యుద్దం నడిమి…(written by Indus Martin)
——————
ప్రియమైన బంగారం
చాలా సంతోషంగా ఈ లేఖను నీకు రాస్తున్నాను. ఇప్పుడే జరిగిన ఒక అద్భుతాన్ని నీతో పంచుకోవాలనుకుంటున్నాను.
నిన్న న్యూయియర్ ఉదయాన సరిహద్దుకు ఇరువైపులా మేము మా దాగుడు గుంటల్లో మాటువేసి వున్నాము. ఎముకలు కొరికే చలీ… తాజా గాలీ.. కొండవాలున వీస్తున్న ఉదయపు గుబాళింపు… అచ్చం ఒక కొత్తసంవత్సరపు ఉదయం ఎలావుండాలో అలానే వుంది.

ఆపని మేమే చేశామని నీకు అబద్దం చెప్పాలని వుంది… కానీ నిజానికి అది మొదలు పెట్టింది మాత్రం చింకీలే అని చెప్పడానికి కాస్త సిగ్గుగా వుంది. మొదట శత్రువుల బంకర్లవైపు ఎవరో ఒక శ్వేతపతాకం రెపరెపలాడటం చూశారు. కొంచెసేపటికి ఆవైపునుండి వాళ్ళ మాటలు వినబడ్డాయ్, “హేపీ న్యూ ఇయర్ ‘గాయ్’, హేపీ న్యూ ఇయర్”. మాలోని కొందరు సమాధానంగా ,” సేం టు యూ చింకీ” అని అరిచారు.
ఇక అది అక్కడితో ఆగిపోతుందనుకున్నాను నేను. కానీ హఠాత్తుగా వాళ్లలో ఒకడు, పెద్ద హోదా వున్నవాడేననుకుంటా, బోల్డన్ని మెడళ్ళు వున్న పైన్ గ్రీన్ కోటు వేసుకుని తెల్ల జండా వూపుతూ బయటకు వచ్చి మావైపు నడవటం మొదలు పెట్టాడు.
‘ఎవరూ కాల్పులు మొదలు పెట్టొద్దు, కాస్త ఆగండి ‘ ….ఎవరో మావాళ్ళు అరిచారు. మేం చూస్తూ వుండి పోయాం. ఇంతలో మరో చింకీ… మరో చింకీ.. మరొకరు.. ఇలా కలుగుల్లోని తెల్ల ఎలుకల్లా ఒక్కొకరూ బయటకు వచ్చి మా వైపు నడవటం మొదలు పెట్టారు. ” తలలు బయటకు కనబడనీకండి… ఇదేదో వాడి ఉపాయంలా వుంది… జాగ్రత్త” అని నేను అరిచాను. కానీ అది కుట్ర కాదని తేలిపోయింది.
వాళ్ళల్లో ఒకడు చేతిలోని రమ్ము సీసాని గాల్లో వూపుతూ ‘ క్రొత్త సంవత్సరపు రోజు ‘గాయ్’, మాదగ్గర నూడిల్స్ వున్నాయ్, కొంచెం రమ్ము కూడా వుంది, మీ వైపు రమ్మంటారా?” అన్నాడు.
” మాదగ్గర కమ్మటి బ్రాండీ వుంది, కొన్ని చపాతీలూ, పచ్చడీ కూడా వున్నాయ్” మాలో ఎవరో సమాధానం చెప్పారు.
వాళ్ళు ఒక్కొక్కరుగా మా వైపు నడుస్తూ నో మేన్స్ లేండ్ దాటడం మొదలు పెట్టారు. ఒక్కరివద్దా రైఫిల్ లేదు.
‘ ఏంటి చూస్తారు అబ్బాయిలూ… ఇంకా ఆలశ్యం ఎందుకూ.. పదండి ‘ అంటూ ఒక్కొక్కరూ మావాళ్ళు బంకర్లలోనుండి బయటకు ఎక్కడం ప్రారంభించారు.
కొద్ది క్షణాల్లో ఆ ఎవడికీ చెందని సరిహద్దు చెలక మొత్తం ఇరువైపులనుండి వస్తున్న కుర్రాళ్ళతో నిండి పోయింది. నేను కమాండ్ ఆఫీసర్ని… మావాళ్ళను వారించి వుండాల్సిందేమో…కానీ ఆ ఆలోచనే నాకు రాలేదు.
ఇరువైపులా పచ్చా- ఖాఖీ యూనిఫాంస్ … ఇరుసరిహద్దులకు మధ్యన వున్న ఆ మైదానంలోకి నడుస్తున్నారు. వాళ్ళలో నేనూ ఒకడ్నని కాస్త ఆలశ్యంగా గుర్తించాను. యుద్ధం నడిమి మేమంతా కొన్ని శాంతి క్షణాలకోసం ఆత్రుత పడుతున్నామల్లేవుంది.
సరిగ్గా అప్పుడు వాళ్ల కమాండ్ ఆఫీసర్ నా ముందుకొచ్చి నిలబడ్దాడు.. సూటిగా కళ్ళలోకి చూస్తూ..! ప్రియ బంగారం… ఆ క్షణాల్ని అనుభవిస్తేనేగానీ తెలీదు… నువ్వు వూహించుకోవడం అస్సలు సాధ్యం కాదు. ఆ ఆఫీసర్ నావైపు చెయ్యి చాస్తూ “నేను లీ- పింగ్, లాంగ్జీ ప్రాంతం వాడిని. పర్వతాల్లో వరి పండించే కుటుంబం నుండి వచ్చాను. నేను రెండు తీగల ఫిడెల్ బాగా వాయిస్తాను, హేపీ న్యూ ఇయర్ ఆఫీసర్!” అన్నాడు.
అప్రయత్నంగా నేను ఆచేతిని అందుకుని గట్టిగా నొక్కుతూ, ” హేపీ న్యూ ఇయర్ ఆఫీసర్, నేను మనోహర్ పిళ్ళై, కొంకణ్ ప్రాంతంలోని స్కూల్ మేస్టారి కుటుంబం నుండి వచ్చాను. నేను మటన్ రోగన్ జోష్ బాగా వండుతాను ” అన్నాను.
“ఓహ్ కొంకణ్… నాకు తెలుసు… చాలాసార్లు చదివాను మీ ప్రాంతం గురించి. గోవా.. బీచ్..బికినీస్… తెల్ల అమ్మాయిలూ… హహహహ..” నవ్వుతూ అన్నాడు.
నాదగ్గర వున్న రేషన్ బ్రాండీనీ, అతనిదగ్గర వున్న నూడిల్స్ నీ పంచుకున్నాం. తను చాలా మాట్లాడాడు. తనెప్పుడూ మనదేశం రాలేదని అర్ధమయ్యింది. కానీ చదువుకునేటప్పుడు టెక్స్ట్ పుస్తకాల్లో చాలానే మనగురించి చదివాడంటా. సైన్యంలో చేరాక దుబాసీ అవసరం లేకుండా వుండేందుకు హిందీ నేర్చుకున్నాడంట… చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఠగోర్ తనకు ఇష్టమైన భారతీయ రచయిత అట. ఆయన రాసిన గీతాంజలి అంటే చాలా ఇష్టమట. నాకు బోలెడు సంతోషం వేసింది. అలా ఆ వివాదగ్రస్త భూమిపై కూర్చుని ఎమేరికా విదేశాంగ విధానం, షారూఖ్ ఖాన్ సినిమాలూ, మన ప్రేమా… అన్నీ మాట్లాడుకున్నాం. తనకు భార్యా, ఆరు నెలలక్రితం పుట్టిన బాబూ వున్నారు.
ఆ వివాదగ్రస్త ప్రదేశమంతా పచ్చా ఖాఖీ యూనిఫారాలు నవ్వుతూ, సిగరెట్లూ బీడీలూ కాల్చుకుంటూ రమ్ము తాగుతూ.. హఠాత్తుగా నువ్వుపంపిన కారప్పూస జేబులో వున్నట్టు గుర్తొచ్చింది. కాస్త తీసి లీకి పెట్టాను. తను తింటూ.. ఇంత రుచికరమైన ఖారాను తనెప్పుడూ తినలేదన్నాడు… నేనూ అది నిజమేనన్నాను….. మేం చాలా మాట్లాడుకున్నాం… నేను అతను మాట్లాడిన అన్నిటికీ సమ్మతించాను… మేం శత్రువులం… కానీ మేం అన్నివిషయాల్లో అంగీకారం వ్యక్త పరిచాం. నా జీవితంలో అంతకన్నా గొప్ప న్యూ ఇయర్ పార్టీ ఎప్పుడూ చూడలేదు.
సరిగ్గా అప్పుడు…. ఎవరో తెలీదు… ఎక్కడినుండి తెచ్చారో… ఒక ఫుట్బాల్ తెచ్చారు. క్షణాల్లో రెండు జట్లుగా విడిపోయారు. యూనిఫారం కోటుల్ని సరిహద్దులుగా పరిచి గోల్ పోస్టుల్ని గీశారు. మరుక్షణం ఆ శాపగ్రస్త ప్రదేశం చప్పట్లతో, ఈలలతో మారుమోగిపోయింది. నేనూ , లీ.. ఇద్దరం పక్కపక్కన కూర్చొని మా మా టీముల్ని ఉత్సాహ పరిచాం. పక్కపక్కన కూర్చున్న మా వూపిరులు అప్పుడప్పుడూ ఆ గాలిలో ఒక్కటిగా కలిసిపోవడం నాకు తెలుస్తూనే వుంది.
అతనూ దీన్ని గమనించినట్టున్నాడు… ” పిళ్ళై… బహుశా మనదేశాల మధ్య వున్న విభేదాల్ని పరిష్కరించుకోడానికి ఇదే బెస్ట్ అనుకుంటా… పిల్లలు అనాధలు కానవసరం లేదూ, భార్యలు విధవలు కావాల్సిన పనిలేదు. ఇదే సరైన పద్దతేమో…!” అతని కళ్ళల్లో తడి కనబడినట్టుంది… బహుశా అది నా చూపుకు అడ్డం పడుతున్న నీటిపొరేమో..! ” ” క్రికెట్ అయితే బాగుంటుందేమో… అదైతే మిమ్మల్ని తుక్కుతుక్కుగా బాదేసేవాళ్ళం మేము” అన్నాను నేను. అతను పెద్దగా నవ్వుతూ ” అవును… పచ్చి నిజం. అప్పుడు మేం షావోలిన్ క్రికెట్ అనే సినిమా తీసుకుని అందులో మిమ్మల్ని ఓడిస్తున్నటు చూపించి మురిసిపోయేవాళ్లం” అన్నాడు. మేమిద్దరం నవ్వీ నవ్వీ దగ్గీ దగ్గీ అలిసిపోయాం.
బంగారం.. విచారకరమైన విషయం… మేం ఓడిపోయాం. మాది ఒకటీ, వాళ్లది మూడు. కానీ లీ మాత్రం తమ గెలుపు అన్యాయమైనదన్నాడు. మా గోల్ పోస్ట్ వాళ్లదానికన్నా పెద్దదిగా వుండటం వల్లే వాళ్ల కుర్రాళ్ళు ఎక్కువ గోల్స్ కొట్టారన్నాడు. నాకు కాస్త ఊరట అనిపించింది.
అంతా అయిపోయింది. మా దగ్గరి బ్రాండీ, వాళ్ళ రమ్మూ… అంతా అయిపోయి చాలా సేపే అయ్యింది. చపాతీలూ, నూడిల్సూ ఎప్పుడో అరిగిపోయాయి. అంతా అయిపోయినట్టు అందరం గుర్తించాం.
లీ ఎందుకో నా చెయ్యి వదలలేక పోయాడు. తన చేతిని వూపుతూ త్వరలో తను తన భార్యనీ కొడుకునీ కలుసుకోవాలని నా అభిలాషను చెప్పాను. మన పెళ్ళి త్వరలో అవ్వాలని తను చెప్పాడు. యుద్దం ముగిసి అందరూ ఇళ్ళకు వెళ్లాలనీ… త్వరలో వసంత ఋతువు రావాలనీ, చలి పిగిలిపోవాలనీ కోరుకున్నాం.
వాళ్ళు వాళ్ళ బంకర్లవైపు కదిలిపోయారు. మధ్యలో లీ వెనుతిరిగి ఒకసారి నావైపు సెల్యూట్ చేశాడు. తరవాత నెమ్మదిగా కదిలిపోయి ఆ పచ్చరంగు కోటుల్లో కలిసిపోయాడు. కాసేపటికి ఎవరెవరి బంకర్లలో వాళ్ళం…. వాళ్ళ వైపునుండి ఎవరో మిథున్ చక్రవర్తి పాట ” జిమ్మీ జిమ్మీ జిమ్మీ… ఆజా అజా అజా ” అంటూ పాడటం వినబడింది. మా కుర్రాళ్ళు ” ఆజారే మేరే సాత్, ఏ జాగీ జాగీ రాత్” అంటూ వంత పాడారు. చాలసేపటికి అంతా నిశ్శబ్ధం. అంతా నిద్రలోకి జారిపోయారు.
బంగారం, బహుశా వచ్చే ఏడాది న్యూ ఇయర్ కి ఈ యుద్దం ఒక మానిపోతున్న జ్ఞాపకం కావచ్చు. మనిద్దరం కలిసి కాపురం చేస్తూ మన బుల్లి ‘పూజా పిళ్ళై కీ (నీపేరే పెట్టుకుంటా) ఈ కథని చెప్పుకుంటూ వుండొచ్చు. నాకా నమ్మకం వుంది. నాకు శాంతిమీద నమ్మకం వుంది.
ఇక వుండనా…
నీ మనోహరుడు
కెమాంగ్- అరుణాచల్
మూలం: మైకెల్ మోర్పుర్గో
స్వేచ్చానువాదం, స్థానికీకరణ: ఇండస్ మార్టిన్



