టించొచ్చని తెలియజేసే సందేశం.

ఆ విశ్వాసాన్ని ఏకల్ఖోరి గ్రామం నిజం చేస్తే.. ఆ కార్యసాధకుడు రైతు రణరాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles