శాస్త్ర, విజ్ఞానపరంగా పురోగమించాలనుకునే దేశంలో ముందు ఆకలి కేకలు ఉండొద్దని భావించాడు. అందుకు ఆహారం ఎంత అవసరమో గుర్తించాడు. ఆ మోటోతోనే భారతదేశ ముఖచిత్రాన్ని మార్చేశాడు. ఆగస్ట్ 7వ తేదీన ఆయన పుట్టినరోజు సందర్భంగా యావత్ దేశం ఓసారి తల్చుకోవాల్సిన భారతరత్న అతను.
పడావు పడ్డ భూములను బంగారు ధాన్యరాశుల క్షేత్రాలుగా మార్చి.. గ్రీన్ రెవల్యూషన్ తో భారత్ తలరాతనే మార్చేసిన శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్.

7 August 1925 – 28 September 2023
ఒకప్పుడు భారత్ అంటే ఆహార దిగుమతులపై ఆధారపడ్డ దేశం. మరోవైపు, విపరీతంగా అంతకంతకూ పెరిగిపోతున్న జనాభా. ఆకలి కేకలు. అలాంటి దేశాన్ని ఇప్పుడు ఆహార మిగులు దేశంగా మార్చాడు. దిగుమతి చేసుకున్న రోజుల నుంచి ఇప్పుడు ఇండియా ఎగుమతి చేసే ఒక స్వర్ణయుగంవైపు అడుగులేయడానికి ప్రధాన కారకుడు భారత హరితవిప్లవ రూపశిల్పి ఎం.ఎస్. స్వామినాథన్.
ఇప్పుడు రేషన్ దుకాణాల వద్ద ఎక్కడ చూసినా పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. ఆ రేషన్ బియ్యంలోనూ పార్టీల మధ్య పోటీలో ప్రభుత్వాలేర్పాటయ్యాక సన్నబియ్యం ఇస్తుండటమూ మనం చూస్తున్నాం. ఇదంతా ఒక రెవల్యూషన్. రోజురోజుకూ పెరుగుతున్న జనాభాతో ఆకలి కేకలు పెట్టిన ఇండియా.. ఆహారమిగులు దేశంగా ఉద్భవించిన ఈ ఖగోళ విజయం వెనుక ఒక విజనరీ సైంటిస్ట్ ముందుచూపు అడుగడుగునా, అణువణువునా కనిపిస్తుంది.
ముందు దేశంలో ఉన్న ప్రజలందరికీ కనీసం తినడానికి ఇన్ని గింజలివ్వగల్గితే.. ఆ తర్వాత ఏ దేశమైనా ఏదైనా సాధించేందుకు అడుగులేయొచ్చు. అలా ఇవాళ చంద్రయాన్, మంగళయాన్ వంటి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంతో విజయాలు సాధించడానికి… దేశంలో ఆకలి కేకలు లేకుండా చేసి దేశాన్ని గ్రీన్ రెవల్యూషన్ తో సుసంపన్నం చేసిన స్వామినాథన్ పాత్ర కూడా ఉంది.
స్వామినాథన్ వంటివారు పనిచేసిన నేలపైనే సవాళ్లను స్వీకరిస్తూ పనిచేసిన.. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ మాజీ డైరెక్టర్ ఏ.కే. సింగ్ 1950-60 మధ్యకాలంలో నాటి దారుణమైన పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు. ఓడలొస్తేనేగానీ ముద్ద దిగని పరిస్థితుల నుంచి భారత్ ఇప్పుడు ఆహారరంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిందన్నది ఈ శాస్త్రవేత్త మాట. దేశీయ అవసరాలను తీర్చడానికి ఆనాటి రోజుల్లో ఏటా 5 నుంచి 7 మిలియన్ టన్నుల గోధుమలను భారత్ దిగుమతి చేసుకునేదట.
డాక్టర్ స్వామినాథన్.. మెక్సికోలోని ఇంటర్నేషనల్ మేజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ నార్మన్ బోర్లాగ్ సహకారంతో.. అధిక దిగుబడులనిచ్చే మెక్సికన్ గోధుమ రకాలను భారతదేశానికి పరిచయం చేసి ఎవరూ కనీసం ఊహించలేని ఒక డ్రమటిక్ ఛేంజ్ తీసుకొచ్చారు.
స్వామినాథన్ చేసిన ఆ ప్రయోగం ఫలించింది. రైతులు ఆ గోధుమలవైపే మొగ్గు చూపారు. అప్పటివరకూ 12 మిలియన్ టన్నులున్న గోధుమల ఉత్పత్తి… ఒక్కసారిగా 1968లో 17 మిలియన్ టన్నులకు చేరుకుంది. అది అప్పటికి భారత్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న మొత్తం.
అయితే, అదే మెక్సికన్ వెరైటీ గోధుమలను పరిచయం చేసి విమర్శలపాలూ అయ్యారు. 2018, నవంబర్ 25వ తేదీన మాడర్న్ టెక్నాలజీస్ ఫర్ సస్టైనబుల్ ఫుడ్ అండ్, న్యూట్రీషన్ సెక్యూరిటీ శీర్షికన కరెంట్ సైన్స్ జర్నల్ లో ప్రచురించిన పత్రంపైనా నాటి భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుగా ఉన్న విజయరాఘవన్ వంటివారి నుంచీ విమర్శలందుకున్నారు.
భారతదేశ ఆహారవ్యవస్థను 1960లకు ముందు… ఆ తర్వాత అన్నట్టుగా చూడాలంటారు భారత వ్యవసాయశాఖా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. 1960లకు ముందు ఆహరభద్రత రంగంలో ఒక స్తబ్దత నెలకొంది. 1967లో భారతదేశం తీవ్ర కరువును అనుభవిస్తుందని కొందరు విదేశీ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఒక అంచనా వేశారు. పెరుగుతున్న జనాభాకు ఆహారమివ్వలేని దుర్భర పరిస్థితులు వస్తాయన్నారు కానీ, వారిది జోస్యం మాత్రమేనని కచ్చితత్వం కాదని హరితవిప్లవంతో నిరూపించిన భారత్ గర్వపడే వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్. స్వామినాథన్.
ఆహార ధాన్యాల ఉత్పత్తిలో నేడు భారత్ స్థానమేంటి..?
నేడు ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత స్థానం ఓ అంచనా ప్రకారం 353. 96 మిలియన్ టన్నులు. గత ఏడాది భారత్ 115 మిలియన్ టన్నుల గోధుమలను పండించింది. ఇప్పుడు గోధుమల అవసరమున్న దేశాలన్నింటికీ.. భారత్ ఎగుమతి చేసే స్థాయికెదిగింది.
ప్రతీ రైతూ ఓ శాస్త్రవేత్తే. కొత్త కొత్త పద్ధతులను ఆవిష్కరిస్తూ ధాన్యం ఉత్పత్తిలో ఏదో సాధించాలన్న ఆసక్తి, తపన చాలామంది రైతుల్లో మనం వ్యవసాయ క్షేత్రాల్లో గమనిస్తుంటాం. పంటలను కాపాడుకునేందుకు, అధిక దిగుబడులు సాధించేందుకు, కొత్త వంగడాలు, కొత్త యజమాన్య పద్ధతులు, నీటి సౌకర్యాలు ఇలా ఎప్పుడూ రైతు పంటలను సమృద్ధిగా పండించుకునేందుకు తపన పడుతూ ఉంటాడు. అలాంటి రైతే ఒకవేళ శాస్త్రవేత్తైతే ఎలా ఉంటుందో.. అదిగో ఆ కోణంలో స్వామినాథన్ ఆలోచనలు సాగాయంటోంది మిగిలిన వ్యవసాయ పరిశోధన సమాజం.
సేద్యంలో స్వయంసమృద్ధి సాధించే ఆత్మవిశ్వాసాన్నిచ్చిన సైంటిస్ట్ స్వామినాథన్. స్వాతంత్ర్యం వచ్చిన రెండు దశాబ్దాలపాటు ఆహారభద్రత కొరవడిన భారత్ అనేక సవాళ్లను చవిచూసింది. గోధుమల పెంపకంతో నాడు స్వామినాథన్ వేసిన బీజాలతో నేడు మన దేశం మిగిలిన దేశాలకు ఒక దారిదీపమైందంటారు ప్రధాని మోడీ. అందుకే, స్వామినాథన్ ను నిజమైన కిసాన్ వైజ్ఞానిక్ గా ఆయన అభివర్ణించారు.
స్వామినాథన్ కేవలం హరిత విప్లవానికే పరిమితం కాలేదు. పర్యావరణ హాని లేని ఉత్పత్తులను పండించే సతత హరిత విప్లవం కావాలని ఆశించారు. సహజ వనరులను పరిరక్షించుకోవడం, నీటి నిల్వలు, ఎరువుల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, వాతావరణానికి తగ్గట్టుగా స్థిరమైన సాంకేతిక పరిజ్ఞానంతో పంటలను పండించుకోవడంతో భారత్ సతత హరిత విప్లవం వైపు అడుగులేయగలదని ఆశించారు స్వామినాథన్.
గతంలో ఎన్డీటీవీతో మాట్లాడినప్పుడు స్వామినాథన్ చెప్పిన విషయాలు ఆసక్తికరంగా సాగాయి. ఆహార ధాన్యాల విషయంలో స్వయంసమృద్ధి సాధించలేకపోతే.. నాటి ఇందిరాగాంధీ సమయంలోగానీ, ఆ తర్వాత వాజ్ పాయ్ కాలంలోగానీ అసలు అణుపరీక్షలనే చేసి ఉండేవారే కాదేమోనన్నారాయన. అంటే, ఆహార కొరత నెలకొంటే ఎలాంటి దుర్భర పరిస్థితులను అనుభవించాల్సి ఉంటుందో చెప్పుకొచ్చారు. అందుకే, హరిత విప్లవం ఒక చరిత్రాత్మక పరివర్తనగా అభివర్ణించారు. రాబోయే రోజుల్లో యువతరం వ్యవసాయం వైపు మొగ్గు చూపదు. ఎందుకంటే రాను రాను వ్యవసాయం జూదంలా మారిపోతున్న పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. కానీ, భవిష్యత్ తుపాకులు, ఆయుధాలున్న దేశాలది కాదు.. ఆహార ధాన్యాలున్న దేశాలదేనని అని ఆయన ముక్తాయించారు.
వ్యవసాయరంగ పరిశోధన, అభివృద్ధికి సంబంధించి భారత్ పెడుతున్న పెట్టుబడులు.. అగ్రికల్చర్ సెక్టార్ నుంచి పొందుతున్న జీడీపీలో కేవలం 0.5 శాతమేనని.. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ పెట్టుబడులు రెట్టింపు కావల్సిన అవసరాన్నీ నేటి శాస్త్రవేత్తలు చెబుతున్న మాట.
ఎం.ఎస్. స్వామినాథన్ నాయకత్వంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటనేది భారతదేశంలో వ్యవసాయంలో వచ్చిన పరివర్తనకు ఓ ఉత్ప్రేరకమని.. నూతన ఆవిష్కరణలకు బీజం వేసిందంటున్నారు ప్రస్తుత ఐఏఆర్ఐ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఆహారం, పోషకాహారం, స్థిరత్వం, సమానత్వం, మొత్తంగా మానవాళి శ్రేయస్సు.. ఇవే హరిత విప్లవం నుంచి సతత హరిత విప్లవం వైపు పయనించిన ప్రొఫెసర్ డాక్టర్ స్వామినాథన్ తాత్విక ఆలోచనలని ఆయన చెబుతారు.
స్వామినాథన్ వంటివారి గొప్పదనాన్ని అవార్డుల్లో కొలవడం కూడా కష్టమేనేమో. ఎందుకంటే, పురస్కారాలే గర్వపడే “భారతరత్న ” స్వామినాథన్. ఆయన మరణానంతరం ఆయనకు భారతరత్న కూడా ప్రకటించింది భారత ప్రభుత్వం.
చెకోస్లేవియాకు చెందిన మెండెల్ మెమోరియల్ అవార్డ్ నుంచి మొదలుకుంటే.. రామన్ మెగసెసే, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ సైన్స్ అవార్డ్, వరల్డ్ ఫుడ్ ప్రైజ్, టైలర్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ అఛీవ్మెంట్, ఫోర్ ఫ్రీడమ్స్ అవార్డ్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, శాంతిస్వరూప్ భట్నాగర్ ఇలా చెప్పుకుంటూ పోతే అదో చాంతాడంత జాబితా.
నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలో కుంభకోణంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన స్వామినాథన్.. ఐపీఎస్ సాధించినా వద్దనుకున్నవాడు. వ్యవసాయ రంగంపై మక్కువతో ప్రయోగశీలిగా ఎదిగి.. దేశానికి ఆహార సార్వభౌమత్వాన్నందించిన పరిశోధకుడు. నెక్స్ట్ జనరేషన్ అగ్రి సైంటిస్టులు, రైతులతో పాటు.. యావత్ దేశానికే ఆదర్శవంతమైన ఓ విధాన రూపకర్త.
నేటితో సరిగ్గా వందేళ్ల చరిత్ర స్వామినాథన్ ది. 1925, ఆగస్ట్ 7న పుట్టి.. 1923, సెప్టెంబర్ 28న కన్నుమూసిన ఆ భారతరత్న స్వామినాథన్ వందో జయంతి సందర్భంగా ఆయనకు నివాళులతో!



