పాడలేను పల్లవైనా భాషరాని దానను… వెయ్యలేను తాళమైనా లయ నేనెరుగనంటూనే.. సింధుభైరవి సినిమాలో పాటతో మొట్టమొదటి జాతీయ అవార్డ్ అందుకుంది కే. ఎస్. చిత్ర. తన మాతృభాష కాని భాషల్లో వేల పాటలు పాడిన ఆ మధురగాయని… నిజంగానే తనకు అప్పటికి అంతగా రాని తెలుగుభాషలో పాడలేను పల్లవైనా భాషరాని దాననంటూ పాడి అవార్డ్ గెల్చుకోవడం నిజంగా ఎంత యాదృచ్ఛికమో… అంతేస్థాయిలో ఆమె ప్రతిభకు ఓ కొలమానం కూడా.

పి. సుశీల, ఎస్. జానకీ వంటివారు ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టిన చిత్ర… తెలుగు, మళయాళ, తమిళ, కన్నడ, బెంగాలీ, ఒరియా, హిందీ, అస్సామీ వంటి పలు భాషల్లో పాటలు పాడి… ఏకంగా పలు జాతీయ అవార్డులతో పాటు… ఎన్నో రాష్ట్ర పురస్కారాలనందుకుంది.
దక్షిణ భారత నైటింగేల్ గా ఖ్యాతిగాంచిన చిత్ర… పక్కా మళయాళీ. ఇదేరోజు జూలై 27, 1963లో కేరళలోని తిరువనంతపురంలోని సంగీతకారుల కుటుంబంలో జన్మించింది. బాల్యంలో ఈమె తండ్రి కృష్ణన్ నాయర్… చిత్ర ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు. చిత్ర తొలి గురువు ఆమె తండ్రే కాగా… చిత్ర 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వ నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్ షిప్ కు ఎంపికైనప్పటినుండి డా. కె.ఓమనకుట్టి వద్ద కర్ణాటక సంగీతములో విస్తృతమైన శిక్షణ పొందింది. 1979లో ఎం.జి.రాధాకృష్ణన్ చిత్ర అనే గానకోకిలను మలయాళ సినీ నేపథ్యగానానికి పరిచయం చేశాడు. ఆ తరువాత సంగీత దర్శకుడు ఇళయరాజా నేతృత్వములో ఈమె చెన్నైలోని తమిళ సినిమారంగములో అడుగుపెట్టింది. ఆతర్వాత చిత్ర వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటికే మహామహులైన ఘంటసాల,న పీ. సుశీల, ఎస్. జానకీ వంటివారితో పనిచేసిగానగంధర్వుడు బాలు వంటి వారితో కూడా అలవోకగా ఆమె పాటలు పాడుతున్న తీరు… ఏకంగా బాలును కూడా సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేదట.
చిత్ర వేలకొద్ది సినిమా పాటలు, సినిమాయేతర పాటలు రికార్డు చేసింది. తన గాత్ర జీవితములో ఉత్తమ మహిళా నేపథ్యగాయనిగా ఆరు జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులనందుకొన్నది. ఇన్ని పురస్కారాలు మరే ఇతర నేపథ్యగాయకురాలు అందుకోలేదు. జాతీయ పురస్కారాలు అందుకొన్ని సినిమాలు
1986లో తమిళంలో విడుదలైన సింధుభైరవి, 1987లో మళయాళ సినిమా నఖక్షతంగళ్, 1989లో మరో మళయాళ సినిమా వైశాలీ, 1996లో తెలుగులో మెరుపుకలలుగా విడుదలైన రాజీవ్ మీనన్ మిన్సార కనువు, 1997లో – విరాసత్ అనే హిందీ సినిమాలో పాడిన పాటకు… 2004లో ఆటోగ్రాఫ్ అనే తమిళ సినిమాలో పాడిన పాటలకు చిత్రకు జాతీయ అవార్డులు దక్కాయి.ఉత్తమ నేపథ్యగాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 15 అవార్డులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుండి 9 అవార్డులు, తమిళ రాష్ట్ర ప్రభుత్వము నుండి 4 అవార్డులు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము నుండి 2 అవార్డులు కూడా అందుకున్నది ఈ గానకోకిల. ఈ విధంగా దక్షిణ భారతదేశములోని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్యగాయక పురస్కారాలందుకున్న తొలి గాయనిగా కూడా చిత్ర రికార్డు సృష్టించింది.
బ్రిటిష్ పౌర్లమెంట్‌లో హౌస్ ఆఫ్ కామర్స్ నుంచి గౌరవం పొందిన తొలి భారతీయ మహిళగా… చైనా ప్రభుత్వం నుంచి షాంఘై ఇంటర్నేషనల్ మ్యూజిక్ పురస్కారం అందుకున్న ఏకైక భారతీయ గాయనిగా… లండన్‌లోని రాయల్ అల్బర్ట్ హాల్‌లో జరిగే ప్రతిష్టాత్మక సంగీత ప్రదర్శనలో పాల్గొన్న తొలి దక్షిణ భారతదేశ గాయనిగా ఇలా పలు రికార్డులను సొంతం చేసుకున్న చిత్ర 25 వేలకి పైగా పాటలు ఆలపించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వంలోనూ, స్వరమాంత్రికుడు ఇళయరాజా స్వరకల్పనలోనూ ఎక్కువ గీతాలు ఆలపించారు చిత్ర. తెలుగురాష్ట్రాల్లో సంగీత సరస్వతిగా కీర్తి ప్రతిష్టలు అందుకొంటున్న చిత్ర ఇంజినీర్, వ్యాపారవేత్త అయిన విజయ్‌శంకర్‌ని వివాహం చేసుకొన్నారు. వీరికి ఒక్కగానొక్క సంతానమైన నందన దుబాయ్‌లో ప్రమాదవశాత్తూ నీటి తొట్టిలో పడి మృతిచెందారు. ఎ.ఆర్.రెహమాన్ సారథ్యంలో జరుగుతున్న సంగీత ప్రదర్శన కోసం చిత్ర వెళ్లిన సందర్భంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఇప్పటికీ ఆమెలో తెలియని లోటును కనబరుస్తుంది.
20 దేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇచ్చి శ్రోతల్ని ఉర్రూతలూగించిన చిత్ర కే.జే. ఏసుదాస్ తో కలిసి పలు సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేణుమాధవా అంటూ ఆర్తితో నేనున్నానని సినిమాలో పాడినా… మాతృదేవోభవ సినిమాలో వేణువై వచ్చాను భువనానికీ… గాలినై పోతాను గగనానికంటూ ఆర్థ్రతతో పాడినా… ఆ స్థానాన్నెవ్వరూ భర్తీ చేయలేని రీతిలో ఆమెకు మాత్రమే ఆ క్రెడిట్ దక్కుతుంది. అందుకే సాహో… కే.ఎస్. చిత్ర.



