పాట వినోదమే కాదు.. ఉద్యమమనీ చాటిన భారతరత్న హజారికా!

బ్రహ్మపుత్రానది కన్న కళాకారుడు… భారతరత్న భూపేన్ హజారికా శత జయంతిన ఆయన యాదిలో!

అస్సాం సమాచార, ప్రజాసంబంధాల శాఖలో ప్రస్తుతం కమిషనర్ అండ్ సెక్రటరీగా పనిచేస్తున్న ఓ ఐఆర్ఎస్ అధికారి హజారికాకు అందించిన ట్రిబ్యూట్ ఇది!

సంకుచితత్వాలు, సరిహద్దులు, సిద్ధాంతాలు, గుర్తింపులతో బతికేసే సమాజంలో… అంతకంటే ఉన్నతంగా ఎదిగేవారు, అలా జీవించి చూపించేవారు కొందరుంటారు. డాక్టర్ భూపేన్ హజారికాది అలాంటి వ్యక్తిత్వమే. అందుకే బ్రహ్మపుత్రా నది కన్న ముద్దుల సంగీత కవీశ్వరుడిగా ఆయన కీర్తినొందారు. ఆయన స్వరం, సంగీతం రెండింటితో.. ఇటు దేశంతో పాటు, యావత్ ప్రపంచంలో ప్రతిధ్వనించిన గళం హజారికా. బార్డర్స్ వెంబడి ఆయన స్వరం ఐక్యతారాగాన్ని సూచించింది. భాషలు, తరగతులు, కులాలు, మతాలు, తరాల గోడలను బద్ధలు కొట్టింది.

1926, సెప్టెంబర్ 8 అస్సాం రాష్ట్రం సాదియాలో… భూమ్మీదే ఓ తార వెలిసింది. అదే భూపేన్ హజారికాగా. అస్సాం జానపదుల జీవనశైలిలో పెరిగి.. అక్కడి పల్లె సంగీతాన్ని చిన్ననాటే ఒంట పట్టించుకున్నాడు హజారికా. పదేళ్ల వయస్సులోనే కోల్ కత్తాలోని ఆల్ ఇండియా రేడియోలో తన మొదటి పాట రికార్డైంది. తన యుక్తవయస్సుకొచ్చేసరికి.. అస్సామీ మొట్టమొదటి ఫిల్మ్ మేకర్ గా గుర్తింపు పొందిన రూప్ కొన్వర్ జ్యోతిప్రసాద్ అగర్వాలా, లలితకళల్లో అస్సామీ ఐకాన్ గా నిల్చిన కలగురు బిష్ణుప్రసాద్ రభా వంటి సాంస్కృతిక రంగాల ప్రముఖుల ప్రభావానికి లోనయ్యాడు. అలాగే, ఇంట్లో తన తల్లి కూడా సంగీతం నేర్పించేది. అదిగో ఆ ప్రభావమే భూపేన్ హజారికా తర్వాత కల్చరల్ జర్నీకి పునాదైంది.

మేస్ట్రో ప్రయాణం ఎలా సాగింది..?

డాక్టర్ భూపేన్ హజారికా బహుముఖ ప్రజ్ఞాశాలి. గాయకుడు, స్వరకర్త, గేయ రచయిత, కవి, చిత్ర నిర్మాత, రచయిత, పాత్రికేయుడు, ప్రజాప్రతినిధి.. ఇవన్నింటికీ మించి ఆలోచనాపరుడు. ప్రతీ మనిషీ ఓ యూనిక్ అని నమ్మినవాడు. సమానత్వం, న్యాయం అందరికీ దక్కాలని ఆశించాడు. సోదరభావాన్ని పెంపొందించేలా ఓ సామాజిక కార్యకర్తై నినదించాడు.

బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి పొల్టికల్ సైన్స్ లో మాస్టర్స్ చేసిన భూపేన్ హజారికా.. న్యూయార్క్ కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్లి 1952లోనే మాస్ కమ్యూనికేషన్ లో పీహెచ్డీ పూర్తి చేసిన ఘనుడు. ఆ సమయంలో అక్కడ ఆఫ్రికన్- అమెరికన్ పౌరహక్కుల ఉద్యమాలను చూసిన తనకు లెజెండరీ గాయకుడు, యాక్టివిస్టైన పాల్ రోబెసన్ తో పరిచయమేర్పడింది. అదే భూపేన్ హజారికాను అత్యంత ప్రభావితం చేసింది. రోబెసన్ ఓల్ మ్యాన్ రివర్ అనే ఆల్బమ్ కు అస్సామీ వెర్షన్ లా బిస్టిర్నో పరోర్ ను కంపోజ్ చేశారు హజారికా. ఆ తర్వాత దాన్నేహిందీలోకి ఓ గంగా బెహెతీ హో క్యూ గా రికార్డ్ చేశారు. అణగారిన వర్గాల బాధలు, ఆశలు, వారి ప్రతిఘటనకు ప్రతిరూపంగా వినిపిస్తుంది ఆ ఆల్బమ్.

భాషపై పట్టు, తన పాటలు, సినిమాలు, కవిత్వం, ప్రజాజీవితంతో గత శతాబ్దకాలంలోనే అస్సాంతో పాటు.. ఈశాన్యభారతంలోనే అత్యంత శక్తివంతమైన సాంస్కృతిక ఏకీకరణ శక్తిగా ఉద్భవించాడు భూపేన్ హజారికా. జాతులు, భాషలు, రాజకీయాలకతీతంగా ఆయన తన పాటలు, రచనలతో ఒక భావోద్వేగ భాషను అట్టడుగువర్గాల పోరాటాల కోసం అందించాడు.

వాయిస్ ఆఫ్ ది పీపుల్!

కార్మికవర్గాల గాధలను, దిగువ మధ్యతరగతి ఈతిబాధలను, అణగారినవర్గాల పోరాటలను అర్థం చేసుకున్న అవగాహన ఆయనకు ప్రపంచ పౌరహక్కుల ఉద్యమాల్లో తోడ్పడింది. అలాగే, పేదరికం, కులవివక్ష, సామాజిక, ఆర్థిక అసమానతలు వంటి అంశాలే ఆయన సంగీతంలో స్థిరంగా వినిపించేవి.

సంగీతానికి మించి హజారికా జీవనయానంలో.. అస్సామీ సినిమా, భారతీయ చలనచిత్ర పరిశ్రమ కోసం ఆయన చేసిన కృషి గణనీయమైంది. ఎరా బాటర్ సుర్, శకుంతల, ప్రతిధ్వని, లోతి ఘోటీ, చమేలీ మెమ్సాబ్ వంటి అస్సామీ చిత్రాలకు ఆయన రచన, దర్శకత్వం, స్వరకల్పన చేశారు. సంగీత దర్శకుడిగా బెంగాలీ, హిందీ చిత్రాలపై కూడా ఆయన ముద్ర వేసి… ఈశాన్య భారత స్వరాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చారు భూపేన్ హజారికా. శ్యామ్ బెనగల్, కల్పనా లాజ్మీ వంటి ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేశారు. ఆయన స్వరపర్చి ఆయనతో పాటు, లతా మంగేష్కర్ గొంతులో వేర్వేరుగా విన్న రుడాలీలోని దిల్ హూమ్ హూమ్ పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఏక్ పాల్, డామన్, సాజ్, ఎం.ఎఫ్. హుస్సేన్ గజగామిని వంటి చిత్రాలకు సంగీతం అందించారు. జాతీయ అవార్డులు, అంతకన్నా ఎక్కువ ప్రశంసలూ పొందారు.

సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా పనిచేసిన డాక్టర్ హజారికా.. 1967లో అస్సాం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. సాంస్కృతిక, సామాజిక అభ్యున్నతి కోసమే తన ఎమ్మెల్యే పదవిని ఉపయోగించారు. దాదాసాహేబ్ ఫాల్కే అవార్డ్ తో పాటు, సంగీత నాటక అకాడమీ అవార్డ్, పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటివి అందుకున్న భూపేన్ హజారికాను… మరణానంతరం 2019లో భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతోనూ సత్కరించుకుంది.

ది మ్యాన్ అండ్ ది మెసేజ్… హజారికా!

భూపేన్ హజారికాను ఓ సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా, రచయితగా, పాటగాడిగా మాత్రమే పరిమితం చేయలేం. ఎందుకంటే ఆయనో సాంస్కృతిక ఉద్యమం. బాధితవర్గం వైపు నిలబడి వారి ఆవేదన తీర్చేందుకు తన కళను ఓ ఆయుధంగా మల్చాడు. వినోదం కోసమో, విలాసం కోసం పాడిన పాట కాదు హజారికా అంటే. సమాజాన్ని మేల్కొల్పే పాట. మనుహే మనుహర్ బాబే అంటూ ఆయన ఆలపించిన పాట ఓ మాస్టర్ పీస్. మానవత్వాన్ని పెంపొందించే సందేశమది. మోయి ఏతి జజాబోర్ అనే ఆయన గీతిక.. ఆయనలో ఓ పర్యాటకుడికుడిని చూపిస్తుంది. ఒక ప్రాంతానికో, ఒక గుర్తింపుకో మాత్రమే పరిమితంకాని గ్లోబల్ మ్యాన్ గా ఆయన్ను నిలబెట్టింది.

హజారికా శతాబ్ది పుట్టినరోజున విశేషమైన వేడుక!

డాక్టర్ భూపేన్ హజారికా జయంతిని పురస్కరించుకుని అస్సాం ప్రభుత్వం 2025, సెప్టెంబర్ 8 నుంచి 2026, సెప్టెంబర్ 8 వరకు ఏడాది పొడవునా వేడుకలను నిర్వహిస్తోంది. ఈ సెప్టెంబర్ 13వ తేదీన గౌహతిలో ఈ వేడుకల ప్రారంభోత్సవంలో భారత ప్రభుత్వం ఆయన బొమ్మతో ఒక స్మారక నాణాన్నీ విడుదల చేయబోతోంది. అందుకోసం ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అస్సాం మొత్తం ప్రతీ జిల్లాలోనూ కార్యక్రమాలను నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. సుమారు వెయ్యి మంది గాయకులు ఆయన పాటల ప్రదర్శనతో మళ్లీ ఒక్కసారి హజారికాను స్మరించేందుకు నడుం బిగించారు.

ఏడాది పొడవునా నిర్వహించే ఈ శతాబ్ది ఉత్సవాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. లలితకళల్లో పోటీలు, చలనచిత్ర ప్రదర్శనలు, సంగీతంతో నివాళులర్పించే కచేరీలు, ఎడ్యుకేషన్ సెమినార్స్, వ్యాసరచన పోటీలు, పాఠశాలల్లో క్విజ్ పోటీలు, పుస్తక ప్రదర్శనలు, హజారికా జీవితాన్ని వివరించే డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన వంటివాటితో ఈ కార్యక్రమాలను డిజైన్ చేశారు.

సమాజ హృదయపూర్వక నివాళి అందుకున్న భారతరత్న హజారికా!

సుధాకాంత డాక్టర్ భూపేన్ హజారికా వందవ జయంతి సందర్భంగా.. నాగరిక సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన మహోన్నతుడిగా ఆయనకు అస్సామీ సమాజంతో పాటు, యావత్భారతం ఘన నివాళినర్పిస్తోంది. కళ కేవలం వినోదం కోసం మాత్రమే కాదు.. సామాజిక కట్టుబాట్లపై, సమానత్వం, సామరస్యం, మానవతావాదం వంటివాటిపై పోరాటాలకు పునరుద్ఘాటించే ఉద్యమమని చాటి చెప్పారు భూపేన్ హజారికా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles