Akula Amaraiah… ✍🏻
————————————————–
ఆస్కార్ వేదికపై ‘యుద్ధం’ చేస్తున్న ఈ ఇరానీ డైరెక్టర్ ఎవరంటే?
సొంత దేశం ఆయన్ను ‘దేశద్రోహీ’ అంటోంది. శత్రు దేశం ఆయన్ను ‘విఘాతకుడు’ అంటోంది.
ఇరాన్ పై అమెరికా యుద్ధం చేస్తోంది. ఓ ఇరానియన్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డ్ కోసం హాలివుడ్ లో సమరం చేస్తున్నాడు.
కళ కళగా బతికితే ఆయన సినిమాకు ఆస్కార్ రావచ్చు. శత్రువు శత్రువు మిత్రుడైతే రాకపోవచ్చు. ఏదైనా మరో 5 రోజుల్లో తేల్తుంది. అసలు నిజం బయటికొస్తుంది.
ఆయన పేరు జఫర్ పనాహి (Jafar Panahi). తీసిన సినిమా “ఇట్ వాజ్ జస్ట్ ఆన్ యాక్సిడెంట్” (It Was Just an Accident). ఇదో అద్భుత పొలిటికల్ థ్రిల్లర్.

జఫర్ పనాహీ ఎలాంటోడంటే..చాలా మామూలోడు. మనవాళ్ల మాదిరి ఓ 5,6 వందల కోట్లతోనో, వేయి, 1500 మందిని బందెల దొడ్లో తోలో సినిమాలు తీయడు. ఇరాన్ ప్రస్తుత పాలకులు ఇంట్లోంచి కదిల్తే కాళ్లు విరిచేస్తామంటే కూడా లెక్కచేయకుండా కొంపలోనే కెమెరా పెట్టి సినిమా తీసి ప్రపంచం మీదికి వదిలారు. ఇంకో ముచ్చటేమిటంటే.. ఈ సినిమాను ఇరాన్- ఆస్కార్ కు నామినేట్ చేయలేదు. ఫ్రాన్స్ చేసింది.
పేదరికం నుంచి ప్రపంచ వేదిక వరకు!
జఫర్ పనాహి ఓ నిరుపేద. 1960లో ఇరాన్‌లోని మియానేలో ఓ కార్మికుడి ఇంట్లో పుట్టారు. తండ్రి పెయింటర్. తల్లి గృహిణి. డబ్బుకి ఎప్పుడూ ఇబ్బందే. పేదలందరి లాగే జాఫర్ బతుకు కూడా. చిన్నతనంలో కూలీనాలీ చేశాడు. ఇక్కట్ల మధ్యే బాల్యం గడిపాడు. 12 ఏళ్ల వయసులో పలకా, బలపం పక్కన బెట్టి నూనె బావుల్లో పన్జేశాడు. సినిమాలంటే పిచ్చి. పొట్టబోసుకోగా మిగిలిన డబ్బుతో సినిమాలు, షికార్లూ చేసేవారు.

20 ఏళ్ల వయసులో ఇరాన్-ఇరాక్ యుద్ధంలో సైనికుడి అవతారమెత్తి యుద్ధ రంగాన్ని సినీ ట్రైనింగ్ సెంటర్ గా మార్చుకున్నాడు. అప్పుడు తీసిన రీళ్లు ఆ తర్వాత చాలా కాలం పనికివచ్చాయి. యుద్ధం ముగిశాక, ఇరాన్ లెజెండరీ దర్శకుడు అబ్బాస్ కియారోస్తామి వద్ద శిష్యరికం చేశారు. 1995లో ‘ది వైట్ బెలూన్’తో దర్శకుడిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
ప్రస్తుతం ఆయనదో విచిత్ర పరిస్థితి. ఓవైపు సొంత ప్రభుత్వం ఆయనను ‘దేశద్రోహి’గా ముద్ర వేసి జైల్లో పెడుతోంది. మరోవైపు శత్రుదేశం అమెరికా ఆయనను తమ ‘రాజకీయ ప్రయోజనాల’ కోసం వాడుకుంటే పోలా అనుకుంటోంది.
పనాహి కుటుంబమంతా ఆర్టిస్టులే. ఆయన భార్య పేరు తహెరెహ్ సైదీ (Tahereh Saedi). నర్సు. కాలేజీ రోజుల్లోనే ప్రేమలో పడి 1983లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు పనాహ్ పనాహి (Panah Panahi). ఆయనా దర్శకుడే. ఆయన తీసిన ‘హిట్ ది రోడ్’ (Hit the Road) అనే సినిమా 2021లో సూపర్ హిట్.
కుమార్తె సోల్మాజ్ పనాహి (Solmaz Panahi). థియేటర్ ఆర్ట్సిస్టు. సినిమాలంటే మక్కువ. ప్రభుత్వ వేధింపులతో పడలేక ఇరాన్ విడిచి ఫ్రాన్స్‌కు పోయి పారిస్‌లో ఉంటోంది.
పనాహీ జీవితం చాలా సాదాసీదా. పెద్ద కార్లు, ఖరీదైన భవంతులు లేవు. తక్కువ ఖర్చుతో (లో-బడ్జెట్) సినిమాలు తీయడం ఆయనకు మంచినీళ్లు తాగినంత పని. సంపాదన కంటే మాట్లాడే హక్కుకే మక్కువ చూపుతారు.
పనాహీ సినిమాలన్నీ చిల్లర బతుకుల చుట్టూతానే తిరుగుతాయి. అవే అసాధారణ కథలంటారాయన. అంతమాత్రాన దేశద్రోహేమీ కాదు. దేశభక్తీ మెండే. “సర్కార్ ను మార్చడానికి సమరం చేయాల్నా” అని ప్రశ్నిస్తారు. ఒంటరిగా ఉంటే వంద ప్లస్ ఐదు, అమెరికా లాంటి శత్రువొస్తే 105 అంటాడు. అమెరికా వంటి విదేశీ శక్తుల జోక్యమెందుకూ అని నిలదీస్తారు. యుద్ధం వల్ల నష్టపోయేది సామాన్య ప్రజలేనంటాడు. మొత్తం మీద ఆయన శాంతి కాముకుడు, యుద్ధ వ్యతిరేకి.
జైలు తలుపుల మధ్య కెమెరా!
పనాహీపై 2010లో ఇరాన్ రిజీమ్ 20 ఏళ్ల సినిమా నిషేధం పెట్టింది. దేశం విడిచిపారిపోవద్దని మెలికా పెట్టింది. మొన్నటికి మొన్న.. అంటే 2025 డిసెంబరులో మళ్లీ ఓ ఏడాది జైలు శిక్ష. 2026 మార్చి 10 నాటికి కూడా ఇల్లే కారాగారం. అయినా, ఆయన సినిమాలు ఆగలేదు. ‘క్రియేటివ్ రిసిస్టెన్స్’ అనే పద్ధతిని విడనాడలేదు.
అదెలాగంటే.. విలేఖరిలా మారతాడు, ఇంటికి అతిథులు వచ్చినట్టు, వేడుక జరుగుతున్నట్టు నటిస్తూ పక్కన కెమెరాలు పెట్టి షూటింగ్ చేస్తారు.
ఐఫోనో, మరొకటో చేతబట్టి తీసిన ఫుటేజీని VPN ద్వారా క్లౌడ్‌కు పంపుతారు. పోలీసులు మెమరీ కార్డులు వెతికినా ఏమీ దొరకకుండా చేస్తారు. కుటుంబ సభ్యుల్నే నటులుగా మారుస్తాడు. “టాక్సీ” సినిమాలో మేనకోడలు, “క్లోజ్డ్ కర్టెన్”లో సహచరులే నటులు. 2011లో “దిస్ ఈజ్ నాట్ ఏ ఫిలిం”ను USB స్టిక్‌లో పెట్టి కేక్‌లో దాచి ఫ్రాన్స్‌కు పంపారు.
ప్రపంచంలోని మూడు ప్రధాన ఫిల్మ్ ఫెస్టివల్స్ (కాన్, బెర్లిన్, వెనిస్)లో ఆయనకు ఆయనే సాటి. కాన్‌లో “ఇట్ వాజ్ జస్ట్ ఆన్ యాక్సిడెంట్”కు పామ్ డి ఓర్ (2025), బెర్లిన్‌లో “టాక్సీ”కి గోల్డెన్ బేర్ (2015), వెనిస్‌లో “ది సర్కిల్”కు గోల్డెన్ లయన్ (2000) అవార్డులు వచ్చాయి.
“ఇట్ వాజ్ జస్ట్ ఆన్ యాక్సిడెంట్” గురించి!
2025లో విడుదలైన ఈ పొలిటికల్ థ్రిల్లర్, ఇరాన్ జైళ్లలో రాజకీయ ఖైదీల అనుభవాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇరాన్ వీధుల్లో ఒక చిన్న రోడ్డు ప్రమాదం… కారు మెకానిక్ వాహిద్ (వాహిద్ మొబస్సేరి) సహాయం చేయడానికి వెళ్తాడు. కానీ, ప్రమాదానికి గురైన వృద్ధుడి (మరియం అఫ్షారీ) కృత్రిమ కాలు చేసే ‘క్లిక్-క్లాక్’ శబ్దం వాహిద్‌ను గతానికి తీసుకెళ్తుంది. దశాబ్దాల క్రితం జైలులో కళ్లకు గంతలు కట్టి చిత్రహింసలు చేసిన అధికారి ఇతనేనని నమ్ముతాడు.
వాహిద్ తోటి మాజీ ఖైదీలతో కలిసి వృద్ధుడిని కిడ్నాప్ చేస్తాడు. ఒక నిర్మానుష్య ప్రాంతంలో ‘రహస్య విచారణ’ జరుగుతుంది. వృద్ధుడు తాను మామూలు పౌరుణ్ణని, కాలు యుద్ధంలో పోయిందని మొరపెట్టుకుంటాడు. కానీ ఖైదీలు “అతనే” అని, “కాదేమో” అని వాదించుకుంటూ కొంతసేపు మానసిక యుద్ధం చేసుకుంటారు. ముగింపులో వృద్ధుడు తానే అధికారి (ఎక్బాల్) అని ఒప్పుకుంటాడు, కానీ “నేను చేసింది నిబంధనల ప్రకారమే. నన్ను చంపితే అమరుణ్ణి అవుతా, వదిలేస్తే మామూలు మనిషిగా బతుకుతా” అంటాడు. ప్రతీకారం తీర్చుకోవాలా, వదిలేయాలా? అనే సందిగ్ధతలో సినిమా ముగుస్తుంది.
ఆస్కార్ బరిలో ఈ చిత్రానికి పోటీ తీవ్రం!
అంతర్జాతీయ చిత్రంలో నార్వే “సెంటిమెంటల్ వ్యాల్యూ”, బ్రెజిల్ “ది సీక్రెట్ ఏజెంట్”తో పోటీ. స్క్రీన్‌ప్లేలో “సిన్నర్స్” (16 నామినేషన్లు) బలమైన ప్రత్యర్థి. విమర్శకులు పనాహి రచనా నైపుణ్యానికి, భావోద్వేగాలకు బ్రహ్మరథం పడుతున్నారు. 70% స్క్రీన్‌ప్లే విభాగంలో పనాహీ సినిమా పోటీ పడుతోంది. ఎందుకంటే అక్కడ ‘రచనా నైపుణ్యానికి’ ప్రాధాన్యత ఉంది. “ప్రభుత్వం వేరు, కళాకారుడు వేరు” అనే భావన. ఫ్రాన్స్ లాబీయింగ్ అదనపు బలం. ఒకవేళ గెలిచినా, పనాహి హాజరుకాకపోవచ్చు. రాజకీయాలకు కళకు మధ్య జరుగుతున్న పోటీ ఇది. ఆస్కార్ ఓటర్లు ‘స్ట్రగుల్ బిహైండ్ ది లెన్స్’ను (ఈ సినిమా తీయడానికి పడిన కష్టాన్ని) కళగానే చూస్తారని నమ్మిక. ప్రస్తుత యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాకు అవార్డు ఇస్తే, అది ఇరాన్ ప్రజలకు మద్దతు. రాజకీయాలు కళను అణచివేస్తే? అప్పుడు మార్చి 15 ‘రాజకీయాలే కారణం’ అని చర్చ.
65 ఏళ్ల పనాహీకి సినిమా తీయడం ఊపిరి. “వారు నా చేతులకు సంకెళ్లు వేయగలరు, కానీ ఆలోచనలకు కాదు” అని చెబుతారు. ఒకవేళ ఆస్కార్ వస్తే, అది ఇరాన్ సినిమా చరిత్రలో మైలురాయి. యుద్ధ మేఘాల మధ్య శాంతి సందేశం. రాకపోయినా, పనాహీ కెమెరా ఆగదు. తెలుగు పాఠకులకు ఆయన కథ ఒక స్ఫూర్తి. పేదరికం, ఆంక్షలు ఎదుర్కొని కూడా కళతో అణచివేతపై పోరాడవచ్చునని మరోసారి నిరూపించవచ్చు. ఈలోపు మీరు “ఇట్ వాజ్ జస్ట్ ఆన్ యాక్సిడెంట్” సినిమాను MUBIలో చూడండి.



