అక్కడ భోజనానికి బిల్లు చెల్లిస్తే.. విజ్ఞానం ఫ్రీ!

ఆ హోటల్ రుచికి కేరాఫ్. అక్కడ వచ్చే ఘుమఘుమలతో ముక్కుపుటాలు అదిరిపోవాల్సిందే. ఆకలి నకనకలాడేవాళ్లు… ఇంకెప్పుడు తమ టేబుల్ పైకి ఆర్డరిచ్చిన ఫుడ్ వస్తుందానని తట్టుకోలేనంత వెయిటింగ్ అక్కడ కనిపిస్తుంది. కానీ, అంతకుమించి.. ఆ హోటల్ కస్టమర్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. కారణం.. అదో లైబ్రరీ కమ్ హోటల్. ఆ హోటల్ ను నడుపుతున్నది.. అసలు చిన్నప్పటి నుంచి బడిబాటే ఎరుగని ఓ 74 ఏళ్ల వృద్ధురాలవ్వడం ఈ కథలో మరింత విశేషం. ఎక్కడా మరి..?

మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని ఓజార్ అనే పట్టణంలో… ఈ లైబ్రరీ హోటల్ దర్శనమిస్తుంది. నాసిక్ కు చెందిన భీమాబాయి జోంథాలే.. ఈ హోటల్ కమ్ లైబ్రరీ ఓనర్. భీమాబాయి కొడుకు ఆమెకు హోటల్ నిర్వహణలో చేదోడువాదోడు.

ఈ హోటల్ పేరు అజ్జిచ్య పుస్తకాంచ హోటల్. ఈ హోటల్ లో డిషెస్ కు ప్రత్యేక పేరుంది. రుచి బాగుండటంతో సాధారణంగానే జనం క్యూ కడుతుంటారు. అయితే, అందించే ఆహార పదార్థాలకు తోడు.. ఇక్కడ లైబ్రరీని ఏర్పాటు చేసింది భీమాబాయి. 2010 నుంచి ఈ హోటల్ అప్రతిహతంగా నడుస్తోంది. కస్టమర్స్ ఆర్డర్ ఇచ్చాక వెయిటింగ్ టైమ్ వేస్ట్ కాకుండా… సుమారు 5 వేల బుక్స్ తో ఇక్కడ లైబ్రరీని ఏర్పాటు చేసింది భీమాబాయి.

భోజనానికి.. లేదా, టిఫిన్స్ కోసం వచ్చేవారికి వడ్డించే ఆహారానికే బిల్లు వేస్తారు తప్ప… బుక్స్ కు అదనపు బిల్లంటూ ఏమీ ఉండదు. పైగా ఆలోచించదగ్గ.. సమాజానికి ఉపయోగపడే.. ఆసక్తికర పుస్తకాలేవో బాగా సెలక్ట్ చేసి.. ఇక్కడి లైబ్రరీలో ఉంచారు.

దీంతో.. భోజనానికో, టిఫిన్ కో వచ్చి ఆర్డర్ వచ్చేంతవరకూ ఖాళీగా కూర్చోలేనివారు… ఓపెన్ స్పేస్ లో ఏర్పాటు చేసిన హోటల్ లోంచి అక్కడక్కడా అల్మారాల్లో కనిపించే లైబ్రరీల్లోకెళ్లి.. తమకిష్టమైన పుస్తకాలను తీసుకుని చదువుతుంటారు. అయితే, కొందరు పుస్తక ప్రేమికులు… అసలు తాము లైబ్రరీకి వచ్చామా.. లేక, హోటల్ కు వచ్చామా అనే ధ్యాస కూడా కోల్పోయి.. పుస్తక పఠనంలో పడిపోతుంటారని చెబుతుంది అందరూ ప్రేమగా అజ్జీ పిల్చుకునే 74 ఏళ్ల భీమాబాయి.

హోటల్ కు రాగానే ముక్కుపుటాలదిరే వాసనలతో ఎప్పుడెప్పుడు వస్తుందానని భోజనం కోసం చూసేవాళ్లంతా.. ఒక్కసారి పుస్తక పఠనం మొదలుపెడితే… వారి ఆకలి దేవుడెరుగుగానీ.. వారు మాత్రం అలా చదువులో లీనమైపోతారట. అసలు హోటల్ కు వచ్చామనే ధ్యాసలో కూడా ఉండనివారెందరో తమకు తారసపడుతున్నారంటోంది ఈ హోటల్ ఓనర్.

హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో కలిపి 5 వేల పుస్తకాలున్న హోటల్!

జస్ట్ ఓ టీ హోటల్ గా ప్రారంభమై.. ఇప్పుడు నాసిక్ జిల్లా ఓజార్ లో ప్రముఖ హోటల్ గా అందరి మన్ననలందుకుంటోంది అజ్జీ.. అజ్జిచ్య పుస్తకాంచ హోటల్.

చిన్నప్పుడు కేవలం 6వ తరగతి వరకు మాత్రమే చదివిన అజ్జీ… ఆ తర్వాత పెళ్లయ్యాక చదవడం మానేయాల్సి వచ్చింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె అలా చదువు మానేయడంతో కొంత బాధపడేవారట. అందుకే, చదువుకు తానిచ్చే ప్రాధాన్యత దృష్ట్యా తన హోటల్ ను ఓ లైబ్రరీ కమ్ రెస్టారెంట్ గా మార్చానంటారు అజ్జీ.

అజ్జీ బతుకు పోరాటం ఓ కలిచివేసే కథ!

అజ్జీ భర్త పచ్చి తాగుబోతు. అజ్జీనే తమకున్న పొలాలను పండించుకుంటూ.. ఇంటి భారమంతా చూసుకునేది. అజ్జీతో పాటే, ఆమె కుమార్తె కూడా పొలం బాట పట్టాల్సిన పరిస్థితులను కళ్లజూసింది. మరోవైపు వాళ్లను చదువుల కోసం బడికి పంపించాలన్న తపన ఓవైపు. ఆర్థికంగా బలహీన స్థితిలో ఉండటం మరోవైపు. తాగుడుకు బానిసైన భర్త చేసే నానా రాద్ధాంతం ఇంకోవైపు. ఇలా అజ్జీ భీమాబాయి బతుకు చిత్రం ఓ పోరాటం. అలాంటి సమయంలో తమకున్న పొలాలను కూడా తాగుడుకు బానిసైన భర్త.. జూదమాడి… మత్తులో అమ్మేశాడు. దాంతో వారి బతుకు చిత్రం ఛిద్రమైపోయింది.

పిల్లవాడిని స్కూల్ కు పంపాలన్నా.. పిల్లలకు పట్టెడన్నం పెట్టాలన్నా.. తాను వారిని పోషించే శక్తి, సామర్థ్యాలు కల్గి ఉండాలన్నా.. అజ్జీకి ఏదో ఒక పని కావల్సిన సమయంలో.. స్వయానా రైతైన భీమాబాయి.. తానే ఓ రైతు కూలీగా మారిపోయింది. ఆ డబ్బు సరిపోకపోవడంతో.. తన కొడుకు కూడా సైకిల్ పై పేపర్ వేసుకుంటూ తిరుగుతూ నాల్గు పైసలు ఇద్దరు కలిసి సంపాదించి ఓ పూట తింటూ, మరో పూట పస్తులుంటూ పొట్ట పోసుకునేవారు.

అయితే, భర్త అమ్మినదాంట్లో మిగిలిన పొలాన్ని కూడా అమ్మేసి.. కొడుకు ప్రవీణ్ ఓ పబ్లిషింగ్ కంపెనీని ఆరంభించాడు. ఆ కంపెనీ కూడా కొద్దిగా పర్లేదు అనుకున్న తరుణంలో ఏవో వ్యక్తిగత కారణాల వల్ల భీమాబాయి కొడుకు ప్రవీణ్ దాన్ని మూసేయాల్సి వచ్చింది. దాంతో.. ఇక బతుకుదెరువు కోసం ఆ కుటుంబం ఓ టీ స్టాల్ ను ప్రారంభించింది. అయితే, అజ్జీ.. ఆమె కుటుంబం కావల్సినవాళ్లు, బంధువులనుకున్న వాళ్ల నుంచే అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా టీ కొట్టు పెట్టడంపై విపరీతమైన విమర్శలు, చీవాట్లు బంధువుల నుంచి తప్పలేదు. అయినా వెనుకడుగు వేయలేదు. అలా 2010లో ప్రారంభించిన అజ్జింక్య పుస్తకాంచ హోటల్ ఇప్పుడు టాప్ రెస్టారెంటై నిలబడింది.

పుస్తకాలే మన మంచి స్నేహితులు, సహచరులంటుంది అజ్జీ!

కేవలం 25 పుస్తకాలతో మొదట ఈ లైబ్రరీ కమ్ హోటల్ ప్రారంభమైంది. ఆరంభంలో ఎవరైనా హోటల్ కు వస్తే.. మేమే ఇదిగో ఈ పుస్తకాన్ని తిరగేస్తూ కాస్సేపు వెయిట్ చేయండని.. లేదా, అలా సరదాగా చదువుతూ తినండని కస్టమర్స్ ని ప్రోత్సహించేవాళ్లమంటుంది అజ్జీ.

అంతేకాదు, జనంలో పఠనాసక్తిని పెంచేందుకు అజ్జీ కుటుంబం చేస్తున్న ప్రయత్నమూ అభినందనయమైనదే. మహిళా దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధీ పుట్టినరోజు.. ఇలా అకేషనల్లీ తమ హోటల్ కు వచ్చి ఏదైనా తిని బిల్ చేసినవారికి.. కాంప్లిమెంటరీగా ఓ పుస్తకాన్ని కూడా ఉచితంగా అందిస్తూ పుస్తక పఠన విలువపై పరోక్షంగా ప్రచారాన్నీ చేస్తోందీ కుటుంబం. అంతేకాదు, ఆసుపత్రుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతూ.. బెడ్స్ పైనే ఉండే రోగులకూ పుస్తకాల పంపిణీ చేస్తున్నారు.

మొత్తంగా చదువుకు దూరమైన తాను చేస్తున్న చిన్ని ప్రయత్నం ఫలించి.. తన హోటల్ విజయవంతమై, కస్టమర్స్ సంఖ్య పెరగడం ఎంత ఆనందాన్నిస్తుందో.. హోటల్ కు వచ్చే ఆబాలగోపాలం పుస్తకాలను చదవుతుండటం.. తాను సాధించిన మరో మెట్టు అంటోంది అజ్జీ భీమాబాయి. మొత్తానికి ఓ హోటల్ రుచితో పాటు.. సామాజిక స్పృహనూ పంచుతున్న తీరు ఇప్పుడు ప్రశంసలందుకుంటోంది.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles