ప్రత్యర్థుల పాలిట విశ్వరూపం! క్రికెట్ లో అతడో సరికొత్త విరాటపర్వం!!

అతడి క్రమశిక్షణ, శారీరక, మానసిక దృఢత్వం… గేమ్ కు ముందు తాను సంసిద్ధమయ్యే తీరు.. క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేశాయి. ఆయనలా ఫిట్ గా ఉండాలనే కోరిక ఇతర క్రికెటర్లలోనూ రగిలించాడు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద వరల్డ్ కప్ అవార్డు స్వీకరించే సమయంలో… కింగ్ కోహ్లీ గురించి వరల్డ్ టాప్ బ్యాట్స్ మ్యాన్ బ్రయాన్ లారా చెప్పిన మాటిది.

VIRAT KOHLI-NOVEMBER 5TH, 1988.

మూడు ప్రపంచ కప్పుల్లో మూడుసార్లు ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్ కప్ గా నిల్చిన ఘనత మన పరుగుల మిషన్ ది. 2014, 2016 టీ20 ప్రపంచకప్స్ తో పాటు.. గత ఏడాది 2023లో జరిగిన ప్రపంచ కప్ లోనూ 765 అత్యధిక పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కోహ్లీనే కొల్లగొట్టాడు.

భారత్ ప్రపంచకప్ సాధించిన 2011లోనూ విరాట్ జట్టులో కీలక సభ్యుడు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ప్రాతనిథ్యం వహించిన కోహ్లీ.. 2024లో ఏకంగా వరుసబెట్టి 17 మ్యాచులు గెల్చిన టీ20 జట్టులోనూ సభ్యుడిగా తన క్రికెట్ కలను నెరవేర్చుకున్నాడు. ఆ ఫైనల్ తర్వాత తాను టీ20ల నుంచి రిటైర్డవుతున్నట్టు ప్రకటించేశాడు. ఇప్పుడు ఏకంగా టెస్ట్ క్రికెట్ నుంచీ విరమణ ప్రకటించేశారు. భౌతికంగా, మానసికంగా తానెంతవరకు క్రీజులో సరిగ్గా ఆడగలడో తనది తనకే తెలిసిన ప్లేయర్. ఇంకెవరో చెబితే, ఆరోపణలు గుప్పిస్తే.. బలవంతంగా తప్పుకునే ఆటగాడిగా కాకుండా కోహ్లీ తీసుకున్న నిర్ణయం ఆయన మైండ్ సెట్ ను చెప్పేది.

కెప్టెన్ గా కోహ్లీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టెస్ట్, వన్డే, టీ20ల్లోనూ భారత్ ఎన్నో విజయాలతో దూసుకుపోయింది. భారత్ నుంచి ఎక్కువ విజయాలు సాధించిన కెప్టెన్లలో కోహ్లీ కూడా ఒక్కడిగా నిల్చాడు. అయితే, కోహ్లీ తన క్రికెట్ జీవితంలో ఐపీఎల్ లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ… ఒక్కటంటే ఒక్క కప్పును కూడా ఐపీఎల్ ఆ జట్టుకు అందించలేకపోవడం ఒకింత వెలితి.

ఢిల్లీ కుర్రాడైన విరాట్ కోహ్లీ… 1998లో వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందాడు. 2002లో ఢిల్లీ అండర్ 15 జట్టుకు ఆడాడు. ఆ తర్వాత అండర్-17 జట్టులో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్తల్లోకెక్కాడు. ఆ తర్వాత పలు మ్యాచులాడినా.. అప్ అండ్ డౌన్స్ చూడాల్సి వచ్చింది. కానీ, 2008లో మలేషియా కౌలాలంపూర్ లో జరిగిన అండర్-19 ప్రపంచకప్పులో జట్టును గెలిపించడంతో.. అతడివైపు ఐపీఎల్ ఫ్రాంచైజీస్ చూపు పడింది. ఆర్సీబీ నుంచి 30 వేల డాలర్లకు కాంట్రాక్ట లభించింది. అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగిడిన కోహ్లీ.. 2009లో ఆస్ట్రేలియాలో జరిగిన ఎమర్జింగ్ ప్లేయర్స్ టోర్నమెంట్ లో తొమ్మిది ఇన్నింగ్స్ ల్లో ఏకంగా 405 పరుగులు చేసి జాతీయజట్టు సెలెక్టర్ల మనసు దోచుకున్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్!

ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించకుండా.. ఒకే ఒక్క జట్టు కోసం ఆడిన ఆటగాడిగా కూడా కోహ్లీదే రికార్డ్. అలా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆడుతూ వస్తున్న కోహ్లీ మొదటి రెండు సీజన్లలో గొప్ప ప్రదర్శన కనబర్చలేకపోయాడు. కానీ 2010లో వైస్ కెప్టెన్ గా పదోన్నతి లభించాక అతడి ఆట తీరు మెరుగైంది. 2011లో ఆర్సీబీని ఫైనల్స్ కు తీసుకెళ్లగల్గినా.. చెన్నై సూపర్ కింగ్స్ తో ఓటమిపాలవ్వడంతో ఆ విజయకాంక్ష ఇప్పటివరకూ ఓ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కానీ, అదే ఐపీఎల్ 2016 సీజన్ లో కోహ్లీ అంటే ఓ పరుగులు మిషన్ అనేలా చితకబాదాడు. ఏకంగా 4 సెంచరీలతో 973 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 8004 పరుగులు చేసిన ఘనత ఇప్పటికీ కోహ్లీ పేరుపైనే ఉంది.

కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానం!

2009లో శ్రీలంకపై తొలి వన్డే సాధించడంతో కోహ్లీ అంతర్జాతీయ విజయ ప్రస్థానం మొదలైంది. 2011 వన్డే ప్రపంచకప్ లో భారత జట్టుతో భాగస్వామైన కోహ్లీ.. బంగ్లాతో మ్యాచులో ఆరంగ్రేటంలోనే సెంచరీ చేశాడు. 28 ఏళ్ల తర్వాత 2011 ప్రపంచ కప్ ను భారత్ అందుకున్న ఫైనల్ మ్యాచులోనూ కోహ్లీది 35 పరుగుల భాగస్వామ్యం.

2011 ప్రపంచకప్ విజయం తర్వాత.. సచిన్ టెండూల్కర్ వంటివాళ్లకు విశ్రాంతినివ్వడంతో.. కోహ్లీ టెస్ట్ కెరీర్ కు బీజం పడింది. 2011లో వెస్ట్ ఇండీస్ తో టెస్టుతో ఆరంగ్రేటం చేసిన కోహ్లీ.. 2011-12లో ఆస్ట్రేలియా చేతిలో 4-0 తేడాతో ఇండియా వైట్ వాష్ అయిన సీరీస్ లో తను మాత్రం సెంచరీ చేసి ప్రశంసలు పొందాడు.

రాను రాను మ్యాచ్ ఛేజింగ్ లో మాస్టర్ గా పేరు తెచ్చుకున్న కోహ్లీ.. 2012లో శ్రీలంకతో జరిగిన కామన్వెల్త్ బ్యాంక్ సీరీస్ లో విశ్వరూపం చూపించాడు. కేవలం 40 ఓవర్లలో భారత్ 320 పరుగులు చేయాల్సి ఉంటే.. కోహ్లీ 86 బంతుల్లో 133 పరుగులు చేసి 36.4 ఓవర్లలోనే అవసరమైన పరుగులతో విజయాన్ని సాధించడంలో కీలకపాత్రధారయ్యాడు. 2012 ఆసియా కప్ కు జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికైన కోహ్లీ.. పాక్ పై ఆ సీరీస్ లో 183 పరుగుల వ్యక్తిగత అత్యధిక స్కోర్ నమోదు చేశాడు. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెల్చుకున్న భారతజట్టు.. ఫైనల్ లో ఇంగ్లాండ్ ను ఓడగొట్టగా.. ఆ మ్యాచులో 43 పరుగుల అత్యధిక స్కోరర్ కూడా కోహ్లీనే.

2013లో తానారాధించే క్రికెటర్ సచిన్ క్రికెట్ విరమణతో.. కోహ్లీ టెస్టుల్లో నాల్గోస్థానంలో బ్యాటింగ్ స్థానానికి ఎదిగాడు. దక్షిణాఫ్రికాతో వాళ్ల సొంతగడ్డపై జోహెన్నెస్ బర్గ్ లో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో వరుసగా 119, 96 పరుగులు చేసి.. టెస్టుల్లో తన స్థానాన్ని పదిలపర్చుకున్నాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సీరీస్ లో.. రెండో మ్యాచులో కేవలం 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 2023లోనూ అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారతీయ ఆటగాడిగా కోహ్లీకి స్థానం దక్కింది. ఆస్ట్రేలియా 360 పరుగుల లక్ష్యాన్ని ముందుంచితే… 39 బాల్స్ మిగిలుండగానే ఇండియా ఆస్ట్రేలియాను మట్టి కరిపించి ఛేదనలో తన దమ్మేంటో చాటింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆరో మ్యాచులోనూ 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా.. 61 బంతుల్లోనే తన దాహం తీరనిదన్నట్టు కోహ్లీ ఆడిన ఆటతో ఆ మ్యాచూ భారత్ దే పైచేయి అయింది.

2014 టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా నిల్చిన కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై భారత్ సెమీఫైనల్ విజయంలోనూ కీలక పాత్రధారి. శ్రీలంకతో భారత్ ఓటమిపాలైన మ్యాచులోనూ కోహ్లీదే హయ్యెస్ట్ స్కోర్. కానీ, అదే ఏడాది మళ్లీ కోహ్లీకి గడ్డుకాలాన్ని ముందుంచింది. ఇంగ్లండ్ లో భారత పర్యటన నేపథ్యంలో ఫామ్ కోల్పోయి చాలా కష్టపడ్డాడు. అతడి కెరీర్ నే అందరూ ప్రశ్నించే స్థాయిలో పేలవమైన ఆటతో నిరాశపర్చాడు. 2015లోనూ కోహ్లీ ఆట గొప్పగా లేకపోవడంతో.. ఇక కోహ్లీ పనైపోయిందనుకున్నారంతా. అప్పుడూ పాక్ పై ఒకే ఒక్క సెంచరీ మినహా.. పనికిరాడనుకున్నారు. కానీ, కోహ్లీలో సహజంగానే ఒక దూకుడు స్వభావం.. ఆ కళ్లల్లో బాల్ ను ఎంత బలంగా బాదాలన్న ఒక కసి… గేమ్ కు తనకు తాను శారీరకంగా, మానసికంగా సిద్ధమయ్యే తీరు.. కోహ్లీని ఎంత ఒత్తిడెదురైనా ఏమీ చేయలేకపోయాయి.

2016లో మళ్లీ కోహ్లీ శకం మొదలైంది. ఆసియా కప్ లో తన స్కోరే భారత్ ను ఫైనల్స్ కు చేర్చి.. ఏకంగా టైటిల్ గెల్చుకునేందుకు కారణమైంది. అప్పటివరకూ ఆడిపోసుకున్న నోళ్లే ఆహా కోహ్లీ ఓహో కోహ్లీ అంటూ హర్షధ్వానాలు చేశాయి. 2016 టీ20 ప్రపంచ కప్ లోనూ మళ్లీ కోహ్లీనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిల్చాడు. ఆ ప్రపంచకప్ లో భారత్ వెస్ట్ ఇండీస్ చేతిలో పరాభవమెదుర్కోగా.. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్స్ లో ఛేజింగ్ లోనూ కోహ్లీదే కీలకపాత్ర. తానే టాప్ స్కోరర్.

కెప్టెన్‌గా అంతర్జాతీయ కెరీర్!

2013లో విరాట్ కోహ్లీ వెస్ట్ ఇండీస్ లో జరిగిన త్రికోణపు సీరీస్ తో కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాడు. ఆ టైంలో కెప్టెన్ గా ఉన్న ధోనీ గాయాలపాలవ్వడంతో.. ఆ అవకాశం కోహ్లీకి దక్కింది. 2014 ఆసియా కప్ లోనూ అనివార్య కారణాల వల్ల ధోనీ గైర్హాజరీ కోహ్లీకి కెప్టెన్సీ అవకాశాలను కట్టబెట్టింది. కానీ, ఆ సీరీస్ లో భారత్ ఫైనల్స్ కు చేరుకోలేకపోయింది. 2014లో ఆడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుకు ముందు ధోనీకి మళ్లీ గాయాలు ఇబ్బందులపాలు చేసినప్పుడు.. టెస్ట్ జట్టు కెప్టెన్ గా కూడా అవకాశం కోహ్లీ తలుపే తట్టింది. ఆ మ్యాచులోనే నాయకుడంటే ఎలా ఉండాలో చూపించాడు. తనను అంతా అగ్రెసివ్ అని ఎందుకంటారో ఆ టెస్టులో కోహ్లీ ఆటను చూస్తే అర్థం చేసుకోవచ్చు. డ్రా కోసం ఆడలేదు సరికదా.. రెండో ఇన్నింగ్స్ లో దూకుడు ప్రదర్శించి 141 పరుగులు చేసి 364 పరుగుల లక్ష్యంతో ఆస్ట్రేలియాకు సవాల్ విసిరాడు. ధోనీ రెండో టెస్టుకు అందుబాటులోకొచ్చినా.. తిరిగి గాయం ఇబ్బందులు సృష్టించేసరికి మళ్లీ మూడోటెస్టుకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ మూడో టెస్టులోనూ కోహ్లీ ఒక సెంచరీ, మరో హాఫ్ సెంచరీతో టెస్టును డ్రా చేశాడు. ఆ మ్యాచ్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. మళ్లీ నాల్గో టెస్టుకు కూడా కోహ్లీనే కెప్టెన్ గా ప్రకటించారు సెలక్టర్లు.

2016లో వెస్ట్ ఇండీస్ పై మొట్టమొదటి టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన కోహ్లీ.. అదే ఏడాది న్యూజిలాండ్ పై మరో డబుల్ సెంచరీ సాధించాడు. భారత్ ఆ రెండు సీరీసులనూ గెల్చుకుంది. ఆ తర్వాత ఇంగ్లండ్, బంగ్లాదేశ్ తో జరిగిన రెండు సీరీసుల్లోనూ డబుల్ సెంచరీలు బాది.. వరుసగా నాల్గు సీరీసుల్లో డబుల్ సెంచరీలు సాధించిన మొట్టమొదటి బ్యాట్స్ మ్యాన్ గా కోహ్లీ రికార్డ్ సృష్టించాడు.

2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ భారత్ కు కెప్టెన్ గా వ్యవహరించగా.. ఆ ఫైనల్స్ లో మాత్రం భారత్ పాక్ చేతిలో ఓటమిపాలైంది. ఆ ఏడాది శ్రీలంకతో జరిగిన టెస్ట్ సీరీస్ లోనూ రెండు డబుల్ సెంచరీలు సాధించాడు మళ్లీ కోహ్లీ. వన్డేల్లో సెంచరీలు చేస్తూనే పోతూ.. పరుగుల మిషన్ గా కోహ్లీ పేరుకు ఓ సుస్థిరస్థానం ఏర్పడింది. 2018లో 10 వేల పరుగులు పూర్తి చేసిన కోహ్లీ… ఆ ఘనత సాధించిన 13వ బ్యాట్స్ మ్యాన్ గా రికార్డ్ నమోదు చేశాడు. అప్పటికే తనకంటే ముందు పదివేల పరుగులు పూర్తి చేసిన తానారాధించే క్రికెట్ దేవుడు సచిన్ కంటే తక్కువ మ్యాచుల్లో 54 ఇన్నింగ్సుల్లోనే ఆ ఘనత సాధించాడు కోహ్లీ.

2018-19 ఆస్ట్రేలియా పర్యటన కోహ్లీ నేతృత్వంలోని భారతజట్టుకు ఓ మరపురాని మరో అనుభవం. ఆస్ట్రేలియాలో మొదటి టెస్ట్ సీరీస్ ను కోహ్లీ కెప్టెన్సీలో భారత్ గెల్చుకుంది. ఆ సీరీస్ లోనే కోహ్లీ తన 25వ టెస్ట్ సెంచరీనీ పూర్తిచేశాడు. 2019లో జరిగిన వన్డే ప్రపంచ కప్ కూ భారతజట్టు కెప్టెన్ గా కోహ్లీనే నియమితుడయ్యాడు. ఆ ప్రపంచకప్ సీరీస్ లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు కోహ్లీ. కానీ, అప్పుడు సెమీఫైనల్స్ లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ టోర్నమెంట్ లోనే కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి తన 20 వేల అంతర్జాతీయ పరుగులను పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా కోహ్లీ ఘనత సాధించాడు. ఆ ఏడాది చివర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సీరీస్ లో తన అత్యధిక టెస్ట్ స్కోర్ 254 పరుగులు చేశాడు.

2021లో కోహ్లీ నేతృత్వంలోని భారత్ పర్యటనకు వెళ్లగా.. మొదటి టెస్టులో భారత్ ఓటమిపాలైంది. అదే సమయంలో కోహ్లీ, తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ హీరోయిన్ అనుష్క జంటకు బిడ్డ పుట్టడంతో.. బిడ్డ కోసం ఇండియాకు తిరిగి వచ్చేశాడు. కోవిడ్-19 మహమ్మారి ప్రయాణాల పరిమితుల నేపథ్యంలో తానిక తిరిగి వెళ్లలేకపోయాడు. ఆ సీరీస్ ను ఇండియా 2-1 తేడాతో కోల్పోయింది.

ఆ తర్వాత కోహ్లీ ప్రదర్శన కూడా అన్ని ఫార్మాట్స్ లో అనుకున్నంత స్థాయిలో కనిపించలేదు. కొన్నేళ్లు సెంచరీలే కరువయ్యాయి. కొన్ని మ్యాచుల్లో అర్థశతకాలు మినహా.. మళ్లీ డౌన్ ఫాల్ మొదలైనట్టనిపించింది. అదే సమయంలో 2021లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. 2021 టీ20 ప్రపంచకప్ లోనూ నాకౌట్ రౌండుకు కూడా అర్హత సాధించలేక చతికిలపడింది. దాంతో కోహ్లీ తన టీ20 కెప్టెన్సీతో పాటు.. వన్డే నాయకత్వ బాధ్యతలకూ స్వస్తి పలికాడు. ఆ తర్వాత ఆ స్థానం రోహిత్ ను వరించింది. అలాగే, 2022లో టెస్ట్ కెప్టెన్సీ నుంచీ వైదొలగడంతో ఆ బాధ్యతలూ రోహిత్ శర్మకే అప్పజెప్పింది సెలక్షన్ కమిటీ.

కోహ్లీ మొత్తం 68 టెస్టులకు సారథ్యం వహిస్తే.. అందులో 40 విజయాలు సాధించిన గ్రేట్ కెప్టెన్. స్వదేశంతో పాటు.. విదేశాల్లోనూ విజయాలు సాధించిన విజయవంతమైన కెప్టెన్ గా కోహ్లీ పేరు నిల్చిపోయింది.

కెప్టెన్సీ తర్వాత కోహ్లీ ప్రదర్శన!

కొన్నేళ్లపాటు పేలవమైన ప్రదర్శనల తర్వాత.. కోహ్లి చివరకు తిరిగి పుంజుకున్నాడు. ఫామ్ లోకి వచ్చాడు. 2022 ఆసియాకప్ లో ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీని సాధించాడు. కానీ, ఆ సీరిస్ లో భారత్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. ఆ తర్వాత జరిగిన 2022 టీ20 ప్రపంచ కప్‌లోనూ కోహ్లీనే అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. కానీ, అప్పుడు భారత్ సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌తో ఓడిపోయింది. ఆ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌పై ఛేజింగ్‌లో బ్యాక్-టు-ది వాల్ అన్నట్టుగా 82 పరుగులకు నాటౌట్‌తో విజయాన్ని కట్టబెట్టి భారతీయ అభిమానుల అప్లాజ్ అందుకున్నాడు. 2023 ప్రారంభంలో.. కోహ్లి శ్రీలంకపై సెంచరీతో ప్రారంభించాక.. మళ్లీ కోహ్లీ వన్డేల శకం మొదలైంది. అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో.. మూడేళ్ల తర్వాత తిరిగి తొలి టెస్టు సెంచరీ సాధించాడు. 2023 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై మరో వన్డే సెంచరీతో విమర్శకులకు బ్యాటుతో సమాధానమిచ్చాడు.

2023 వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ పలు రికార్డులను బద్దలుకొట్టాడు. ఒక క్యాలెండర్ ఈయర్ లో వెయ్యి పరుగులు సాధించిన ఘనత కోహ్లీ సాధించాడు. అలా ఒక క్యాలెండర్ ఈయర్ లో అన్నేసి పరుగులను ఎనిమిదిసార్లు చేసి.. అంతకుముందు ఏడుసార్లు సచిన్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. ఒక క్యాలెండర్ ఈయర్ లో ఏడుసార్లు వెయ్యి పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ ఘనతను… దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో… యాదృచ్ఛికంగా తన పుట్టినరోజున నవంబర్ 5నే సమం చేసి.. రికార్డులకెక్కాడు కోహ్లీ. 50 వన్డే సెంచరీలు సాధించిన కోహ్లీ.. ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు 673 చేసి సచిన్ పేరిట ఉన్న ఆ రికార్డునూ బద్ధలు కొట్టి.. 2023 టీ20 ప్రపంచకప్ లో 765 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిల్చి భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త విరాటపర్వాన్ని లిఖించాడు.

2024 టీ20 ప్రపంచ కప్‌లో కోహ్లీ అంత ఫామ్ లో ఏమీ లేడు. కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో టోర్నమెంట్‌లో తన మొదటి అర్ధ సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికైన తర్వాత.. కోహ్లీ తన టీ20 క్రికెట్‌కు గుడ్ బై చెబుతూ రిటైర్మెంట్ ప్రకటించేశాడు.

కోహ్లీకి దక్కిన అవార్డులు!

2013లో భారత ప్రభుత్వం నుండి భారతదేశపు రెండవ అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డ్ అందుకున్నాడు. 2017లో కోహ్లికి భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ దక్కింది. 2018లో అతను రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు.
ప్రస్తుతం దీన్నే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ గా పేరు మార్చేశారు. అలాగే ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉన్న స్టాండ్స్ కి.. 2019లో కోహ్లీ పేరు పెట్టి అతడి ఆటకు సముచిత గౌరవాన్ని కల్పించారు.

ఇక ఇంటా బయట కోహ్లీకి దక్కిన అవార్డులు, రివార్డులెన్నెన్నో. అంతేకాదు.. ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా అడ్వర్టైజ్ మెంట్స్ రూపంలోనూ కోహ్లీ ఆదాయం అంచెలంచెలుగా పెరిగిపోయింది. మొత్తంగా పట్టుదలతో ప్రయత్నించి ఓ ఢిల్లీ కుర్రాడు… ఇంతింతై ఎదిగి విరాటపర్వాన్ని రచించిన క్రీడాస్ఫూర్తి భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఘట్టం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles