बिनय न मानत जलधि जड़, गए तीन दिन बीत। बोले राम सकोप तब,भय बिनु होय न प्रीति।
“వినయంగా ప్రార్థించినా జడసంద్రం వినిపించుకోవడంలేదు. మూడురోజులు గడిచిపోయాయి. భయం లేకుండా ప్రేమ కల్గదంటాడు రాముడు.” తులసీదాస్ రాసిన రామమానస చరిత్ లోని ఈ పంక్తిని కోట్ చేశారు ఎయిర్ మార్షల్ ఏ.కే భారతి.
అలా 2025, మే 7వ తేదీన పాకిస్థాన్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాద స్థావరాలపై దాడులతో… భారత్ రాజకీయంగా, సైనికంగా, మానసికంగా ఇలా మూడు కీలక లక్ష్యాల్లో విజయాన్ని సాధించిందనేది భారతి మాటల్లో సారాంశం. అయితే, కాల్పుల విరమణ ఉన్నపళంగా ఎందుకు ప్రకటించింది… ప్రకటన మోడీ నుంచి రాకుండా… ట్రంప్ నుంచి ఎందుకొచ్చిందని పెద్ద చర్చకు తెరలేపింది ఆపరేషన్ సిందూర్. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ తో ఎలాంటి సందేశాన్నందిస్తున్నారన్న విలేకర్ల ప్రశ్నకు ఎయిర్ మార్షల్ భారతి కోట్ చేసిన విధానం మన రక్షణరంగ ఆలోచనను పట్టిచూపేది.
కాల్పుల విరమణపైన వర్గాలుగా విడిపోయి ఒకవైపు… గతకాలపు నేతలతో, ప్రస్తుతకాలపు నాయకులకు లెంక పెడుతూ చర్చలు జరుపుతున్న నేపథ్యం. వెనకడుగు వేయొద్దంటూ యుద్ధానికి మద్దతు ప్రకటించిన క్రమంలో భారత్ తీరు డిజప్పాయింట్ చేసిందంటూ ఇంకోవైపు నెలకొంటున్న అసంతృప్తి. మరోవైపు, అలా చేయడం వెనుక వ్యూహాలేమై ఉంటాయోనన్న కోణంలో సమర్థనలతో కూడిన విశ్లేషణలు. పార్టీలు, నాయకుల పట్ల ఏర్పర్చుకున్న దృఢ, నిశ్చితాభిప్రాయాలతో వెల్లువెత్తే విద్వేషాలొకవైపు, అంతకుమించిన భక్తి ఇంకోవైపు. అదే సమయంలో ఎవరో కొందరినుంచి న్యూట్రలైజ్డ్ వ్యాఖ్యలు.. ఇలా విభిన్నమైన విభేదించే విషయాలను వింటున్నాం, చదువుతున్నాం.

భారత్, పాక్ మధ్య యుద్ధంలో ఎవరికివారే తాము విజేతలని ప్రకటించుకుంటున్న ప్రచారాలు కనిపిస్తున్న వేళ… భారత్ కోణంలో ఓసారి ఆలోచిస్తే ఎందుకు మూడు కీలక లక్ష్యాల్లో భారత్ విజయం సాధించిందో మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు.
ఒకటి పాక్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాదం పీచ మణచడం ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది. ఇప్పటికే ఒక్కో ఉగ్రవాదిపై భారత్ లో 30 మంది వైద్య విద్యార్థులపై పెడుతున్నంత ఖర్చు పాక్ పెడుతోందన్న అంచనాల నేపథ్యంలో… బహవల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్ వంటి చోట్ల బలంగా పాతుకుపోయిన ఉగ్రస్థావరాలను నామరూపాల్లేకుండా చేసి.. ఉగ్రవాదాన్ని సమర్థించే పాక్ ఖర్చును అనూహ్యంగా మరింత పెంచేసింది భారత్ తన దాడులతో. అలాగే, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ఏకంగా పాకే స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సింధూ జలాలకు అడ్డుకట్ట వేయడం కూడా రాజకీయంగా భారత్ తీసుకున్న గట్టి నిర్ణయం. సింధూ జలాల నిలిపివేతపై సెక్యులర్ భావాలున్నవారికి కొంత బాధ ఉన్నప్పటికీ.. అందుకు కారణమైన పాక్ నాయకులు, అక్కడి మిల్ట్రీ అక్కడి ప్రజలకు జవాబుదారీగా నిలవాల్సి ఉంటుంది. లేనప్పుడు తిరుగుబాట్లకు దారితీస్తుంది. కాబట్టి, దాన్ని భారత నాయకత్వంపైకి తీసుకొచ్చి దోషులుగా చిత్రించే విధానం ఈ సందర్భంలో ముమ్మాటికీ సరైంది కాదనే వాదనా ఉంది.
వీటితో పాటు.. శత్రుభూభాగంలోకి చొచ్చుకొచ్చి భారత్ ఎలా దాడులు చేయగలదో కూడా పాక్ కు రుచి చూపించగల్గాం. పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు ఏ స్థావరంగానీ, ప్రదేశంగానీ వారనుకున్నంత సురక్షితమేం కాదనే విషయాన్నీ నిరూపించి వారిని మానసికంగా కూడా దెబ్బతీశాయి ఇండియన్ రక్షణ దళాలు.
భారత్-పాకిస్తాన్ సంబంధాల్లో అసాధారణ స్థితి!
పాకిస్థాన్ తో యుద్ధం చేయడం లేదని.. అణుయుద్ధానికి తావేలేదని భారత్ ముందే తేల్చి చెప్పింది. అయితే, తమ యుద్ధం ఉగ్రవాదంపైనేనని.. పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రమూకలను నామరూపాల్లేకుండా చేయడానికే లైన్ ఆఫ్ కంట్రోలే వెంట దాడులకు సిద్ధమైనట్టూ ఇండికేషన్స్ ఇచ్చింది. పెహల్గాం దాడి తర్వాత ప్రతీ బుల్లెట్, ఫిరంగి బంతులు ఉగ్రవాద శిబిరాల అంతంగా ఫోకస్ చేయాలని ఏకంగా ప్రధాని మోడీనే సాయుధదళాలను ఆదేశించారు.
ప్రస్తుతానికి కాల్పుల విరమణ పేరుతో యుద్ధం ఆగిపోయినట్టు కనిపిస్తున్నా.. విద్వేష, కుట్రపూరిత పాక్ దుందుడుకు చర్యలు ఇంకా ఆగడం లేదు. ఇంకా కూడా భారత్ సహనంగా వాటిని తిప్పికొట్టే ప్రయత్నమే చేస్తోంది తప్ప.. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట దాయాది దేశం తరహాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంలేదు. అయితే, అదే సమయంలో ఆపరేషన్ సిందూర్ కూడా ఇంకా ముగియలేదనే స్పష్టమైన సంకేతాలను ఇండియన్ రక్షణ దళాలు ఇస్తూనే ఉన్నాయి. పాక్ ఉగ్రవాదాన్ని ఆపేసేవరకూ కొనసాగుతుందని.. అదే సమయంలో, సింధూ జలాల సస్పెన్షన్ కూడా తప్పదనీ హెచ్చరిస్తోంది. మే 1వ తేదీన విదేశాంగ మంత్రి జైశంకర్ పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేయాలని నిర్ణయించినట్టు అమెరికా సెనేటర్ మార్కో రూబియోకు స్పష్టం చేశారు.
పాకిస్తాన్ సైనిక స్థావరాలపై వైమానిక దాడులు!
ఇటీవలి సమావేశంలో ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ… భారత వైమానిక దళం, పాకిస్తాన్ వైమానిక స్థావరాలతో పాటు, రాడార్ కేంద్రాలపై కచ్చితమైన దాడులు చేసిందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ నుంచి పదేపదే భారత సైనిక, పౌర స్థావరాలపై డ్రోన్ దాడులు జరగడంతోనే ఆ ప్రతిచర్యలను భారత్ మొదలుపెట్టినట్టు ఆయన వెల్లడించారు.
పాక్ లో రన్‌వేలు, విమాన హ్యాంగర్లు, సహాయక భవనాల వంటి కీలకమైన వైమానిక స్థావరాలకు ఎంత పెద్దఎత్తున నష్టం వాటిల్లిందో కూడా… దాడులకు ముందు, దాడుల తర్వాత ఉపగ్రహ చిత్రాలను ప్రదర్శించి మీడియాకు చూపించారు ఎయిర్ మార్షల్ భారతి. ప్రభావిత ప్రదేశాల్లో సర్గోధా స్కార్డు, జకోబాబాద్, భోలారి, సుక్కూర్, రహీమ్ యార్ ఖాన్ వంటివున్నాయి. అందులో సర్గోధాలో F-16 జెట్స్ కూడా ఉండగా వాటినీ భారత్ తునాతునకలు చేసేసింది. తమ పోరాటం ఉగ్రవాదులతో మాత్రమేనని.. భారత సైన్యంతో కాదని భారతి స్పష్టం చేశారు. కానీ, నిరంతర దాడుల నేపథ్యంలో పాక్ లోకి చొచ్చుకెళ్లక తప్పని పరిస్థితుల్లో వేరే మార్గం కూడా లేకపోయిందన్నారు.
అంతేకాదు, ఎయిర్ మార్షల్ భారతీ
పాక్ కు భారత్ స్పష్టమైన సందేశాన్నించిందన్న ఎయిర్ మార్షల్!
భారత్ ను గోకితే కచ్చితంగా పాక్ లోకి చొచ్చుకొచ్చి దాడి చేయగలదనే సందేశాన్ని మాత్రం ఆ దేశానికి కచ్చితంగా పంపగల్గామన్నారు ఎయిర్ మార్షల్ భారతి. అదే సమయంలో, పౌర సమాజానికి, వారికందాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా కూడా అంతే జాగ్రత్తపడ్డామన్నారు.
ఈ దాడుల్లో భారత్ చాలా కచ్చితత్వంతో యుద్ధాన్ని కొనసాగించింది. రఫికి, మురిద్ తో పాటు, మొత్తం తొమ్మిది వైమానికి స్థావరాలను.. అలాగే, పస్రూర్, చునియన్, సియాల్ కోట్ లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని కచ్చితత్వంతో ఫోకస్డ్ గా దాడులు చేయగల్గింది.
ఈ మిషన్ లో ఐఏఎఫ్ వివిధ రకాల అధునాతన ఆయుధాలనుపయోగించింది. సుఖోయ్-3-ఎంకేఐ ఫైటర్ జెట్స్, 450 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించగల ఎక్స్టెండ్ రేంజ్ బ్రహ్మోస్ క్షిపణులు, క్రిస్టల్ మేజ్-2 క్షిపణులు, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణలు, హ్యామర్ గైడెడ్ మందుగుండు సామాగ్రి, అలాగే, స్పైస్ 2000 బాంబులనుపయోగించింది.
సుఖోయ్- 30కేఎంఐ ఫైటర్ జెట్స్ ప్రత్యేకతేంటంటే.. గాలిలోకెళ్లాక ఇంధనం నింపాల్సిన అవసరం లేకుండా సుమారు 15 వందల కిలోమీటర్ల పోరాట పరిధిలో దూసుకుపోతాయి. ఇక బ్రహ్మోస్ క్షిపణలు ధ్వని వేగం కంటే దాదాపు మూడు రెట్ల వేగం, కచ్చితత్వంతో ఎగురుతాయి. ఈ ఆయుధాల వాడకం చాలా ప్రభావవంతంగా చేయగల్గింది భారత రక్షణదళం. దాదాపు 40 సుఖోయ్ జెట్స్ ఇప్పుడు బ్రహ్మోస్ మోసుకెళ్లడానికి అప్ గ్రేడ్ చేయబడి రెడీగా ఉన్నాయి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలాకాలంగా బంగాళాఖాతంలో సుదూర తీరాలను ఛేదించేలా కచ్చితమైన దాడుల ప్రాక్టీస్ ను కొనసాగిస్తోంది. ఈ ఆపరేషన్ పశ్చిమ సరిహద్దుల్లో ఆ సామర్థ్యాన్ని ఇప్పటికే ప్రదర్శించింది.
మొత్తంగా ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి కాల్పుల విరమణపై ఒకవైపు విపరీతమైన చర్చోపర్చలు సాగుతుండగా.. అందుకుగల కారణాల విశ్లేషణలపైనా సోషల్ మీడియాలో ఇండియా పాక్ వార్ ను మించిన యుద్ధమే జరుగుతోంది. ఇవన్నీ ఏవేమైనప్పటికీ.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించినంతసేపు కచ్చితత్వంతో కూడిన దాడులతో భారత రక్షణదళం తమ వృత్తి నైపుణ్యాన్ని పాక్ తో పోలిస్తే ఎన్నోరెట్లు నైపుణ్యంగా ప్రదర్శించిందనేది పాక్ తో పాటు, అంతర్జాతీయ సమాజమే గుర్తించింది. అంతేకాదు, శాంతి, సౌభ్రాతృత్వాన్ని కోరుకునే భారత్.. అవసరమైతే దేనికైనా సిద్ధమనే ఓ సంకేతాన్నీ పంపినట్టైంది.



